సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 450వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ప్రార్థించినంతనే పదిలంగా ఇంటికి చేర్చిన బాబా
  2. నమ్మకంతో ఉంటే బాబా అనుగ్రహం లభిస్తుంది

ప్రార్థించినంతనే పదిలంగా ఇంటికి చేర్చిన బాబా

సాయిభక్తురాలు శాంతి తన తల్లికి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువుకి నా ధన్యవాదాలు. నా పేరు శాంతి. బాబా ఆశీస్సులతో మా కుటుంబానికి కలిగిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 

నాకు సుమారు 13 సంవత్సరాల వయసప్పుడు మా అమ్మ మా బంధువుల గృహప్రవేశానికి 90 కి.మీ దూరంలో ఉన్న ఊరికి ఒంటరిగా వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్లాక నెలసరి రావటంతో అమ్మ అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది. వారు అమ్మని వేరే చోట ఉండవచ్చని ఎంత నచ్చజెప్పినా అమ్మకు అక్కడ ఉండటానికి మనస్కరించలేదు. తన వల్ల ఎవరూ ఇబ్బందులు పడకూడదన్నది అమ్మ ఆలోచన. అందువల్ల రాత్రి 9 గంటల సమయంలో అక్కడనుండి బస్సులో బయలుదేరింది. అమ్మ బస్సు ఎక్కినప్పటినుండి బాబాని స్మరిస్తూ ఉంది. "బాబా! నేను మా ఊరు దగ్గరున్న టౌనుకి వెళ్ళేసరికి అర్థరాత్రి 12 గంటలు అవుతుంది. అక్కడనుండి నీవే నన్ను ఇంటికి   చేర్చాలి" అంటూ బాబాను ప్రార్థించింది. సరిగ్గా మా ఊరు దగ్గరున్న టౌనుకి వచ్చేసరికి అర్థరాత్రి 12 గంటలైంది. ఫోన్ చేస్తే టౌనుకి వెళ్లి అమ్మను తీసుకురావడానికి అప్పటికి ఇంత ఫోన్ టెక్నాలజీ కూడా లేదు. బస్సు దిగగానే అంతా నిర్మానుష్యంగా ఉంది. అమ్మకు కాస్త భయమేసింది. ఇంటికి వెళ్ళడానికి ఆటోలు కూడా లేవు. ఉన్నట్టుండి ఎక్కడినుండి వచ్చాడో తెలియదు, ఒక వృద్ధుడు కారులో వచ్చి, "ఒక్కదానివే ఉన్నట్టున్నావు, ఎక్కడికి వెళ్లాలమ్మా? నేను నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్తాను" అని చెప్పి అడ్రస్ అడిగారు. 'ఆయనని బాబానే పంపాడు' అని మనసుకి అనిపించి అమ్మ ఇంటి అడ్రస్ చెప్పింది. ఆయన అమ్మని కారు ఎక్కించుకుని జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలిపెట్టారు. మేము ఆ సమయంలో అమ్మని చూసి ఆశ్చర్యపోయాం. అమ్మ జరిగిందంతా చెప్పింది. అమ్మని తీసుకువచ్చింది బాబా పంపిన వ్యక్తి కాదు, బాబానే! అందరం ఎంతో ఆనందంగా బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. "బాబా! వృద్ధాప్యంలో ఉన్న అమ్మానాన్నలపై ఎల్లప్పుడూ మీ ప్రేమ చూపండి బాబా!"

నమ్మకంతో ఉంటే బాబా అనుగ్రహం లభిస్తుంది

హైదరాబాద్ నుండి సాయి భక్తురాలు శ్రీమతి ఉష బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

ఓం శ్రీసాయినాథాయ నమః.

సాయికుటుంబసభ్యులందరికీ నా నమస్కారములు. 'నేను సాయిభక్తులలో ఒకరిని' అని చెప్పుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రూపులోని సాయిభక్తుల అనుభవాలు, సాయినాథునితో వారికి గల జీవిత విశేషాలను చదువుతుంటే నాకు కూడా నా జీవితంలో జరిగిన ఒక మరపురాని సంఘటనను పంచుకోవాలనిపించింది. ఆ సాయి దివ్యలీలను మీ అందరితో పంచుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది జరిగి ఇప్పటికి సుమారు 17 సంవత్సరాలు అవుతోంది.

ఇది 2003 జులై నెలలో నా డెలివరీ సమయంలో జరిగింది. మొదటినించీ నాకు నార్మల్ డెలివరీ జరగాలని కోరిక. నేను గర్భం దాల్చిన తరువాత 9 నెలల పాటు అంతా సజావుగానే సాగింది. డెలివరీకి ఇంకా కొద్ది రోజులు వున్నప్పటికీ మానవసహజ తప్పిదం వల్ల నేను ముందుగానే హాస్పిటల్లో చేరవలసి వచ్చింది. రెండు రోజులు వేచి చూసి ఎంతకీ నొప్పులు రాకపోయేసరికి నొప్పులు రావటానికి మందు ఇచ్చారు. 5, 6 గంటల నొప్పుల తరువాత కూడా బిడ్డ తల కనిపించలేదని సిజేరియన్ చేయటానికి అన్నీ సిద్ధం చేసేస్తున్నారు. అంతవరకూ నొప్పులకు తట్టుకోలేక విలవిలలాడిన నాకు ఈ సిజేరియన్ వార్త వినగానే విపరీతమైన ఏడుపు తన్నుకువచ్చింది. ఇంక అప్పుడు నా మదిలో మెదిలిన దైవం - శ్రీసాయి. ఆ భగవంతునితో నా మొర చెప్పుకుని, "నాకు ఈ సిజేరియన్ లేకుండా నార్మల్ డెలివరీ జరిగేలా చెయ్యి సాయీ! నా బిడ్డతో శిరిడీకి వచ్చి నీ దర్శనం చేసుకుంటాను" అని కన్నీళ్ళతో ప్రార్థిస్తూ వున్నాను. తరువాత ఒక 10, 15 నిమిషాలలో డాక్టర్ వచ్చి చూసి, "బిడ్డ తల కనిపిస్తోంది కనుక సక్షన్ (నార్మల్ డెలివరీ సమయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు, సిజేరియన్ చేయాల్సిన అవసరం లేకుండా, వాక్యూమ్ పరికరాన్ని ఉపయోగించి బిడ్డను బయటికి తీసే ప్రక్రియ) చేద్దాం, సిజేరియన్ అవసరం లేదు" అని చెప్పారు. ఆ తరువాత అంతా సజావుగా సాగి నాకు నార్మల్ డెలివరీ జరిగింది. నా మొర ఆలకించి నా కోరిక తీర్చిన శ్రీసాయికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కొంతకాలం తరువాత శ్రీసాయికి మాట ఇచ్చినట్లుగా నా బిడ్డతో శిరిడీ వెళ్లి ఆ భగవంతుని కనులారా దర్శించుకున్నాను. 'బాబా మీద నమ్మకంతో ఉంటే ఆయన మనలను కంటికి రెప్పలా కాపాడుతారు' అనటంలో ఎటువంటి సందేహం లేదు. 

ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!


5 comments:

  1. 🙏 ఓం సాయిరాం🙏
    ****************
    మా సాయి బాబా.. మనసు వెండి కొండ
    మా యోగి బాబా.. మాట మల్లెదండ
    సాయి చేతి చలువ వేయి కోట్ల విలువ
    ఆ లీలలన్ని అభినుతించ గలమా

    సాయి దివ్య రూపం ….. 2
    జ్ఞాన కాంతి దీపం …
    సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం
    సాయి దివ్య రూపం...సాయి దివ్య రూపం…
    సాయి దివ్య రూ….పం…

    ReplyDelete
  2. ఓం శ్రీసాయినాథాయ నమః.

    ReplyDelete
  3. ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo