సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు మంగ. నేను చెప్పబోయే అనుభవం కాస్త పెద్దది అయినందున నన్ను క్షమించి ఓపికతో చదవండి.
1993, ఏప్రిల్ 17వ తేదీన జరిగిన అనుభవం:
మా ఇంటిలో అందరికంటే ముందు నేను బాబాకి దగ్గరయ్యాను, తరువాత మా నాన్నగారు కూడా సాయిభక్తులై, ప్రతిరోజూ రాత్రి 10 గంటలకి మా ఇంట్లో బాబాకు ఆరతి ఇవ్వడం ప్రారంభించారు. అప్పట్లో నేను, మా నాన్నగారు మాత్రమే సాయిభక్తులం. ఒకరోజు మా నాన్నగారు హైదరాబాదులోని మాసాబ్‌ట్యాంక్ దగ్గరున్న సాయిమందిరంలో ఆరతికి వెళ్లారు. ఆ సమయంలో అమ్మ, నేను, చెల్లి ఇంట్లోనే ఉన్నాము. సాధారణంగా మా అమ్మగారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటిది ఆరోజు రాత్రి 7 గంటల సమయంలో ఆమె బట్టలు కుడుతుండగా ఒక్కసారిగా తనకు తీవ్రమయిన కడుపునొప్పి వచ్చింది. ఆ నొప్పిని తట్టుకోలేక ఎప్పుడూ హాస్పిటల్‌కి వెళ్ళని మా అమ్మ తనే దగ్గరలో ఉన్న క్లినిక్‌కి వెళ్లి డాక్టరుని సంప్రదించింది. డాక్టర్ ఇంజక్షన్ చేసి, "మరేమీ పర్వాలేదు, తగ్గిపోతుంద"ని చెప్పారు. కానీ ఆ రాత్రంతా భరించలేనంత నొప్పితో విలవిలలాడిపోయింది అమ్మ. రాత్రంతా బాత్రూంకి వెళ్తూనే ఉంది. ఆ రాత్రి తను ఏమీ తినలేదు, త్రాగలేదు కూడా. ఇంక మా నాన్నగారు వేరే మందులేమీ వాడకుండా మరుసటిరోజు ఆదివారంనాడు పొద్దునే 6 గంటలకి మా అమ్మగారిని పెద్ద హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. మాకు బోర్డు ఎగ్జామ్స్ ఉండడం వలన మా చదువులపై ఈ ప్రభావం పడకూడదని మా నాన్నగారు ఒక్కరే అమ్మ దగ్గర ఉండేవారు. "అమ్మ బాగానే ఉంది, డాక్టర్స్ బాగా చూసుకుంటున్నారు" అని మాతో చెప్పేవారు. కానీ రోజులు గడుస్తున్నా అమ్మ పరిస్థితి మెరుగవలేదు. మూడు రోజుల తరువాత, మా ఎగ్జామ్స్ కూడా అయిపోవడంతో మేము వెళ్లి అమ్మని చూసి షాక్ అయ్యాం. తన పొట్ట ఉబ్బిపోయి తను చాలా ఇబ్బందిపడుతోంది.
ఏప్రిల్ 22వ తేదీ, గురువారంరోజు నేను, చెల్లి ఇంట్లోనే ఉన్నాం. ఆరోజు అమ్మకి ఆపరేషన్ జరుగుతుందని మాకు ఏమాత్రం ఐడియా లేదు. మా ఇంట్లో బాబా ఫోటో (బాబా రాతిమీద కూర్చొని ఉండే ఫోటో) చాలా పెద్దది ఉంది. మేమిద్దరం ఆ ఫోటో ముందు నిల్చొని బాబాని ప్రార్థిస్తూ ఉన్నాం. హఠాత్తుగా ఫోటోలో నుండి ఒక వెలుగు రావడం మేమిద్దరమూ చూశాము. నేను మంచం పైకి ఎక్కి ఫోటోను చేతితో పట్టుకొని కూడా ఆ వెలుగుని చూశాను. చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు. "మీ అమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను" అని బాబా మాకు ఆ వెలుగు రూపంలో సంకేతం ఇచ్చారని మాకు అనిపించింది. కొద్దిక్షణాల పాటు బాబా ఫోటో అలానే వెలుగుతో ఉంది. మాకు ఇంక మాటలు రాలేదు. ఆరోజు రాత్రి పది అవుతున్నా నాన్న ఇంటికి రాలేదు. మేము నాన్న కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే, ఆయన వచ్చి తాను భోజనం చేసి, అమ్మకి భోజనం తీసుకొని మళ్లీ హాస్పిటల్‌కి వెళ్ళాలి.
ఇప్పుడు బాబా లీల చూడండి. మా నాన్న రాగానే మేము జరిగినది చెప్పాము. అంతా విని ఆయన ఇలా చెప్పారు: "మంచి అనుభవం కలిగిన ఒక కొత్త డాక్టర్ ఆరోజు రౌండ్స్‌కి వచ్చి అమ్మ పొట్టని చూసి, వెంటనే X-RAY తీసి రిపోర్ట్స్ తీయమని చెప్పారు. రిపోర్ట్స్ రాగానే డాక్టర్ అన్నీ చూసి వెంటనే ఆపరేషన్‌కి రెడీ చేయమని చెప్పారు. వెంటనే ఆపరేషన్‌కి అన్ని ఏర్పాట్లు చేశారు. 'ఆపరేషన్ ద్వారా ఆమె రక్షింపబడుతుందా, లేదా' అని డాక్టర్ కాస్త ఆందోళనగానే ఉన్నారు. 'ఈ ఆపరేషన్ ద్వారా ఫలితం లేకపోతే మరో ఆపరేషన్ కూడా చేయవలసి ఉంటుంద'ని అన్నారు. ఎప్పటికప్పుడు నర్సు ద్వారా పరిస్థితి తెలుసుకుంటూ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా, లేదా అని ఆదుర్దాగా ఉన్నారు. ఆమె పొట్ట లోపల ఉన్న గ్యాస్ బయటకు పోతుందో లేదోనని టెన్షన్ పడ్డారు, కానీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. డాక్టర్ కూడా “THANK GOD” అన్నారు."
నాన్న చెప్పింది విని మేము చాలా సంతోషపడ్డాము, ఎందుకంటే అమ్మ ఆపరేషన్ జరిగిన సమయంలోనే (సాయంత్రం 6 నుండి 7) మాకు బాబా ఫోటోలో వెలుగు కనిపించింది. అంటే, బాబా అమ్మ విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నట్టు మాకు సంకేతం ఇచ్చారు.
బాబాకి తన నిజమైన భక్తులు ఎవరో బాగా తెలుసు. తనని పూజించినా, పూజించకపోయినా తనవారిని ఎప్పుడు, ఎలా తన వైపుకి లాక్కోవాలో బాబాకి బాగా తెలుసు. మా అమ్మ దేవుడిని పూజించినప్పటికీ, భక్తురాలు అయినప్పటికీ బాబాని మాత్రం ఎన్నడూ ప్రార్థించలేదు. ఈ సంఘటనతో మా అమ్మ పూర్తిగా బాబా భక్తురాలు అయ్యింది. ఇతర దేవతా పూజల నుండి పూర్తిగా బాబా వైపుకు మళ్ళింది. అప్పటినుండి ప్రతి గురువారం బాబా మందిరానికి వెళ్ళేది. రోజూ మూడు పూటలు ఇంట్లో బాబాకి ఆరతులు ఇవ్వడం, మధ్యాహ్నం బాబాకి భోజనం పెట్టడం, ఇలా పూర్తిగా బాబా పూజలలో లీనమైపోయింది. చాలా సంవత్సరాల నుండి ప్రతి గురువారం తనే స్వయంగా వంటలు వండి అన్నదానం చేస్తూ ఉంది. మా కుటుంబం అంతా బాబాకి ఋణపడి ఉన్నాం.
నా రెండవ అనుభవం :
10 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి బాబా మా అమ్మ ప్రాణాలని కాపాడారు. ఒక అట్లతద్దినాడు మా అమ్మ వ్రతం చేసుకోవవడానికి వాళ్ళ ఊరికి వెళ్ళింది. పూజ నియమం ప్రకారం వ్రతం అయ్యాక ఆడవాళ్ళంతా సాయంత్రం దీపాలను నదిలో విడవాలి. ఇంకా ఆరోజు అందరూ చిన్న చేపపిల్లలను కొని, నదిలో వదులుతుంటారు. మా అమ్మ, ఇంకా కొందరు ఆడవాళ్లు ఆరోజు ఉపవాసం ఉండి, చెరువు దగ్గర పూజ పూర్తిచేసి దీపం వదలడానికి వెళ్తున్నారు. దానితో వాళ్ళ పూజ పూర్తై ఉపవాసం వదిలిపెడతారు. అక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు వెళ్లి చివరి మెట్టు వద్ద నిల్చొని దీపం వదిలి వస్తున్నారు. అమ్మ కూడా అలానే దీపాన్ని వదిలి తిరిగి వచ్చే క్షణంలో అనుకోకుండా తన కాలు జారి నీళ్ళలో పడిపోయింది. తనకి ఈత కూడా రాదు కాబట్టి తలదాకా మునిగిపోయింది. రాత్రివేళ కావడంతో అంతా చీకటిగా ఉంది. ఆమెను కాపాడటానికి మగవాళ్ళు ఎవరూ ముందుకు రావటం లేదు. అంతలో మా పిన్ని అక్కడ దూరంగా ఉన్న ఒక వ్యక్తిని సహాయం చేయమని అడిగింది. అతను, "నేను పనిచేసుకుంటూ వస్తున్నాను, నా జేబులో డబ్బులు ఉన్నాయి. నేను నీటిలోకి దిగితే అవి తడిసిపోతాయి అందువలన నేను సహాయం చేయలేను" అన్నాడు. మా పిన్ని సహాయం చెయ్యమని పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఆడవాళ్లెవరికీ ఈత రాకపోవడంతో వారు సహాయం చెయ్యలేకపోయారు. అలానే అందరూ చూస్తూ ఉండగా, ఆశ్చర్యకరంగా మా అమ్మ వేరే ఒడ్డుకి చేరుకుంది. నిజానికి ఆమెకి ఈత రాదు, పైగా ఎవరూ సహాయం అందించలేదు. అయినా ఆమె ఒడ్డుకు క్షేమంగా చేరుకుంది. ఆమె ఎలా రాగలిగిందా అని ఎవరికీ నోట మాట రాక అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
కానీ మాకు తెలుసు, ఇదంతా బాబా చేసిన సహాయం అని. అమ్మని ఒక్క చుక్క నీరు కూడా మ్రింగనివ్వకుండా క్షేమంగా ఒడ్డుకు చేర్చి బాబా కాపాడారు. అక్కడికి దగ్గరలో బాబా మందిరం ఉంది. మా అమ్మ బయటకు వచ్చిన వెంటనే అలానే తడిబట్టలతో కాస్త కూడా సిగ్గుపడకుండా తిన్నగా బాబా మందిరానికి వెళ్లి ఆరతికి హాజరయింది. తనని కాపాడినందుకు బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంది.
ఈ విధంగా బాబా మా అమ్మ ప్రాణాలను రెండుసార్లు నిలిపారు.
🕉 sai Ram
ReplyDeleteThank you Sairam for protecting this woman🙏🙏🙏
ReplyDeleteSai Ram 🙏🏼🙏🏼🙏🏼
ReplyDeleteJai sairam 🌷🙏
ReplyDelete