సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 389వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ఇరవై మూడవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

కొద్దిరోజుల తరువాత సాయంకాల వ్యాహ్యాళి నుండి బాబా తిరిగి వచ్చాక తాత్యాకోతేపాటిల్ బాబా దగ్గరకు రావటానికి ముందో తరువాతో నాకు గుర్తులేదుకానీ, ధునిలో సాంబ్రాణి వేయటమనే కార్యక్రమాన్ని రాధాకృష్ణమాయి నాచేత మొదలుపెట్టించింది. అయితే తరువాత ఏదో కారణంతో ఆమె నాతో తగవులాడి, ధూపం వేసే పనిని నాచేత చేయించటం ఆపేసి మరెవర్నో ఆ పనికోసం పంపటం మొదలుపెట్టింది. రెండ్రోజుల తరువాత బాబా ఆ వ్యక్తిని కోప్పడి, ధూపం వేయటం నుంచి అతన్ని తప్పించారు. సరిగ్గా అదేరోజు సాయంకాలం మాయి తన పొరపాటును గ్రహించి నేను చేస్తున్న సేవను మరొకరికివ్వటం తన తప్పేనని ఒప్పుకొని, మరుసటిరోజునుండి ఆ పనిని నాకే అప్పగించింది. ఆ రకంగా ఆ సేవ తిరిగి నాకే దక్కింది.

పైన చెప్పిన నిత్యసేవే కాకుండా ప్రతిరోజూ తప్పనిసరిగా మశీదును శుభ్రపరచడం చేసేవాడిని. పర్వదినాల్లోనే కాక వారానికొక్కసారి మశీదుని కడిగి పేడతో అలికేవాళ్ళం. అలాగే ఉత్సవాల సందర్భాల్లో మట్టిగోడలూ, విరిగిన కిటికీలూ మరమత్తులు చేసి శుభ్రంగా అలికేవాళ్ళం. ఈ పనులన్నీ కూడా ఒక్కోసారి అందరితోపాటో, లేకపోతే బాబా చావడికి వెళ్ళేరోజు మాయీ, నేనూ కలిసో రాత్రి ఎవరూ లేని సమయంలో చేసేవాళ్ళం. చావడి నుండి గురుస్థానం వరకూ వీధిలో గుంటలు తవ్వి వాటిలో చిన్న కమ్మీలు పెట్టి వాటిమీద ఇనుప జల్లెడ ఏర్పరిచేవాళ్ళం. అలా తయారైన ఆర్చీల మీద చెట్ల తీగలు పెంచే పనిని రాధాకృష్ణమాయి నాతో కలిసి మొదలుపెట్టింది. ఈ దారిలో కొన్నిచోట్ల సున్నం వేసేవాళ్ళం. 

ఇలానే ఒకరోజు మధ్యాహ్నం బాబా లెండీబాగ్‌కి వెళుతుండగా చూసి, రాధాకృష్ణమాయి ఈ ఆర్చీలు బాబా నడిచే మార్గంలో కూడా ఉంటే బాగుండుననుకున్నది. ఈ పనికోసం సభామండపంలో పెద్దరాయి (బాబా కూర్చున్న రాయి) ఉన్న చోటులో సున్నమూ, కుంచెలూ తెచ్చి పెట్టుకున్నాం. రాధాకృష్ణమాయి వెనకాల సున్నం కలుపుకున్న తొట్టి ఉంది. తొట్టిముందు నేనున్నాను. ఒకరిద్దరు పిల్లలు సున్నంలోని కుంచెను తీసుకుని సున్నాన్ని అటూ ఇటూ కెలికి క్రింద పోశారు. అయితే నేను శూన్యమనస్కుడనై అదంతా చూస్తూ నిలుచున్నాను. అంతలో రాధాకృష్ణమాయి జరుగుతున్నది గమనించి పట్టరాని కోపంతో నా చెంపపై రెండు దెబ్బలు వేసి, “ఆ పిల్లలు అలా నాశనం చేస్తుంటే నీకు కళ్ళు కనిపించటం లేదా?” అన్నది. నన్నలా కొట్టినందుకు ఆమె బహుశా పశ్చాత్తాపపడి ఉండొచ్చు. ఎందుకంటే నేను నా గదికి వెళ్ళిన వెంటనే ఆమె కూడా నా వెనకే వచ్చి నన్ను పలకరించింది.

ఆకారంలో పెద్దగా ఉండి, ఏమాత్రం బరువు లేకుండా తేలిగ్గా ఉన్న బిందెతో రాధాకృష్ణమాయి సాయంత్రం పూట నీళ్ళు తెచ్చుకునేది. ఈ పనికోసం ఒకటి రెండ్రోజులు ఆమె నన్ను తనతో తీసుకెళ్ళింది. ఆ గిలక బావిలోంచి నీరు తోడి ఆమె ఒక బిందె, ఒక బొక్కెన నింపుకునేది. నేను ఆ బిందె, బొక్కెన మోసేవాడిని. నా కుటుంబసభ్యులెవరైనా శిరిడీ వస్తే రాధాకృష్ణమాయి నాతో ఈ సేవ చేయించుకునేది కాదు. అయినా కూడా ఒకసారి ఆమె మాట వినకుండా నేను బిందె నింపి తెచ్చాను. ఆమె వెంటనే ఆ నీరు పారబోసింది. కుటుంబసభ్యుల సమక్షంలో ఈ రకమైన సేవచేయటం వల్ల బాబా కూడా కోపం వ్యక్తం చేసేవారు.

అందరూ నిద్రపోయినప్పుడు చాలాసార్లు అర్థరాత్రి సమయంలో రాధాకృష్ణమాయి ఒంటరిగా వెళ్ళి నీరు నింపుకొని తెచ్చేది. ఒక అర్థరాత్రి నేను ప్రత్యక్షంగా చూశాను కూడా. వెంటనే నేను కూడా ఆమెతో వెళ్ళి ఆమెకి సహాయం చేద్దామనుకుంటే ఆమె ఖచ్చితంగా వద్దన్నారు. ఉపయోగించగా మిగిలిన కొవ్వొత్తిలోని కొవ్వుని మళ్ళీ కరిగించి మూసలో పోసి కొవ్వొత్తులు తయారుచేసే పనిని నేను కొన్నిరోజులు చేశాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo