సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 405వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ముప్పైతొమ్మిదవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకసారి మాట్లాడుతూ మాట్లాడుతూ రాధాకృష్ణమాయి నాతో, “నీవు బాబాకి ప్రతిరూపానివి” అన్నది. ఈ మాటతో నాకు సంతోషం కలుగలేదు. మనసులో ఇలా అనిపించింది, “ప్రతిరూపం అవటంలో ఏం పురుషార్థం ఉంది? నేను అసలైనవాడినే కావాలి” అని. అంతర్‌జ్ఞాని అయిన రాధాకృష్ణమాయి వెంటనే, “మనందరం ప్రతిరూపాలమే(నకళ్ళు)! అసలయినవారు ఆయనే(బాబా)!” అన్నది.

ఒకప్పుడు మా మోఘీ అక్కయ్య ఇంట్లో ఉండి సొలిసిటర్ పరీక్షకు తయారవుతున్నాను. అప్పుడు ఆ చదువులో వచ్చిన బాధల వల్ల నేను విచారగ్రస్తుడినయ్యాను. శరీరంలో బలహీనత ఏర్పడింది. ఒకరోజు ముంబాయి వెళ్ళటం కోసం విల్లేపార్లే ట్రైనులో కూర్చున్నాను. అప్పుడు నా నడుము క్రిందిభాగంలో గణేశ దర్శనం అయినట్టు అత్యంత విచిత్రంగా అనిపించింది. ఆ సమయంలోనే నేను కూర్చున్న పెట్టెనుండి ఒక క్రైస్తవుడు దిగటం చూసి, 'అతను సాక్షాత్తూ ఏసుప్రభువే' అని అనుకున్నాను. ఆ సమయంలో పరీక్ష గురించిన ఆలోచనతో పాటు భగవంతుడు, గురువు, స్వంతవిషయాల గురించిన అనేక రకాల ఆలోచనల పరిభ్రమణలో చిక్కుకుని ఉన్నాను. 

అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ తన భార్యతో కలిసి శిరిడీ వెళుతున్నట్లు నాకు తెలిసింది. అందువల్ల బాబాకు సమర్పించడానికి పూలమాల, పళ్ళు, కొంచెం దక్షిణ వారితో పంపించాలనుకున్నాను. మా బావగారితో పూలు, పళ్ళను తెప్పించి, వాటిని కాకాసాహెబ్‌కు ఇవ్వటానికి నేను మా బావగారితో కలిసి బోరీబందరు వెళ్ళాను. మనసంతా ఆధ్యాత్మిక విషయాలతో నిండిపోవటం వల్ల స్టేషనులో ఉన్నప్పుడు, "కాకాసాహెబ్ ద్వారా వీటిని పంపే బదులు స్వయంగా శిరిడీకి వెళ్ళి బాబాకి అర్పిస్తే ఎంత బావుంటుంది! బాబాకు అర్పించి వెంటనే తిరిగి రావచ్చు కదా!" అని మననులో అనిపించింది. కాకాసాహెబ్‌తోనూ, ఆయన భార్యతోనూ ఈ మాట చెబితే వాళ్ళు కూడా దానికి సంతోషంగా సమ్మతించారు. బావగారితో అక్కయ్యకు కబురు పంపించి, నేను పళ్ళు, పూలను తీసుకుని కట్టుబట్టలతో శిరిడీ వెళ్ళాను. నోరంతా అరుచిగా ఉండటం వల్ల ఆ రాత్రి నేనేమీ తినలేదు. అలా వెళ్ళినవాణ్ణి శిరిడీలో ఇరవైఒక్క రోజులపాటు ఉండిపోవటమనేది నా దృష్టిలో అత్యంత విశిష్టమైనది. ఎందుకంటే, ఈ సమయంలో నాకు అనేకరకాల ఆధ్యాత్మికానుభవాలు కలిగాయి. దాంట్లో మొదటి అనుభవం రాధాకృష్ణమాయితో అనుబంధం. దాన్ని గురించి మొదట చెప్పి, తరువాత బాబా ప్రసాదించిన అప్రతిమ, అమూల్య, అత్యంత గొప్ప అనుభవం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. 

ఇది నేను 14-5-1959 రోజున, అంటే ఆ అనుభవం జరిగిన 42 సంవత్సరాల తరువాత వ్రాస్తున్నాను.

శిరిడీ చేరిన తరువాత తొట్లో నీటితో స్నానం చేసి, పూలదండ ఇత్యాది పూజాసామాగ్రి దొరక్కపోవటంవల్ల దక్షిణగా 65 రూపాయలు తీసుకుని మసీదుకు వెళ్ళి బాబాను దర్శించుకుని దక్షిణ అర్పించాను. మధ్యాహ్న ఆరతి తరువాత బాబా నైవేద్యం గురించిన ఏర్పాట్లు జరుగుతుండటాన్ని చూసి నేను రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకుని, “ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలనే వచ్చాను. ఇక్కడ ఉండి సొలిసిటర్ పరీక్షకు తయారవుతాను” అన్నాను. ఆమె, “చాలా మంచిది. నీలాంటి వ్యక్తి ఇక్కడ ఉండటం మంచిదే. బాబా తమ స్థానంలో విరాజమానులై ఉన్నారు. భక్తులు కూడా కూర్చుని ఉన్నారు. నువ్విప్పుడు వెళ్ళు. పుచ్చకాయ, కర్బూజ ప్రసాదంగా పంచుతున్నారు” అని చెప్పి, ఒక రుమాలును జోలెలాగా చేసి నాకిచ్చి, “వెళ్ళి ధుని ఎదురుగా నిలబడు. నా భాగానికి రావలసిన ప్రసాదాన్ని జోలెలో వేస్తారు” అన్నది. 

ఆ ప్రకారంగానే నేను వెళ్ళి మసీదులో నిలబడ్డప్పుడు బాబా ఆదేశం మీద నా జోలెలో ప్రసాదం వేయబడింది. ఆ ప్రసాదాన్ని తీసుకుని నేను రాధాకృష్ణమాయి వద్దకు వెళ్ళాను. అప్పుడు ఆమె నా పాత గది ముందున్న అరుగు మీద కూర్చుని భోజనం చేస్తున్నది. నన్ను చూసి ఆమె, “నువ్వు వచ్చావన్న సంగతి నాకు గుర్తులేదు. నీతో చెప్పిన మాటను నేను మరచిపోయాను. రా, కూర్చో” అంటూ తాను తినే పప్పన్నంలోంచి కొంచెం వేరుగా తీసి నాకు ఇచ్చి తినమని ఆదేశించింది. కానీ అది చాలా కారంగా ఉండటం వల్ల నేను తినలేకపోయాను. భోజనం తరువాత నేను కొంచెంసేపు కూర్చున్నాను. అప్పుడు రాధాకృష్ణమాయి, “ఇప్పుడు పడుకుంటావా, ఏం?” అన్నది. నేను 'అవును' అన్నమీదట ఆమె రామనామం వ్రాయబడిన తన దుప్పటిని నాపై కప్పింది. తను పడుకోకుండా గది బయటకు వెళ్ళి ద్వారకామాయి వైపు దృష్టి పెట్టి, “వామన్ ఇప్పుడు కూడా పడుకోవాలనే అనుకుంటున్నాడు” అన్నది. నేను పడుకోవటం ఆమెకు నచ్చలేదని గ్రహించి రామనామం రాసిన ఆ దుప్పటిని అక్కడే పెట్టి గది బయటకొచ్చాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. very nice sai experience radha krinamai is sais devotee she is lucky devotee.she did many things to sai.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo