సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

దామోదర్ సావల్రాం రాస్నే



దామోదర్ సావల్రాం రాస్నే అలియాస్ అన్నా రాస్నే సాయిబాబాకు గొప్ప భక్తుడు. బాబా అతన్ని ప్రేమగా ‘దామ్యా’ అని పిలిచేవారు. అతను వినయ విధేయతలు గల మంచి వ్యక్తి. రషీన్ గ్రామానికి చెందిన ‘దేవి రేణుక జగదంబ మాత’ వారి కులదేవత. ఆ కారణంగానే ఆ కుటుంబసభ్యులందరి ఇంటిపేరుగా ‘రాస్నే’ ఉంది. అతను మొదట అహ్మద్‌నగర్‌కు చెందినవాడు. తరువాత పూనాకు తన నివాసాన్ని మార్చాడు. పేదవాడైన అతను జీవనభృతికోసం గాజుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. అందులో అతను మంచి లాభాలు ఆర్జించి త్వరలోనే ధనవంతుడయ్యాడు. సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి అవసరమైనవన్నీ ఉన్నప్పటికీ సంతానం లేదన్న చింత అతన్ని తీవ్రంగా వేధిస్తుండేది. మొదటి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు రెండవ భార్య వలన కూడా అతను సంతానభాగ్యాన్ని పొందలేదు. అప్పుడు అతను జ్యోతిష్కులను సంప్రదించాడు. వాళ్ళు అతని జాతకచక్రాన్ని పరిశీలించి, 'పుత్ర స్థానంలో, అంటే ఐదవ స్థానంలో కేతువు ఉన్నాడని, ఆ దోషాన్ని అధిగమించడానికి గురు ప్రభావం కూడా లేదని, కాబట్టి జీవితంలో అతనికి సంతానం ప్రాప్తించడం అసాధ్యమని' చెప్పారు. దాంతో అతను ఎప్పుడు చూసినా విచారగ్రస్తుడై ఉండేవాడు. అటువంటి సమయంలో బాబా గురించి, ఆయన అద్భుత మహిమల గురించి అతను విన్నాడు. దాంతో బాబాను దర్శించి, వారి ఆశీస్సులు తీసుకుంటే తనకు సంతానభాగ్యం కలగవచ్చనే ఆశతో 1895వ సంవత్సరంలో మొదటిసారి అతడు శిరిడీ ప్రయాణమయ్యాడు.
[clip_image001%255B5%255D.jpg]
సరిగ్గా అదే సమయానికి గోవాకి చెందిన రాళే అను భక్తుడు ఎంతో రుచికరమైన గోవా మామిడిపండ్ల బుట్టను బాబాకు కానుకగా పంపాడు. బాబా వాటిలో ఎనిమిది పండ్లను వేరుగా ఉంచి, మిగిలిన వాటిని అందరికీ పంచారు. వేరుగా ఉంచిన పండ్లను కూడా పంచమని భక్తులు అడిగారు. బాబా, “ఆ ఎనిమిది మామిడిపండ్లు దామ్యా కోసం ఉంచాను” అని చెప్పారు. "అతనిక్కడ లేడు కదా!" అని భక్తులు అంటే, "అతనిప్పుడే కోపర్‌గాఁవ్‌లో దిగాడు. కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తాడు" అని అన్నారు బాబా. తరువాత బాబా బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆ ఎనిమిది మామిడిపండ్లలో నుండి నాలుగు పండ్లను పిల్లలు ఎత్తుకుపోయారు.

కొంతసేపటికి దామ్యా మసీదుకొచ్చి బాబా దర్శనం చేసుకుని, వారికి పూలదండలు, చాదర్ మొదలైనవి సమర్పించుకున్నాడు. బాబా అతనికి నాలుగు మామిడిపండ్లు ప్రసాదించి, “దామ్యా! ఈ పండ్లను తీసుకో. వీటిని తిని చావు” అని అన్నారు. 'చావు' అన్న అమంగళకరమైన పదాన్ని విన్నంతనే అతడు కలవరపడ్డాడు. అక్కడే ఉన్న మహల్సాపతి అతని కలవరపాటుని గమనించి, "బాబా పాదాల వద్ద మరణించడం అన్నది ఆశీర్వాదమే గానీ మరొకటి కాదు" అని చెప్పాడు. ఆ మాటలతో అతను కాస్త ఊరట చెందాడు. అంతలో బాబా, "దామ్యా! ఈ పండ్లను నువ్వు తినకు. వీటిని నీ భార్యకివ్వు" అని అన్నారు. అతడు, "ఏ భార్వకివ్వమంటారు బాబా?" అని అడిగాడు. అప్పుడు బాబా, “నీ చిన్నభార్యకివ్వు” అని, “ఆమెకు ఎనిమిదిమంది పిల్లలు పుడతారు. మొదటి ఇద్దరు మగపిల్లలే అవుతారు. మొదటివాడికి ‘దౌలత్ షా’ అని, రెండవవానికి ‘తానాషా’ అని పేర్లు పెట్టు” అని అన్నారు. తరువాత అతను బాబా వద్ద సెలవు తీసుకుని తిరిగి అహ్మద్‌నగర్ చేరుకున్నాడు. 

బాబా ప్రసాదించిన మామడిపండ్లను తన చిన్నభార్యకిచ్చి, బాబా చెప్పిన పేర్లను ఒక డైరీలో వ్రాసిపెట్టుకున్నాడు. సంవత్సరం తరువాత అతని భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు పదిహేను నెలల వయస్సున్నప్పుడు దామ్యా ఆ బిడ్డను తీసుకుని బాబా దర్శనానికై  శిరిడీ వెళ్ళాడు. బాబాకు బిడ్డను చూపించి, “వాడికేమి పేరు పెట్టాలి?” అని అడిగాడు. “నేను ఈ బిడ్డకు పేరు పెట్టడమేమిటి? నేను ఏమి చెప్పానో మరచిపోయావా? నువ్వు నీ డైరీలోని మూడవ పేజీలో వ్రాసుకున్నావుగా, వీడికి ‘దౌలత్ షా’ అని పేరు పెట్టమని నేను చెప్పాను కదా!” అని అన్నారు బాబా.

మొత్తం పదిహేనేళ్ల కాలంలో దామ్యా దంపతులకు ఎనిమిదిమంది పిల్లలు పుట్టారు. బాబా చెప్పినట్లే మొదటి ఇద్దరు మగపిల్లలు. ఆ పిల్లలిద్దరికీ బాబా ఆదేశించిన పేర్లే పెట్టారు. ఆ పేర్లతో పాటు వాళ్ళకి హిందూ పేర్లు కూడా ఉన్నాయి. నాలుగు మామిడిపండ్లను పిల్లలెత్తుకుపోవడం ఒక సంకేతమే కాబోలు. అతనికి పుట్టిన ఎనిమిదిమంది పిల్లలలో నలుగురు మాత్రమే జీవించారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం అతని జాతకంలో కేతు ప్రభావం వల్ల పిల్లలు పుట్టే యోగమే లేదు. ఆ కేతు ప్రభావాన్ని అధిగమించడానికి గురు బలం కూడా లేదు. కానీ దామ్యాకు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడైన బాబా గురువుగా లభించారు. ఆయన కృపావీక్షణాలతో జాతకంలో ఉన్న ప్రతికూల ప్రభావం తొలగిపోయి అతనికి సంతానభాగ్యం కలిగింది. పిల్లలు లేరన్న చింత తీరింది. ఇక అతనికి ఏ లోటూ లేదు, చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. బాబా యొక్క అద్భుత శక్తులు మరియు మహిమల గురించి తనకు తెలిసిన వారందరితో ఎంతో ఆనందంగా పంచుకోసాగాడు. అలా అతని వల్ల బాబా కీర్తి చాలా దూరప్రాంతాలకు వ్యాపించింది.

దామూ శేట్ శిరిడీ వెళ్ళిన తొలిరోజుల్లో నెవాసా గ్రామానికి చెందిన బాలాజీ పాటిల్ మసీదు ఊడ్చడం, దీపాలను పెట్టడం తదితర పనులు చేస్తుండేవాడు. దామూ శేట్ బాబా అనుమతి తీసుకుని ఆ పనులలో తాను కూడా పాలుపంచుకోవడం ప్రారంభించాడు.

1897వ సంవత్సరం నుండి శిరిడీలో శ్రీరామనవమినాడు ఉరుసు ఉత్సవం, జెండా ఊరేగింపు ప్రారంభమయ్యాయి. ఆ ఉత్సవాల సందర్భంగా, సంతానభాగ్యమే లేని తనకు సంతానాన్ని ప్రసాదించిన బాబాపట్ల తనకున్న కృతజ్ఞతకు చిహ్నంగా ఒక జరీ అంచు జెండాను సమర్పించాడు దామ్యామరో జెండాను నిమోన్కర్ సమర్పించాడు. ఈ రెండు జెండాలను చక్కగా అలంకరించి మసీదు నుండి శిరిడీ వీధులలో ఊరేగించిన పిమ్మట వాటిని మసీదుకు రెండువైపులా కట్టేవారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమినాడు ఒక జెండాను దామ్యా కుటుంబం సమర్పించుకుంటోంది. అంతటితో దామ్యా సంతృప్తి చెందక బాబాకోసం ఏమి చేయడానికైనా, ఎంత ధనాన్ని ఖర్చుపెట్టడానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. మసీదు పునర్నిర్మాణ సమయంలోనూ, మరికొన్ని ఇతర సందర్భాలలోనూ అతడు తన సహకారాన్ని అందించాడు. అన్నిటికన్నా గొప్ప విషయం, అతను బాబాకు అంకిత భక్తుడయ్యాడు. అతను ఎక్కడ ఉన్నా, ఎప్పుడు బాబాను తలచుకున్నా బాబా అతని క్షేమాన్ని చూసుకుంటుండేవారు.

దామ్యా ఎప్పుడూ బాబా సలహా తీసుకుని, తదనుగుణంగా నడుచుకుంటుండేవాడు. తత్ఫలితంగా అతనికి ఎప్పుడూ మంచి ఫలితాలే దక్కేవి. ఒకసారి అతనికి సంబంధించిన కేసు ఒకటి హైకోర్టులో అప్పీలు చేయబడింది. న్యాయవాది అతనిని బొంబాయికి రమ్మని ఒక లేఖ వ్రాశాడు. దామూ అప్పుడు శిరిడీలో ఉన్నాడు. బాబా అతన్ని బొంబాయికి వెళ్లేందుకు అనుమతించక శిరిడీలోనే ఉంచారు. అతను కోర్టుకు హాజరు కానప్పటికీ తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది.

దామ్యా వ్యాపార విషయాలలో బాబానే సంప్రదిస్తుండేవాడు. ఒకసారి బొంబాయికి చెందిన ఓ స్నేహితుడు ప్రత్తి వ్యాపారంలో తనతో భాగస్వామిగా చేరి, రెండు లక్షల రూపాయల లాభం ఆర్జించవచ్చని దామూకు ఆశ పెట్టాడు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని, నష్టానికి ఎంతమాత్రం అవకాశం లేదని, కనుక అవకాశాన్ని పోగొట్టుకోక వెంటనే భాగస్వామిగా చేరమని దామూకు ఉత్తరం వ్రాశాడు. దామ్యా ‘ఆ బేరంలోకి దిగాలా? వద్దా?’ అని సందేహపడ్డాడు. వెంటనే ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు. కానీ, లాభం వస్తుందనగానే అతని మనసు అటువైపు లాగింది. అయినా తాను బాబాకు భక్తుడు కావటంవల్ల ఈ విషయమై శ్యామాకు వివరంగా ఒక లేఖ వ్రాసి, బాబా సలహాను అడిగి తెలుసుకొమ్మన్నాడు. మర్నాడు ఆ ఉత్తరం శ్యామాకు అందింది. శ్యామా దానిని తీసుకుని మసీదుకు వెళ్లి బాబా ఎదుట పెట్టాడు. ఆ కాగితం ఏమిటని శ్యామాను అడిగారు బాబా. అహ్మద్‌నగర్ నుంచి దామూ అన్నా ఏదో విషయమై సంశయం తీర్చుకునేందుకు లేఖ రాశాడని శ్యామా చెప్పాడు. “దామూ ఏమి రాశాడు? ఏం ఎత్తులు వేస్తున్నాడు? భగవంతుడు ఇచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశానికి ఎగరాలని చూస్తున్నట్టున్నాడు. వాడు రాసిన ఉత్తరం చదువు” అన్నారు బాబా. శ్యామా ఆశ్చర్యపోయాడు. ఆ ఉత్తరంలో ఉన్నదానికే బాబా సమాధానమిచ్చారు. ఇక చదవటానికి ఏముంది కనుక? అప్పుడు శ్యామా బాబాతో, “దేవా! నువ్విక్కడే కూర్చుని భక్తులను ఆందోళనలపాలు చేస్తావు. వారు వ్యాకులపడితే ఇక్కడకు ఈడ్చుకుని వస్తావు. కొందరిని ప్రత్యక్షంగా, మరికొందరిని ఉత్తరాల రూపంలో తీసుకువస్తావు. ఉత్తరంలోని సంగతులు తెలిసీ మళ్లీ నన్నెందుకు చదవమంటావు?” అన్నాడు. బాబా “శ్యామా! దయచేసి ఉత్తరంలో ఏముందో చదువు. నా నోటికి వచ్చింది నేను మాట్లాడతాను. నన్ను విశ్వసించే వారెవరు చెప్పు?” అన్నారు. అప్పుడు శ్యామా ఆ ఉత్తరాన్ని చదివాడు. బాబా దానిని జాగ్రత్తగా విని, "శేటుకు పిచ్చెక్కినట్టుంది. 'అతనింట ఏ లోటూ లేద'ని సమాధానం రాయి. "తనకున్న సగం రొట్టెతో సంతుష్టి చెందమను. లక్షలార్జించాలని ప్రయాసపడవద్దని చెప్పు” అన్నారు. శ్యామా అదే విషయాన్ని దామూకు సమాధానంగా రాశాడు. బాబా సమాధానం కోసమే ఆతృతతో ఎదురుచూస్తున్న దామూ ఆ ఉత్తరాన్ని చదివి తన ఆశ అడియాశ అయిందని నిరాశచెందాడు. అయితే, బాబాను లేఖ ద్వారా సమాధానం కోరటానికి, స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయటానికి తేడా ఉంటుందని భావించి దామూ శిరిడీ వెళ్ళాడు. 

బాబాకు నమస్కారం చేసి, బాబా పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు. తన వ్యాపారం విషయాన్ని బహిరంగంగా బాబా ఎదుట ప్రస్తావించటానికి అతనికి ధైర్యం సరిపోలేదు. "ఈ విషయంలో బాబా తనకు సహాయం చేస్తే ప్రత్తి వ్యాపారంలో వచ్చే లాభంలో సగం బాబాకు ఇస్తాను" అని మనసులో అనుకున్నాడు. అయితే, బాబా అందరి అంతరంగాలను చదివే సర్వజ్ఞులు కదా! అతని మనసులోని ఆలోచనను కనిపెట్టారు. బిడ్డలు తీపిమాత్రలే కోరుకుంటారు. కానీ బిడ్డల ఆరోగ్యాన్ని కోరి తల్లి వారికి చేదుమాత్రలనిస్తుంది. తీపివస్తువులు ఆరోగ్యానికి చేటు తెస్తాయి. చేదుమాత్రలు ఆరోగ్యాన్ని నయం చేస్తాయి. అందువలన తల్లి తన బిడ్డ మేలు కోరి బుజ్జగించి చేదు మాత్రలనే మింగిస్తుంది. బాబా దయగల తల్లి వంటివారు. భక్తుల భూత, భవిష్యత్, వర్తమానాలు, లాభనష్టాలు ఎరిగినవారు. బాబా దామ్యాతో, "ప్రపంచ విషయాల్లో తగులుకోవడం నాకిష్టం లేదు” అని అన్నారు. తాను మనసులో అనుకున్నది బాబా గ్రహించారని అర్థమై అతడు ఆశ్చర్యపోయాడు. అంతటితో ప్రత్తి వ్యాపార ఆలోచనను విడిచిపెట్టాడు.

మరోసారి దామూ ధాన్యం వ్యాపారం చేయాలని తలచాడు. ఈ ఆలోచనను కూడా బాబా కనిపెట్టి, “దామ్యా! నువ్వు అయిదుసేర్ల చొప్పున కొని ఏడుసేర్ల చొప్పున అమ్మాల్సి ఉంటుంది. కనుక ఈ వ్యాపారాన్ని కూడా మానుకో!" అని సలహా ఇచ్చారు. తరువాత కొన్నాళ్ల వరకు ధాన్యం ధర బాగానే ఉంది. కానీ, ఒకటి రెండు నెలల తరువాత వర్షాలు విస్తారంగా కురిసి ధరలు పడిపోయాయి. ధాన్యం నిల్వచేసిన వారంతా నష్టాల పాలయ్యారు. ఈ అవస్థ నుంచి బాబా దామ్యాను కాపాడారు. అనంతరం కొద్దిరోజులకు ప్రత్తి వ్యాపారం కూడా పడిపోయింది. ఆ ప్రత్తి వ్యాపారం గురించి దామ్యాకు ఆశపెట్టిన మిత్రుడు వేరొక మిత్రునితో వ్యాపారంలో దిగి తీవ్రంగా నష్టపోయాడు. బాబా తనను ఆ రెండు నష్టాల నుంచి కాపాడటంతో బాబాపై మరింత విశ్వాసాన్ని పెంచుకున్నాడు దామ్యా. దురాశపడక, ఉన్నదానితోనే తృప్తిచెందటం నేర్చుకున్నాడు. అప్పటినుంచి బాబా మహాసమాధి చెందేవరకు బాబాకు నిజమైన భక్తుడిగా మసలుకున్నాడు దామ్యా.

దామ్యా మనస్సెప్పుడూ బాబా ధ్యాసలోనే ఉండేది. తరచూ బాబా దర్శనం తనున్నచోటనే లభించేది. బాబా అప్పుడప్పుడు అతన్ని తిట్టేవారు, తీవ్రంగా కొట్టేవారు. అక్కల్‌కోట మహారాజ్ వంటి మహాత్ముల తిట్లు, దెబ్బలు శుభాలనే కలుగజేస్తాయని అతనికి తెలుసు. అందువలన అతనెప్పుడూ బాబా తిట్లను, దెబ్బలను అవమానకరంగా భావించలేదు, గొణుగుకోలేదు, ఆయనతో అనుబంధాన్ని వదులుకోలేదు.

బాబా అన్ని జీవులను, కడజాతివారిని ఎటువంటి వివక్ష చూపక సమానంగా ఆదరిస్తారని దామ్యాకి తెలుసు. అతనొకసారి శిరిడీలో విందు ఏర్పాటు చేసి బాబా వద్దకు వెళ్ళాడు. ఆయనెలాగూ భోజనం కోసం తన బసకి రారని తెలుసు కాబట్టి ఆయన సేవకుడైన బాలాపాటిల్‌ని పంపమని బాబాను అభ్యర్థించాడు. బాలాపాటిల్ కడజాతివాడు. అందువలన బాబా అతని అభ్యర్థనను అంగీకరిస్తూ, " 'ధూత్, ధూత్' అని అతిథిపై అరిచి, మీరు కూర్చునే చోటుకు దూరంగా తనని కూర్చోపెట్టి అవమానపరచనంటే పంపుతాన"ని అన్నారు. అందుకు దామ్యా అంగీకరించాడు. వంట పూర్తికాగానే అతను బాబా కోసమని ఒక పళ్లెంలో ఆహార పదార్థాలన్నీ వడ్డించి, "బాబా, దయచేయండి!" అని ఆహ్వానించాడు. వెంటనే ఒక నల్లకుక్క లోపలి వచ్చి, పళ్ళెంలోని ఆహారపదార్థాలను తిని వెళ్లిపోయింది. అది తినేవరకు అతను గౌరవభావంతో వేచివుండి, తరువాత బాలాపాటిల్‌ని తనతోపాటు కూర్చుండబెట్టుకుని అతిథులందరితో కలిసి భోజనం చేశాడు. దామ్యా పూర్తిగా బాబాపై ఆధారపడేవాడు. కష్టనష్టాలలో ఆయనే తనకు రక్షణ కవచమని, ఎదురయ్యే ప్రతి సమస్య నుండి తనని కాపాడే సంరక్షకుడని భావించేవాడు. అందువలన ఏ ఇబ్బంది వచ్చినా అతను బాబాని తలచుకునేవాడు.

అహ్మద్‌నగర్‌లో ఉన్నప్పుడు దామూ అన్నా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 33 సంవత్సరాలుగా వారింట్లో పనిచేస్తున్న వ్యక్తే ఆ దొంగతనానికి పూనుకున్నాడు. అతడు అల్మారాలో ఉన్న ఆభరణాల పెట్టెను దొంగిలించాడు. అందులో చాలా పురాతనమైన నత్తు (నాసికాభరణం) ఉంది. వివాహిత స్త్రీకి అది ఎంతో అమూల్యమైనది. మిగిలిన వస్తువులు పోవడం కంటే ఆ నత్తు పోవడమే వారందరినీ ఎక్కువగా బాధపెట్టింది. దొంగతనం చేసింది పనివాడేనని తెలిసి దాము అన్నా చాలా బాధపడ్డాడు. అటువంటి పని చేసేందుకు ప్రేరేపించిన కారణాలు ఏమై ఉంటాయో అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఆ పనివానిని బెదిరించినా, భయపెట్టినా, ప్రలోభపెట్టినా ప్రయోజనం లేకపోయింది. అతడు దేనికీ లొంగలేదు, ఏ వివరాలూ వెల్లడించలేదు. చివరికి పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఈ విషయం కోర్టు వరకు వెళ్లకూడదని దాము అన్నా హృదయం ఎంతగానో తపించింది. అట్టి స్థితిలో అతను బాబా పటం ముందు కూర్చుని, ఆయనను ప్రార్థించి, సమస్యను బాబా ముందు ఉంచాడు. మరుసటిరోజే ఆ పనివాడు దొంగిలించిన ఆభరణాల పెట్టెను దాము అన్నాకు ఇచ్చి క్షమించమని వేడుకున్నాడు. ఆ పెట్టెలో ఆభరణాలన్నీ ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి.

1910-1911లో రాస్నే సోదరులు అతని నుండి విడిపోయారు. అతని సోదరి మరణించింది. పైగా అదే సమయంలో దొంగతనం, పోలీసు విచారణ జరిగాయి. ఇవన్నీ అతని మనసును తీవ్రంగా కలవరపరిచాయి. ముఖ్యంగా సోదరి మరణం అతనిని బాగా  కృంగదీసింది. ఆ బాధలో జీవితం, ఇతర సుఖాలు అతని మనసుకు పట్టలేదు. తరువాత అతను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, బాబా కొన్ని మాటలు చెప్పి అతనిని శాంతింపజేసి, అప్పాకులకర్ణి ఇంట పూరణ్ పోళీలతో విందు ఏర్పాటు చేయించి, అతని నుదుట గంధం పెట్టి ఆశీర్వదించారు.

ఒకసారి దామ్యా మశీదులో భక్తులందరితో పాటు బాబా పాదాలచెంత కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అతని మనసులో, "నిత్యం బాబా దగ్గరకు అసంఖ్యాక భక్తులు వస్తుంటారు కదా! వచ్చినవాళ్ళంతా బాబా నుండి లబ్దిపొందుతున్నారా?""బాబా సమాధి చెందితే నాకు దిక్కెవరు? నా గతి ఏమౌతుంది?" అన్న రెండు ప్రశ్నలు తలెత్తాయి. సర్వజ్ఞుడైన బాబా అతని మనసులోని సందేహాలను గ్రహించి ఇలా చెప్పారు: “దామ్యా! పూత పూసిన మామిడిచెట్టును చూడు. ఆ పువ్వులన్నీ కాయలై, పండ్లయితే ఎంత బాగుంటుంది? కానీ అలా అవుతాయా? కొన్ని పువ్వులుగా, కొన్ని పిందెలుగా, మరికొన్ని గాలికి సహజంగానే రాలిపోతాయి. చివరికి ఏ కొద్దో మిగులుతాయి!” అన్నారు.

ఇక రెండవ ప్రశ్నకు సమాధానంగా బాబా అతనితో, "ఎప్పుడైనా, ఎక్కడున్నా నన్ను తలచిన వెంటనే నేను నీ వెంట ఉంటాను" అని హామీ ఇచ్చారు. "ఆ హామీని బాబా 1918 ముందు, తరువాత కూడా నెరవేర్చారు. వారు నాతోనే ఉండి, నాకు మార్గం చూపిస్తున్నారు" అని 1936లో అతడు శ్రీబి.వి.నరసింహస్వామితో చెప్పాడు. అతను చెప్పింది ఖచ్చితంగా నిజం. బాబా అతనితో ఉన్నారు. తరచూ అతనికి దర్శనమిచ్చేవారు. బాబా సమాధి చెందాక అతడు బాబా ముందు చీటీలు వేసేవాడు. ఆ చీటీల ద్వారా అతనికి ఎప్పుడూ బాబా సమాధానాలు లభించేవి. ఆ విషయమే అతనిలా అంటాడు: "నేను అనేకసార్లు చీటీల ద్వారా బాబాను సంప్రదించాను. ఒక్క సందర్భంలో కూడా బాబా నుండి వచ్చిన సమాధానం తప్పు కాలేదు". అతను ఎక్కువగా ప్రాపంచిక వ్యవహారాలలోనే బాబా ఆశీస్సులు పొందాడు. మతపరమైన విషయాలలో బాబా సహాయం కోరేందుకు అతనికి చాలా తక్కువ సందర్భాలు వచ్చాయి. 

1941, జనవరి 20న 89 ఏళ్ళ వయసులో దామూశేట్ తుదిశ్వాస విడిచాడు. అతడు తుదిశ్వాస విడిచేముందు తన కుమారులను దగ్గరకు పిలిచి, “అప్పుడప్పుడు బాబా నాకు డబ్బులు ఇచ్చారు. అవి మొత్తం 31 రూపాయలు. మీ జీవితం కన్నా వాటిని జాగ్రత్తగా చూసుకోండి. అవి సాధారణ నాణేలు కాదు, అవి సాక్షాత్తూ కామధేను స్వరూపం. శ్రీసాయిబాబా సేవలో ఏమీ లోటులేకుండా చూసుకోండి” అని చెప్పాడు. నానాసాహెబ్ రాస్నే వారసులు ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సమయంలో వచ్చే ధన త్రయోదశినాడు ఆ నాణేలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పై చిత్రంలోని మొదటిది శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నానాసాహెబ్ రాస్నేకు ఇచ్చిన బంగారు సాయిబాబా లాకెట్. చివరిది నానాసాహెబ్ తల్లి అతనికిచ్చిన నాణెం. మిగిలిన నాణేలన్నీ సాయిబాబా దామ్యాకు ప్రసాదించినవి.

దాము అన్నా మరణానంతరం నానాసాహెబ్ రాస్నే శిరిడీ వెళ్లి, బాబా సమాధి ముందు నిలబడి తనని తాను నియంత్రించుకోలేక ఏడ్చేశాడు. అంతలో బాబా సమాధినుండి, “అరె, నానా! పద్నాలుగవరోజు కర్మకాండలు పూర్తయ్యాయి. సంతాపకాలం పరిసమాప్తమైంది. మీరిప్పుడు తీపి కూడా తిన్నారు. కాబట్టి ఇకపై కన్నీళ్లు పెట్టుకోకు" అన్న బాబా స్వరం వినిపించింది.

దామ్యా తరువాతి తరాలవారంతా బాబానే తమ ఆరాధ్యదైవంగా కొలుస్తున్నారు. నేటికీ ఆ కుటుంబంలోని పిల్లలు, పెద్దలు సాయిబాబా బోధనలను అనుసరిస్తున్నారు. దామ్యా పెద్దకొడుకు నానాసాహెబ్ తండ్రి ఆదేశం మేరకు కుటుంబం కంటే సాయిబాబా సేవకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవాడు. అతనికి సంబంధించిన మరిన్ని వివరాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం.

1936లో శ్రీబి.వి.నరసింహస్వామి చేసిన ఇంటర్వ్యూలో దామ్యా ఇలా చెప్పాడు: "దాసగణు మహరాజ్ గానీ, దాభోళ్కర్ గానీ నా అనుభవాల గురించి నన్నెప్పుడూ అడగలేదు. నేను వాళ్ళకి ఏ వివరాలూ చెప్పలేదు. నాకు ముగ్గురు భార్యలున్నారని వ్రాసిన విషయం వాస్తవం కాదు. నాకు ఇద్దరు భార్యలు మాత్రమే ఉన్నారు. బాబా ముస్లింలను నమాజ్ చేయమని, తరువాత తమ వద్ద ఖురాన్ పఠించమని చెప్పేవారు. అప్పుడప్పుడు మౌల్వీలతో మతపరమైన విషయాల గురించి మాట్లాడుతుండేవారు. బాబా తమ మహాసమాధి తర్వాత కూడా నాకు సహాయం చేస్తున్నారు, కొన్నిసార్లు నాకు దర్శనమిచ్చారు. 

సమాప్తం... 

(Source: Life of Sai Baba - Volume III by Poojya B.V.Narasimha Swamiji, Shri Sai Leela Magazine September-October 2007, Personal Interview Smt.Shreya Nagaraj had with Shri.Shrikant Rasane Grandson of Nana Saheb Rasane and Dr.Parag Rasane Photo Courtesy: Shri.Nagaraj Sham, Pune)
http://www.saiamrithadhara.com/mahabhakthas/damodar_savalram_rasane.html
http://bonjanrao.blogspot.com/2012/12/damodar-savalram-rasane.html

5 comments:

  1. 🙏🌹🙏 ఓం సాయిరాం🙏🌹🙏
    మధురం మధురం శ్రీ సాయి లీలామృతం
    సుమధురం సాయి దివ్య నామం!!
    !!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
    !!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
    !!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    ReplyDelete
  2. ఓం సాయి రాం జై శ్రీ సాయి మాస్టర్

    ReplyDelete
  3. Kothakonda SrinivasMay 11, 2021 at 7:49 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. Om shri sachidananda sadguru sai Maharaj ki jai.. 💐💐💐💐🙏🙏🙏🙏

    ReplyDelete
  5. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ షిరిడి సాయినాథ్ మీరే నా దైవం నా సర్వస్వం మీరే.. నాకు వచ్చే ఇబ్బందులన్నీ తొలగించే శక్తి యుక్తులను మీరు ఇస్తారు ఆ నమ్మకం నాకు ఉంది.. నీ ఆశీర్వాద బలం తో మాకు వచ్చి నటు వంటి అనేక వ్యాధుల్ని రూపుమాపి నిర్మూలన చేసినందుకు కష్టనష్టాలను దగ్గర ఉండి తీర్చినందుకు, మాకు అమ్మానాన్న లాగా ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నందుకు.. హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు సాయీశ్వర నీవే కలవు నీవే తప్ప మాకు ఎవరు లేరు ఈ లోకంలో..

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo