సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 449వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. మనసుకు సాంత్వన చేకూరుస్తున్న బాబా
  2. బాబా కృప

మనసుకు సాంత్వన చేకూరుస్తున్న బాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నమస్తే! సాయిభక్తులందరికీ ఓం సాయిరామ్! గతంలో బాబా నాకు ప్రసాదించిన ఒక అన్నయ్య క్షేమసమాచారాన్ని బాబా తెలియజేసిన అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పటికీ పరిస్థితుల్లో పెద్ద మార్పులు లేవు. అతనింకా కష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ జన్మలో మేము మాట్లాడుకునే పరిస్థితి ఉండదేమోనని ప్రస్తుతానికి నాకనిపిస్తోంది. ఏ బంధమైనా ఈ జన్మ వరకే, బాబా ఒక్కరే చివరివరకూ ఉండే తోడు అని తెలియజేయడానికి బాబా నాకీ పరిస్థితి కల్పించారేమో! అనిపిస్తోంది. ఏదేమైనా అన్నయ్య క్షేమసమాచారాన్ని తెలిపినందుకు, ఈ కొరోనా సంకట పరిస్థితుల్లో కూడా మా కుటుంబాన్ని, ఆత్మీయుల క్షేమాన్ని చూస్తున్నందుకు బాబాకు అనంతకోటి ప్రణామాలు.

ఆర్థిక బాధలు, ఆత్మీయులతో విభేదాలు తట్టుకోలేక ఏడ్చిన ప్రతిసారీ బాబా నాకు సాంత్వన చేకూరుస్తున్నారు. కుటుంబ పరిస్థితులు చక్కబడాలి, ఆత్మీయుల మధ్య పట్టింపులు తొలగి మామూలు స్థితికి రావాలని నేను సాయి దివ్యపూజ, నవగురువార వ్రతం, సచ్చరిత్ర, గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను. బాబా కృపవల్ల సాంత్వన కలిగే అనుభవాలు ఈ రెండు నెలల్లో లెక్కలేనన్నిసార్లు కలిగాయి. వాటిలో కొన్నింటిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం:

మా అన్నయ్య(పెద్దమ్మ కొడుకు) విశాఖపట్నంలో ఉంటారు. ఇటీవల గ్యాస్ లీక్ ప్రమాదం సంభవించిన ప్రదేశానికి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు. ఆ ప్రమాదం గురించి తెలిసి అన్నయ్య క్షేమసమాచారం తెలుసుకుందామంటే సాయంత్రం వరకు అతని ఫోన్ కలవలేదు. మనసులో ఆందోళనగా ఉంది. రాత్రి ఎనిమిది గంటల తరువాత నేను బయట కారిడార్‌లో కూర్చుని బాబా పారాయణ చేసుకున్నాను. పారాయణ ముగించి పుస్తకం మూస్తూనే ఆకాశంలోకి చూశాను. అప్పుడే మబ్బులు వీడి చందమామ కనిపించాడు. ఆరోజు వైశాఖ పూర్ణిమ. పది నిమిషాల్లో అన్నయ్య, 'అంతా క్షేమం. వేరే మిత్రుల ఇంట్లో ఉన్నందువలన ఫోన్ చేయలేదు' అని మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ చూశాక మనసు కుదుటపడి బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

రెండవ అనుభవం:

2020, జూన్ 4, శుక్రవారం నాటి సాయంత్రం నా స్నేహితురాలు వెన్నెలలో లలితా సహస్రనామం చదివితే మంచిదని చెప్పింది. అయితే ఆరోజు పలురకాల ఆలోచనలతో చదివే మనఃస్థితి నాకు లేదు. అయినప్పటికీ స్నేహితురాలు చెప్పిందని స్నానం చేసి దీపారాధన చేశాను. కానీ రాత్రి ఎనిమిదిన్నర వరకు ఆకాశంలో మబ్బుల కారణంగా వెన్నెల జాడే లేదు. పిల్లలకి భోజనం పెట్టిన తర్వాత బయటకు వెళ్లి చూస్తే, వెన్నెల వచ్చింది. గబగబా పాలు కాచి, అమ్మవారికి పెట్టి, బయటకు వచ్చి ఇరవై నిమిషాల్లో లలితా సహస్రనామ పారాయణ పూర్తి చేశాను. తరువాత మనసారా అమ్మవారికి నా బాధ చెప్పుకొని హారతి ఇవ్వగానే మళ్లీ మబ్బులు కమ్ముకున్నాయి. చిన్న జల్లు కూడా పడింది. అదే సమయంలో నేను ఫోన్లో మహాపారాయణకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ తెరచి చూస్తే ఆకుపచ్చరంగు శాలువా ధరించి ఉన్న బాబా ఫోటో దర్శనమిచ్చింది. ఆవిధంగా బాబా తమ ఆశీస్సులు తెలియజేశారని అనుకున్నాను. మర్నాడే ఒక చిన్న సమస్య పరిష్కారమైంది. అంతా బాబా దయ.

చివరిగా మరో అనుభవం:

నేను ప్రతిరోజూ బాబాకి, మిగతా దేవుళ్ళకి పూజచేసి మా కుటుంబం, అమ్మ, తమ్ముడు, ఇంకా బాబా ఇచ్చిన అన్నయ్య బాగుండాలని, తను నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. బాబా చిన్న చిన్న సానుకూల సందేశాలు ఇస్తున్నప్పటికీ ఒక సగటు మానవమాత్రురాలిగా నా మనస్సు చాలావరకు సందేహపడుతూనే ఉంటుంది. 2020, జూన్ 7 సాయంత్రం ఆరు గంటలప్పుడు నేను, మావారు కూరగాయలకు వెళ్లి వస్తున్న సమయంలో కూడా నా మనసు అవే ఆలోచనలతో దిగులుపడుతూ ఉంది. ఆ దిగులుతో నేను స్కూటర్ మీద ఎలా కుర్చున్నానో ఏమోగానీ, డ్రైవ్ చేస్తున్న మావారు, "బ్యాలన్స్ చేసి సరిగ్గా కూర్చో!" అని కోప్పడ్డారు కూడా. ఆ సమయంలో ఆంజనేయస్వామి ఆలయం నుండి "సాయినాథ్ తేరే హజారోం హాత్..." అన్న పాట వినపడింది. సాధారణంగా ఏ దేవుడి ఆలయమైతే, ఆ దేవుని పాటలే వేస్తారు. కానీ మారుతి ఆలయం నుండి బాబా పాట వినపడేసరికి అది నా కోసమే అని అనిపించింది. కానీ కాస్త కోపంగా, "ఇలాగే కంటితుడుపు పనులు బాగా చేస్తావు బాబా" అని తిట్టుకున్నాను. మళ్ళీ మరుక్షణమే, "ఆర్థికంగా, మానసికంగా పడుతున్న బాధలు తట్టుకోలేక ఏదో అనేశాను, నన్ను క్షమించండి బాబా" అని అనుకున్నాను. మరుక్షణంలో సందు మలుపు తిరిగేసరికి ఒక సూపర్ మార్కెట్ ఎంట్రన్స్ దగ్గర ఆకుపచ్చని శాలువా ధరించి ఉన్న పెద్ద బాబా పటం దర్శనమిచ్చింది. ఆ క్షణంలో నా మానసికస్థితి ఎలా ఉండి ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా ఎన్నో నిదర్శనాలు ఇస్తూ నా మనసుకు సాంత్వన చేకూర్చడానికి బాబా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన దయ అటువంటిది.  

ఏ బాధ ఉన్నా బాబాకి చెప్పుకుంటే తగ్గుతుందని మా అమ్మ చెప్పేవారు. అదే భావంతో నేను నా బాధలను బాబాకి చెప్పుకుంటూ ఉంటాను. ఒకటి మాత్రం నిజం, మనం ఎంత ద్వేషించినా, పట్టించుకోకపోయినా మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉండే ఒకే ఒక్క తోడు - దైవం. ఆ దైవాన్ని ఏ పేరుతో పిలుచుకున్నా సరే. "ఈ ప్రపంచాన్ని కొరోనా వైరస్ నుండి కాపాడండి బాబా!".

లోకాః సమస్తాః సుఖినోభవంతు.

ఓం సాయిరామ్!

బాబా కృప

నా పేరు సురేశ్. కటిక పేదరికంలో పుట్టిన నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ ఉద్యోగం మాత్రం రాలేదు. చివరికి విసిగిపోయిన నేను బాబాను ప్రార్థించి, "మీరు నాకు ఉద్యోగాన్ని ప్రసాదించినట్లైతే శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను, మీకు కానుకలు చెల్లించుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. అలా ప్రార్థించిన వెంటనే ఫలితాలు వెలువడి నాకు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత మా ఇంట్లో అందరికీ మంచి సంబంధాలు వచ్చి వివాహాలయ్యాయి. నాకు కూడా సభ్యత, సంస్కారం, చదువు, దైవభక్తి కలిగిన గొప్పింటి స్త్రీ భార్యగా లభించింది. ఇప్పుడు మా జీవితాలలో అసంతృప్తి అనేదే లేదు. ఈమధ్యనే బాబా మందిరంలో చాలామంది బీదవారికి మేము అన్నసమారాధన కూడా చేశాము. ఇన్ని సంతోషాలు ప్రసాదించిన బాబాకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి.

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి!


8 comments:

  1. చెరగని చిరునవ్వు తరగని సుఖ శాంతి!
    జ్ఞాన విభూది నిరతం కోరింది!!
    అందరి గురుమూర్తి పొందగా అనుభూతి!
    నీ పాద జ్యోతినై చేసేద సన్నిధి!!
    సర్వము నీవెగ సాధన చేయగా!
    బాబాయే ఈయబోయే దీవెన!!
    మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం వేడితి
    విజయం కోరితి.పాహిమాం దయగల ఓం సాయిరాం🙏🙏🙏

    ReplyDelete
  2. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి!

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  5. Om Sri Sai Ram thaatha 🙏🙏
    Bhavya sree

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo