సాయిశరణానంద అనుభవాలు - ఇరవైఏడవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
ఈ మధ్యకాలంలో మాతుంగాలో ఉంటూ పరేల్ వర్క్‌షాపులో పనిచేసే ఈశ్వర్‌లాల్ అనే ఒక యువకుడు బాబా దర్శనార్థం వచ్చి చావడిలో ఉండేవాడు. అతను బాబా సేవ చేసేవాడు. అతను నా వద్దకు వస్తూ పోతూ ఉండేవాడు. అప్పుడొకరోజు సాఠేసాహెబ్ వాడా దగ్గర నాక్కొంచెం పని ఉంది. కానీ శ్రీరామనవమిరోజు అవటంతో దారిలో విపరీతంగా జనం ఉన్నారు. అందుకని తను అటు వెళ్ళేటప్పుడు అక్కడ నా పని చేసుకొస్తానని అతను నాతో చెప్పాడు. "నా సొంత పనికోసం ఇతరులకి అకారణంగా కష్టం ఎందుకివ్వాలి? అందుకు ప్రతిగా నేనతనికి ఏమివ్వగలను?" అనుకుని నేనతన్ని ఆ పని చేయకుండా ఆపేశాను. అయితే దారంతా బాగా బురదగా ఉండటంవల్ల నేను జారిపడిపోయాను. ఈ సంఘటనతో, "ఎవరైనా ప్రేమపూర్వకంగా నిష్కామసేవ చేసేందుకు అర్థిస్తే దాన్ని తిరస్కరించకూడద”ని నేనర్థం చేసుకున్నాను.
ఈశ్వర్‌లాల్ రాధాకృష్ణమాయి ఇంటికి కూడా వచ్చి పోతూ ఉండేవాడు. ఒకరోజు హఠాత్తుగా అతనికి కలరా సోకింది. చివరి ఒకటి రెండ్రోజులు అతను నా గదిలోనే ఉన్నాడు. నేను, రాధాకృష్ణమాయి మాకు చేతనైన వైద్యం చేశాం. అయినా అతను బ్రతకలేదు. ఆరతి సమయంలో అతనికి దేహావసానం ప్రాప్తించింది. నా గదిలో రాధాకృష్ణమాయి సమక్షంలో అతను మరణించాడు. చివరిక్షణంలో అతనికి దడ వచ్చినప్పుడు రాధాకృష్ణమాయి అతన్ని, "కొంచెం పుణ్యదానమేమైనా చేశావా?” అని అడిగింది. అతను 'లేద'ని బదులిచ్చాడు. చివరి సమయంలో రాధాకృష్ణమాయి ఈ రకంగా ప్రశ్నించటం నాకు సమంజసం అనిపించలేదు. అయితే పుణ్యం చేయకపోతే ప్రాయశ్చిత్తం చేయించగల ఇలాంటి శాస్త్రబద్ధమైన పద్ధతేదైనా ఉందేమో అనుకున్నాను. అతని మరణానికి కారణం బాబాపట్ల శ్రద్ధ తక్కువ అవటమని రాధాకృష్ణమాయి బహుశా అనుకున్నారేమో కానీ, అలాంటిదేమీ లేదు. బాబా, "వేరే జగత్తులో నివసించటానికతను వెళ్ళిపోయాడు” అని అన్నారు.
అవి వేసవి రోజులు. రాధాకృష్ణమాయి తన గుమ్మం ముందున్న అరుగు మీద పడుకుని ఉంది. నేను నా గది బయట ఉన్న మట్టి అరుగు మీద పడుకుని ఉన్నాను. బాబా చావడిలో గానీ లేక ద్వారకామాయిలో గానీ పడుకునేటప్పుడు నేను నా పడక మీద నుండే మంగళ ఆరతి ఇచ్చేవాడిని. ఒకసారి ఆరతి సమయంలో 'ఉఠా ఉఠా శ్రీసాయినాథ గురు చరణకమలధావా' (బాబా, లేవండి సాయినాథ గురూ! మీ చరణ కమలాలు చూపండి) ఈ తృతీయ భూపాలి యొక్క, "ఉఘడూనీ నేత్రకమలా దీనబంధూ రమాకాంతా పాహిబా కృపాదృష్టీ బాలకా జసీ మాతా" (హే దీనబంధూ, రమాకాంతా, నేత్ర కమలాలను తెరచి తల్లి తన బిడ్డను ఎలా చూస్తుందో అలా కృపాదృష్టితో చూడండి) అనే పదాన్ని పాడుతూ నేను పక్కమీదే పడుకుని ఉన్నాను. అప్పుడే రాధాకృష్ణమాయి కళ్ళు తెరిచి నా వైపు చూసింది. అప్పుడు, 'రాధాకృష్ణమాయి, బాబా ఒక్కరేననీ, ఆమె రూపంలో బాబా నాపై కృప చూపించార'నీ నాకనిపించింది. మనసులో ఈ ఆలోచన మెదిలిన మరుక్షణంలో మశీదులోంచి బాబా బిగ్గరగా, “నీ తల్లి -----------” అని చాలా చెడ్డగా తిట్టారు. దాంతో మాయి రూపంలో బాబా నా ప్రార్థన స్వీకరించారనే నా కల్పన తప్పని నేను తెలుసుకున్నాను. రాధాకృష్ణమాయి ప్రార్థన భావం వల్ల తను తాదాత్మ్యం చెందిందంతే. అందువల్ల బాబా స్థానంలో ఆమెను పెట్టటం యోగ్యం కాదని ఆ విధంగా బాబా సూచించారు.
ఈ సంఘటన జరిగి 22 సంవత్సరాలు గడిచిన తరువాత, గుజరాతీ భాషలో ఉన్న 'గర్గ సంహిత' నాకు చదవటానికి దొరికింది. అందులో ఈ రకమైన సందర్భంలో రాధ గురించి ఒక వర్ణన ఉంది. రాధిక వ్యాహ్యాళికి వెళ్ళే ఉద్యానవనంలో శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఒక సఖి కలుస్తుంది. ఆ సఖి వ్యవహరించే తీరూ, హావభావాలూ, మాట్లాడే పద్ధతి, లేవటం, కూర్చోవటం, రాధని ప్రేమించటం అంతా అచ్చుగుద్దినట్లు శ్రీకృష్ణునిలా ఉండటం వల్ల ఆమెతో రాధకి సఖ్యత ఏర్పడుతుంది. సఖి తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విరహం కూడా రాధకి సహించరానిదిగా ఉండేది. అందువల్ల ఎక్కువ సమయం వారు కలిసే ఉండేవారు. ఒకసారి ఆ సఖి రాధను వదిలి వెళ్ళవలసి వస్తుంది. సఖిని వెళ్ళకుండా ఆపాలని రాధ చాలా ఉపాయాలు పన్నినా అవన్నీ వృధా అయిపోతాయి. అప్పుడు రాధ 'హే కృష్ణా.. హే కృష్ణా' అని రోదించి స్పృహతప్పి పడిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రకటమై ఆమెను 'ఏమైంద'ని అడుగుతాడు. రాధిక సత్యాన్ని శ్రీకృష్ణునితో చెప్తుంది. అప్పుడాయన, “నీ సఖి నా రూపాన్ని ఎంతగా పోలి ఉన్నప్పటికీ ఆమెనే నన్నుగా భావించి ఆమె మీద ఇంత ప్రేమ చూపించటం యోగ్యం కాదు. నేను నేనే. నా స్థానంలో వేరే ఎవర్నో పెట్టుకోవటం సరికాదు. అలా చేస్తే ఈ రకంగా దుఃఖం కలగటం సహజమే. అందుకని ఇక మేలుకో" అంటాడు.
తరువాయి భాగం రేపు ......
source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.
good leela very happy to read this leela.om sai ram omsaima
ReplyDeleteOm Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete🙏🌹 ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏
ReplyDeleteBhavya sree..
ఓం సాయిరాం...🌹🙏🌹
ReplyDelete