సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 401వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ముప్పైఐదవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నవసారిలో నేనుండే ఇంట్లో పైఅంతస్తు వెనుక గదిలో ఏదో అధమయోనిలో జన్మించి భూతదశలో ఉన్న జీవుడు నివసిస్తున్నట్లు అనిపించేది. ఒకసారి అక్కడ కొంచెం భయమనిపించి క్రిందకు దిగొచ్చాను. కంగారుగా ముంబాయికి బయలుదేరిన సమయంలో నేను ఒక సజ్జనుల ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా! వారి 20, 25 సంవత్సరాల చెల్లెలికి ఆ తరువాత రెండు మూడు రోజుల్లోనే భూతం ఆవేశించింది. కానీ మంచి ఉపచారాలతో అది వదలిపోయింది.

అప్పట్లో, అంటే శ్రీరామనవమికి నేను శిరిడీ వెళ్ళకముందు ‘రామవిజయం’ చదువుతుండేవాడిని. కానీ అందులో కొన్ని అంశాల అర్థాలు నాకు తెలిసేవికావు. పారాయణ గ్రంథం చదువుతున్నప్పుడు ఇంటివారైన శ్రీతుల్జారామ్ జోషీ అక్కడకొచ్చి కూర్చునేవారు. ఆయన జోతిష్యాన్నీ, వేదాంతాన్నీ అభ్యసించి ఉన్నారు. ఒకసారి పారాయణ చేస్తున్నప్పుడు నేను ఆయన్ని వేదాంత విషయం గురించి ఒక ప్రశ్న అడిగాను. కానీ ఆయన పరధ్యానంగా ఉన్నట్లున్నారు. 'ఏమిటి, ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు?” అని నేను అడిగినప్పుడు కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. ఆ మధ్యకాలంలో క్రింది అంతస్తులో పడుకునేటప్పుడు అర్థరాత్రివేళ నన్నెవరో ఆకాశంలోకి తీసుకెళ్తున్నట్లూ, నా తల పగిలిపోయినట్లు అనిపించింది. భయపడిపోయి మెలకువ వచ్చిన తరువాత కూడా ఇంట్లో సూర్యకాంతి ఎంత ప్రచండంగా కనిపించిందంటే దాన్ని భరించలేక కళ్ళు గట్టిగా మూసుకున్నాను. కొద్దిసేపు తరువాత కళ్ళు తెరిచాను. సూర్యకాంతి కాస్త తగ్గి నేను చూడగలిగేంతగా మారి అదృశ్యమైపోయింది. హనుమంతుడు తాను జన్మించిన వెంటనే సూర్యనారాయణుడ్ని పట్టుకోవటం కోసం పైకి ఎగిరాడని నేను రామవిజయంలో చదివాను. దాని పరిణామంతో స్వప్నంలోనే కాక జాగ్రదావస్తలో కూడా సూర్యప్రకాశం కనిపించిందని నేను తెలుసుకున్నాను. ఇది జరగకముందు, ఒక రాత్రి పడుకోబోయేముందు వేదాంత విచారంలో లీనమై ఉండి అలమరలో ఉన్న పుస్తకాలు తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో కూడా పైన చెప్పిన సూర్యప్రకాశం కనిపించింది. దాంతో జ్ఞానమయ వృత్తి తదాకారం అయితే ఇలా జరుగుతుందని నేను తెలుసుకున్నాను.

శ్రీరామనవమి అయిపోయి శిరిడీ నుంచి వచ్చిన తరువాత ఈ ఇంట్లో ఓ గొప్ప అనుభవం కలిగింది. శిరిడీనుంచి వచ్చేటప్పుడు రాధాకృష్ణమాయి నువ్వుండలను శ్రీసాయిబాబా ప్రసాద రూపంగా ఇచ్చింది. వాటిని కొంచెం కొంచెంగా ప్రసాదస్వరూపంగా తింటూ పంచీకరణను ధ్యానపూర్వకంగా అభ్యాసం చేసేవాణ్ణి. శిరిడీయే కైలాసం అన్న భావమే మనసులో ఉండేది. చాలాసార్లు నేను గోపికాభావంలో లీనమైపోయేవాణ్ణి. పైఅంతస్తులో ఒంటరిగా పడుకునేవాణ్ణి. ఇంట్లో ఇంకెవరూ ఉండేవారు కాదు. జొన్నరొట్టె, కూర లేదా ఉల్లిపాయను ఒంటరిగా తింటూండేవాణ్ణి. రాత్రిపూట నిద్ర తగ్గిపోయింది. నిద్రించే కాస్త సమయం కూడా జాగ్రదావస్థలాగే ఉండేది. అప్పుడొక శబ్దం వినిపించింది, "నీవేదో నేనదే. నేనేదో నీవదే. సాయిబాబా మౌలాఫకీరు అలీ బందేనవాజ్ ఔరంగజేబు బాద్‌షా షెహన్‌షా నాటకం" అని. 'ఎవరు మాట్లాడుతున్నారు?' అని నేనడిగితే, “నేను మురళీలోలుడిని. ఇదేమిటి? గోపీభావం ఎందుకు? ఈ రకమైన అనన్య చింతన భావంవల్ల నేను అనేకులను ఉద్ధరించాను. ఇంకా ఈ ప్రకారంగా ఉద్ధరిస్తూనే ఉంటాను” - ఈ ప్రకారంగా అభేద బోధను చేసి వేణుగానలోలుడు నన్ను తనవాడిగా చేసుకున్నాడు. 

నాకు అవధుల్లేని ఆనందం కలిగింది. కానీ అంతలోనే నా ఆరోగ్యం గురించిన ఆలోచన వచ్చింది. నా ఆలోచన నా శరీరం మీదకు పోయి దుఃఖం కలిగింది. ఇంత గొప్ప విషయం లోకులకు చెప్పేవరకూ నేను జీవించి ఉంటే చాలనిపించింది. అత్యంత దుర్బలత వల్ల నా శారీరకస్థితి క్షీణించింది. ఈ శరీర యంత్రం ఇక ముందు పని చేస్తుందన్న నమ్మకం లేదు. అంతిమ సమయంలో మురళీలోలుడు నాపై ఈ కృపను వర్షించాడనిపించింది. అందువల్లే తపస్సు నియమాలను తగ్గించి శరీరం మీద ధ్యాస ఎక్కువగా పెట్టుకొని ఈ అనుభవాన్ని లోకులకు చెప్పేవరకైనా శరీరాన్ని భద్రంగా ఉంచుకోవాలని నిశ్చయించుకున్నాను. కానీ అన్నపానాల విషయంలో నియమాలు మాత్రం ఇదివరకులాగానే నడిచేవి.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo