సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 470వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా స్థానం నా హృదయమందే!
  2. బాబా ఇచ్చిన స్వప్నానుభవం

    బాబా స్థానం నా హృదయమందే!

    ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. సాయిబిడ్డనైన నేను ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.

    నేను స్కూల్లో మాథ్స్ టీచరుగా పనిచేస్తున్నాను. ఇంటిలోని పనులు, వృత్తిరీత్యా స్కూల్ బాధ్యతలు చూసుకునేసరికి నాకు సమయం అస్సలు సరిపోవడం లేదు. కేవలం నాలుగైదు గంటల సమయం మాత్రమే నిద్రపోవడానికి దొరుకుతుంది. ఇట్టి స్థితిలో నాకు 'సాయి సచ్చరిత్ర' సప్తాహ పారాయణ చేయాలన్న సంకల్పం కలిగి, పారాయణ మొదలుపెట్టాను. సమయం లేని కారణంగా ఉదయం మూడుగంటలకే నిద్రలేచి, స్నానం చేసి, బాబాను అలంకరించి పూజ చేశాను. ఆ తరువాత పారాయణ మొదలుపెట్టాను. పారాయణ మొదలుపెట్టగానే రోజంతా పనుల వలన ఏర్పడిన అలసట, నిద్రలేమి కారణంగా నిరంతరాయంగా ఆవలింతలు మొదలయ్యాయి. ఒక్క వాక్యం కూడా చదవకముందే విపరీతంగా నిద్ర కమ్ముకొచ్చింది. దాంతో నేను బాబా దగ్గర ఉన్న ఊదీ  తీసుకుని, నా నుదుటన పెట్టుకుని, "బాబా! ఈ ఆవలింతల వలన నేను పారాయణ సరిగా చేయలేకపోతున్నాను. నేను పారాయణ పూర్తి చేసేవరకు ఒక్క ఆవలింత కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే బాబా" అని బాబాతో చెప్పుకొని పారాయణ కొనసాగించాను. అయితే మనసులో, "అలా ఎలా అవుతుంది? ఖచ్చితంగా నాకు నిద్ర వస్తుందిలే!" అని అనుకున్నాను. కానీ ఆశ్చర్యం! ఆరోజు భాగంలోని ఎనిమిది అధ్యాయాల పారాయణ పూర్తి చేసేంతవరకు కనీసం ఒక్క ఆవలింత కూడా రాలేదు. నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఇది మాత్రమే కాదు, పారాయణ చేస్తున్న సమయంలో బాబా నాకు ఇంకొక అద్భుత అనుభవాన్ని కూడా ఇచ్చారు. అదేమిటంటే, నేను పారాయణ చేస్తూ మనసులో, "బాబా! మీరు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దర్శనం ఇస్తారట కదా! ఒకరికి చందమామలో కనిపించారట, ఒకరికేమో జ్యోతిరూపంలో కనిపించారట. మరి నాకు మాత్రం ఎందుకు కనిపించరు బాబా? నేను మీ ముద్దుల బిడ్డను కాదా?" అని బాధగా బాబాను అడిగాను. వాస్తవానికి నేను ఒకవైపు ఆడియోలో సచ్చరిత్ర వింటూ, మరోవైపు పుస్తకం చూస్తూ పారాయణ చేస్తుంటాను. నేను అలా బాధతో బాబా దర్శనం గురించి అడిగిన కొద్దిసేపటికి హఠాత్తుగా వింటున్న ఆడియోలో బాబా ఏదో చెబుతున్నట్లు అనిపించింది. కానీ ఆ మాటలు ఆడియో ద్వారా వస్తున్నట్లు నాకస్సలు అనిపించలేదు. మరి ఆ మాటలు ఎక్కడ నుండి వస్తున్నాయా అని కాస్త శ్రద్ధగా గమనిస్తే, అవి నా హృదయంలో నుండి వస్తున్నాయి! సుమారు ఒక ఐదు నిమిషాలపాటు బాబా మాట్లాడుతున్నట్లు నాకు స్పష్టంగా తెలిసింది. నాకు తెలియకుండానే నా కళ్ళల్లోనుండి ఆనందభాష్పాలు కారిపోతున్నాయి. నేను అలాగే కన్నీళ్లు పెట్టుకుంటూ, 'బాబా ఎక్కడో కాదు, నా హృదయంలోనే ఉన్నారు' అని పదిహేను నిమిషాలపాటు మాటల్లో వర్ణించలేని అనుభూతిలో ఉండిపోయాను. బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారన్న ఆనందంతో పారాయణ పూర్తి చేసుకొని, అడిగినంతనే ప్రేమతో అంతటి ఆనందాన్నిచ్చిన బాబాకు మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాను.

    బాబా ఇచ్చిన స్వప్నానుభవం

    పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
       
    ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సద్గురవే నమః. సాయి చరణం శరణం. "నా అనుభవాన్ని ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించి ఆశీర్వదించండి బాబా!" ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, అలాగే సాయిబంధువులకు నా నమస్కారములు. ఇక నా అనుభవంలోకి వస్తే..

    ఒకరోజు స్వప్నంలో నేను, నా భార్య, మా బాబు ముగ్గురం కలిసి శిరిడీ ప్రయాణమయ్యాము. మేము అక్కడకు చేరుకొనే సమయానికి సమాధిమందిరం మూసి వుంది. లోపలికి ఎవరూ రాకుండా అక్కడ వున్న హుండీలను అడ్డుగా పెట్టారు. బాబా చుట్టూ ఒక తెర ఏర్పాటు చేసి వుంది. మందిరం అంతా చెత్తాచెదారంతో నిండి వుంది.  నేను, నా భార్య ఇప్పుడు ఏమి చేద్ధామని ఆలోచిస్తూ అక్కడున్న ఒక మెట్టు మీద కూర్చున్నాము. మళ్ళీ అంతలోనే నేను లేచి బాబా మందిరం ఇలా చెత్తతో ఉండకూడదని హుండీలను ఒక ప్రక్కకు నెట్టి అంతా శుభ్రం చేశాను. తరువాత బాబా ఎలా ఉన్నారో చూద్దామని తెరను కొంచెం తెరచి చూశాను. బాబా ఎర్రటి పూలమాల ధరించి ఉన్నారు. బాబాను చూడగానే నా కళ్ళలో కన్నీళ్ళు ఆగలేదు. "బాబా! ఏమిటిది ఇలా జరిగింది?" అని బాబాతో అన్నాను. బాబా వెంటనే తమ స్థానం నుండి లేచి, తమ మెడలో ఉన్న మాలను తెంపుకొని, పరుగున నా వద్ధకు వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. నేను బాబాను పట్టుకొని ఏడ్చేశాను. తరువాత బాబాతో, "బాబా! మీరు మాతో మా ఇంటికి వస్తారా?" అని అడిగాను. బాబా వెంటనే "సరే, పద" అన్నారు. నేను బాబాను ఎత్తుకొని బయటకు వచ్చాను. నా భార్య, "అంతా శుభ్రం చేశారా? పదండి, బాబాను దర్శించుకుందాము" అని అంది. నేను, "బాబా నాతోనే ఉన్నారు. మనతో మన ఇంటికి వస్తున్నారు, పదా పోదాం" అని చెప్పి, నా భార్యను తీసుకొని శిరిడీ నుండి బయలుదేరాను. కొంత దూరం వెళ్ళాక, 'మా బాబు సంగతి మరచి పోయాము. వాడు అక్కడే ఉండిపోయాడ'ని గుర్తొచ్చింది. వెంటనే మేము ఒక ఊరిలో బస్సు దిగి, టెలిఫోన్ బుత్ నుండి మా బాబుకి ఫోన్ చేసి, "వెంటనే శిరిడీ నుండీ బయలుదేరి మేమున్న చోటికి రమ్మ"ని చెప్పాము. అంతటితో నాకు మెలకువ వచ్చింది. అది స్వప్నమే అయినా మనసుకు చాలా ఆనందంగా అనిపించింది. బాబా మాతో మా ఇంటికి రావడం, మేము మా బాబుని మరచిపోయినా బాబా గుర్తుచేయడం ద్వారా ఎల్లవేళలా మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటున్నానని నిదర్శనం ఇవ్వడం నేను ఎప్పటికీ మరువలేనిది. ఇంతకన్నా ఏం కావాలి? "సాయీ! సదా మీ ప్రేమ మా కుటుంబంపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కలలోనైనా ఇలలోనైనా నిన్ను మరువని వరాన్ని మాకు ఒసగు సాయీ!"

    సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


    8 comments:

    1. 🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
      సర్వే జనా సుఖినోభవంతు.
      సర్వే సుజనా సుఖినోభవంతు.
      🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
      ఓం శాంతి శాంతి శాంతిః!!

      ReplyDelete
    2. ఓం శ్రీ సాయినాథాయ నమః

      ReplyDelete
    3. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

      ReplyDelete
    4. Om Sairam
      Sai always be with me

      ReplyDelete
    5. sairam
      please cure my son health
      always be with him

      ReplyDelete

    సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

    Subscribe Here

    బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

    Delivered by FeedBurner

    Followers

    Recent Posts


    Blog Logo