సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 418వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - 51వ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నేను మొట్టమొదటిసారి బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళి పదిరోజులుండి తిరిగి వచ్చాను. అప్పుడు నా మిత్రుడు కాంతిలాల్ నానాభాయి దేశాయి అనే అతను విల్సన్ కాలేజీలో బి.ఎ. చదువుతున్నాడు. అతను కాలేజీ హాస్టల్లో ఉండేవాడు. అతను బాప్టిజం స్వీకరించాడు. కాంతిలాల్‌తో నాకు బాగా పాత పరిచయముంది. నేను ఎల్.ఎల్.బి. పరీక్ష ఉత్తీర్ణుడినైన సంవత్సరంలో, అంటే 1911వ సంవత్సరంలో అతను ముంబాయి వచ్చి విల్సన్ కాలేజీలో సీనియర్ బి.ఎ. లో ప్రవేశించాడు. అతడు కాలేజీ మిషనరీ సంచాలకుల అధీనంలో నడుస్తున్న హాస్టల్లో ఉండేవాడు. అతనికక్కడ ఆ మిషనరీలతో సాంగత్యం బాగా ఎక్కువైంది. అతను నన్ను కూడా ఆ మిషనరీలకు పరిచయం చేశాడు. మా ఇద్దరి స్నేహం చూసి ఆ మిషనరీలు అందరూ గౌరవించే బైబిల్‌ని బహుమతిగా ఇచ్చారు. మేమిద్దరం పరీక్షల తరువాత ఆ మిషనరీల ద్వారా బైబిల్‌ని నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాము. నా పరీక్షలయ్యాయి. అలాగే కాంతిలాల్‌కి కూడా బి.ఎ. పరీక్షలు అయిపోయి ఉండొచ్చు. ఒక ఆదివారం రోజున మేమిద్దరం ఆ మిషనరీల వద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. ఈ మధ్యలో మిషనరీ వాళ్ళు కాంతిలాల్‌ని గట్టిగా వాళ్ళ వలలో వేసుకునే ప్రయత్నం చేశారు. వారు కాంతిలాల్‌ను భోజనానికి పిలిచేవారు. ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపారు. అమ్మాయిలతో పరిచయం చేయిస్తూ ఉండేవారు. అలాగే అతనికి వివాహం జరిపిస్తామన్న ఆశను కూడా అతని మనసులో కలిగించారు. ఇది అక్కడున్న వాస్తవమైన పరిస్థితి. ఈ మధ్యకాలంలో నన్ను మా నాన్న మొదటిసారిగా శిరిడీ వెళ్ళమని చెప్పి,  శ్రీనానాసాహెబ్ చందోర్కర్ కి వారి సోదరుడి నుంచి పరిచయపు లేఖ తీసుకొచ్చి, నేను శిరిడీ వెళ్ళటానికి ఏర్పాట్లు కూడా చేశారు. అప్పుడు నేను శిరిడీ వెళ్ళాను. ఇదివరకే చెప్పిన విధంగా అక్కడ ఎనిమిది, పది రోజులుండి తిరిగి వచ్చాను.

అప్పుడు నాకు కాంతిలాల్ తండ్రి నానాభాయి, "కాంతిలాల్ బాప్టిజమ్ స్వీకరించాడనీ, అలాగే అతను క్రైస్తవుడయ్యాడనీ" రాసిన లేఖ అందింది. తరువాత ఆ తండ్రీకొడుకులను నేను కలిశాను. కాంతిలాల్‌ని నేను, “ఏం చూసి నువ్వు బాప్టిజమ్ స్వీకరించావు? స్వధర్మంలో నీకు ఏం లోపం కనిపించింది? అలాగే వారి ధర్మంలో నీకు ఎక్కువ ఏం కనిపించింది? వారు నీకు మతమార్పిడి చేశారా?” అని అడిగాను. తరువాత నేనతనికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను స్మరింపజేశాను. బహుశా అవి 3వ అధ్యాయం, 18వ అధ్యాయాల్లోని శ్లోకాలు కావచ్చు.


శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్టితాత్ 
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః

(3వ అధ్యాయం - 35వ శ్లోకం)

భావం:- మంచి పద్ధతులతో ఆచరణలోకి తీసుకొచ్చిన పరధర్మం కన్నా గుణరహితమైన మన ధర్మం అత్యంత ఉత్తమమైనది. స్వధర్మంలో మరణం కూడా శుభప్రదమైనదే. ఇతరుల ధర్మం భయానకమైనది.

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్టితాత్

స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్

(18వ అధ్యాయం - 47వ శ్లోకం)

భావం:- మంచి పద్ధతిలో ఆచరణ చేసే ఇతరుల ధర్మం కన్నా మన ధర్మం శ్రేష్టమైనది. ఎందుకంటే స్వభావతః నియమించబడిన స్వధర్మరూప కర్మను చేస్తుండే మనిషికి పాపం అంటుకోదు.

ఈ శ్లోకాలు నా మనుసులో చెదరని విధంగా ముద్రించుకుపోయాయి. వాటి ఆధారంతో నేనతనితో, “గీతామాత ఇలాంటి మతమార్పిడికి విరుద్ధం” అన్నాను. అప్పుడు కాంతిలాల్, “మన ధర్మంలో భగవద్గీత లాంటి గ్రంథం ఉందని కూడా నాకు తెలీదు” అన్నాడు. దీని తరువాత అతని తండ్రి నానాభాయి అతన్ని తన గ్రామమైన పేట్‌లాద్ తీసుకెళ్ళాడు. అక్కడ కాంతిలాల్ మరణించాడు. దాంతో నా అంతరాత్మ వ్యధ చెంది నాకు చాలా దుఃఖం కలిగింది.

ఈ మధ్యకాలంలో మహాదేవ్‌భాయి దేశాయి, అతని అన్నయ్య హరిభాయిని నాకు పరిచయం చేశాడు. ఆయన్ని మా శాంతాక్రజ్ బంగళాకు తీసుకొచ్చినప్పుడు, నా మిత్రుడు కాంతిలాల్ భ్రష్టుడై క్రైస్తవుడైన వృత్తాంతాన్ని ఆయనతో చెప్పాను. ఆయనతో నా హృదయవేదనను వ్యక్తం చేశాను. అప్పుడు వేదాంత అభ్యాసకుడైన హరిభాయి, “ఎవరు భ్రష్టుడయ్యాడు? ఆత్మ ఎక్కడయినా భ్రష్టమౌతుందా? ఎవరి నమ్మకం వారిది” అన్నారు. కానీ ఈ మాటలతో నా దుఃఖమేమీ తగ్గలేదు.

మొదటినుంచీ కూడా నేను ధర్మాభిమానిని. ఒక ఫాదర్ నా మిత్రుడిని స్వధర్మ త్యాగం చేసేలా ప్రేరేపించగలిగాడు. ఇది ఎంతో సిగ్గుచేటని నాకనిపిస్తోంది. తరువాత కాంతిలాల్ మరణవార్తను విని నా వేదన ఇంకా పెరిగింది. మంచి సంస్కారాలతో సుశిక్షితుడైన నాగరికజాతికి చెందిన ఒక యువకుడికి(కాంతిలాల్) భగవాన్ శ్రీకృష్ణుడు మన ధర్మం కోసం ప్రసాదించిన భగవద్గీతలాంటి అమూల్యమైన గ్రంథాన్ని గురించిన జ్ఞానం కలగకపోవటమనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం! ఈ రకమైన అజ్ఞానం గుజరాత్‌లో ఇంటింటా వ్యాపించి ఉంది. ఈ అజ్ఞానం ఏ రకంగానైనా తొలగిపోతే అప్పుడు భ్రష్టులను చేసే క్రైస్తవుల ప్రవృత్తిలో కొన్ని అంశాలు తక్కువవుతాయి. ఇది నా మనోభావన. భారతభూమిపై ఉండేవారు భగవద్గీత అస్తిత్వాన్ని తెలుసుకోలేరా? ధర్మాభిమానమూ, స్వదేశాభిమానమూ గల నా మనసు దీన్నెలా సహించగలదు? ఇది రాసే సమయంలో నాకు పైన చెప్పిన సందర్భంలో బాబా నాకు అంతరిక్షం నుంచి విష్ణుబువా బ్రహ్మచారి పేరును సూచించి, ఆయన భగవద్గీతకు రాసిన వ్యాఖ్యానాన్ని స్మరింపచేశారనిపిస్తోంది. ఎందుకంటే వారి చరిత్రతో నేను తెలుసుకున్నదేమిటంటే, ఆ విష్ణుబువా బ్రహ్మచారి చౌపాటిలో ఒక స్టూలు లేదా టేబుల్ మీద నిలబడి మాట్లాడుతుండేవారు. అక్కడే క్రైస్తవ మిషనరీలు తమ మత ధర్మ ప్రచారం గురించి మాట్లాడుతూ వారి భాషలో ఎంతో మిథ్యాతర్కాన్ని చేస్తుండేవారు. విష్ణుబువా దానికి జవాబిచ్చి, హిందూధర్మం యొక్క సత్యత, నిత్యత మొదలైనవాటిని తీవ్రశబ్దాలతో సిద్ధం చేసేవారు.

నేను శిరిడీ వెళ్ళినప్పుడు కాంతిలాల్ పరధర్మాన్ని స్వీకరించిన సమాచారం నాకు రాలేదు. కానీ బాబా సర్వజ్ఞులవటం వల్ల నా మిత్రుడి మతస్వీకరణతో కలగబోయే విఘాతాన్ని నాకు తెలిపి ఉండి ఉండొచ్చు. అందువల్ల ఆయన నాకు విష్ణుబువాను, ఆయన పుస్తకాలను చూపించి అంతరిక్షం నుంచి సూచన ఇచ్చారు. "అది ఈరోజు(17-7-1959) స్పష్టంగా తెలిసింది. దీంతో, 'భారతదేశ యువకులలో భగవద్గీత అస్తిత్వం విషయంలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేయటం కోసం భగవద్గీతలోని కొన్ని మౌలిక సిద్ధాంతాలూ మొదలైనవాటిని వారికి అందుబాటులో ఉంచితే వారి అజ్ఞానం దూరమై భారతదేశంలో నలుదిశలా జ్ఞానం ప్రసరింపబడుతుందని నాకనిపించింది. ఈ జ్ఞానవిచారాన్ని 1916లో నాకు అంతరిక్షవాణి ద్వారా బోధించినప్పుడు బాబా నన్ను "పార్థా!” అనే సంబోధనతో పిలిచి భగవద్గీత సిద్ధాంతాల గూఢార్థాలు తెలిపారు. బాబా భగవద్గీతను తన నోటితో స్వయంగా ఉచ్ఛరించారు. ఇప్పుడు స్వదేశంలో భగవద్గీత నలువైపులా ప్రసిద్ధి చెందుతుందని సంతోషం కలిగింది. బి.ఎ వరకూ చదువుకున్న లేదా ఉత్తీర్ణులై పదవిని చేపట్టిన యువకులు భగవద్గీత విషయంలో అజ్ఞానులుగా ఉండలేరు. కాంతిలాల్‌కి జరిగిన ఏ విఘాతం నాకు 1911లో సహించవలసి వచ్చిందో అది 1916లో దూరమైంది. దాని తరువాతనే పూజ్యశ్రీ స్వామివిద్యానందగారి ప్రచారం గుజరాత్‌లో ప్రారంభమైంది. స్వామీజీ ప్రథమ ప్రవచనం బోరడీ మిల్లులో జరిగింది. అప్పుడు నేనక్కడ ఉన్నాను.

తరువాయి భాగం రేపు ....

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

5 comments:

  1. 🙏💐🙏 ఓం సాయిరాం🙏💐🙏
    మంగళం శిరిడి నివాసాయ మహనీయ గుణాత్మనే
    భక్త వరద తనూజాయ కళ్యాణ రామ గుణ తిలకాయ
    మంగళం మంగళం!!

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

    ReplyDelete
  4. Om Sri Sai Ram thaatha 🙏🙏
    Bhāvyā srēē

    ReplyDelete
  5. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo