సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 414వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభై ఏడవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

బాబా కుశాల్ సేట్ ఇంటినుంచి బయలుదేరి నదిని దాటి బండి ఆగివున్న చోటువరకూ నడిచి చేరుకున్నారు. నేను కూడా అక్కడకు చేరుకున్నప్పుడు ఒక అశరీరవాణి వినిపించింది: “వెనుకనుండి నన్ను పట్టుకుని నువ్వు గుర్రంలా నడువు!” అని. అందువల్ల నేను బాబాకి సరిగ్గా వెనకాల నిలుచున్నాను. బాబా నడుముని రెండు చేతులతో పట్టుకుని గుర్రంలా నడిచాననుకుంటా. అలాగే బాబా చరణాల వద్ద ఆకుపచ్చని బట్టలో చుట్టబడివున్న (శిరస్సు, ముఖం, ఛాతీలతో సహా) ఒక శవాన్ని చూశాను. అది చూసిన నాకు, 'బాబా ఇక్కడ ఎవరో ఒక రాక్షస ఫకీరును చంపారేమో' అనిపించింది. తరువాత బాబా బండిలో కూర్చున్నారు. వారితోపాటు బండిలో కాకాసాహెబ్, నార్వేకర్ కూర్చున్నారు. మేము బండి వెనుక కొంతదూరం వరకూ పరుగెత్తాం. అప్పుడు బాబా నాతో, “అరె! ముళ్ళల్లోకి ఎందుకెళ్తావు? సరిగ్గా రోడ్డుమీద నడువు” అన్నారు. దాని తరువాత వామనరావ్ నార్వేకర్‌కు కుశాల్‌భావు చేత కొంచెం డబ్బును అప్పుగా ఇప్పించటం కోసం బాబా ఆరోజు కుశాల్‌భావు ఇంటికి వెళ్ళారని నాకు తెలిసింది. వామనరావుకి అప్పు లభించిందో లేదో తెలుసుకోవటం కోసం అక్కడ నేను ఆగలేదు కనుక ఈరోజు వరకూ నాకది తెలీలేదు. 

శ్రీకృష్ణభగవానుడు ఈ రకంగానే రాక్షససంహారం చేయటం కోసం బృందావనానికి ఆవుల్ని మేపటానికి తీసుకొని వెళ్తుండేవారు. ఈ సంఘటన తరువాత నాకు రాక్షససంహారాన్ని బాబా ప్రత్యక్షరూపంతో చూపించారని అనిపించేది. నాతో పాటు బాబా వెంటవచ్చిన కాకాసాహెబ్ గానీ లేదా నార్వేకర్ గానీ ఆ దృశ్యాన్ని చూసి ఉంటారని నాకనిపించటం లేదు. ఆ దృశ్యాన్ని చూపించి బాబా నాకు, "నీవు ఇక్కడనుంచి వెళ్ళు! ఈ ఫకీరు రాధాకృష్ణమాయిని చంపేశాడు. చూడు, నా చరణాల వద్ద ఆమె శవం!” అని సూచిస్తున్నారేమో! అలాగే అయింది కూడా. వైకుంఠరావు వచ్చి నన్ను ముంబాయి తీసుకెళ్ళాడు. ముంబాయి నుంచి నేను మోతా వెళ్ళాను. నేను శిరిడీని వదిలిన 21 రోజుల తరువాత, రాధాకృష్ణమాయి ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అంతం చేసుకున్నదని నాకు తెలిసింది.

ఒకరోజు ఉదయం బాబా నామోచ్ఛారణ చేస్తూ బాబా చరణాలకి ప్రణామం చేసినప్పుడు బాబా, “అరె! ఇంకా అదే చేస్తున్నావా?” అన్నారు. దీంతో నేను ఆలోచనలో పడిపోయాను. బాబా తమ 'సాయినాథ్' నామస్మరణతో ప్రసన్నులు కాలేదా? వేరే ఏదైనా నామం జపించాలని నాకు ఆదేశమిస్తున్నారా? అని అనిపించింది. బాబా ఆదేశంతో నేను జపిస్తున్న మంత్రం యొక్క తీవ్రమైన శబ్దం అలా మస్తిష్కం నుంచి బయటకొచ్చి ఆకాశంలో సమ్మిళితమైపోయింది. దీనికి వివరణ మొదటే ఇచ్చేశాను. నానావలీ నా తలమీద రాయితో రెండు గాయాలు చేసి నాతో, “సితార్ వాయించటం తెలీకపోతే చేతిలోకి ఎందుకు తీసుకున్నావు?” అన్నారు. దీంతో నేను జపిస్తున్న మంత్రం విషయంలో నా చిత్తంలో శంక ఉత్పన్నం అయింది. అందుకని బాబా తమ నామోచ్ఛారణ విషయం తమకు నచ్చకపోవటాన్ని ప్రకటించారు. మరి ఇప్పుడు నేను ఏ నామస్మరణ చేయాలి? ఏ మంత్రజపాన్ని చేయాలి? అన్న యోచనలో పడిపోయాను. కానీ ఈ విషయంలో స్పష్టంగా సూచన లభించే వరకూ నేను బాబా ద్వారా లభించిన మంత్రజపాన్నే కొనసాగించాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

    ReplyDelete
  3. ఓం సాయిరాం...,🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo