సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 411వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభైనాలుగవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఈ మధ్యలో నన్ను తీసుకెళ్ళటానికి మా పెద్దబావగారొచ్చారు. బాబా అనుమతి లభించింది. దాంతో నేను బావగారితో కలిసి బయలుదేరాను. దారిలో నది పొంగటాన్ని చూసి ఇద్దరం వెనక్కి తిరిగి వచ్చాం. నావ నుంచి దిగి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను కొట్టుకుపోతూ కూడా బాబా దయవల్ల రక్షించబడ్డాను. నేను తిరిగి రావటాన్ని చూసి కాకాసాహెబ్ దీక్షిత్ కొంచెం కూడా అప్రసన్నుడు కాలేదు. మునుపటిలాగానే నన్ను స్నేహపూర్వకంగా ఆదరించాడు. 1913వ సంవత్సరంలో రాధాకృష్ణమాయిని నేను మొదటిసారి కలిశాను. ఆమె మొదటినుంచీ కూడా నన్నెంతో ప్రేమగా చూసుకొనేది. ఆమె నన్నో చిన్నపిల్లవాడిలా చూసి గారాబం చేసేది. అలాగే నేను కూడా ఆమెను నా తల్లిలాగానే గౌరవించేవాడిని. మా పరిచయమై అప్పటికి కేవలం మూడు, నాలుగు రోజులే అయింది. అవి చాతుర్మాస్యం రోజులు. ఆమె నాకు వెచ్చని స్వెట్టర్ తొడిగి, అలాగే తలపాగా పెట్టి నావైపు చూస్తూ, “వామన్యా, ఇప్పుడు నువ్వు ‘వార్కరీ’ అయినట్లు కనిపిస్తున్నావు” అన్నారు. భగవద్గీత చదివినందువల్ల నా మనసు దృఢంగా ఉండేది. శ్రేయస్సుని పట్టుకుని ప్రియమైనదాన్ని త్యజించే శక్తి నాకు భగవద్గీత నుంచే ప్రాప్తించిందన్న అనుభవం నాకు కల్గింది.

ఒకసారి నేను చావడి నుంచి బయలుదేరి ద్వారకామాయి వైపు వెళ్ళటానికి సిద్ధమవుతున్నప్పుడు బాబా, “నా వామన్‌కి తినటానికేమైనా దొరకుతోందా?” అన్నారు. ఒకసారి బాగా తెల్లవారుఝామున చీకట్లో శౌచవిధి కోసం బావి దగ్గరకు వెళుతున్న సమయంలో దారిలో ఉన్న పెద్ద గుంట నాకు కనిపించలేదు. అయితే ఆ సమయంలో సగుణమేరునాయక్ మేలుకునే ఉన్నాడు కాబోలు, నేను గుంట వైపు వెళ్ళటం చూసి వేగంగా నా వెనుక పరిగెత్తుకొచ్చాడు. నేను గుంటలో పడకుండా అతను నన్నలా రక్షించాడు. సగుణరావు నన్నక్కడనుంచి వాడాకి తీసుకొచ్చి వదిలాడు.

ఒకరోజు మధ్యాహ్నం, ఇప్పుడు మాధ్యమిక పాఠశాల ఉన్నచోటు, అంటే శ్యామసుందర్ అనే బాబా గుర్రం కట్టబడి ఉన్నచోట్లో ఆ ఇంటిగోడని ఆనుకొని భక్తులతో పాటు నేను నిలుచుని ఉన్నాను. ఇంతలో రాధాకృష్ణమాయి గదిలోంచి ఏదో శ్వాస వచ్చినట్లనిపించింది. ప్రాణవాయువును బాబా మీదకు వదిలినట్లూ, అలాగే ఆ ప్రాణవాయువు విస్తరించి బాబా నిత్యరూపం ఉన్న స్థానంలో రుద్రాక్షధారి రూపంలో దర్శనమైంది. ఇదిలా రాస్తున్నప్పుడు ఈ దృశ్యం ద్వారా బాబా బహుశా నాకు “నేను శుద్ధ బుద్ధ నిర్గుణ నిరంజన నిరాకారుడిన”ని చెప్పాలనుకుంటున్నారనిపిస్తోంది. అయితే మాయయొక్క శ్వాసతో (స్పందనతో) ఈ శివరూపం ప్రాప్తించింది. నాకు శివరూపంలో దర్శనమైన రూపమే తలకు బట్ట కట్టుకుని గడ్డం, మీసాలతో ఉన్న కఫ్నీధారి రూపమని తెలుసుకోండి! పూర్ణ బ్రహ్మత్వం మాయవల్లనే సాకారమవుతుంది.

ఒకరోజు నేను ద్వారకామాయికి వెళుతున్నాను. ఆ పరిసరాల్లో గోడను దాటి వాకిలికి ఒకటి రెండు అడుగుల దూరంలో ఉన్నాను. అక్కడ ఎవరో, “అక్కడే నిలబడు” అని నన్ను ఆజ్ఞాపించారు. నేనలాగే నిలబడిపోయాను. తరువాత, “ఇక్కడే నిలబడి బాబా నామాన్ని స్మరించు” అన్న ఆదేశం ఇవ్వబడింది. ఆ ఆదేశానుసారం ఆ స్థానంలో నిలబడే నేను బాగా తీవ్రంగా బాబా నామోచ్ఛారణ చేశాను. ఇది విని కొంచెంసేపయిన తరువాత బాబా తమ ఆసనంలోంచి లేచి తులసికోట దగ్గరున్న గట్టుమీద విరాజమానులైనారు. ఆయనే నన్ను పిలిచారో లేక నేనే అక్కడకు వెళ్ళానో కానీ నేను ప్రేమపూర్వకంగా ఆయన చరణాలకు నమస్కరించాను. మళ్ళీ ఆయన తిరిగి తమ ఆననం మీద కూర్చున్నారు. నేను నామోచ్ఛారణ చేసినందుకే బాబా ఆసనంపైనుంచి లేచి వచ్చారన్న మాటను చెప్పవలసిన అవసరంలేదు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo