సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 404వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ముప్పైఎనిమిదవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

బాబా కఠిన వైరాగ్యం, సర్వజ్ఞత, అనుద్వేగకరమైన సత్యం, ప్రియవచనాలు, వచ్చీపోయేవారి ఉద్ధరణ కోసం చింత, ఆర్తులైన భక్తుల బాధలను తాను గ్రహించి వారి దుఃఖాన్ని పోగొట్టే ఆయన నిత్యస్వభావాలను చూసి నేను ఆయన్ని సాక్షాత్తూ ఈశ్వరుడిగానే భావించేవాణ్ణి. బాబా స్వయంగా, 'అల్లామాలిక్', 'అల్లా సే కోయీ బడా నహీ', 'కరేగా ఓ భరేగా' (చేసినదాన్ని అనుభవించాలి), 'స్వర్గనరకాలు ఉన్నాయి' అని అంటూండేవారు. వారి మాటలు ఒక్కటి కూడా నాకు మిథ్య అని అనిపించలేదు. ఆయన నవ్వుతూ నవ్వుతూ ఏమనేవారో అవన్నీ సత్యమే అయ్యేవి. అందువల్ల బాబా విషయంలో నాకు, “ఆయన ఏ మార్గం చూపిస్తారో అదే సత్యం. ఆ మార్గంతోనే నాకు భగవంతుడి సాక్షాత్కారం అవుతుంది” అని అనిపించేది. అయినప్పటికీ ఆయన భక్తులకు ప్రార్థనను, నామస్మరణను ఉపదేశించే సమయంలో వారికేదైనా మంచి జరిగితే, "అది భగవంతుడే చేశాడు” అనేవారు. దీనితో "బాబా శిక్షణ ద్వైతమా? లేక అద్వైతమా?" అని మనసులో ఒక తలంపు వచ్చింది. 

అప్పుడు బాబా సేవకోసం నన్ను రాధాకృష్ణమాయి దగ్గరకు పంపించారు. ఆ సమయంలో ఆమె స్వయంగా తన జీవితం గురించి చెప్పేటప్పుడు 'శాల' (స్కూలు) అనే శబ్దాన్ని ప్రయోగించింది. ఆమె, “సాయిబాబా పేరును నేను విధవను అయిన తరువాతనే విన్నాను. నా పెళ్ళైన మూణ్ణాలుగు రోజుల్లోనే నేను విధవనయ్యాను. దాని తరువాత నేను మా మామగారింట్లో ఉండేదాన్ని. ఆయన పండరిపురంలో వకీలుగా ఉండేవారు. నేను ధార్మిక గ్రంథాలను చదువుతూ సమయాన్నంతా భజన, పూజల కోసం వెచ్చించేదాన్ని. మధ్యాహ్నం పూట ఎక్కువ జనం లేనప్పుడు దైవదర్శనం కోసం గుడికి వెళ్తుండేదాన్ని. బాబా పేరు విని ఆయన పట్ల భక్తిని పెంచుకోవటం ప్రారంభించాను. ఆ రోజుల్లో నేను ఎక్కువ అన్నం తినేదాన్ని. కడుపు బాగా నిండిపోయి నొప్పిపుట్టినప్పుడు, "సాయిబాబా, సాయిబాబా” అని అరిచి నేలపై పడుకునేదాన్ని. 

ఒకరాత్రి నాకు స్వప్నంలో ఏదో కనిపించి నాలో వైరాగ్యం మేలుకొంది. మేలుకొన్న తరువాత నా శరీరం మీద ఉన్న నగలను తీసివేసి దూరంగా విసిరేశాను. అలాగే ఇల్లొదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. అందరూ వద్దని నాకు ఎంతగానో చెప్పినా నేను నా నిర్ణయం మీదనే దృఢంగా ఉన్నాను. కట్టుబట్టలతో నేను ఇల్లు వదిలి బయటకొచ్చాను. అయాచిత వ్రతాన్ని పాటిస్తూ నాలుగు ధామాల యాత్రను చేశాను. కొన్ని సమయాల్లో తినటానికేమీ లభించకపోతే పేడను తిని నా మనసును తృప్తిపరచేదాన్ని. డబ్బును ముట్టేదాన్ని కాదు. ఎవరైనా దానం చేయబోతే ఆ వ్యక్తితో కేవలం నా ప్రయాణానికి అవసరమైన టిక్కెట్టు కొనివ్వమనేదాన్ని. పాండురంగడు నాలుగు ధామాల యాత్ర చేయించి ఈ కఠిన వ్రతాన్ని నా చేత పూర్తిచేయించాడు. తరువాత ఇక్కడకొచ్చి బాబా సమక్షంలో సంత్ తుకారాం అభంగాలను పాడుతుండేదాన్ని. 

ఆ రోజుల్లో బాబా లెండీబాగ్‌కు వెళ్ళే దారిలోనూ, చావడి దగ్గరా భక్తుడైన నెవాస్కర్ పరిశుభ్రం చేస్తుండేవాడు. నెవాస్కర్ చేసే ఆ పనిని క్రమంగా నా చేతిలోకి తీసుకున్నాను. అలాగే అతను మరణించిన తరువాత ఆ పనినంతా నేనొక్కదాన్నే చేయటం మొదలుపెట్టాను. గ్రామస్థులు వచ్చేపోయే దారిలో రెండు వైపులా మలవిసర్జన చేస్తూ అలాగే పిల్లలను కూడా మలవిసర్జనకు కూర్చోబెట్టేవారు. చెత్త పడేసేవారు. ఆ చెత్తనూ, మలాన్నీ నెవాస్కర్ లాగానే పూర్తిగా నేనే శుభ్రం చేస్తుండేదాన్ని. నేను స్కూల్లో ఉండేదాన్ని. అక్కడ తులసిమొక్కను నాటడం వల్ల ఆ ప్రదేశాన్ని అందరూ 'శాల' లేదా 'బృందావనం' అనే పేరుతో పిలిచేవారు. నేను బాబా ఎదుటకు వెళ్ళేదాన్ని కాదు. ఒకసారి నేను బాగా జ్వరపడ్డాను. అది చలిజ్వరం. దాంతో చాలా నీరసపడిపోవటం వల్ల నేను నిద్రిస్తున్నాను. అప్పుడు బాబా నా దగరకొచ్చి, నా నుదుటిపై ఊదీ పెట్టి, "ఇంతగా శ్రమపడకు. ఇప్పుడు విశ్రాంతి తీసుకో!" అన్నారు" అని వివరించింది.

ఈ నెవాస్కర్ జీవితం మనకు మేలుకొలుపు కలిగించేదిగా ఉంది. అతను బాబాకి అనన్యంగా శరణన్నాడు. అతను తన పొలంలో వచ్చే పంటనంతా శిరిడీకి తెప్పించేవాడు. దాన్లోంచి బాబా ఎంతిస్తే అంతే తన ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఇంట్లో భార్యాపిల్లలకు కావలసిన బట్టలను కూడా బాబా ఆజ్ఞననుసరించే కుట్టించేవాడు. తరువాత ఒక్కసారిగా సర్వాన్నీ త్యజించి అతను శిరిడీ వచ్చేశాడు. కానీ బాబా అలా చేయవద్దని చెప్పిన మీదట అతను తిరిగి వెళ్ళిపోయాడు. అంతిమ సమయంలో అతను అన్నపానీయాలను కూడా త్యాగం చేశాడు. బాబా ద్వారా పంపబడిన జొన్న రొట్టె ప్రసాదాన్ని భుజిస్తూ, బాబా చరణతీర్థాన్నే నీటికి బదులుగా త్రాగేవాడు. అంతిమ సమయంలో భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయం పదమూడవ శ్లోకంలోని - "ఓ మిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరన్ మామనుస్మరన్” అనే పంక్తిలో చెప్పబడిన విధంగా దేహాన్ని త్యజించి అతను పరమపదవిని ప్రాప్తింప చేసుకున్నాడు. అతని జన్మ ధన్యం.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🌹🙏🌹🙏🌹🙏ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏🌹🙏🌹🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo