సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

"నీవు ఇంకొంత కాలం బ్రతుకుతావు!"


హైదరాబాదు నుండి శ్రీనివాసమూర్తిగారు తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు:


నా పేరు శ్రీనివాసమూర్తి. మా ఇంట్లో నన్ను చిన్నప్పటినుండి గారాబంగా పెంచారు. ఇంట్లో అమ్మ, అన్నయ్య మంచి దైవభక్తి కలవారు. శ్రీగురుచరిత్ర పారాయణ, వివిధ దేవత అష్టోత్తరనామాలు వారికి కంఠతా వచ్చు. నేను మాత్రం స్నానం చేయగానే దేవుని గదిలోకి వెళ్లి బొట్టు పెట్టుకోవడం వరకే చేసేవాడిని. అటువంటి నా జీవితంలో భగవంతుని మీద ఆసక్తి నాకు 1999 సంవత్సరంలో కలిగింది. ఆ సమయంలో నేను జార్ఖండ్ రాష్ట్రంలోని 'రాంచి'లో MBAలో చేరాను. సరిగ్గా ఒకటిన్నర నెలలలో, అంటే మే నెలలో సెలవులకి ఇంటికి బాగా సిక్(sick) అయి వచ్చాను. కానీ, దాని గురించి అంతగా పట్టించుకోకుండా ఒక నెల తరువాత మరల రాంచికి వెళ్ళాను. అక్కడికి వెళ్లిన తరువాత నా అనారోగ్యం ఇంకా ఎక్కువైంది. నేను ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు. దసరా సమయంలో కాలేజీకి సెలవులు ఇస్తే వైజాగ్‌‌లో ఉన్న మా అన్నయ్య వద్దకు వెళ్ళాను. నన్ను చూస్తునే అన్నయ్య భయపడిపోయాడు. అప్పటి నా పరిస్థితి ఎలా ఉందంటే, చాలా సన్నబడిపోయి, చాలా నీరసంగా ఉన్నాను. 'ఏమైంద'ని అన్నయ్య అడిగితే, "నెలరోజుల నుండి సరిగా నిద్రలేదు, భయంగా ఉంటోంది" అని చెప్పాను. అన్నయ్య నన్ను వైజాగ్‌‌లో ఉన్న సైటియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లారు. అయినా నా అనారోగ్యంలో మార్పు రాలేదు. అక్కడినుండి ఇంటికి (గుంటూరు జిల్లా నెమలిపురి) వచ్చాను. అప్పటినుండి నాకుమా కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. అనారోగ్యంతో ఉన్న నన్ను చూసి మా ఊరివారంతా మా కుటుంబంతో మాట్లాడడం మానేశారు. ఒకరకంగా ఊరిలో మమ్మల్ని వెలివేశారు. ఒక్క మా పెద్దమ్మ(పద్మావతి) కుటుంబంవారు తప్ప మా ఇంటికి ఎవరూ వచ్చేవారు కాదు.

ఆ సమయంలో మా కజిన్స్ కొందరు అయ్యప్పమాల వేసుకున్నారు. వారు మా రి పక్కనే ఉన్న స్వయంభువు వెంకటేశ్వరస్వామి ఆలయానికి నిద్రకు వెళుతూ, నాకు ఇష్టం లేకున్నా బలవంతంగా నన్ను వాళ్లతోపాటు తీసుకువెళ్లారు. క్కడ వెంకటేశ్వరస్వామి రాతిపై వెలిశారు. స్వామి ముందు ఉన్న గుంటలో నెయ్యి పోస్తే స్వామి  నేతిలో మత్స్య(చేపఅవతారంలో కనిపిస్తారు. ఎప్పటిలాగే ఆరోజు కూడా నాకు నిద్రపట్టలేదు. ఒక్క అయిదు నిమిషాలు మాత్రం మగతగా నిద్రపట్టింది. అప్పుడు కలలో, స్వయంభువు వేంకటేశ్వరస్వామి రాతిలో నుండి బాబా తమ చేయి చాచి నా తలపై పెట్టబోతున్నారు. నేనేమో, "వద్దు బాబా, నేను చనిపోవాలనుకుంటున్నాను" అంటూ వెనక్కి వెనక్కి జరుగుతున్నాను. ఆ సమయంలో నా ఉద్దేశ్యం - నేను చనిపోవాలని. బాబా నా తలపై చేయి వేస్తే నేను బ్రతుకుతానని నా భయం. నేను బ్రతకకూడదని వెనక్కి వెనక్కి వెళుతుంటే, బాబా కూడా మ చేతిని చాలా పొడుగ్గా చాచి నా తలపై చేయి వేసి, "నీవు ఇంకొంత కాలం బ్రతుకుతావు" అని ఆశీర్వదించారు. తరువాత కొద్దిరోజులకే బాబా దయవల్ల నా ఆరోగ్యం కుదుటపడడము, ఊర్లో జనంలో కూడా మార్పు రావడం జరిగింది. అప్పుడు, "నేను బాబాకి ఏమి చేశాను, బాబా నన్ను ఇంతగా బ్లెస్స్(Bless) చేయడానికి? అని ఆలోచిస్తే నాకు ఒక విషయం గుర్తొచ్చింది.

అంతకుముందు సంవత్సరం నేను, మా కజిన్స్ అయ్యప్పస్వామి మాల వేసుకున్నాము. అంతకుముందు ఎప్పుడు శబరిమలై యాత్ర చేసినా దక్షిణ భారతదేశంలోని పవిత్రక్షేత్రాలు దర్శించుకుంటూ వెళ్లడం మా ఊరిలో సాంప్రదాయం. కానీ ఈసారి మాత్రం నేను, మా కజిన్స్, "ముందుగా శిరిడీ దర్శించాలి,  తరువాతే ఏ పుణ్యక్షేత్రమైనా" అని పట్టుబట్టాము. దాంతో మా యాత్రలో ముందుగా మమ్మల్ని శిరిడీ చేర్చారు. నేను టికెట్స్ డబ్బులు కాకుండా ఖర్చులకుగాను రెండువేల రూపాయలు అదనంగా తీసుకుని వెళ్ళాను. అందులో సగం డబ్బులు, అంటే వేయి రూపాయలు శిరిడీ ఖర్చుల కోసం, మిగిలిన డబ్బు తరువాతి యాత్రలకని అనుకున్నాను. అనుకున్నట్లుగానే వేయి రూపాయలు శిరిడీలో ఖర్చుపెట్టి, మిగిలినవి మిగతా యాత్రలలో ఖర్చుపెట్టాను. తిరుపతి దర్శించుకుని ఇంటికి వస్తున్నాము. నేను బస్సు కాంట్రాక్టరు(గురుస్వామి)ని 'తిరుగు ప్రయాణంలో ఒంగోలు సాయిబాబా మందిరం దర్శించుకోవాల'ని పట్టుబట్టాను. అతను 'తన దగ్గర డబ్బులు లేవని, పార్కింగ్‌‌కి నువ్వే ఇవ్వాల'ని నాతో అన్నాడు. నేను సరేనన్నాను. అప్పటికి సరిగ్గా నా జేబులో యాభై రూపాయలే ఉన్నాయి. నేను యాభై రూపాయలు ఆయనకు ఇచ్చాను. ఆరోజు గురువారం. అందరం లాయరుపేటలో భరద్వాజ మాస్టర్‌‌గారు కట్టించిన సాయిబాబా మందిరం దర్శించుకుని ఇంటికి వచ్చాముమా శబరిమలై యాత్రలో మేమనుకున్న మొదటియాత్ర శిరిడీ, చివరియాత్ర ఒంగోలులోని సాయిబాబా మందిరం. కేవలం నేనొక సామాన్య భక్తుడిగా శిరిడీ వెళ్ళినా, బాబా మాత్రం ఎంతో ప్రేమతో నన్ను తమ రక్షణలోకి తీసుకున్నారు. అందుకే వెంకటేశ్వరస్వామి రాతిలో బాబా నాకు దర్శనమిచ్చి, నన్ను ఆశీర్వదించి, నా మనసులోని చెడు ఆలోచనలను త్రుంచివేసి, నన్ను రక్షించి తమవాడిగా చేసుకున్నారు. అప్పటినుండి నాకు బాబా పట్ల భక్తివిశ్వాసాలు పెంపొందాయి. ఇప్పుడు బాబానే నా సర్వస్వము.


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo