సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 466వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబాపై భారమేస్తే, అంతా ఆయనే చూసుకుంటారు 
  2. శ్రీసాయి అనుగ్రహం 

బాబాపై భారమేస్తే, అంతా ఆయనే చూసుకుంటారు

అశేష సాయిభక్తులకు నా వందనాలు. నా పేరు శ్రీదేవి. మేము విశాఖపట్నంలోని సుజాతనగర్‌లో నివాసముంటున్నాము. మా అమ్మాయి, అల్లుడు అమెరికాలో వుంటున్నారు. మా అబ్బాయి చిక్కి చెన్నైలో ఇంజినీరుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. మా అమ్మాయి మూడవ నెల గర్భవతిగా ఉన్నప్పుడు తనకు సహాయంగా ఉండటానికి నన్ను రమ్మంటే 2020, ఫిబ్రవరిలో నేను అమెరికా వెళ్ళాను. తిరుగు ప్రయాణానికి ఏప్రిల్ మొదటివారంలో టిక్కెట్లు కూడా బుక్ చేశారు మా అల్లుడుగారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ప్రధానమంత్రి మోడీ మార్చి 22 నుంచి విమానాలు రద్దు చేశారు. నా ప్రయాణం ఏప్రిల్ నెలలో కాబట్టి అప్పటికి కరోనా ఉధృతి తగ్గుతుందని అనుకున్నాను. కానీ అమెరికాలో కూడా కరోనా బాగా ప్రబలిపోవడంతో లాక్‌డౌన్ విధించి అంతర్జాతీయ విమానాలన్నీ పూర్తిగా రద్దు చేశారు. మూడుసార్లు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకుంటే మూడుసార్లూ రద్దయిపోయాయి. ఏప్రిల్ నెల గడిచి మే నెల వచ్చినా విమానాలు నడవలేదు. విశాఖపట్నంలో మావారు ఒక్కరే ఇంట్లో వుంటున్నారు. ఆయనకి కూడా జాండీస్ వచ్చి తగ్గింది. ఆయన ఒకచోట, అబ్బాయి ఒకచోట, నేనొకచోట. నాకు ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇక నేను బాబా మీద భారం వేశాను.

అసలే కరోనా సమయం. దానికి తోడు మే 7వ తేదీన విశాఖపట్నంలో ఉదయం 4 గంటల నుంచి ఎల్.జి.పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ అయ్యి 12 మంది చనిపోయిన వార్తలు టీవీలో చూపించారు. మేము వుండే సుజాతనగర్ ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరే. వెంటనే మా చెల్లివాళ్ళు మావారికి ఫోన్ చేస్తే వెంటనే మావారు మా చెల్లెలి వాళ్ళింటికి వెళ్లిపోయారు. రాత్రి వరకు బాగానే వుంది. కానీ రాత్రి రెండు గంటల నుంచి మళ్ళీ గ్యాస్ లీకవుతోందని టీవీలో వార్తలు వచ్చాయి. కరోనా సమయంలో ఏం చేయడానికీ తోచక వెంటనే మా చెల్లికి ఫోన్ చేసి వాళ్ళని ఎక్కడికైనా వెళ్ళిపొమ్మని చెప్పగా వాళ్ళు కూడా హడావిడిగా వేరేచోటికి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు. ఇంతలో పోలీసులు అవన్నీ వదంతులనీ, ఎవ్వరూ ఎక్కడికీ వెళ్ళనక్కరలేదని మైకులో చెప్పగా ప్రయాణం విరమించుకొని ఆ రాత్రంతా టీవీ చూస్తూ ప్రాణాలు ఉగ్గబట్టుకొని అనుక్షణం భయం భయంగా గడిపారు. 

ఎట్టకేలకు మే 9వ తారీఖు నుంచి అంతర్జాతీయ విమానాలు తిరుగుతాయని మోడీ ప్రకటించారు. విదేశాల నుంచి సుమారుగా పదహారువేల మంది ఇండియా రావాల్సి ఉంది. వారందరికీ లాటరీలో టికెట్ కేటాయిస్తానన్నారు. మేము దరఖాస్తు చేసుకున్నాము, కానీ మాకు టికెట్ వస్తుందన్న నమ్మకమైతే లేదు. బాబా తప్ప మరెవరూ మాకు సహాయం చెయ్యలేరు. మే 7వ తారీఖున దుప్పటి ముసుగేసుకొని మా మనవడిని ఆడిస్తున్నాను. ఉన్నట్టుండి నా ముసుగు ప్రక్కనే ఒక వ్యకి ఉన్నట్లు అనుభూతి చెందాను. కానీ ముసుగు తీస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడనుకున్నాను ‘అది బాబానే’ అని. ఆ రాత్రి మా అల్లుడుగారు లాటరీలో టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పారు. బాబా దయవలన మే 9న కరోనా పరీక్షల అనంతరం విమానం ఎక్కాను. ముంబాయి మీదుగా హైదరాబాదు తీసుకొచ్చి అక్కడ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని చెప్పి అందరినీ హోటల్ కామత్‌లో ఉంచారు. నా పాస్‌పోర్ట్ కూడా తీసుకున్నారు. క్షణమొక యుగంగా గడిచింది. 14 రోజుల అనంతరం మరలా టెస్టులు చేసి ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్లాలో వాళ్ళు సొంత ప్రయత్నాలు చేసుకోవచ్చని చెప్పి అధికారులు మమ్మల్ని వదిలేశారు. రెండు రోజుల అనంతరం మా పాస్‌పోర్ట్ మరియు టెస్ట్ రిపోర్టులు మాకు అందించారు. కానీ విశాఖపట్నం చేరుకోవడం ఎలా? హైదరాబాద్ నుంచి అంతర్రాష్ట్ర బస్సులు ఏవీ నడవటం లేదు. బాబా తప్ప నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. బాబానే చూసుకుంటారని బాబా మీదే భారం వేశాను. సర్వం శ్రీసాయి మయం. ప్రతీ క్షణం బాబానే నాకు మార్గం చూపించారు. బాబా ఆదేశించినట్టుగా మా చిన్నాన్న కొడుకు నాకు ఫోన్ చేసి విజయవాడ వరకు తాను కారులో దిగబెడతానని చెప్పడంతో మే 26న హైదరాబాదు నుండి బయలుదేరి విజయవాడకు చేరుకున్నాను. ఇంతలో మా బావ ఫోన్ చేసి తాను విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు కారులో దిగబెడతానని చెప్పి రాత్రి 7 గంటలకు నన్ను క్షేమంగా మా ఇంట్లో దిగబెట్టారు. నేను క్షేమంగా అమెరికా నుంచి రావడానికి సహాయపడిన అందరికీ నా కృతజ్ఞతలు. ఇంత చేసిన బాబాకి నేను ఏవిధంగా కృతజ్ఞతలు తెలియచేయగలను, ఆ బాబా కరుణించి మా కుటుంబం అందరికీ ఆయన దర్శనం కలిగించాలని కోరుకోవడం తప్ప? సర్వం శ్రీ సాయి చరణారవింద సమర్పణమస్తు! శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

శ్రీసాయి అనుగ్రహం 

అందరికీ నమస్కారం! నా పేరు సాయి శ్రీరామ్. నా పేరులో ‘సాయి’ ఉంది. అందుకు కారణం, మా అమ్మానాన్నలకు పెళ్ళయిన నాలుగేళ్ల వరకు పిల్లలు కలగకపోతే (ఆ సమయంలో మా తల్లిదండ్రులు ఒంగోలులో ఉండేవాళ్ళు.) మా అమ్మ సాయిబాబా గుడికి వెళ్లి బాబా చరిత్ర పారాయణ చేసిన తర్వాత సాయిబాబా ఆశీస్సులతో నేను పుట్టాను. అలాగే నా తమ్ముడి పేరులో కూడా ‘సాయి’ ఉంది. నాకు 31 సంవత్సరాలప్పుడు 2019 డిసెంబరులో నిశ్చితార్థమైంది. ఫిబ్రవరిలో మా పెళ్లి జరిగింది. మా అమ్మ మొదటినుంచి సాయిభక్తురాలు. నా శ్రీమతి కూడా సాయిభక్తురాలే. చిన్నప్పటినుండి తనకి ఎప్పుడూ సాయిబాబా కలలో కనిపించి ‘నేనున్నాన’ని ధైర్యం ఇచ్చేవారు. తను కూడా సాయిబాబాని అలానే నమ్ముతుంది. “మనమిద్దరం కలవడం బాబా దయ” అని నా శ్రీమతి ఎప్పుడూ అంటూ ఉంటుంది. తర్వాత నేను కూడా బాబాను నమ్మడం మొదలుపెట్టాను. ఇదిలా ఉండగా మా పెళ్లి సరిగ్గా లాక్‌డౌన్‌‌కి నెల రోజుల ముందు జరిగింది. పెళ్లి తర్వాత కుటుంబంతో కలిసి అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళాము. తరువాత నేను, నా శ్రీమతి శిరిడీ వెళ్ళాము. బాబా మాకు అద్భుతమైన దర్శనాన్ని ప్రసాదించారు.

నేను కెనడాలో ఉద్యోగం చేస్తున్నాను. వివాహం తర్వాత మార్చి 20వ తారీఖున నేను కెనడాకు రావాల్సి ఉంది. కానీ నా కనెక్టింగ్ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వలన నేను ఇండియాలోనే రెండు నెలలు ఉండిపోయాను. మా కంపెనీవాళ్ళు ఇంటినుంచే ఎంతో కొంత పని చేయమన్నారు. కానీ పని చేయటానికి కావలసిన పరికరాలు లేక నేను ఎక్కువగా పని చేయలేకపోయాను. అయినప్పటికీ మా కంపెనీవాళ్ళు నాకు పూర్తి జీతం ఇచ్చారు, నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అంతా బాబా దయ. మార్చి 20 తర్వాత కెనడా వెళ్ళడానికి ఎన్నిసార్లు టికెట్ బుక్ చేసుకున్నా అంతర్జాతీయ విమానాలు రద్దు చేసినందువల్ల అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. దాంతో బాబా నన్ను కెనడా వెళ్ళొద్దన్నారని అనిపించింది. చివరికి మే నెలాఖరున కెనడా వెళ్ళడానికి బాబా ఆదేశం వచ్చింది. నేను ఇండియాలో గురువారంరోజు బయలుదేరి ఆదివారంనాడు కెనడాకి సురక్షితంగా చేరుకున్నాను. అంటే, మూడున్నర రోజుల ప్రయాణమన్నమాట. అంతా బాబా అనుగ్రహమే.

అయితే, నా లగేజ్ బ్యాగ్ కెనడాకు చేరుకోలేదు. నేను బాబాకి నమస్కరించుకుని నా లగేజ్ బ్యాగ్ నాకు చేరేలా అనుగ్రహించమని ప్రార్థించాను. లగేజ్ బ్యాగులో శిరిడీలోని బాబా ఫోటో ఉంది. ఆ ఫోటో ఉండడం వల్లనే నా లగేజ్ బ్యాగ్ మళ్ళీ తిరిగి గురువారం రోజున మా ఇంటికి వచ్చింది. ఇది పూర్తిగా బాబా అనుగ్రహమే. 14 రోజుల క్వారంటైన్ సమయం తరువాత ఎటువంటి ఇబ్బందీ లేకుండా నా ఉద్యోగం చేసుకుంటున్నాను. మా వివాహమై ఇప్పటికి నాలుగు నెలలు అయింది. బాబా ఆశీస్సులతో మా వివాహం కూడా గురువారం రోజునే జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాను.


6 comments:

  1. 🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
    లీలా విశ్వంభర.. జీవన్ముక్తి అభయ ప్రదాత
    సకల చరాచర జగత్ రక్షక.శిరిడి నివాస
    నమోస్తు సాయినాథ పాహిమాం రక్ష రక్ష
    🙏🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹🙏

    ReplyDelete
  2. సర్వం శ్రీసాయి మయం

    ReplyDelete
  3. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo