సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

వర్షం ఆపించి కళ్యాణం జరిపించిన బాబా


నా పేరు ఇందిరవాణి, మావారి పేరు బాలాజీ. మేము నెల్లూరు వస్తావ్యులం. మా నెల్లూరు సాయి సత్సంగ సభ్యులకు సుమారు రెండు సంవత్సరాల క్రితం కలిగిన అద్భుత అనుభవాన్ని సాయి బంధువులందరితో పంచుకుంటున్నాను. సాయి తనను నమ్ముకున్న వారికోసం చేసిన అద్భుత లీలను చదివి ఆనందించండి.
శ్రీ సచ్చిదానంద సద్గురువు సాయి నాధ్ మహరాజ్ కి జై
నెల్లూరులో  "పద్మావతి నగర్ - అద్దాల మందిరం సాయిబాబా" అంటే తెలియని వారంటూ వుండరేమోl ఆ గుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత మధుసూదన్ గారు,  వారి సతీమణి లక్ష్మీ,  వారి కొడుకు సాయి బస్వంత్ కు దక్కుతుంది. కుటుంబం అంతా సాయి సేవ చేస్తూ వుంటారు. ప్రతి ఆదివారం ఒక్కొక్కరి ఇంట్లో సత్సంగం నిర్వహిస్తూ వుంటారు. మేము అందులో సభ్యులం. మేమన్నా వారికి కూడా చాలా అభిమానం. విషయం ఏమిటంటే వారికి ఒక్కడే కొడుకు. సాయి వరప్రసాదం వాడు. మా సత్సంగ సభ్యులందరికీ వాడు ముద్దు బిడ్డ. ఎప్పుడూ సందడిగా అందరినీ ఆకట్టుకుంటాడు. సాయినాధ్ మహరాజ్ చూపించిన అద్భుతం కనండి. 

ఆ సాయి బస్వంత్ వివాహం 26-8-2016, శుక్రవారం నాడు రాత్రి 7.36 నుండి 9.35 లోపల సుమూహుర్తం నిర్ణయించారు. ఒక్కడే కొడుకు చాలా బ్రహ్మాండంగా చేయాలని సంకల్పం. చాలా మందిని పిలిచారు కూడా. మధుసూదన్ గారు తలచుకొంటే, ఎక్కడైనా, ఏ కళ్యాణమండపం లోనయినా చేయగలిగిన సమర్దత గలవారు. కానీ బాబా సమక్షంలో మందిరానికి ప్రక్కన ఉన్న ప్రాంగణంలో వివాహం చేయాలని వారి ఉద్దేశ్యం. ఆ ప్రాంగణం చాలా పెద్ద ఓపెన్ ప్లేస్. ఎక్కువ మంది వస్తారని అంచనా. పెళ్లి సమయం దగ్గరకు వచ్చింది. అంతా తారుమారు అయ్యింది. ఒకటే ముసురు  ఆగకుండా వర్షం. శుక్రవారం ఉదయం నుంచి ఒకటే వాన. ఆసమయంలో ఒక తండ్రిగా ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. నేలంతా చిత్తడి. ఏం చేయాలి? అందరం సాయిబంధువులం కాబట్టి ఆయన బిడ్డను తమ బిడ్డ అనుకున్నారు. సత్సంగ సభ్యులందరూ అవాంతరం తొలగిపోయేలా చేయమని ఉదయం 11గంటల నుండి సాయంత్రం 4గంటల వరకూ ఆపకుండా సాయి నామం చెప్పడం మొదలుపెట్టారు. కొంతమంది కళ్యాణ మండపం బుక్ చేద్దామన్నారు. అప్పుడు మధుసూదన్ గారు వారిని ఆపి, గుడిలో బాబా ఎదురుగా నిలబడి "నాకు ఒక్కగానొక్క బిడ్డ మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం యిదే. నీ ఆశీస్సులతో ఎన్నో ఉత్సవాలు ఘనంగా ఇక్కడ జరిగాయి. మరి ఇది నా బిడ్డ పెళ్ళి. ఏంచేస్తావో నీఇష్టం. వర్షం పడిందా? నీ ఎదురుగానే  గుడిలో పెళ్ళి  చేస్తా. అంతే కానీ మండపాల్లో చేసే ప్రసక్తి లేదు"  అన్నారు. 

అక్కడే ఒకామె సచ్చరిత్ర పారాయణ చేస్తూ వుంటే ఆమె చేతిలో నుండి సచ్చరిత్ర తీసుకుని ఒక పేజీ తీసారు. సచ్చరిత్రలో 71వపేజీ "ఆకాశము మబ్బుపట్టి వుంది. కొద్దిసేపటిలో మబ్బులన్నియు చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదనో చూడుము వారి కష్టములన్నియు నావే" అని వచ్చింది. ఆయన కళ్ళల్లో నీరు. విశేషమేమిటంటే, అక్కడ పారాయణ చేస్తూ వున్న ఆమె చదువుతున్న పేజీ, వాక్యాలు కూడా అవే. ఎంత ఆశ్చర్యమో  చూడండి. అక్కడ ఎవరికీ  నోట మాట రాలేదు. ఆయన "ఇంక నేను ఏదీ ఆలోచించేది లేదని" చెప్పారు. అంతే, వర్షం తగ్గుముఖం పట్టింది. 5గంటల నుండి పూర్తిగా వర్షం ఆగిపోయింది. అందరికీ ఆనందం. చాలా మంది వచ్చారు. చాలా బ్రహ్మాండంగా వివాహం జరిగింది. మాంగల్యధారణ సమయంలో మధు సాయి ఆనందంతో సాయి నామం మైకులో చెబుతూ వుంటే అందరికీ  సంతోషంగా అనిపించింది. పెళ్లి భోజనాలు అయ్యి అందరూ ఎవరి గూటికి వారు చేరిన తరువాత, అర్థరాత్రి 2గం. తరువాత మరోసారి వర్షం ఆగకుండా తెల్లవారిందాక పడింది. ఇదంతా చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించటం లేదూ? ఇదంతా చూస్తుంటే సాయిలీల అని అర్దం అయిపోతుంది. నూతన దంపతులకు బాబా ఆశీస్సులు లభించాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నమ్మికొలిచే వారికి కొంగు బంగారమతడు. ఆ తండ్రి మనపై చూపించే ప్రేమకు యింతకంటే నిదర్శనం  ఏం కావాలి చెప్పండి. అందరికీ సాయిరామ్. ఇందిరా బాలాజీ రావ్.. నెల్లూరు.


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo