సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నానాసాహెబ్ రాస్నే



బాబా అనుగ్రహంతో దామూఅన్నాకి కలిగిన మొదటి సంతానమే దౌలత్ షా అలియాస్ దత్తాత్రేయ దామోదర్ రాస్నే అలియాస్ నానాసాహెబ్ రాస్నే. తనకు ఐదేళ్ళ వయస్సు వచ్చాక తండ్రి పుట్టువెంట్రుకలు తీయించి, అక్షరాభ్యాసం చేయించడానికి శిరిడీ తీసుకుని వెళ్ళాడు. బాబా దౌలత్ షా చేయిపట్టుకుని పలక మీద బలపంతో 'హరి' అని వ్రాయించారు. తరువాత తనని శిరిడీలోని బడికి పంపించారు.
[clip_image001%255B4%255D.jpg]
నానాసాహెబ్ రాస్నేకు ఏడు సంవత్సరాల వయస్సున్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి శిరిడీ వెళ్ళాడు. ఒకరోజు అతను మశీదులో కూర్చుని బాబా పాదాలు ఒత్తుతున్నాడు. ఆ సమయంలో బాబా అక్కడున్న పిల్లలకి తమ స్వహస్తాలతో మిఠాయిలు పంచుతున్నారు. చిన్నపిల్లవాడైనందున సహజంగానే తన దృష్టి మిఠాయిల వైపు మళ్ళింది. ఫలితంగా బాబా పాదాలు ఒత్తడంలో శ్రద్ధ మందగించింది. పక్కనే ఉన్న తల్లి అది గమనించి, "మిఠాయిల వైపు చూస్తూ బాబా సేవను నిర్లక్ష్యం చేస్తున్నావా?" అని పిల్లవాణ్ణి కొట్టింది. వెంటనే బాబా కోపంతో, "ఏయ్ ముసలీ! పిల్లవాణ్ణి ఎందుకు కొట్టావు?" అన్నారు. అప్పుడు ఆమె బాబాతో, "బాబా! కుదురుగా మీ సేవ చేసుకునే మంచి బుద్ధిని పిల్లవాడికి ప్రసాదించండి" అని వేడుకుంది. "పిల్లవాడు చక్కగా నా సేవ చేసుకుంటాడు. భగవంతుడు వాడికి స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. భయపడకు, ఇక వాడినెప్పుడూ కొట్టకు" అని అన్నారు బాబా.

నానాసాహెబ్ రాస్నేకు పన్నెండేళ్ళ వయస్సప్పుడు తన సోదరునితో కలిసి శిరిడీ వెళ్ళాడు. వారిద్దరి వద్ద 100 రూపాయలున్నాయి. బాబా మొదట 10 రూపాయలు, తరువాత 15 రూపాయలు, ఇలా చాలాసార్లు దక్షిణ అడిగి తీసుకున్నారు. చివరికి అతని సోదరుని జేబులో 25 రూపాయలు మాత్రమే మిగిలాయి. అప్పుడు వాళ్ళు బాబాకు దక్షిణ సమర్పించేందుకు, తిరుగు ప్రయాణానికి అవసరమైన డబ్బులు పంపమని అహ్మద్‌నగర్‌లోని తమ వాళ్ళకి లేఖ వ్రాశారు. ఆ సాయంత్రం బాబా నానాసాహెబ్ సోదరుణ్ణి 25 రూపాయల దక్షిణ అడిగారు. అందుకతను, “మా దగ్గరున్న డబ్బంతా అయిపోయింది, తిరుగు ప్రయాణానికి మాకు డబ్బులు అవసరమ”ని బదులిచ్చాడు. బాబా వెంటనే, "ఎందుకు అబద్ధం చెబుతావు? నీ జేబులో 25 రూపాయలున్నాయి. ప్రయాణ ఖర్చులకి డబ్బులు పంపమని నగర్‌కు జాబు వ్రాశారు కదా! ఆ డబ్బు మనియార్డర్ ద్వారా రేపు మీకు అందుతుంది, భయపడవద్దు" అని అన్నారు. అతను వెంటనే బాబాకు 25 రూపాయలు దక్షిణగా సమర్పించాడు. బాబా తరచుగా, "ఎవరు నాకు ఒకటి సమర్పిస్తారో వారికి నేను రెండు ఇస్తాను. రెండు ఇచ్చినవారికి ఐదిస్తాను. ఐదు ఇచ్చినవారికి పదిస్తాను!" అని చెబుతుండేవారు. బాబా ఆవిధంగా తమను ఆశ్రయించిన భక్తుల వద్దనుండి తీసుకున్న మొత్తానికి ఎన్నోరెట్లు తిరిగి ఇస్తారు.

నానాసాహెబ్ రాస్నే పెళ్ళీడుకి వచ్చినప్పుడు పెద్దలు అతనికి వివాహం చేయ నిశ్చయించారు. అప్పుడు అతనికి నాలుగు సంబంధాలు వచ్చాయి. అందులో 2,500 లేదా 3,000 రూపాయల కట్నం ఇచ్చే సంబంధం కూడా ఒకటి ఉంది. బాబాను సంప్రదించకుండా, వారి అనుమతి లేకుండా ఏ పనీ చేయని అతని తండ్రి దామ్యా ఆ నలుగురు అమ్మాయిల జాతకాలు తీసుకుని శిరిడీ వెళ్ళాడు. వాటిని బాబా ముందుంచి, "ఏ సంబంధాన్ని ఖాయం చేసుకోమంటారు బాబా?" అని అడిగాడు. బాబా ఒక పేదింటి అమ్మాయి జాతకం ఎంపిక చేసి అతని చేతిలో పెట్టారు. అతడు మరో ఆలోచన చేయక ఆ అమ్మాయితోనే వివాహం ఖాయపరిచాడు. వివాహాన్ని పండరీపురంలో చేయ నిశ్చయించి, "వివాహానికి రమ్మ"ని బాబాను ఆహ్వానించాడు దామ్యా. అందుకు బాబా, "నేను నీతో ఉన్నాను. భయపడవద్దు. నువ్వెప్పుడు తలచుకున్నా నేను నీ చెంత ఉంటాను" అని సమాధానమిచ్చారు. అయినా అతను వివాహానికి రమ్మని బాబాను ఒత్తిడి చేశాడు. అప్పుడు బాబా, "భగవంతుని అనుమతి లేనిదే నేను ఏ పనీ చేయలేను. నా తరఫున శ్యామాను పంపుతాను" అన్నారు. పండరీపురంలో జరిగిన నానాసాహెబ్ రాస్నే వివాహానికి శ్యామా హాజరయ్యాడు. పెద్ద మొత్తంలో కట్నం ఇచ్చే సంబంధాన్ని వదులుకుని పేదింటి సంబంధాన్ని ఖాయం చేసుకున్నాడని ప్రజలు పలురకాలుగా దామూశేఠ్‌ను విమర్శించసాగారు. అతడు ఆ విమర్శలకు గాని, ద్రవ్య ప్రలోభానికి గాని లోనుకాకుండా బాబా చెప్పినట్లే నడుచుకున్నందున నానాసాహెబ్ వైవాహిక జీవితం సంతోషదాయకంగా ప్రారంభమైంది.

నానాసాహెబ్ రాస్నే దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు జన్మించారు. కానీ ఆ ముగ్గురూ పుట్టిన కొన్ని నెలలకే మూర్ఛరోగంతో మరణించారు. మగపిల్లవాడు 1926లో చనిపోయాడు. అతని భార్య ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆమె మరో వివాహం చేసుకోమని అతడిని ఒత్తిడి చేసింది. కానీ అతను తీవ్రమైన నిరాశానిస్పృహలకు లోనై సంసారజీవితంపై విరక్తి చెందాడు. అట్టి స్థితిలో అతనొకసారి శిరిడీ వెళ్లి బాబా సమాధి ముందు కూర్చుని, "బాబా! అల్పాయుష్కులైన ఇంతమంది పిల్లలను ఇచ్చే బదులు పూర్ణాయువు గల ఒక్క బిడ్డను ప్రసాదించండి, లేదంటే ఆత్మోద్ధరణకు మార్గం చూపండి" అని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తూనే అతను కన్నీళ్ళపర్యంతమయ్యాడు. ఇంతలో బాబా సమాధి నుండి "నీకు పిల్లలు పుడతారు" అని ఒక స్వరం వినిపించింది. అతను ఆశ్చర్యపోయాడు. అవధులు లేని ఆనందంతో బాబా సమాధి ముందు సాష్టాంగపడ్డాడు. పిల్లలు కలుగుతారన్న దానికంటే తన ప్రార్థనలకు సద్గురువు స్పందించారని అతను ఆనందపరవశుడయ్యాడు. తరువాత అతను వాడాలో నిద్రిస్తుండగా బాబా స్వప్న దర్శనమిచ్చి, "పిల్లవాడు చనిపోయాడని చింతించకు. వాడు తల్లిదండ్రులకు హాని కలిగించే మూలా నక్షత్రంలో జన్మించాడు" అని చెప్పారు. ఆ స్వప్నంలో అతను బాబా ఛాతీపై సూర్యుని వలే ప్రకాశిస్తున్న ఒక కాంతివలయాన్ని చూశాడు. ఆ వలయం లోపల చనిపోయిన అతని బిడ్డని ఒడిలో పెట్టుకుని బాబా కూర్చుని ఉన్నారు. "నీకు ఈ బిడ్డవల్ల ప్రమాదముంది. అందుకే వీడిని నేను తీసుకెళ్ళాను. నీకు మరో బిడ్డను ప్రసాదిస్తాను, భయపడవద్దు" అని అన్నారు. అప్పటికే అతని కుటుంబం అహ్మద్‌నగర్ నుండి పూనాకు తరలి వెళ్ళింది. అతను ఇంటికి వెళ్ళి చనిపోయిన పిల్లవాని జాతకచక్రం తీసి చూశాడు. బాబా చెప్పినట్లు వాడు మూలా నక్షత్రంలోనే పుట్టాడు. 

శిరిడీ నుండి వచ్చిన పదిహేను నెలల తరువాత 1928లో పండరీపురంలో ఉన్నప్పుడు నానాసాహెబ్ రాస్నేకి ఒక కుమారుడు జన్మించాడు. వాడు పూర్ణారోగ్యవంతుడు. వాడికి ‘ఫల్గుణ్ వద్య’ అని పేరు పెట్టారు. పదిహేను నెలల తరువాత నానాసాహెబ్ తన తండ్రితో కలిసి శిరిడీ వెళ్ళాడు. అప్పుడు అతని తండ్రి బాబా సమాధి వద్ద "రెండవ మనవడిని ప్రసాదించమ"ని బాబాను ప్రార్థించాడు. బాబా కృపవలన 1931 సంవత్సరంలో నానాసాహెబ్ రాస్నేకు మరొక కుమారుడు జన్మించాడు.  పుట్టిన రెండవరోజున పిల్లవాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. వాడికి బాబా ఊదీ, తీర్థం ఇచ్చి, బాబా శేషవస్త్రాన్ని ఒక తాయెత్తులో పెట్టి పిల్లవానికి కట్టారు. వెంటనే జ్వరం తగ్గి పిల్లవాడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ పిల్లవాడికి ‘సాయిదాస్’ అని పేరు పెట్టారు. పిల్లవాడికి సంవత్సరం నిండిన తరువాత వాడిని తీసుకుని శిరిడీ వెళ్లారు. బాబాకి అభిషేకం చేయించి, బాబా సమాధి మీద కప్పేందుకు వస్త్రాన్ని సమర్పించి, బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేశారు.

నానాసాహెబ్ రాస్నే ఇలా చెప్పాడు: "నానాటికీ నాకు సాయియందు భక్తివిశ్వాసాలు వృద్ధి చెందుతున్నాయి. నేను సాధుసత్పురుషులందరినీ సాయిబాబా రూపాలుగానే చూసేవాడిని. వారిని దర్శించినప్పుడు బయటకు గాని, మనసులో గాని, "సమర్థ సద్గురు సాయినాథునికి ప్రణామాలు" అని నమస్కరించుకునేవాడిని. 1927లో నేను ఖేడ్‌‌గాంభేట్ వెళ్లి, నారాయణ్ మహరాజ్‌ని దర్శించి, "సమర్థ సద్గురు సాయినాథునికి ప్రణామాలు" అని నమస్కరించాను. వారు నాతో, "నీ గురువు పరమగురువు. వారు నాకంటే ఎంతో గొప్పవారు. నువ్వు నావద్దకు రావడమెందుకు? నీ ప్రారబ్ధము, సంచితము అక్కడే ఉంది. నీ ఎన్నిక శ్రేష్ఠమైనది. నువ్వు అక్కడికే వెళ్ళు. గమ్యం చేరుతావు(నీ ఆశయాలన్నీ అక్కడే సిద్ధించగలవు)" అని అన్నారు.

1927లో జాతకచక్రంలోని నక్షత్ర ప్రభావం వల్ల నానాసాహెబ్ రాస్నే ఆరోగ్యం క్షీణించింది. అతను ప్రతి ఆదివారం పూనా నుండి 40 మైళ్ళ దూరంలోని జున్నర్ సమీపంలో ఉన్న సీతారాం ఉత్తరేశ్వర్ (శివాలయం) ఆలయానికి వెళ్లి పూజలు చేసేవాడు. ఒక ఆదివారం రాత్రి 9 గంటలకి అతను అచ్చటి విగ్రహంపై పువ్వులు ఉంచి, "సాయిబాబాకు ప్రణామాలు" అని నమస్కరించుకున్నాడు. అప్పుడు అతనికి ఆ విగ్రహం వద్ద ఒక వెలుగు, ఆ వెలుగులో అతను నిరంతరం స్మరించే సాయిబాబా రూపం కనిపించాయి. అప్పటినుండి అతని ఆరోగ్యం మెరుగుపడింది.

సీతారాం ఉత్తరేశ్వర్ ఆలయమున్న ప్రాంతంలో జానకీదాస్ అనే సాధువు నివసిస్తుండేవారు. ప్రతి ఆదివారం నానాసాహెబ్ రాస్నే అక్కడికి వెళ్ళినపుడు ఆయనను దర్శించి, సాయిబాబాను స్మరించుకుంటూ వారికి నమస్కరించేవాడు. ఒకసారి ఆ సాధువు అతనితో, "నీవు గొప్ప మహాత్ముని ఆశ్రయించావు. నాలాంటి సామాన్య సాధువు వద్దకు ఎందుకు వస్తావు? మాలాంటి వారమంతా సాయిబాబా పాదాలనే ఆశ్రయిస్తాం" అని అన్నారు. తరువాత అతను తన బసకు వెళ్లి నిద్రపోయాడు. ఆ రాత్రి కలలో అతనికి బాబా ఫకీరు వలే కనిపించి, "నీవు చాలా ఆతురత పడుతున్నావు. నీ సంపూర్ణ శరీరాన్ని, మనస్సును నాకు భిక్షగా సమర్పించు" అని అన్నారు.

రాస్నే: “నేను ఈ భిక్షను సమర్పించి నా తండ్రికి తెలియజేస్తాను”.

బాబా: “నీ తండ్రిని సంప్రదించకుండా నీవు ఈ పని ఎలా చేయగలవు?”

రాస్నే: “నా శరీరానికి యజమానిని నేనే! నా తండ్రికి ఇంకా కుమారులు ఉన్నారు. మీరే వారికి కుమారులను ప్రసాదించారు. మీరిచ్చిన దానిని తిరిగి మీకివ్వడానికి నా తండ్రి అభ్యంతరం చెప్పరు".

అప్పుడు బాబా అతని శరీరాన్ని తమ అరచేతుల్లోకి తీసుకుని తమ హృదయం దగ్గర జేబులో వేసుకున్నారు. బాబా ఎంతో దయతో తనను వారి హృదయం చెంతకు చేర్చుకున్నారని అతను ఆనందపారవశ్యంలో మునిగిపోయాడు. నిద్రనుండి మేల్కొన్నాక అతనెంతో ఆనందాన్ని అనుభూతి చెందాడు. అంతేకాకుండా తన మనస్సు వైరాగ్యంతో నిండి నిర్లిప్తంగా ఉన్నట్లు గ్రహించాడు. అంతటితో ఏ విషయమూ మునుపటివలె అతన్ని ఆకర్షించలేదు, మనసుపై ప్రభావం చూపలేదు.

1931లో గాజుల వ్యాపార నిర్వహణ బాధ్యతను నానాసాహెబ్ రాస్నేకు అప్పగించారు. అతడు ఆ వ్యాపారానికి బాబా పేరు పెట్టాలని పట్టుబట్టాడు. బాబా చిత్రపటం ముందు చీటీలు వేసి, బాబా అనుమతి తీసుకుని తమ వ్యాపారానికి 'శ్రీ సమర్థ సాయినాథ్ & కంపెనీ' అని పేరు పెట్టారు. ఈ వ్యాపారాన్ని నిజాయితీగానూ, మనస్సాక్షి సమ్మతంగానూ అతను నడపసాగాడు.

1932 సెప్టెంబరులో నానాసాహెబ్ రాస్నే తీర్థయాత్రలో ఉన్నప్పుడు ముత్రా అనే ప్రదేశంలో అతనికి కలరా సోకింది. దాదాపు మరణం తప్పదనిపించింది. అతని చివరి కోరిక ఏమిటని అతని తండ్రి అడిగాడు. అందుకతను, "నన్ను శిరిడీ తీసుకుని వెళ్ళండి. నేను మరణిస్తే నా శ్రీకృష్ణుడైన సాయిబాబా చెంత నన్ను దహనం చేయండి" అని కోరాడు. కానీ బాబా పటాన్ని అతని తలవద్ద ఉంచి అగరుబత్తీలు వెలిగించి, తరచూ అతనికి ఊదీ తీర్థం ఇచ్చారు. అతను కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అర్థరాత్రి సమయంలో అతని మరదలు సుభద్రాబాయిని గుజరాత్‌లోని సిద్‌పూర్ సమీపంలోని ఉనవకు చెందిన మీరాదాతార్ అనే ప్రఖ్యాత ముస్లిం సాధువు ఆవహించి మాట్లాడుతూ, "మీరు సాయిబాబాను ప్రార్థిస్తున్నారు. వారు నా మామ. వారు వయోభారంతో నడవలేకున్నారు. వారు తమ తరఫున నన్ను పంపారు. కనుక నేను వచ్చాను. భయపడవద్దు. వారి కృపాశీస్సులు మీకు లభిస్తాయి. వారిని మీరు రేపు దర్శించుకుంటారు. ఒక కప్పు కాఫీ తయారుచేసి రోగికి ఇవ్వండి, భయపడవద్దు" అని చెప్పాడు. తరువాత వాళ్ళు కాఫీ తయారుచేసి అందులో బాబా ఊదీ కలిపి అతని చేత త్రాగించారు. కొద్దిసేపటికి అతని జ్వరం తగ్గి, విరోచనాలు ఆగిపోయాయి. మరుసటిరోజు అతనికి చికిత్స చేస్తున్న వైద్యుడు అంత త్వరగా కోలుకున్న అతనిని చూసి ఆశ్చర్యపోతూ, "నిన్న ఇతను మృత్యువుకు అతి సమీపంలో ఉన్నాడు. ఒక్కరోజులో ఇంత మార్పు ఎలా వచ్చింది?" అని ప్రశ్నించాడు. అందుకతను, "శ్రీసాయిబాబా వైద్యులకే వైద్యుడు. వారి పవిత్ర ఊదీయే నన్ను కాపాడింది" అని బదులిచ్చాడు.

బాబా కృపావర్షంలో తడిసిన పుణ్యాత్ముడు నానాసాహెబ్ రాస్నే. చిన్నవయస్సులోనే అతని మనస్సులో బాబాపట్ల భక్తి నాటుకుంది. అతను తన జీవితాన్ని బాబా పాదాలకు సమర్పించాడు. "సద్గురువే కర్త, మన జీవితాలను నడిపేది ఆయనే" అని అతను హృదయపూర్వకంగా నమ్మేవాడుఅతని ప్రతి చర్యా బాబాతో అనుసంధానింపబడి ఉండేది. క్రమంగా అతనిలో విరక్తి పెరిగింది. సంసార జీవితం పట్ల అతనికి ఎలాంటి ఆకర్షణా ఉండేది కాదు. భౌతిక విషయాలు, సంతోషాలకు సంబంధించిన కోరికలు వాటంతటవే తొలగిపోయాయి. చాలా కఠిన స్వభావిగా అతను ప్రసిద్ధి చెందినప్పటికీ, అతని హృదయం మాత్రం అంతే దయతో నిండి ఉండేది.

పనికిమాలిన మాటలతో నిర్లక్ష్యంగా ప్రవర్తించే భక్తులను నానాసాహెబ్ అసహ్యించుకునేవాడు. అతను మోసాన్ని సహించేవాడు కాదు. అతనెప్పుడూ బాబాను "మై బాబా(నా బాబా)" అని పిలిచేవాడు. అతను తరచూ, “ప్రజలు నా బాబాను వేధిస్తున్నారు. అందరూ నా బాబాను దోచుకోవడానికి కుట్ర చేస్తున్నారు. నా బాబాను మోసం చేయడానికి, బాధపెట్టడానికి ప్రయత్నించవద్దు. ఆయన అగ్నిస్వరూపుడు" అని చెప్తుండేవాడు. ఇంకా ఇలా అనేవాడు: “ఇంట్లోని చిన్న మందిరంలో కూర్చోవడం నా బాబా స్వభావంలో ఎన్నడూ లేదు. నా బాబా ఒక సామాన్యుడిలా మసలుకున్నారు. ఆయన తన మాటల్లో చాలా ఉర్దూ పదాలను ఉపయోగించేవారు” అని. బాబాతో అతనికి అంత దగ్గరి అనుబంధం ఉండటానికి కారణమేమిటంటే, స్వయంగా బాబానే దామూ అన్నాతో అతని మొదటి కొడుకును తనకు ఇవ్వమని అడిగారు. అంటే, అతను ఆయనకి చెందినవాడు. బాబా అతనికి పారమార్థిక పురోగతిని ప్రసాదించారు. బాబాని స్మరించి అతనెవరికైనా ఊదీ, తీర్థాలు ఇస్తే రోగాలు నయమయ్యేవి, సమస్యలు పరిష్కరింపబడేవి.

ఒక గురుపూర్ణిమనాడు బాబాకు వేసిన మాల నుండి నయాపైసా నాణెమొకటి నానాసాహెబ్ చేతుల్లో పడింది. ఎంతో భక్తితో అతను దానిని తన జీవితాంతం భద్రపరచుకున్నాడు. అతనెప్పుడూ ఆ నాణాన్ని తన చొక్కా బటన్ పట్టీలో పెట్టుకుని అపురూపంగా చూసుకునేవాడు. ఆ నాణెం గురించి అతను, “నా వార్షిక ఆదాయం సుమారు 5,000 రూపాయలు. కానీ ఈ ప్రపంచంలోని ఏ నాణెమూ ఈ నయాపైసాతో సరిపోలదు. దీనికి విలువ కట్ట శక్యం కాదు. ఇది చాలా అమూల్యమైనది" అని అనేవాడు. మరణాంతరం తనని దహనం చేసేటప్పుడు తన శరీరంతోపాటు ఆ నాణేన్ని కూడా దహనం గావించాలని అతను తన కోరికను కుటుంబసభ్యులతో చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు.

బాబా భక్తులలో చాలామంది ఏకాదశి శుభదినాన కన్నుమూశారు. నానాసాహెబ్‌కి కూడా ఏకాదశి రోజే తుదిశ్వాస వీడాలని బలమైన కోరిక ఉండేది. అతను తన చివరిరోజుల్లో తన నివాసాన్ని శిరిడీకి మార్చాడు. ఆషాఢ ఏకాదశి రోజున అతను ఒక చిన్న సంఘటన కారణంగా క్రింద పడిపోయాడు. భారమంతా తన భుజాల మీద పడటంతో కాలర్ ఎముక దెబ్బతింది. అతనిని సంస్థాన్ వారి సాయి ఆసుపత్రిలో చేర్చారు. అదేరోజున అతను కన్నుమూశాడు. ఏకాదశి రోజు మరణించాలన్న తన ప్రియభక్తుని కోరికను బాబా నెరవేర్చారు.

నానాసాహెబ్ రాస్నే మంచి వక్త, సామాజిక కార్యకర్త. అతను తన జీవితంలో ఎక్కువ భాగం శ్రీసాయిబాబా లీలలను, బోధనలను ప్రచారం చేయడంలోనే గడిపాడు. అతను కొంతకాలం శిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించి శ్రీసాయి సేవలో తరించాడు. బాబా సమాధిమందిరంలో ఇతర భక్తుల చిత్రపటాల నడుమ దత్తాత్రేయ దామోదర్ రాస్నే చిత్రపటాన్ని కూడా ఉంచి సంస్థాన్ అతన్ని గౌరవించింది.

సమాప్తం... 

 డీవోటీస్ ఎక్స్‌పీరియన్సెస్ బై బి.వి.నరసింహస్వామి 
Shri Sai Leela Magazine September-October 2007
http://www.saiamrithadhara.com/mahabhakthas/dattatreya_damodar_rasane.html
http://bonjanrao.blogspot.com/2012/12/dattatreya-damodar-rasane.html?view=timeslide.

7 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
    🌟 ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి🌟
    🌟 ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి🌟
    🌟 ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి🌟
    🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

    ReplyDelete
  3. ☘️☘️Om Sai Ram 🙏🌹🙏🌹🙏☘️☘️
    ☘️☘️ఓం సాయినాథాయ నమః!🙏☘️☘️☘️
    ☘️☘️ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏☘️☘️
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    ReplyDelete
  4. Kothakonda SrinivasMay 11, 2021 at 8:04 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  5. మీరు అందిస్తున్న సాయి లీల కి మీకు శతకోటి వందనాలు గురువు గారు.
    ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  7. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo