ఈ భాగంలో అనుభవం:
- ఆపత్కాలంలో వెన్నంటే ఉండే సాయి
- కృపతో భయంకరమైన వ్యాధి నుండి విముక్తినిచ్చారు బాబా
5. ఆపత్కాలంలో వెన్నంటే ఉండే సాయి
6. ఓం శ్రీ సాయినాథాయ నమః
నా పేరు జి.గోపీనాథ్. నేను సాయిభక్తుడిని. నేను మేడ్చల్ నివాసిని.
గవర్నమెంట్ టీచరుగా పనిచేస్తున్నాను. 'ఆపత్కాలంలో సాయి
వెన్నంటే ఉంటారు' అన్నదానికి నిదర్శనమైన నా అనుభవాలను
నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
అది 2014, ఫిబ్రవరి 2వ
తేదీ. నా భార్యకి వీ.ఆర్.ఓ పరీక్షా కేంద్రం చిలుకూరు బాలాజీ గుడి నుండి పది
కిలోమీటర్లో దూరంలో ఉన్న చోట వచ్చింది. అంటే, మేముండే
మేడ్చల్ నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరం. పరీక్ష సాయంత్రం 5
గంటలకి పూర్తయింది. మేము అక్కడినుండి తిరిగి వస్తుండగా బైక్ వెనక
టైర్ పంక్చర్ అయ్యింది. అయినప్పటికీ కొద్ది దూరం అలాగే ప్రయాణించడం వలన ట్యూబ్
పాడైంది. క్రొత్త ట్యూబ్ వేయాలంటే 350 రూపాయలు కావాలి.
నేనేమో చిలుకూరి బాలాజీ గుడి వద్ద పుస్తకాలు, తేనె, ఇంకా కొన్ని వస్తువులు తీసుకున్నాను. బైకులో పెట్రోల్ బాగానే ఉంది,
ఇంకేం అవసరాలు ఉంటాయని డబ్బంతా వాడేశాను. ఆ టైంలో 'ఫోన్ పే', 'గూగుల్ పే'ల
గురించి నాకు తెలియదు. పైగా నాకు ATM కార్డు పెట్టుకునే
అలవాటు కూడా లేదు. ఆ ఏరియాలో దగ్గర బంధువులు గానీ, తెలిసినవాళ్ళు
గానీ లేరు. చీకటిపడుతోంది, ట్యూబ్
పాడైంది, డబ్బులు లేవు, ఇంకా 50
కిలోమీటర్లు ప్రయాణం చేస్తేగానీ ఇల్లు చేరుకోలేము. ఏమీ చేయడానికి తోచలేదు. అటువంటి నిస్సహాయస్థితిలో నేను సాయిబాబాను,
"ఎలాగైనా ఈ గండం గట్టెక్కించు బాబా" అని వేడుకున్నాను. బాబా దయతో నాకు మా మామకొడుకు
కూడా అదే పరీక్ష వ్రాస్తున్నాడని గుర్తుకు వచ్చింది. అయితే
అతని పరీక్షా కేంద్రం ఎక్కడో నాకు తెలియదు. వెంటనే అతనికి ఫోన్ చేస్తే, అతని పరీక్ష కేంద్రం అదే రూటులో అని తెలిసింది. ఒక్కసారిగా ప్రాణాలు లేచి వచ్చినట్లనిపించింది. అతను వచ్చేదాకా వేచి
ఉన్నాము. అదృష్టవశాత్తూ దగ్గరలోనే పంక్చరు షాప్ ఉంది.
అక్కడ ట్యూబ్ మార్చుకొని, రాత్రి 7.30-8.00
మధ్యలో ఇంటికి చేరాము. ఆ కష్ట సమయంలో
అవసరమైన డబ్బులు ఇచ్చిన మా మామకొడుకు పేరు సాయి సుమన్. బాబానే ఆ రూపంలో మాకు సహాయం
చేశారని నేను ఎంతో సంతోషించాను. ఇప్పటికీ ఆ సంఘటన
గుర్తుకు వచ్చినప్పుడల్లా బాబా మనకు ఎప్పటికీ తోడు ఉంటారన్న విశ్వాసంతో ఆనందంగా
అనిపిస్తుంది.
8.
ఇటీవల జరిగిన మరో
అనుభవం:
9. ఈ మధ్యనే 01.06.2020న జరిగిన మరో అనుభవాన్ని కూడా
పంచుకుంటాను. మా బాబు నరేంద్రనాథ్‌కి 3 సంవత్సరాలు. జూన్ 1,
సాయంత్రం 8 గంటల సమయంలో వాడికి కడుపునొప్పి వచ్చింది.
మామూలుగా వాడికి దిష్టితీసి, సాయిబాబా ఊదీని నుదుటన
పెట్టి, కొద్దిగా నీళ్ళలో ఊదీ వేసి వాడి చేత త్రాగించాము.
కొద్దిసేపటికి నొప్పి తగ్గిపోయి వాడు మామూలు స్థితికి వచ్చాడు. తర్వాత అందరం భోజనం చేసి నిద్రపోయాము. రాత్రి 12.30
దాటాక వాడు నొప్పితో విలవిలాడిపోతూ ఏడవడం మొదలుపెట్టాడు. ఇక లాభం లేదని హాస్పిటల్‌కి
వెళ్ళాము. దాదాపు మేడ్చల్‌లో ఉన్న అన్ని హాస్పిటల్స్‌కి వెళ్ళాము. ఎక్కడా
డాక్టర్లు లేరు. హాస్పిటల్ స్టాఫ్, "చిన్న పిల్లాడు కదా,
పిల్లల డాక్టరుకి చూపించండి. మేము ఎలాంటి మందులూ ఇవ్వము. జీడిమెట్ల
దగ్గర సురక్ష హాస్పిటల్‌కి వెళ్ళండి. అక్కడ పిల్లల డాక్టర్ ఉంటారు" అని
చెప్పారు. బాబు నొప్పితో విపరీతంగా బాధపడుతున్నాడు. సమయం రాత్రి 1.30 దాటింది. అప్పటికే వర్షం పడి చిమ్మచీకటిగా ఉంది. ఆకాశం ఇంకా మేఘావృతమై
మళ్ళీ వర్షం పడే సూచనలు కనపడుతున్నాయి. హాస్పిటల్ మేడ్చల్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో వుంది. మాకు కారు లేదు కాబట్టి బైక్ పైనే వెళ్ళాలి. సమయానికి అందులో పెట్రోల్ కూడా లేదు. లాక్‌డౌన్
కారణంగా పెట్రోల్ బంకులు మూసి ఉన్నాయి. అయినా
హాస్పిటల్ వరకూ వెళ్లగలిగితే చాలు, వచ్చేటప్పటి సంగతి
చూద్దాంలే అని బాబాను తలచుకొని బయలుదేరాను. నొప్పికి
తాళలేక బాబు ఏడుస్తూనే ఉన్నాడు. దారి పొడవునా బాబాను తలచుకుంటూనే వెళ్ళాము. మొత్తానికి బాబా దయవలన హాస్పిటల్ చేరుకున్నాము. డాక్టర్
బాబుని పరీక్షించి, మందులు వ్రాసిచ్చాడు. ఇప్పుడు మరో సమస్య.
బండిలో పెట్రోల్ లేదు, తిరిగి ఇంటికి వెళ్లలేము. పెట్రోల్
బంకులు తెరచేవరకు, అంటే ఉదయం 6 గంటల
వరకు వేచి చూడాలి, ఇప్పుడేం చేయాలా అనుకుంటూ ఉండగా బాబా కృప మా తమ్ముడి రూపంలో లభించింది. విషయం
ఏమిటంటే, మేము హాస్పిటల్‌కి వెళ్ళామని తెలిసి, మా తమ్ముడు మా వెనకే తన బైక్ పై వచ్చాడు. అయితే తన బైకులో కూడా పెట్రోల్
కొద్దిగానే ఉంది. ఆ బైకులోని కొంత పెట్రోల్ తీసి మా బైకులో పోసేంత లేదు. అది
మేడ్చల్ వరకే వస్తుంది. అప్పుడు బాబానే మాకు దారి
చూపించారు. మేము తన బైక్ మీద ఇంటికి వచ్చేశాము. తను తన
ఫ్రెండుకి ఫోన్ చేసి, పెట్రోల్ తెప్పించుకుని ఇంటికి
చేరేసరికి తెల్లవారుఝాము 4.00 అయ్యింది. బాబానే మేము ఎక్కడా వర్షంలో తడవకుండా, ఎటువంటి
ఇబ్బందీ పడకుండా మమ్మల్ని సురక్షితంగా ఇంటికి చేర్చారు. మా తమ్ముని పేరు కూడా సాయినాథే. ఇలా రెండు సందర్భాలలోనూ 'సాయి' అన్న పేరు ఉన్నవారి ద్వారానే బాబా నాకు
రక్షణనిచ్చారు. "మీ అనుగ్రహానికి కృతజ్ఞతలు
బాబా".
జై సాయినాథ్ మహరాజ్.
కృపతో భయంకరమైన
వ్యాధి నుండి విముక్తినిచ్చారు బాబా
6. ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
8. ఓం సాయిరామ్! కొన్నిరోజుల క్రితం నాకు టి.బి.కి సంబంధించిన ఒక వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. ఏమి చేయాలో తెలియక భయంతో కంపించిపోయాను. ఆ స్థితిలో బాబా భక్తురాలినైన నేను బాబానే తలచుకొని, "బాబా! నాకు నువ్వే దిక్కు. భయంకరమైన ఈ వ్యాధి నుండి నన్ను కాపాడు" అని దీనంగా వేడుకున్నాను. ప్రతిరోజూ ఆ వ్యాధికి సంబంధించిన శరీర భాగాలపై బాబా ఊదీ రాస్తూ ఉండేదాన్ని. సాయి దివ్యపూజ కూడా మొదలుపెట్టాను. బాబా దయవల్ల క్రమంగా ఆ వ్యాధి నుండి నాకు విముక్తి లభించింది. ఇదంతా కేవలం బాబా వల్లే సాధ్యమైంది. ఆయన అపారమైన కృపను నాపై కురిపించి నాకు పునర్జన్మను ప్రసాదించారు. "బాబా! నేను మీకు చాలా ఋణపడివున్నాను. మీ దయవల్లే భయంకరమైన వ్యాధి నుండి బయటపడ్డాను. మీ మేలు ఎప్పటికీ మరువలేను".
🙏 ఓం సాయి రామ్ 🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః
ReplyDeleteఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹
ReplyDelete