సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 447వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. అద్భుతరీతిన అనుగ్రహించిన బాబా
  2. బాబా కృప అద్భుతం

అద్భుతరీతిన అనుగ్రహించిన బాబా
  
సాయిభక్తురాలు చీనా తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయి నా జీవితంలో అద్భుతరీతిన దీపాలు వెలిగించారు. ఆయన ప్రతి ఒక్కరి జీవితాలను వెలుగుతో నింపుతారు.

2016లో నేను దుబాయి వెళ్లి అక్కడ నా జీవితాన్ని మొదలుపెట్టాను. దగ్గరగా తెలిసిన వారెవరూ లేరు. ఎక్కువమంది పరిచయస్థులు కూడా లేనందున నాకు చాలా కష్టంగా ఉండేది. ఆ సమయంలో 'సాయి' నన్ను మరింత దగ్గర చేసుకున్నారు. నేను గూగుల్‌లో బాబా జీవితం గురించి, లీలల గురించి చదవడం మొదలుపెట్టాను. ఇప్పటికీ అదే చేస్తూ బాబా ప్రేమను ఆస్వాదిస్తున్నాను. ఆ క్రమంలోనే సాయి నవగురువారవ్రతం గురించి తెలుసుకుని 2017 జనవరి నెల చివరిలో ఆ వ్రతాన్ని చేశాను. సాయి ఎప్పుడూ ఉపవాసం ఉండటాన్ని ప్రోత్సహించలేదు, తన భక్తులు ఉపవాసం ఉన్నా ఒప్పుకోలేదు. అందువలన నేనెప్పుడూ ఉపవాసం ఉండను. కానీ ఆ వ్రత విధానంలో చెప్పివున్నందువల్ల నేను ఉపవాసం ఉండాలని భావించాను. అయితే ఉపవాసం ఉన్న రోజులలో నేను బాబాను ఏమీ అడగలేదు. కేవలం వ్రతం ప్రారంభించిన మొదటిరోజు మాత్రమే నా మనసులోని కోరికను బాబాకు చెప్పుకున్నాను. అలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు నేను 'సాయి ఇప్పటికీ సజీవులే' అన్న పుస్తకం రచయత జయవాహి గురించి గూగుల్‌లో చదివి, ఆమె దుబాయి వస్తే కలవాలని ఏదో యథాలాపంగా అనుకున్నాను. మరుసటిరోజు ఫేస్‌బుక్‌లో ఆమె దుబాయి వస్తున్నట్లు చూసి ఆశ్చర్యపోయాను. నేను సాయి అనుగ్రహాన్ని పొందిన ఆ సాయి సోదరిని కలుసుకున్నాను. ఆమె పారాయణ విషయంలో నాకు స్ఫూర్తినిచ్చింది. దాంతో నేను నిత్యపారాయణ గ్రూపులో చేరాను. అలా ఆమె నన్ను సాయి అనుగ్రహానికి పాత్రురాలిని చేసింది. సరే, ఇక సాయితో నా ప్రయాణం గురించి ఆపి సాయి చేసిన అతిపెద్ద లీల గురించి మీకు చెప్తాను...

నా వయసు 44 సంవత్సరాలు. మూడున్నర సంవత్సరాల క్రితం నాకు వివాహమైంది. అంటే నేను వివాహం చాలా ఆలస్యంగా చేసుకున్నాను. అప్పటికే ఆలస్యం అయినందున నా భర్త పిల్లల కోసం డాక్టరుని సంప్రదిద్దామని అన్నారు. సరేనని ఇద్దరం మూడేళ్ళ క్రితం డాక్టరును కలిశాము. డాక్టరు పరీక్షలు చేసి, "మీ విషయంలో వయస్సు అతిపెద్ద సమస్య. మీరు చాలా ఆలస్యం చేశారు. కాబట్టి ఐ.వి.ఎఫ్ తప్పనిసరి" అని చెప్పారు. నేను నా భర్తతో, "ఇక్కడ వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది, కాబట్టి నేను భారతదేశంలో ఐ.వి.ఎఫ్ చేయించుకుంటాను" అని చెప్పాను. ఈ విషయం గురించి మా ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవ జరిగి, సంవత్సరం పాటు దాని గురించి మాట్లాడటం మానేశాము. తరువాత నేను నవగురువార వ్రతం మొదలుపెట్టి, "తల్లినయ్యే అర్హత నాకుందని మీరు అనుకుంటే దయచేసి నన్ను ఆశీర్వదించండి. ఐ.వి.ఎఫ్ లేదా నేచురల్ ప్రక్రియలలో దేన్ని ఆశ్రయించాలో కూడా నాకు తెలియజేయండి" అని సాయిని ప్రార్థించాను. 2018 ఫిబ్రవరి నుండి సెప్టెంబరు వరకు సాయి సూచనకోసం నేను ఎదురు చూశాను. అప్పుడు బాబా నాకు అతిపెద్ద అద్భుతాన్ని చూపించారు. ఏ డాక్టర్ అవసరం గానీ, ఎలాంటి మందుల అవసరం గానీ లేకుండానే నేను సహజరీతిన గర్భం దాల్చాను. అలా సాయి ఆశీస్సులు పొందాము మేము. బాబాకు తమవైన ప్రత్యేక మార్గాలు, సమయం ఉంటాయి. నేను చేసినదంతా భక్తితో నామజపం, పారాయణలతో ఆయనకు పూర్తిగా శరణాగతి చెందడమే. నేను, నా భర్త రోహిత్ ఇద్దరం బాబాను ఎంతగానో ప్రేమిస్తున్నాము. ఆయన కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నట్లు పలురకాలుగా మాకు తెలియజేశారు. మా బిడ్డ సాయి మాకు బాబా ఆశీర్వాదం. "లవ్ యు సాయీ! థాంక్యూ, థాంక్యూ సో మచ్".

బాబా కృప అద్భుతం

సాయిభక్తుడు తిరు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిని. నేను ఒక పేరున్న క్లబ్ కోసం ఆడుతున్నాను. మా జట్టును గెలిపించి సూపర్ లీగ్ లోకి తీసుకెళ్లటమే మా లక్ష్యం. నేను బాగా ప్రాక్టీస్ చేసి మరో రెండునెలల్లో ఉన్న మొదటి మ్యాచ్‌కి సూపర్ ఫిట్‌గా తయారయ్యాను. మొదటి మ్యాచ్‌లో నేను 11వ ఆటగాడిగా ఆట మొదలుపెట్టాను. నేను నా ఉత్తమ ఆటను ప్రదర్శిస్తున్న సమయంలో అకస్మాత్తుగా నా తొడనరం తీవ్రంగా గాయపడింది. మెమెంటో అందుకునే దిశగా సాగుతున్న దశలో నాకలా జరగడంతో నాకు కన్నీళ్ళు ఆగలేదు. అందువలన గాయమైనప్పటికీ జట్టుకు నా అవసరముందని ఆట కొనసాగించాను. రెండవ దశలోకి వచ్చాక ఇంక ఆట కొనసాగించలేక కోచ్‌తో గాయపడ్డ సంగతి చెప్పి బయటకు వచ్చేశాను. తరువాత నేరుగా ఇంటికి వెళ్లి సాయిబాబా దగ్గర నా ఫుట్‌బాల్ కెరీర్‌ క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు ఇలా ఎందుకు జరిగిందని ఏడుస్తూ, "నిజంగా నా జట్టుకి నా అవసరముంది, ఏదైనా అద్భుతం చేసి రాబోయే ముఖ్యమైన మ్యాచ్‌లలో నేను ఆడగలిగేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. సాధారణంగా తొడనరానికి సంబంధించిన గ్రేడ్ -2 గాయం ఆరునెలలు ఉంటుంది. అయితే నా తదుపరి మ్యాచ్ మూడు రోజుల్లో ఉంది. మ్యాచ్ జరిగే రోజున నా కోచ్ నన్ను 'ఆడగలవా?' అని అడిగారు. నేను ప్రయత్నిస్తానని చెప్పి ఆట మొదలుపెట్టాను. బాబా కృపవలన నేను ఇబ్బంది లేకుండా ఆడగలిగాను. మా జట్టు గెలిచింది. ఆశ్చర్యమేమిటంటే మ్యాచ్ ముగిసిన వెంటనే నా కండరాలలో నొప్పి మళ్ళీ కనిపించింది. అది తరువాతి మ్యాచ్ వరకు కొనసాగింది. తరువాతి మ్యాచ్ కూడా నేను ఇబ్బంది లేకుండా ఆడగలిగాను. మళ్ళీ మేము గెలిచాము. ఆట ముగిసినంతనే మళ్ళీ తీవ్రమైన నొప్పి మొదలైంది. ఖచ్చితంగా ఇది బాబా చేసిన అద్భుతం, ఆయన వల్లే ఇది సాధ్యమైంది. మొత్తం 10 జట్లలో మేము 3వ స్థానంలో నిలిచాము. అయితే తరువాత కీలకమైన మ్యాచ్‌లో నా రెండవ కాలికి కూడా గాయమవటం వలన మేము ఓడిపోయాము. బహుశా అది నా కర్మ కావచ్చు. కానీ నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను. ఎందుకంటే, సాయిబాబా నన్ను సంరక్షిస్తున్నారు. నా గాయం కారణంగా మేము ట్రోఫీని కోల్పోయాము. కానీ తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన సద్గురు సాయి కృపతో నేను తదుపరి మ్యాచ్‌లకి పుంజుకుంటాను. "చాలా కృతజ్ఞతలు బాబా. నేను ఎన్ని కోల్పోయినా మీ నామాన్ని పలకడం మరువను. నేనెప్పుడూ మీ ఆశీస్సుల కోసం అభ్యర్థిస్తాను".

ఓం సాయిరామ్!


7 comments:

  1. om sai ram i am reading this blog every day and feel happy.om sai ram om saima

    ReplyDelete
  2. పరమ పవిత్రం బాబా విభూతిం!!
    పరమ విచిత్రం లీలా వినోదం!!
    పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రధానం!!
    బాబా విభూతిం ఇదయాశ్రయామి!!

    ReplyDelete
  3. ఓం సాయిరామ్!

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo