సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 436వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ‘బాబానే వచ్చి పర్సు అక్కడ పెట్టి వెళ్ళారు’
  2. బాబా దయామయుడు, మనస్ఫూర్తిగా ప్రార్థించిన వారి కోరికలు తప్పక నెరవేరుస్తారు

‘బాబానే వచ్చి పర్సు అక్కడ పెట్టి వెళ్ళారు’

హైదరాబాదు నుండి శ్రీమతి వీణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నా పేరు వీణ. మాది హైదరాబాద్. మా పెళ్లైన కొత్తలో (2010) నేను, మావారు శిరిడీ వెళ్ళాము. ఆరోజు ఉదయం ఎంతో ఆనందంగా బాబా దర్శనం చేసుకున్నాము. సాయంత్రం బస్సుకి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకొని ఉన్న మేము ఆ సాయంత్రం హోటల్ రూం నుండి బయలుదేరి, నడుచుకుంటూ బస్‌స్టాప్‌కి వెళ్తున్నాము. దారిలో మావారు తన మనీ పర్సు కోసం చూశారు. కానీ పర్సు కనిపించలేదు. సాధారణంగా తను పర్సును ప్యాంట్ వెనుక జేబులోనే పెట్టుకుంటారు. రోడ్డు ప్రక్కన ఆగి అన్ని బ్యాగులూ వెతికాము. కానీ పర్సు కనిపించలేదు. “సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను హోటల్ రూంకి వెళ్ళి చెక్ చేస్తాను” అని మావారు వెళ్ళి హోటల్ రూంలో చూశారు. కానీ అక్కడ కూడా పర్సు కనిపించలేదు. తరువాత మేం రూం నుండి వచ్చిన దారిలో చూసుకుంటూ వచ్చారు. ఎక్కడా పర్సు కనబడలేదు. ఆ పర్సులోనే డబ్బులు, కార్డులు, టికెట్లు కూడా ఉన్నాయి. నేను బ్యాగ్ దగ్గరే ఉండి మా పర్సు దొరకాలని సాయిబాబాని ప్రార్థిస్తూ ఉన్నాను. “బాబా! మీరు నిజంగా మా ప్రక్కనే ఉంటే మా పర్సు మాకు ఇవ్వండి బాబా” అని బాబాను వేడుకుంటున్నాను. ఇంతలో మావారు వచ్చి, “పర్సు ఎక్కడా కనిపించలేదు, పద వెళదాం” అని చెప్పారు. సరేనని బ్యాగు చేతిలోకి తీసుకోబోతుంటే, అద్భుతం!! మా బ్యాగ్ పైనే పర్సు ఉంది. “ఇదేంటి? ఇప్పటివరకు బ్యాగులన్నీ చెక్ చేశాము, పర్సు కనబడలేదు, ఇప్పుడు ఎలా వచ్చింది?” అని ఆశ్చర్యపోయాము. ఆశ్చర్యం నుంచి తేరుకున్నాక, ‘బాబానే వచ్చి పర్సు అక్కడ పెట్టి వెళ్ళారు’ అని అనుకుని ఎంతో ఆనందించాము. మా పర్సును మాకు ఇచ్చినందుకు మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఇది నా మొదటి అనుభవం. ఇలాంటి అనుభవాలను ఇంకా ఎన్నిటినో బాబా నాకు ప్రసాదించారు. “బాబా! మీరు నిజంగా మా ప్రక్కనే ఉన్నారని తెలిసింది. థాంక్యూ సో మచ్ బాబా!”

బాబా దయామయుడు, మనస్ఫూర్తిగా ప్రార్థించిన వారి కోరికలు తప్పక నెరవేరుస్తారు

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిరోజూ ఈ బ్లాగ్ నాకొక సత్సంగంలా వుంది. నేను సాయిబాబాని చాలా సంవత్సరాల నుంచి పూజిస్తున్నాను. నేను ప్రతిరోజూ సాయిబాబా సచ్చరిత్ర పారాయణ చేస్తాను. బాబా నాకు ఎన్నోఅనుభవాలను ప్రసాదించారు. నాకు ఈమధ్య జరిగిన ఒక అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.

ఈ మధ్య మా అమ్మకి పంటినొప్పి వచ్చింది. డాక్టర్ని సంప్రదిస్తే, అమ్మని పరీక్షించి, ‘పన్ను పీకాలి’ అని చెప్పారు. కానీ మా అమ్మ, “ఈసారి నొప్పి వచ్చినప్పుడు పన్ను పీకించుకుంటాను, ప్రస్తుతానికి నొప్పి తగ్గటానికి మందులు రాసి ఇవ్వండి” అని అడిగింది. తరువాతరోజు నుంచి లాక్‌డౌన్ మొదలైంది. అమ్మకి పంటినొప్పి ఎక్కువైంది. డాక్టర్ దగ్గరకి వెళదామంటే హాస్పిటల్స్ లేవు. టాబ్లెట్ వేసుకున్నప్పటికీ పంటినొప్పి తగ్గలేదు. ఏప్రిల్ నెలంతా అమ్మ పంటినొప్పితో చాలా బాధపడింది. మే ఒకటో తారీఖున నొప్పి విపరీతంగా వచ్చింది. అమ్మ పడుతున్న బాధను మేము చూడలేకపోయాము. దాంతో నేను, “బాబా! డాక్టర్స్ వచ్చేవరకు అమ్మకి పంటినొప్పి రాకూడదు. తను టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాకూడదు. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాని ప్రార్థించాను. ప్రతి నాలుగు రోజులకు వచ్చే పంటినొప్పి బాబా దయవల్ల రాలేదు. 2020, మే 30న డాక్టర్స్ వచ్చారు. నొప్పి లేకపోయినా అమ్మ డాక్టర్ దగ్గరకు వెళ్ళి పన్ను పీకించుకుంది. బాబా దయామయుడు, మనస్ఫూర్తిగా ప్రార్థించిన వారి కోరికలు తప్పక నెరవేరుస్తారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి


6 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo