సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 427వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. త్రాగుడు సమస్యని పరిష్కరించిన బాబా 
  2. బాబా అనుగ్రహ మహిమ

త్రాగుడు సమస్యని పరిష్కరించిన బాబా 

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

బాబా మీద పూర్తి విశ్వాసం ఉంచి సహనంతో వేచి ఉన్నట్లయితే మన జీవితంలో నిజంగా అద్భుతాలు జరుగుతాయి. బాబాకి శరణాగతి చెందితే అన్నింటా సూత్రధారియై ఆయనే నడిపిస్తారు. బాబా నన్ను తమ భక్తురాలిగా ఎన్నుకొని నా జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తున్నారు. ఇప్పుడు నేను పూర్తిగా బాబా దయవల్ల సత్యమార్గంలో, ధర్మమార్గంలో ప్రయాణం చేస్తున్నాను. అడుగడుగునా బాబానే నాతో ఉండి నాకు మార్గదర్శకత్వం చేస్తూ నన్ను నడిపిస్తున్నారు.

ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం కొద్దిరోజుల క్రితం జరిగింది. మా నాన్నగారికి ఎన్నో సంవత్సరాల క్రితం త్రాగుడు అలవాటు ఉండేది. నా చిన్నవయస్సులోనే, అంటే సుమారు 12 సంవత్సరాల క్రితం ఒకరోజున మానాన్నగారు బాబా మందిరానికి వెళ్ళి, "తన త్రాగుడు అలవాటు మానేస్తాన"ని బాబాకు ప్రమాణం చేసి త్రాగుడు మానేశారు. కానీ కొన్ని నెలల క్రితం తన పాత అలవాటు గుర్తొచ్చి మరలా త్రాగడం మొదలుపెట్టారు. అప్పటినుండి 6 నెలలపాటు పండుగ సమయాలలోనూ, కొన్ని ప్రత్యేక సందర్భాలోనూ మాత్రమే త్రాగుతుండేవారు. అలా అప్పుడప్పుడు మాత్రమే త్రాగుతుండటంతో మాకు అంతగా ఇబ్బంది అనిపించలేదు. కానీ గత కొద్దిరోజులుగా రోజు విడిచి రోజు త్రాగటం ప్రారంభించారు. మేము ఎంతగా ప్రాధేయపడినా ఆయన తన అలవాటును మానుకోలేకపోయారు. ఈ పరిణామంతో మేము, మా అమ్మ ఎంతో బాధపడ్డాము. ఆ సమయంలో మా నాన్నగారి త్రాగుడు అలవాటు మాన్పించమని, నాన్నగారు ఈ అలవాటు నుండి బయటపడితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నీటిలో కలిపి నాన్నకి ఇచ్చాను. బాబా అనుగ్రహంతో ఈ నెలలోనే మా నాన్నగారు త్రాగటం మానేశారు. బాబా చూపిన అనుగ్రహానికి ఎంతో సంతోషంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ప్రస్తుతం నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారు. “మరలా ఇంకెప్పుడూ మా నాన్నగారు ఆ అలవాటు జోలికి వెళ్ళకుండా కాపాడండి బాబా!” 

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

బాబా అనుగ్రహ మహిమ

సాయిభక్తురాలు శ్రీమతి విజయ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నా పేరు విజయ. బాబా అనుగ్రహంతో నాకు కలిగిన రెండవ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మా చిన్నపాప వయసు ఒకటిన్నర సంవత్సరాలు. పాప చాలా అందంగానూ, ఆరోగ్యంగానూ ఉంటుంది. చాలా అరుదుగా పాపకు అజీర్ణ సమస్య వస్తుంటుంది, అంతేతప్ప తను ఎప్పుడూ చురుకుగా ఆడుకుంటూ సందడి చేస్తూ ఉంటుంది. కాకపోతే తను ఆటలాడే సమయం తన వయసు పిల్లలతో పోలిస్తే కాస్త ఎక్కువనే చెప్పాలి. అంటే తను హైపర్ యాక్టివ్ ఛైల్డ్. ఈ యాక్టివ్‌నెస్ వల్ల నన్ను పగలు పని చేసుకోనివ్వదు, రాత్రి పడుకోనివ్వదు. రోజు మొత్తంలో, అంటే రోజుకి 24 గంటలైతే, పాప పడుకునేది కేవలం అయిదు గంటలు మాత్రమే. ఈ సమస్య వల్ల నేను చాలా ఇబ్బందిపడేదాన్ని. ఇది చిన్న సమస్యే అయినప్పటికీ తల్లులను చాలా ఇబ్బందిపెట్టే సమస్య.

నేను గత కొన్నిరోజుల నుండి బాబా పూజ చేసేటప్పుడు పాపను కూడా నాతో పాటు పూజలో కూర్చోబెట్టుకుని, బాబా ఊదీని పాపకు పెడుతున్నాను. ఆశ్చర్యంగా, ఇంతకుముందు రాత్రి ఒంటిగంటకు పడుకుని 5 గంటలకు లేచే మా పాప బాబా ఊదీ పెట్టడం ప్రారంభించినప్పటినుంచి రాత్రి 9, 10 గంటలకు పడుకొని ఉదయం ఏడు గంటలకు లేస్తోంది. ఇది చిన్న అనుభవమైనప్పటికీ నాకు చాలా గొప్పగా అనిపించింది. 

నా అనుభవాన్ని పంచుకునే అవకాశం కల్పించిన ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. సాయిభక్తులందరిపై సాయి దయ ఉండాలని సాయిని ప్రార్థిస్తూ..

సాయిభక్తురాలు 

విజయ


6 comments:

  1. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

    ReplyDelete
  2. om sairam
    sai always be with me

    ReplyDelete
  3. Thanks Baba, please always be with me. Thank you.

    ReplyDelete
  4. Om Sri Sai Ram.. thaatha 🙏
    Bhavya sree

    ReplyDelete
  5. 🙏🌹ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo