సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

భాగోజీ షిండే


బాబా యొక్క ప్రముఖ సేవకుడు,
భాగోజీషిండే శిరిడీ నివాసి. అతడు లక్ష్మీబాయిషిండేకి బంధువు. అతను ఒక కుష్టువ్యాధిగ్రస్తుడు. ఆ వ్యాధి వలన అతను తన చేతివేళ్ళలో ఎక్కువ భాగాన్ని కోల్పోయాడు. అంతేకాకుండా ముఖంలో ఎంతో ముఖ్యభాగమైన ముక్కులో కొంతభాగాన్ని కూడా కోల్పోయాడు. అతని శరీరం నుండి చీము, రక్తం స్రవిస్తూ దుర్గంధం వస్తుండేది. ఇన్ని భాధలు అనుభవిస్తున్నప్పటికీ  అతడు తన జీవితాంతం బాబాకు సేవచేసుకొని తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. బాబాతో భాగోజీకి పరిచయం అయ్యేటప్పటికే అతనికి కుష్ఠురోగం ఉండేది. అతడు దురదృష్టవశాత్తూ తనకి సంక్రమించిన ఆ వ్యాధితో చాలా బాధపడుతూ ఉండేవాడు. అయినప్పటికీ బాబాతో నిరంతరం ఉంటూ, ఆయనకు సేవచేసుకొనే భాగ్యం కలిగి ఉండడం నిజంగా అతని అదృష్టం. నిరంతరం బాబా సాంగత్యంతో అతనెంతో లాభం పొందాడు.

బాబా శిరిడీ వచ్చిన తొలినాళ్ళలో ఆపదలో ఉన్నవారికి మందులను పంపిణీ చేసేవారు. ఉచితంగా వైద్యం అవసరమైతే పరిచర్యలు కూడా చేసేవారు. భాగోజీ అనారోగ్యం తీవ్రస్థాయికి చేరినప్పుడు అతని బంధువులందరూ అతనిపై ఆశ వదులుకున్నారు. ఆ సమయంలో బాబా భాగోజీ ఇంటికి వెళ్లి అతనికి కొన్ని మందులు ఇచ్చారు. ఆ విషయమై అతని సోదరుడు రఘుజీ మాట్లాడుతూ, "ఒకప్పుడు భాగోజీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అంతిమఘడియలు సమీపించే సమయంలో బాబా మా ఇంటికి వచ్చారు. ఆయన అతని వీపు మరియు కణతల మీద వేడి ఇనుపకడ్డీతో కాల్చారు. దానితో అతను త్వరలోనే కోలుకున్నాడు" అని చెప్పాడు.

అతడు బాబా పాదతీర్థాన్ని సేవించేవాడు. అలా చేయడం వలన అతని వ్యాధి కొంతవరకు నయమయింది. దానితో అతని పరిస్థితి కాస్త మెరుగుపడి పాక్షికంగా వికారంగా ఉండేది. వ్యాధి వలన అతని పరిస్థితి మరింత అధ్వాన్నంగా కాకుండా  బాబా అనుగ్రహించారు. అతని వ్యాధి మరీ తీవ్రం కాకుండా ఉండేలా చేశారు బాబా. అతను బాబా సన్నిహిత పరిచారకుడు. ఎల్లప్పుడూ బాబా సేవలో నిమగ్నమై ఉండేవాడు.

ఒకసారి బాబా భాగోజీని తన ప్రయోజనం కోసం తన కుష్ఠువ్యాధి నుండి స్వస్థత కోసం వరం కోరుకోమని అడిగినప్పుడు, "బాబా! నాకు నా వ్యాధి గురించిగానీ, నా భౌతికరూపం గురించిగానీ ఎటువంటి ఆందోళనా లేదు. కానీ నేను మిమ్మల్ని ఒక కోరిక అడుగుతాను. అదేమిటంటే, ఎల్లప్పుడూ నన్ను మీతో కలిసి ఉండటానికి అనుమతించండి, మరియు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ద్వారకామాయికి రావడానికి నాకు అనుమతినివ్వండి. నాకు అది చాలు" అన్నాడు భాగోజీ. అప్పుడు బాబా "సరే" అని అతన్ని అనుగ్రహించారు.

భాగోజీ బాబాకు ఒక పరిచారకుడిగా (వ్యక్తిగత సహచరుడిగా) ఉండేవాడు. అతను నిత్యం బాబా సేవలో సదా నిమగ్నమై ఉండేవాడు. అతడు వేకువఝామున మసీదులోకి ప్రవేశించే మొట్టమొదటివాడు. బాబా వేకువఝామునే లేచి ధుని దగ్గర ఉన్న స్తంభానికి ఆనుకొని కూర్చుని నిశ్చలంగా ధ్యాననిమగ్నులయ్యేవారు. ఆ సమయంలో మశీదులోకి ఎవరూ అనుమతించబడేవారు కాదు. తరువాత అక్కడే నిలబడి ఆయన చేతులతో ఏవో భంగిమలు చేస్తూ నెమ్మదిగా "యాదేహక్(దైవాన్ని ఎల్లప్పుడూ స్మరించాలి)," "అల్లా వలీ హై" మరియు "అల్లా మాలిక్ హై" వంటి పదాలు ఉచ్ఛరించేవారు. 

ఆ సమయంలో కేవలం అబ్దుల్‌బాబా, మాధవ్‌ఫస్లేలు  మసీదులోకి ప్రవేశించి మసీదును శుభ్రపరచడం, దీపాలను చమురుతో నింపడం, ధునిలో కట్టెలు వేయడం వంటి సేవలు చేసేవారు. ఆ సమయంలో భాగోజీషిండే మశీదుకు వచ్చేవాడు. బాబా ధుని ఎదుట కూర్చొని ఉండగా,  ప్రతి రోజు అతను బాబా కుడి చేతిని, తర్వాత బాబా శరీరమంతా మసాజ్ చేసేవాడు. తరువాత అతను చిలుం వెలిగించి బాబాకి అందించేవాడు. బాబా చిలుం పీల్చి భాగోజీకి చిలుం ఇచ్చేవారు. అలా కొన్నిసార్లు ఒకరి తరువాత ఒకరు చిలుం పిల్చిన తరువాత భాగోజీ ఇంటికి వెళ్ళేవాడు. 

భాగోజీ చేతితో ఇచ్చిన చిలుం బాబా ఎంతో ప్రేమతో, అభిమానంతో  పీల్చేవారు. భాగోజీ తన సేవను ముగించి మశీదు నుండి వెళ్ళిన తర్వాత మాత్రమే ఇతర భక్తులు రావడానికి అనుమతించబడేవారు. ఈవిధంగా అతను ఈ సేవను 1918లో బాబా సమాధి చెందే వరకు ఏ ఒక్క రోజు విఫలం కాకుండా చేసాడు. బాబా ప్రతిదినం లెండికి వెళ్ళేటప్పుడు అతడు గొడుగు పట్టేవాడు. షిరిడి సందర్శించే భక్తులకు బాబా యొక్క ఊదీని ఇస్తుండేవాడు, కొంతమంది భక్తుల నోటిలో ఊదీని వేస్తుండేవారు కూడా. అతను బాబా ఆదేశాలపై ఈ పనులను చేస్తుండటం వలన ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు.

1910వ సంవత్సరం దీపావళి పండగ నాడు దూరాన ఉన్న తమ భక్తుల యొక్క బిడ్డ జీవితాన్ని కాపాడటానికి బాబా తమ చేతిని ధుని (పవిత్రమైన అగ్ని)లో పెట్టడం వలన ఆయన చేయి బాగా కాలిపోయింది. ఆ విషయం తెలిసి నానాసాహెబ్ చందోర్కర్ బాబా చికిత్స కోసం బొంబాయి నుంచి  ప్రముఖ డాక్టర్ అయిన పరమానంద్ ని తీసుకొని షిర్డీ వచ్చారు. కానీ, తన చేతిని పరిశీలించడానికి కూడా ఆ డాక్టరుకి  బాబా అనుమతి ఇవ్వలేదు. బదులుగా ఆయన తన చేతి కాలిన భాగానికి నెయ్యి రాసి ఆకువేసి గట్టిగా కట్టుకట్టమని భాగోజీకి చెప్పారు బాబా. అలా తమ చేతి గాయాన్ని శుభ్రం చేసి కట్టు కట్టడానికి భాగోజీని మాత్రమే బాబా తమ అనుమతిని ఇచ్చారు.. నానా మరియు డాక్టర్ పరమానంద్ ఎంత ప్రాదేయపడినా “అల్లా మాత్రమే తమ డాక్టర్” అని వారికీ అనుమతి ఇవ్వలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్నాళ్ళకి గాయం మానిపోయింది. ఆ తరువాత కూడా అతడు ఉదయాన్నే పాత కట్టు తొలగించి,  కాలిన  చేతి  భాగాన్ని మసాజ్ చేసి నెయ్యి రాసి తాజా కట్టుని కట్టేవాడు. ఈ ప్రక్రియ బాబా యొక్క మహాసమాధి వరకు అనగా ఎనిమిదేళ్ల పాటు కొనసాగింది. 

బాబా పరిపూర్ణ సిద్ధపురుషులు. నిజానికి ఈ చికిత్స  తనకు అవసరంలేదు. కానీ తన భక్తుడు భాగోజీకి ప్రేమతో ఈ సేవను నిరంతరాయంగా కొనసాగించటానికి ఆయన అనుమతించారు. బహుశా బాబా భాగోజీని తన పూర్వ కర్మల నుండి విముక్తుడిని చేసి అతనిని అనుగ్రహించాలని ఈ పనిని నిరంతరాయంగా తమ మహాసమాధి వరకు కొనసాగనిచ్చారు. ప్రతిరోజు ఉదయం భాగోజీ తన ఇతర సేవలతో పాటు బాబాకు ఈవిధంగా సేవ చేసుకొనేవాడు.

1916లో విజయదశమి రోజున బాబా కోపంతో అకస్మాత్తుగా తన తలకున్న వస్త్రం, కఫ్నీ మరియు లంగోటీను  తొలగించి, ముక్కలు ముక్కలుగా చేసి వాటిని అన్నింటినీ ధునిలోకి విసిరేసారు. ఆయన నగ్నంగా ధుని ముందు నిలుచున్నారు। అప్పుడు బాబా కోపంతో బిగ్గరగా "మూఢులారా! ఇప్పుడు చూసి నేను ముస్లింనో, హిందూవునో తేల్చుకోండి" అని కేకలేసారు. అక్కడున్న వారంతా భయపడిపోయారు. కానీ ఆ సమయంలో మశీదులో ఉన్న భాగోజీ బాబాను సమీపించి బాబాకు లంగోటిని కట్టి, శుభమాని  భక్తులు సీమోల్లంఘన చేసుకుంటు ఉంటే మీరెందుకు ఇలా భయపెడతారు అన్నాడు. బాబా కోపంగా "ఈరోజు నా సీమోల్లంఘనం" అని కేకలు వేసారు. తరవాత కొంతసేపటికి బాబా శాంతించారు.

బాబా మహాసమాధి చెందే సమయంలో కేవలం మసీదులో ఏడుగురు భక్తులు మాత్రమే ఉన్నారు, వారిలో భాగోజీ షిండే కూడా ఒకరు. అప్పుడు బాబా లక్ష్మీబాయి షిండేకి రూ ।9 / - ఇచ్చారు. తరువాత ఆయన తమకు మశీదులో బాగా లేదని, బూటి వాడకు లేదా దగిడివాడ (రాతి భవనం) కు తీసుకువెళ్తే బాగుంటుందని బయాజీ  అప్పాకోతే పాటిల్ ఒడిలో ఒరిగి తుది శ్వాసను విడిచారు. అది గమనించి భాగోజీ నానాసాహెబ్ నిమోనుకర్ కి చెప్పాడు. అలా అతను బాబా మహాసమాధి చెందే వరకు ఆయనకు సేవ చేసిన కొంతమంది భక్తులలో భాగోజీ ఒకరు.

బాబా లెండీకి వెళ్ళేటప్పుడు బాబాకు అలంకరించబడిన గొడుగును పట్టుకొనే అదృష్టం భాగోజీకి దక్కింది. ఆవిధంగా బాబా అతనికి చరిత్రలో చిరస్థాయిగా నిలిచే స్థానం కల్పించారు. ఇప్పటికి ఇన్ని సంవత్సరాల తరువాత కూడా బాబాకి అతను గొడుగు పట్టుకొని ఉన్న ఛాయాచిత్రం చూసి సాయి భక్తలు అతనిని గుర్తు చేసుకుంటున్నారు.

ఈ అద్భుతమైన భక్తుని జీవితంలో నేర్చుకోవలసిన అనేక పాఠాలు ఉన్నాయి. భాగోజీ శరీర స్పృహను అధిగమించాడు. అతను తన చేతి యొక్క వేళ్ళలో ఎక్కువ భాగాన్ని కోల్పోయాడు, అంతేకాకుండా ముఖ భాగంలోని ఎంతో ముఖ్య భాగమైన ముక్కులో కొంత భాగమును కూడా కోల్పోయాడు అయినప్పటికీ అతడు తన భౌతికరూప విషయంలో ఎటువంటి ఆందోళన చెందలేదు. అతని శరీరం నుండి చీము, రక్తం స్రవిస్తూ దుర్గంధంగా వస్తుండేది. ఇతరులు అతనిని చూచి వెక్కిరించిన, అసహ్యంచుకున్న, కనికరం లేకుండా ఎన్నో పరుష పదాలతో తనని నిందించినప్పటికీ అతడు పటించుకొనేవాడు కాదు. 

ఇది పూర్తిగా శాస్త్రాలలో చెప్పబడిన "స్టిత ప్రజ్ఞ" (సమన్వయము) స్థితి. ఏది ఏమైనా, ఎన్ని అవరోదాలు ఎదురైనా తన సద్గురు సేవను  కొనసాగించాలని అతను నిశ్చయించుకున్నాడు. విపరితమైన చలి అయినా లేదా ఎంతటి భారీ వర్షమైన సంబంధం లేకుండా బాబా చేతికి మసాజ్ చేయటానికి ఎప్పుడు రాకుండా ఉండలేదు. దీనినే  "ధృఢ బుద్ధి" అంటారు.నవ విధి భక్తిలో ఒకటైన "దాస్య" భక్తికి భాగోజీని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. 

అతడు సద్గురువైన సాయికి అన్ని రకాలైన సేవాలు భక్తీ విశ్వాసాలతో చేసుకున్నాడు. భాగోజీ తన సద్గురు చరణాలకు పూర్తిగా శరణాగతి చెందాడు. అలా అతను తన సద్గురు సన్నిధిలో ఉండటం వలన బాబా యొక్క అనుగ్రహ వీక్షనలలో తడిసి ముద్దయ్యాడు. మరియు ఆయనను తాకి నిత్యం సేవిస్తూ ఉండటం వలన  బాబా తమ దైవ సంబంధమైన శక్తులను భాగోజీ షిండే యొక్క ఆత్మకి బదిలీ చేసారు.

షిండే వాడాగా పిలవబడే భాగోజీ ఇల్లు లక్ష్మీబాయి ఇంటి వెనుక ఉంది. ఈ ఇల్లు "పల్లకి రోడ్"లో కుడి చేతి వైపున ఉంది.


source: Holy Shri Sai Satcharitra Chapter 7, Baba's Anurag by Vinny Chitluri
http://bonjanrao.blogspot.co.ke/2013/01/bhagoji-shinde.html


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo