సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నారాయణ్ మోతీరామ్ జానీ



నారాయణ్ మోతీరామ్ జానీ

నారాయణ్ మోతీరామ్ జానీ శ్రీసాయిబాబాకు గొప్ప భక్తుడు. అతను నాసిక్ నివాసి, ఆడిచ్యా బ్రాహ్మణ కులస్థుడు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు రెండుసార్లు వారి దర్శనభాగ్యాన్ని పొందిన అదృష్టశాలి. అయితే బాబా మహాసమాధి చెందిన తరువాత మూడు సంవత్సరాలకు గానీ మూడవసారి శిరిడీ వెళ్ళి బాబా సమాధిని దర్శించే అవకాశం అతనికి లభించలేదు. శ్రీసాయిబాబా అనుగ్రహాన్ని, సాంగత్యాన్ని పొందడంతోపాటు శ్రీగాడ్గేబాబా, శ్రీవలీబాబా (ఇండోర్‌కు చెందిన శ్రీమాధవ్‌నాథ్ మహరాజ్ శిష్యుడు) మొదలైన సత్పురుషుల సాంగత్యాన్ని కూడా పొందిన అదృష్టవంతుడు నారాయణ్ జానీ. ఆ సత్పురుషులు అతని ఇంట్లో బస కూడా చేశారు. అయినప్పటికీ, అతను సాయిబాబాకు దృఢమైన భక్తుడు.

నారాయణ్ మోతీరామ్ జానీ మొదటిసారి బాబా దర్శనానికి వెళ్లిన సమయంలో అతను రామచంద్ర వామన్ మోదక్ వద్ద ఉద్యోగం చేస్తుండేవాడు. మొదటి సమావేశంలోనే బాబా అతనితో, "ఒకరి ఆదేశాలకు కట్టుబడి ఉండకు. స్వంత వ్యాపారాన్ని ప్రారంభించు!" అని అన్నారు. తదనుగుణంగానే భవిష్యత్ పరిణామాలు చోటుచేసుకోసాగాయి. బాబా మహాసమాధి చెందడానికి కొన్నిరోజుల ముందు నారాయణ్ జానీ తన తల్లిని తీసుకుని మరోసారి బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు బాబా అతని తల్లితో, "ఇక మనం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. మనం వ్యాపారం చేద్దాం" అని అన్నారు. తరువాత కొద్దికాలంలోనే అతను ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ‘ఆనందాశ్రమం’ పేరుతో ఒక వసతిగృహాన్ని ప్రారంభించాడు. బాబా అనుగ్రహం, అతని కృషి ఫలితంగా 'ఆనందాశ్రమం' ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ వరుస సంఘటనల కారణంగా, బాబాపై అతని విశ్వాసం దృఢపడి బాబాకు అచంచలమైన భక్తుడయ్యాడు.

ఒకసారి జానీ స్నేహితునికి తేలు కుట్టి నొప్పితో విలవిలలాడిపోయాడు. ఆ సమయంలో బాబా ఊదీ తన వద్ద లేనందున జానీ బాబా పటం ముందు ఉన్న అగరుబత్తి నుండి రాలిన భస్మాన్ని తీసుకొని తేలు కుట్టిన ప్రదేశంలో పూశాడు. వెంటనే నొప్పి అదృశ్యమైంది. బాబా మహాసమాధి చెందిన తరువాత సుమారు ఒక సంవత్సరానికి నారాయణ్ జానీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కొన్నిరోజులపాటు అతను ఆ అనారోగ్యంతో బాధపడిన తరువాత ఒకరోజు బాబా అతనికి స్వప్నదర్శనం ఇచ్చారు. ఆ స్వప్నంలో ఒక గుహనుండి బయటకు వచ్చిన అతని వద్దకు బాబా వచ్చి, “ఆందోళన చెందవద్దు. రేపటి నుండి నువ్వు కోలుకుంటావు. ఎనిమిది రోజులలో నీకు పూర్తిగా నయమవుతుంది” అని అన్నారు. సరిగ్గా అలాగే జరగసాగింది. ఆరోజు నుండి అతని ఆరోగ్యం కుదుటపడసాగి ఎనిమిది రోజులలో పూర్తిగా కోలుకున్నాడు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు అతనికి శిరిడీ దర్శనభాగ్యం లభించింది. బాబా సమాధిని సమీపిస్తూనే అతనికి పై స్వప్నానుభవం గుర్తుకొచ్చి, సమాధి అనంతరం కూడా బాబా తనపై చూపిన ప్రేమను తలచుకొని ఉద్విగ్నతకు లోనయ్యాడు. తరువాత వాడాకి వెళ్లి తన అనుభవాన్ని దీక్షిత్‌తో పంచుకుని కన్నీళ్లపర్యంతమయ్యాడు.

నాసిక్ సందర్శించే ప్రజలకు 'ఆనందాశ్రమం' ద్వారా భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తూ త్వరలోనే నారాయణ్ మోతీరామ్ జానీ మంచి స్థితికి చేరుకున్నాడు. అతని ఇంట పెద్దసంఖ్యలో సేవకులు, గుర్రపుబండి కూడా సమకూరాయి. అయితే, అతను అకాలమరణం చెందాడు. అప్పటికింకా అతని పిల్లలు చిన్నవాళ్ళయినందున వాళ్ళు ఆనందాశ్రమాన్ని నిర్వహించలేకపోయారు. దాంతో ఆ కుటుంబం కష్టకాలాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. వేలాదిమందికి ఆహారాన్ని, ఆశ్రయాన్ని అందించిన అదే నాసిక్ పట్టణంలో ఆ కుటుంబం చాలారోజులు తినడానికి లేక రోజులు గడపాల్సి వచ్చింది. సంపదతోపాటు స్నేహితులు, బంధువులు కూడా దూరమయ్యారు. 

చివరికి శ్రీమతి నారాయణ్ జానీ నాసిక్ విడిచిపెట్టి, ఖండ్వా సమీపంలోని సత్పురుషులైన ధునిదాదా ఆశ్రమానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. మిగిలిన కొద్దిపాటి వస్తువులను సమీకరించుకొని ఆమె నాసిక్ వదిలి వెళ్ళింది. అయితే, మార్గమందు ఆమె తీసుకెళ్తున్నవాటిలో చాలా వస్తువులు దొంగిలించబడ్డాయి. మొత్తానికి ఆ పేదరాలు ఖండ్వా చేరుకొని ధునిదాదా దర్శనం చేసుకొని విచారకరమైన తన కథను విన్నవించుకుంది. ఆ మహాత్ముడు కనీస అవసరాలైన భోజన, వసతి వంటి అవసరాలు ఆమెకి ఏర్పాటు చేశాడు. ఆమె ఆ ధర్మశాలలో తన మనుగడ సాగిస్తూ ఉండేది. కొద్దికాలానికి ఆమె తల్లి తరఫు బంధువు, వరుసకి సోదరుడు, చాలీస్‌గాఁవ్‌లోని ఒక మిల్లులో పనిచేస్తున్న ఒకతను యాదృచ్ఛికంగా ధునిదాదా దర్శనానికి వచ్చాడు. తన సోదరుని చూసిన ఆమె అతనికి ఎదురుపడకుండా ఉండటానికి ప్రయత్నించింది. ఆమె సోదరుడు ధునిదాదా దర్శనం చేసుకొని, వారి ముందు దక్షిణ ఉంచడానికి ముందుకి వెళుతుండగా ఆయన అరుస్తూ, "నాకు దక్షిణ ఇవ్వకు. ఆ మూలన ఒక మహిళ తన పిల్లలతో కూర్చుని ఉంది. నాసిక్‌కి టిక్కెట్లు కొని ఆమెకు ఇవ్వు! వాళ్ళని తిరిగి నాసిక్‌కు పంపు. ఎందుకంటే, వాళ్ళు శ్రీసాయిబాబా ఆశీస్సులు పొందిన అదృష్టవంతులు" అని అన్నారు.

ఆ విధంగా కష్టసమయంలో కూడా ఆ కుటుంబంపై బాబా ఆశీస్సుల జల్లు కురుస్తుందని స్పష్టమైంది. అంతటితో శ్రీమతి నారాయణ్ జానీ శాంతిని పొందింది. ఆర్థిక పరిస్థితులలో మార్పులేకపోయినప్పటికీ ఆమె మానసికస్థితి మెరుగుపడింది. ఆమె తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని సొంతం చేసుకుంది. తన సద్గురువు తనతోనే ఉన్నారని ఆమెకు పూర్తి నమ్మకం కుదిరింది. రోజులు గడిచాయి. ఒకరోజు ఆమె తన కుటుంబాన్ని నాసిక్ నుండి పూణేకు తరలించింది. ఆమె పూణేలోని బాబు గెనూ చౌక్‌లో నివాసం ఏర్పరుచుకొని వంటమనిషిగా, నర్సుగా కొన్ని పనులలో చేరి డబ్బు సంపాదించడం ప్రారంభించింది.

Source:  సాయిలీలా ద్వైమాసిక పత్రిక

6 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🌷🙏ఓం సాయిరాం🙏🌷🙏
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    🙏🌷🙏💐🙏🌺🙏🌷🙏💐🙏🌺🙏🌺🙏

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo