సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 463వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబానే స్వయంగా వచ్చి ఆశీర్వదించి వెళ్లారు
  2. నాపై నిఘా పెట్టిన బాబా నేత్రాలు

బాబానే స్వయంగా వచ్చి ఆశీర్వదించి వెళ్లారు

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబిడ్డను. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో నుంచి మొదటి అనుభవం గత వారం పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకుంటాను. 

నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకసారి బ్యాంకు పనిమీద కాలేజీకి సెలవు పెట్టి బ్యాంకుకి వెళ్ళాలనుకున్నాను. ఆరోజు ఇంట్లో జరిగిన చిన్న చిన్న గొడవల కారణంగా కోపంతో భోజనం చెయ్యడం మానేసి బ్యాంకు పనిమీద బయటకి వచ్చేశాను. మనసులో చాలా బాధగా ఉన్నందువల్ల, ఒకసారి బాబా గుడికి వెళ్లి బాబాతో నా బాధని పంచుకొని తరువాత బ్యాంకుకి వెళ్దామని అనుకున్నాను. నా స్నేహితురాలికి కూడా బ్యాంకులో పని ఉంది. ఆ అమ్మాయి పని చాలాకాలంగా జరగకపోవడంతో తను కూడా నాతో వస్తానని బయలుదేరింది. “మొదట బాబా మందిరానికి వెళ్లి తరువాత బ్యాంకు పని చేసుకోవచ్చ”ని నేను తనతో చెప్పాను. అయితే తను, “నేను ముస్లిం యువతిని. మా బంధువులు ఎవరైనా నన్ను మందిరంలో చూస్తే తిడతారు. నేను రాను, నువ్వు వెళ్లి రా” అని అంది. కానీ, అందుకు నేను ఒప్పుకోకుండా, “బాబాకు అందరూ సమానమే, నువ్వు బాబా మందిరానికి రావాల్సిందే” అని పట్టుబట్టి తనను నాతో పాటు బాబా మందిరానికి తీసుకొని వెళ్ళాను. గుడికి వెళ్ళాలంటే 10 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళాలి. అలా నడుచుకుంటూ బాబా గుడికి వెళుతున్నప్పుడు నేను మనసులో, “బాబా! నీకు నేను రెండు రూపాయలు దక్షిణ సమర్పిస్తాను” అని అనుకున్నాను. ఇక మేము గుడికి చేరువవుతుండగా ఒకాయన బాబా గుడి వైపు నుంచి మా ముందుకు వచ్చారు. ఆయన చినిగిన గుడ్డలు ధరించి, చంకలో జోలె తగిలించుకుని ఉన్నారు. ఒక చేతితో కర్ర పట్టుకొని చాలా కోపంగా నన్ను చూస్తూ నా ముందర చేయి చాపారు. నేను ఆయనకి రెండు రూపాయలు ఇద్దామని పర్సు తీసే లోపల పర్సు కాస్తా క్రింద పడింది. నేను పర్సు కోసం క్రిందకు వంగేసరికి పర్సు సరిగ్గా ఆయన పాదాల దగ్గర ఉంది. పర్సు తీసుకుని అందులోంచి రెండు రూపాయలు తీసి ఆయనకి ఇచ్చాను. నా స్నేహితురాలిని కూడా ఆయనకి డబ్బులు ఇవ్వమని చెప్పేలోపే తను కూడా ఆయనకు రెండు రూపాయలు ఇచ్చింది. తరువాత ఇద్దరం బాబా గుడి వద్దకు చేరుకున్నాము. కానీ గుడికి తాళాలు వేసి ఉండడంతో బయటనుండే బాబాకు నమస్కారం చేసుకుని తిరిగి వస్తుండగా, “బాబాకి రెండు రూపాయలు సమర్పిస్తాను” అని చెప్పుకున్న విషయం గుర్తొచ్చింది. “అయ్యో! మరచిపోయాను కదా బాబా, నువ్వైనా గుర్తుచేసి ఉండొచ్చు కదా బాబా” అనుకున్నాను. కానీ అంతలోనే, “బాబా అంతకుముందే వచ్చి నా దగ్గర రెండు రూపాయలు స్వీకరించారు కదా!” అని గుర్తొచ్చి ఆశ్చర్యం, ఆనందం వేసింది. ఆ తరువాత ఎంత వెతికినా ఆయన మరలా కనపడలేదు. గుడికి తాళం వేసి ఉండడంతో నా తండ్రి బాబానే స్వయంగా నాకోసం వచ్చి నా పర్సు క్రింద పడేలా చేసి నన్ను ఆశీర్వదించి వెళ్లారు అని అనిపించింది. 

ఇక తరువాత ఇద్దరమూ బ్యాంకుకి వెళ్ళాము. ఆశ్చర్యంగా నా స్నేహితురాలి పని పూర్తయిందని బ్యాంకువారు చెప్పారు. “ఇదంతా సాయినే చేశారు” అని ఆ అమ్మాయి చాలా సంతోషించింది. కానీ నా పని మాత్రం పూర్తి కాలేదు. అందుకు కారణం కూడా నాకు తెలుసు. అదేమిటంటే, నేను ఇంట్లోవాళ్ల మీద అలిగి భోజనం చెయ్యకుండా వచ్చేశాను కదా. నా తప్పు తెలుసుకొని వెంటనే అక్కడ బ్యాంకులో బాబా ఫోటో కనిపిస్తే బాబాకు నమస్కారం చేసుకుని, “బాబా! ఇంటికి వెళ్లి భోజనం చేస్తాను, దయచేసి నా పని జరిగేలా చూడు” అని ప్రార్థించాను. ఆ మరుక్షణమే బాబా అనుగ్రహంతో నా పని కూడా పూర్తయింది. బాబాకు ఉపవాసం ఉండడం ఇష్టం ఉండదు. ఆయన తన పిల్లలను ఆకలి కడుపుతో చూడలేరు. బాబాది మాతృప్రేమ.

నాపై నిఘా పెట్టిన బాబా నేత్రాలు

సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తమ మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:  

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. "సాయి మహారాజ్ సన్నిధి" బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాటి సాయిబంధువులకు నా నమస్కారములు. ఒకసారి బాబా కృప వర్షించింది అంటే, మన చేయి వదలరు బాబా. మొదట్లో నేను బాబాను కనీసం 10 శాతమైనా ప్రేమించానో లేదో తెలియదు, కానీ ఆ సద్గురు సాయినాథుడు మాత్రం ఆ 10 పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకున్నారో తెలియదుగానీ తమ కృపను నాపై కుండపోతలా కురిపించారు. బాబా తమ ఆశీస్సులతో నాకు ధ్యానంలోనే కాక, స్వప్నావస్థలోనూ, సుషుప్తావస్థలోనూ, జాగ్రదావస్థలోనూ దర్శనమిస్తుంటారు. మధ్యాహ్నం పూట ఒక పది నిమిషాలు నిద్రించినా కూడా నాకు బాబా దర్శనం అవుతుంటుంది. ప్రతిరోజూ బాబా దర్శనంతో, సత్పురుషుల దర్శనంతో నేను వేకువఝామునే మేలుకుంటాను. బ్రహ్మీముహూర్తంలో సద్గురు దర్శనం నాకు ప్రతినిత్యం కలుగుతుంది.

బాబా దర్శనాలతో నా జీవితం పారమార్థికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగుతుండగా ఇటీవల కాలంలో నన్ను ప్రాపంచిక మాయ ఆవరించింది. ఎంతటి వారినైనా మాయ వదలదు కదా! పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలకు బంధువులు మమ్మల్ని ఆహ్వానించడం, మేము ఆ వేడుకలకు హాజరవటం తప్పని పరిస్థితుల్లో జరుగుతూ వస్తున్నాయి. తరచూ బంధువులను కలవడంతో నేను పూర్తిగా ప్రాపంచిక ఆలోచనలతో గడుపుతున్నాను. కానీ బాబా ప్రేమ చూడండి! నేను అలా ఉన్నప్పటికీ ఆయన నా చేయి వదల్లేదు. ఎప్పటిలాగే బాబా దర్శనాలు నాకు అవుతూ ఉన్నాయి. ఆయన దర్శనంతోనే ఉదయం మెలకువ వస్తోంది. అయితే, “బిడ్డా! చూస్తున్నా.. చూస్తున్నా!అన్నట్టుగా నేత్రం ఒకటి నాకు దర్శనమిస్తూ ఉంది. ఒకరోజు ఉదయాన్నే నాలుగు గంటలకు బ్రహ్మీముహూర్తంలో నేత్రం ఒకటి నాపై నిఘా పెట్టినట్లు చూశాను. మళ్లీ ఒకరోజు రాత్రి 2 గంటల సమయంలో కల, మెలకువ కాని స్థితిలో మరొక నేత్రం దర్శనం అయింది. ఆ నేత్రాలు, నేను ప్రతిరోజూ నమస్కరించే బాబా నేత్రాలు! ఆ నేత్రాలు నన్ను కరుణతో, దయతో చూస్తున్నట్లుగా, నన్ను ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటాయి. ఆ దర్శనాలతో నాలో మార్పు కలిగి బాబాకి క్షమాపణలు చెప్పుకుని ఎలాంటి ఆడంబరాలకూ పోకుండా నన్ను నేను నియంత్రించుకున్నాను. సాయి కృప నాపై వర్షించడమే భాగ్యం అనుకుంటే, సాయి నేత్రాలు నాపై నిఘా పెట్టాయి అంటే నన్ను నా తండ్రి సాయినాథుడు ఎంతలా కనిపెట్టుకొని ఉన్నారో అని ఆనందంతో నా మనస్సు ఉప్పొంగిపోతుంది. “తండ్రీ, సాయినాథా! మీ ప్రేమకు సదా బానిసనై, ఆనందాశ్రువులతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అశాశ్వతమైన వాటిని ఆకర్షించకుండా శాశ్వతమైనది, సత్యమైనది, నిత్యమైనది అయినటువంటి మీ ఆనందస్వరూపాన్ని నేను సదా ధ్యానం చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి సాయీశ్వరా! నేను ఎవరో తెలుసుకునే అర్హతను నాకు కల్పించండి. మీ దయతో నేను చక్కగా ఆధ్యాత్మికత సాధన చేసి, ఆత్మసాక్షాత్కారం పొందేలా నన్ను అనుగ్రహించండి సాయీశ్వరా! మీ నిరాకార ఆనందస్వరూపాన్ని నాకు దర్శింపచేయండి తండ్రీ! సాయి సత్సంగంలో పాల్గొనే అదృష్టాన్ని, అవకాశాన్ని నాకు కల్పించండి గురుదేవా! నేను ఎవరో తెలుసుకునే సాధన చక్కగా చేసి ఈ మానవజన్మ పుట్టుకకు అర్థం, పరమార్థం, సార్థకత తెలుసుకొని మరుజన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని ప్రసాదించి మీలో ఐక్యం చెందేలా అనుగ్రహించండి గురుదేవా సాయిశివా!”.

బాబా నాపై కురిపించిన ప్రేమను ఎంతని చెప్పను, ఎలా చెప్పను? మాటలకు అందని ఆ సద్గురువు కృప అందరిపైనా ఉండాలని కోరుకుంటూ, జై సాయిరాం! ఓం సద్గురువే నమః.

బాబా నాపై నిఘా పెట్టిన నేత్రాలను సాయిబంధువులకు నేను చూపిస్తాను, చూడండి.




4 comments:

  1. 🙏🌹🙏💐🙏🌹🙏💐🙏🌹🙏💐🙏🌹🙏💐🙏
    తత్వజ్ఞాని - శ్రీ సాయినాథ
    ధళదళిపనణి - శ్రీ సాయినాథ
    దక్షిణామూర్తి - శ్రీ సాయినాథ
    ధర్మరక్షక - శ్రీ సాయినాథ
    నక్షత్రనామ - శ్రీ సాయినాథ
    🙏💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🙏
    🙏💐🌹🙏 ఓం సాయిరాం🙏💐🌹🙏

    ReplyDelete
  2. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

    ReplyDelete
  3. జై సాయిరాం!

    ReplyDelete
  4. om sairam
    sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo