సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 592వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా కృపతో సాయిసత్యవ్రతం
  2. బాబుకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా

బాబా కృపతో సాయిసత్యవ్రతం

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు ప్రశాంతి. 2020, అక్టోబరు 12, సోమవారంనాడు (మా పెళ్ళిరోజు సందర్భంగా) మేము సాయిసత్యవ్రతం చేసుకుందామని అనుకున్నాము. అయితే కోవిడ్ పరిస్థితుల్లో పంతులుగారిని పిలిచి వ్రతం చేసుకునే ధైర్యం లేదు. అందువల్ల మేమే స్వయంగా వ్రతం చేసుకుందామనుకొని ఆ వ్రత విధానం తెలిపే పుస్తకం కొనుక్కుందామని ఎన్ని షాపులు వెతికినా ఆ పుస్తకం దొరకలేదు. ‘వ్రతం చేసుకుందామని పుస్తకం కోసం వెతుకుతుంటే దొరకడం లేదేమిటి?’ అనుకుని, “అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ” అని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల అక్టోబరు 11వ తేదీ, ఆదివారం ఉదయం ఒక షాపులో సాయిసత్యవ్రతం పుస్తకం దొరికింది. సాధారణంగా భార్యాభర్తలు కలిసి వ్రతం చేసుకుంటున్నప్పుడు ఎవరైనా ఆ దంపతులకు పసుపు, కుంకుమ పెడతారు. అంతేగాక, సాయిసత్యవ్రతం పుస్తకంలో వ్రతం పూర్తయ్యాక ఒకరికి భోజనం పెట్టాలి అని వ్రాసి ఉంది. కానీ కోవిడ్ సమయంలో ఎవరినీ ఇంటికి ఆహ్వానించలేము. అందుచేత “ఈ సమయంలో ఇవన్నీ సాధ్యమేనా?” అనుకున్నాను. అయినా బాబానే అన్నీ చూసుకుంటారని భారమంతా బాబాపైనే వేశాను.

పూజ ప్రారంభించేముందు నా స్నేహితురాలు మాకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి నాకు ఫోన్ చేసింది. అది నిజంగా బాబా చేసిన అద్భుతం. మాటల మధ్యలో, “మేము గుడికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే సాయిసత్యవ్రతం చేసుకుందామని ఏర్పాట్లు చేసుకుంటున్నాన”ని చెప్పాను. తను వెంటనే నాకు పసుపు, కుంకుమ పంపింది. మళ్ళీ కాసేపాగి నాకు ఫోన్ చేసి, “ఒక బ్రాహ్మణ అబ్బాయితో పువ్వులు, పండ్లు పంపిస్తున్నాన”ని చెప్పింది. ఆ వచ్చిన బ్రాహ్మణ అబ్బాయికి తాంబూలంలో కొంత డబ్బు, పండ్లు పెట్టి ఇచ్చి, ‘ఈ డబ్బుతో భోజనం చెయ్యమ’ని చెప్పాను. బాబానే నా కోసం ఇదంతా చేశారని చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఆ విధంగా సాయిసత్యవ్రతాన్ని మాచేత ఆనందంగా పూర్తి చేయించినందుకు ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు అర్పించుకున్నాను.


బాబుకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా

నా పేరు భాగ్యలక్ష్మి. మాది హైదరాబాద్. 2020, ఆగస్టులో మేము కుటుంబంతో సహా కొద్దిరోజులు ఉండటానికి మా అమ్మగారింటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన పదిరోజుల తరువాత బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు “ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః” అనే మంత్రాన్ని మొదటిసారిగా చూశాను. ఆరోజు సాయంత్రం మావారికి జలుబుతో నీరసంగా అనిపించింది. మా చుట్టుప్రక్కల కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మాకు చాలా భయం వేసింది. ఆ రాత్రి నాకు ఆందోళనతో నిద్రపట్టక ‘ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నాను. మరుసటి ఉదయం ఐదుగంటల సమయంలో ఉన్నట్టుండి మా బాబు విపరీతమైన జ్వరంతోనూ, విరేచనాలతోనూ బాధపడ్డాడు. మాకు తెలిసిన ఒక డాక్టరుకి ఫోన్ చేసి బాబు పరిస్థితిని వివరిస్తే, ఆయన కొన్ని మందులు సూచించారు. ఒకవైపు డాక్టర్ సూచించిన మందులు వేస్తూనే, మరోవైపు బాబు నుదుటిపై బాబా ఊదీని పెడుతూ, మంచినీళ్లలో బాబా ఊదీని వేసి బాబుకి త్రాగిస్తూ, ‘ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని విడువకుండా జపించాను. బాబా అనుగ్రహంతో మరుసటిరోజు మధ్యాహ్నానికి బాబు పూర్తిగా కోలుకున్నాడు. మామూలుగా అయితే మా బాబు ఉన్న పరిస్థితి నుంచి కోలుకోవడానికి కనీసం వారంరోజులైనా పడుతుంది. కానీ బాబా దయవలన బాబు చాలా తొందరగా కోలుకున్నాడు. “మాకు రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి, ‘ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని కాపాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

ఒకసారి మా అమ్మగారు సాయి దివ్యపూజ ప్రారంభించారు. ఆఖరివారం ఐదుగురికి అన్నదానం చేయాలనుకున్నాము. కానీ, అనుకోకుండా కాలు బెణకడం వల్ల ఆఖరివారం పూజ, అన్నదానం ఎలా జరుగుతుందా అని చాలా ఆందోళనపడ్డాను. కానీ సాయిదైవం అంతా సవ్యంగా, చాలా బాగా జరిపించారు. “ధన్యవాదాలు బాబా! ఐ లవ్యూ బాబా! మీ ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ! అలాగే, గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అతి పెద్ద సమస్యను కూడా త్వరలోనే మీరు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను బాబా!”



9 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo