సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 459వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • రానున్న ఉపద్రవాన్ని ముందుగానే స్వప్నంలో సూచించి రక్షణనిచ్చిన బాబా

త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దైవతం| 
సంసార ప్రీతి భంగాయా తుభ్యం శ్రీ గురవే నమః||

భావం: గురుదేవా, సాయీశ్వరా! మీరే నాకు తల్లి, తండ్రి, గురువు, బంధువు, దైవము, సర్వమూ. సంసారమనే భవబంధాల నుండి విముక్తి కలిగించి, సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది అయిన ఆనందాన్ని ప్రసాదించే గురువునకు నమస్కారము.

నా పేరు సంధ్య. ముందుగా సద్గురు సాయీశ్వరుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 2017లో నన్ను రక్షించి ఆయన కృపను తెలుసుకునేలా చేసిన సాయీశ్వరునికి నేను సర్వస్య శరణాగతి పొందాను. ఆ అనుభవాన్నే ఇప్పుడు సాటి సాయిబంధువులతో పంచుకోబోతున్నాను. “గురుదేవా! మాటలకందని మీ ప్రేమను సాటి సాయిప్రేమికులతో పంచుకునే భాగ్యం కల్పించినందుకు మీకు వేవేల కృతజ్ఞతలు”. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబృందానికి, సాటి సాయిబంధువులకు నా నమస్కారములు. "సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్" రూపకల్పన చేసి, సాయిబిడ్డలందరినీ ఒకచోట చేర్చి సాయి ప్రేమను ఆస్వాదించే భాగ్యం కల్పిస్తున్న నా సద్గురు సాయికి పాదాభివందనం చేస్తూ నా అనుభవాన్ని తెలియజేస్తున్నాను.

2016వ సంవత్సరంలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక ఎద్దు నన్ను కోపంగా చూస్తోంది. నేనూ ఆ ఎద్దును చూస్తున్నాను. ఆ ఎద్దు నన్ను ఇంకా కోపంగా కళ్ళు పెద్దవిగా చేస్తూ చూస్తోంది. అంతలో హఠాత్తుగా తెల్లని కఫినీ, తలపాగా ధరించి ఉన్న ఒక వృద్ధుడు (సాయిబాబా) నాకు, ఎద్దుకు మధ్యలోకి వచ్చారు. ఆ వృద్ధుని  చూసి ఆ ఎద్దు వెంబడించింది. వృద్ధుడు పరిగెత్తడం, వృద్ధుని వెంట ఆ ఎద్దు పరిగెత్తడం నేను చూస్తున్నాను. “అయ్యో! ఆ వృద్ధుడిని పొడిచేయాలని ఎద్దు ఆయన వెనకాలే పరిగెడుతున్నదే” అని నేనూ పరిగెత్తాను. కాసేపటికి ఆ వృద్ధుడు కనిపించలేదు. “ఈ వృద్ధుడు ఎటు వెళ్ళాడా?” అని నేను ఆ వృద్ధుడు పరిగెత్తిన మలుపు వైపుకు చూశాను. గమనిస్తే, నేను నిలుచుని ఉన్న స్థలం - "శిరిడీ సాయిబాబా సమాధిమందిరం". ‘ఆ వృద్ధుడు ఎక్కడికి వెళ్ళారా?’ అని అటు ఇటు చూశాను. బాబా సమాధిమందిరంలో కూర్చుని వున్నారు. ఆ తర్వాత సమాధిమందిరం పైన ఉన్న శిఖరం లాంటి శిఖరాలు మూడింటిని జాజిమన్ కలర్‌లో చూశాను. ‘ఇది శిరిడీ సాయి మందిరం కదా!’ అనుకుని బయటకు వచ్చాను. ఆ ఎద్దు నా వంక కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోయింది. తరువాత నాకు మెలకువ వచ్చింది. ఆ కల ఎందుకు వచ్చింది అన్న విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు.

ఆ తరువాత కొద్ది రోజులలోనే నేను అనారోగ్యం పాలయ్యాను. అన్నం తిన్నాక జీర్ణం అయ్యేది కాదు. నెలకు మూడుసార్లు చొప్పున వాంతులు అయ్యేవి. ఆ సమయంలో నేను చాలా ఇబ్బందిపడ్డాను. డాక్టర్ని సంప్రదిస్తే, "ఫుడ్ పాయిజన్ అయింద"ని చెప్పి మందులు రాసిచ్చారు. మందులు వాడుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు, వాంతులు అవుతూనే ఉండేవి. తిన్న అన్నం జీర్ణమయ్యేది కాదు. అంతేకాదు, కాళ్లు లాగడం, మెడనొప్పి ఎక్కువగా ఉండేవి.  ఇదిలా ఉండగా 2017 జనవరి ఒకటవ తేదీన రక్తంతో కూడిన వాంతులయ్యాయి. అందరం చాలా కంగారుపడ్డాము. విషయమేమిటంటే, నాకు అన్నంలో విషప్రయోగం జరిగిందని నిర్ధారణ అయింది. అది తెలిసి నేను నిర్ఘాంతపోయాను. నేను తినే పదార్థాలలో అన్నం అంటే నాకు చాలా ఇష్టం. “అయ్యో ఈ పని ఎవరు చేశారు? నాకేమైనా అయితే నా పిల్లలకు దిక్కెవరు?” అని నిస్సహాయంగా ఏడవసాగాను. “నీకేమీ కాదు, ధైర్యంగా ఉండు” అని మావారు నాకు ధైర్యం చెబుతూనే ఉండేవారు. కానీ, నేను మాత్రం ధైర్యం కోల్పోయి, నిస్సహాయస్థితిలో దైవాన్ని ప్రార్థించి, మంచం మీద పడిపోయాను. అప్పుడు నా కళ్ళు మూతలుపడ్డాయి. నేను జాగ్రదావస్థలోనే ఉన్నాను. అంతా చీకటిగా ఉంది. ఆ చీకటిలో లక్ష్మీసమేతంగా నరసింహస్వామి ప్రశాంత వదనంతో దర్శనమిచ్చారు. వెంటనే నాలో భయమంతా ఆవిరైపోయింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. “నేనుండగా నీకు ఏమీ కానివ్వను, అంతా మంచే జరుగుతుంది” అన్నట్లుగా ఉంది ఆ స్వామి దర్శనం. “అంతా దైవమే చూసుకుంటుంది” అని నేను నిశ్చింతగా ఉండిపోయాను. నేనెప్పుడూ ప్రార్థించని దైవం నన్ను ఆశీర్వదించారన్న ఆనందంలో ఉండిపోయాను. నా పుట్టింటివారి సహకారంతో నా కడుపులో ఉన్న విషం పూర్తిగా తొలగించబడి నేను రక్షించబడ్డాను. ఆ తరువాత నాకు అంతకుముందు వచ్చిన కలను మననం చేసుకున్నాను. ఆ కలలో ఎద్దు ఎవరో కాదు, నాకు తెలియకుండానే నా వెనుక ఉన్న శత్రువులు. ఆ ఎద్దు బారినుండి తప్పించిన వృద్ధుడు ఎవరో కాదు, సాక్షాత్తూ సాయీశ్వరుడే! కలలో నాకు తన దర్శనమిచ్చి, శత్రువుల బాధనుండి తప్పించడమేగాక, కలలోనే నాకు ప్రాణభిక్ష పెట్టి, నేను శిరిడీ సాయి సమాధిమందిరంలో ప్రవేశించి సాయిబాబాను దర్శించుకునే భాగ్యాన్ని కలిగించి, సమాధిమందిర ప్రవేశంతోనే నా చెడు కర్మలను తొలగించి, సమాధిమందిర దర్శనం, శిఖర దర్శనం కూడా చేయించి నన్ను రక్షించినది నా తండ్రి సాయీశ్వరుడే అని నిర్ధారణ చేసుకుని ఆనందాశ్రువులతో నా సాయికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 

ఇక నేను ప్రాపంచిక బంధాలపై విరక్తి చెందాను. ప్రాపంచిక విషయాలకు, బంధాలకు దూరంగా ఉండిపోయాను. ప్రాపంచిక ఆర్భాటాలకు దూరంగా ఉండి పారమార్థికం వైపు అడుగు వేసేలా సాయి నాకు దారి చూపారు. సద్గురువుల ప్రవచనాలు, బోధనల వైపు నేను మొగ్గుచూపాను. ఒక గృహిణిగా ఉంటూనే మానసికంగా వైరాగ్యంలో ఉండిపోయాను. ‘అంతా మాయ, గురువే సర్వం, గురువుతోనే శాశ్వత బంధం’ అనే ధ్యాస నన్ను వీడలేదు. బంధాల పట్ల విరక్తి కలిగి, బాబాను ధ్యానించడం మొదలుపెట్టాను. “బాబా! సాయీశ్వరా! నాకు ధ్యానస్థితి కలిగించండి” అని బాబాను దీనంగా, ఆర్తిగా వేడుకున్నాను. బాబాను ఆయన ఇవ్వదలచుకున్నదే అడిగాను. బాబా నాపై కరుణతో, ప్రేమతో నాకు ధ్యానస్థితిని కలిగించి, ధ్యానంలో తమ దివ్యదర్శనాలతో పాటు ఎందరో దేవీ, దేవతామూర్తుల దర్శనాలు, సత్పురుషుల దర్శనాలు, ఎప్పుడూ కనీ వినీ ఎరుగని ఆధ్యాత్మిక ప్రదేశాల దర్శనాలు, ఇష్టదైవమైన ఈశ్వరుడు, ఎందరో సద్గురువులు, సాధువుల దర్శనాలను ప్రసాదించారు. శిరిడీ సాయినాథుని కృపాకటాక్షాలు నాపై కుండపోతలా అపారంగా వర్షించాయి. బాబా నన్ను పూర్ణస్థితికి తీసుకెళ్లారు.

తరువాత నాకు ఆ దుస్థితిని కలిగించినది ఎవరో తెలుసుకున్నాను. కానీ "ఎవరిని నిందించవద్దు. ఎవరికి ఎవరు శత్రువులు. అంతా ఒక్కటే" అని బాబా చెప్తారు గనుక నేను ఎవరినీ నిందించలేదు. సద్గురు కృపను పొందిన అదృష్టశాలిని గనుక నన్ను సంరక్షించుకున్న సాయిబాబాకి కృతజ్ఞతలు తెలుపుకొని ఆయనకే శరణాగతి పొందాను. "బాబా! సాయీశ్వరా! మీరు ప్రేమమూర్తులు. మీరు అందరిని సమాన దృష్టితో చూస్తారు. మీకు ప్రేమించడమే తెలుసు. మీరు కరుణా సముద్రులు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. ఆ అన్నమే తినకుండా చేసి నన్ను హతమార్చాలి అనుకున్న వారికి సద్భుద్ధిని ప్రసాదించండి గురుదేవా. ఏ జన్మ బంధమో, నన్ను, నా కుటుంబాన్ని కూడా మీ ఒడికి చేర్చుకున్నారు. ఇలాగే ఎన్నడూ మీ నీడలో ఉండాలని కోరుకుంటున్నాను గురుదేవా, సాయీ!”. 

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! 

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 
సద్గురు చరణం భవభయ హరణం.


10 comments:

  1. 🙏💐🙏💐🙏💐🙏💐💐🙏💐🙏

    ప్రత్యక్ష దైవం ప్రతి బంధ నాశనం
    సత్య రూపం సకల ఆర్తి నాశనం!!

    సౌఖ్యప్రదం శాంతమనోజ్ఞాన రూపం
    సాయినాథ సద్గురుం చరణం నమామి!!
    🙏💐🙏💐💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

    ReplyDelete
  2. Sairam maa..baba manchi sthithi lo vuncharu...baba gurinche metho matladalani anukuntunnanu.meki matladalani anipisthe na numbeki cal chehandi amma..9000953983

    ReplyDelete
  3. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. గురుదేవా, సాయీశ్వరా! మీరే నాకు తల్లి, తండ్రి, గురువు, బంధువు, దైవము, సర్వమూ. సంసారమనే భవబంధాల నుండి విముక్తి కలిగించి, సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది అయిన ఆనందాన్ని ప్రసాదించే గురువునకు నమస్కారము.

    ReplyDelete
  7. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

    ReplyDelete
  8. Om Sri Sai Ram thaatha 🙏🙏
    Bhāvyā srēē

    ReplyDelete
  9. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  10. దేవా సాయి బాబా.. షిరిడీ శ్వర మా అనారోగ్యాన్ని ఇప్పటికిప్పుడు రూపుమాపు.. నిర్మూలించు, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించు దేవా..

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo