సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఒక భక్తుని అందమైన అనుభవం ద్వారా భక్తులందరికీ బాబా నేర్పిన పాఠం


శ్రావణికుమార్‌రావు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 1969వ సంవత్సరంలో చాలా చెడ్డదశ నడుస్తూ ఉంది. భార్యతో గొడవలు, కుమారుడు తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇంకా అతని తల్లి దృష్టిని కోల్పోయింది. అతను బాబా నామం నిరంతరం జపిస్తూ ఈ పరిస్థితి నుండి రక్షించమని బాబాను ప్రార్థించాడు. ఇలా ఒక సంవత్సరం గడిచింది. అతని పరిస్థితి ఇంకా దారుణంగా తయారయింది. ఒకరోజు అతడు తీవ్రమైన మానసిక ఒత్తిడితో, తనకి సహాయం అందించనందుకు బాబాను నిందించాడు. అదే రాత్రి బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి, అతనితో ఇలా చెప్పారు:

బాబా: నీవు కృతజ్ఞత లేని మనిషివి. అందువలన నేను నీకు సహాయం చేయను.

శ్రావణికుమార్: బాబా! నేను చేయని తప్పుకి నన్నెందుకు చీవాట్లు పెడుతున్నావు? నేను ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞుడిగా ఉన్నాను, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు తెలిపాను. అంతేకాదు, నేను చాలా దానధర్మాలు చేశాను. ఇంకా నేను అన్ని సమయాల్లోనూ మీ నామాన్ని జపిస్తూ ఉన్నాను. అయినా మీరు నన్నెందుకు కృతజ్ఞత లేనివాడినని నిందిస్తూ ఉన్నారు?

బాబా: అవును బిడ్డా, నీవు ఎల్లప్పుడూ నాకు కృతజ్ఞతలు చెప్పావు. కానీ 7 ఏళ్ళ క్రితం నీకు ఏమి జరిగిందో గుర్తుచేసుకో!

[7 సంవత్సరాల క్రితం శ్రావణికుమార్ వ్యాపారంలో భారీ నష్టాన్ని ఎదుర్కొన్నాడు. అతను  భారీ ఋణాన్ని చెల్లించవలసి వచ్చింది. ఋణదాతలు అతని రెండు దుకాణాలను మూసివేశారు. సమస్యలతో అతను ఇబ్బందులు ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు]

శ్రావణికుమార్: బాబా! 7 ఏళ్ల క్రిందట ఏమి జరిగిందో గుర్తుచేసుకున్నాను. అది నా జీవితంలో అత్యంత ఘోరమైన దశ. నా సమస్యల నుండి నన్ను బయటకు తెచ్చిన మీయందు నేను నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నాను.

బాబా: నీవు నాపట్ల మాత్రమే కృతజ్ఞతతో ఉన్నావా? మరి కృష్ణదస్సా సంగతేమిటి? ఈరోజు అతనెక్కడ ఉన్నాడో నీకు తెలుసా? అతను బ్రతికే ఉన్నాడా, లేదా అని నీవు ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నావా?

[7 ఏళ్ళ క్రితం కృష్ణదస్సా శ్రావణికుమార్‌కి బెస్ట్ ఫ్రెండ్. అతనెప్పుడూ నీడవలె శ్రావణికుమార్‌ని అంటిపెట్టుకొని ఉండేవాడు. కృష్ణదస్సా తన ఋణాలు చెల్లించడానికి శ్రావణికుమార్‌కి డబ్బును ఇచ్చాడు. అంతేకాకుండా, కృష్ణ తన స్నేహితుడి కోసం 40 రోజులు చెప్పులు లేకుండా బాబా మందిరానికి వెళ్లాడు. శ్రావణికుమార్ ఏనాడూ ఒంటరితనాన్ని అనుభూతి చెందకుండా కృష్ణ ఎప్పుడూ తనకు తోడుగా ఉండేవాడు. కృష్ణ తన సమయాన్ని, శక్తిని, డబ్బుని మరియు ప్రేమను ఇచ్చాడు. తాను చేయగలిగినదంతా చేశాడు]

శ్రావణికుమార్: బాబా, నిజంగా నా ప్రవర్తన పట్ల నేను సిగ్గుపడుతున్నాను.

బాబా: ఇప్పుడు నీకు అర్ధం అయిందా, నేను నిన్ను ఎందుకు కృతజ్ఞత లేనివాడని అన్నానో? ఎందుకంటే, నీవు నా ప్రతినిధి(కృష్ణదస్సా)కి కృతజ్ఞత చూపించలేదు. నేను ప్రతి భక్తుని విషయంలో నా ప్రతినిధులను పంపుతాను. ఎలా అయితే నేను దేవుని ఏజెంటునో, అదేవిధంగా కృష్ణదస్సా నీ జీవితంలో నా ప్రతినిధి(ఏజెంట్)గా ఉన్నాడు. నేను అతనిని నీ సహాయం కోసం, నీ మంచి జీవితం కోసం పంపాను. కానీ, నీవు అందుకు ప్రతిగా తిరిగి ఏం చేశావ్? నీవు నా ప్రతినిధి చేతిని వదిలేశావు. ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నానని ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటావు? నేను నా ఆశీస్సులను, నా సహాయాన్ని కృష్ణదస్సా రూపంలో పంపించాను. కానీ నీవు నా ఆశీస్సులను సరిగా నిలుపుకోలేదు.

శ్రావణికుమార్: బాబా! నేను ఎప్పుడూ అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటాను.

బాబా: కానీ అతనికి నీవు ఏం చేశావు? కేవలం మాటలతో కృతజ్ఞతగా ఉండటం సరిపోదు. నీ పరిస్థితులు మారుతున్న కొద్దీ, నీవు కృష్ణదస్సా నుండి దూరమయ్యావు. తరువాత నీకు పెళ్లి అయింది, పిల్లలు పుట్టారు. క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించి నీవు నీ జీవితంలో నిమగ్నమయ్యావు. 'కృష్ణదస్సా ఎలా ఉన్నాడ'ని మాత్రం శ్రద్ధ చూపలేదు. నీవు అనుభవిస్తున్న ఆనందమంతా కృష్ణదస్సా వల్లనే అని గుర్తించడంలో నీవు విఫలమయ్యావు. ప్రతి ఒక్కరి జీవితాన్ని నడిపించేది నేనే అయినప్పటికీ, ఈ భౌతిక ప్రపంచంలో లీలలను చేయటానికి మాధ్యమం అవసరం.

బాబా: కృష్ణదస్సా నీకు డబ్బులు ఇవ్వలేదా? నీ అప్పులు తీర్చలేదా? కృష్ణదస్సా నీచేత కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టించనట్లయితే, నీకు వ్యాపారం ఉండేది కాదు, పెళ్లి అయివుండేది కాదు.

[శ్రావణికుమార్ తాను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు.]

బాబా: ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? నీ సమస్యల గురించి నాతో ఎందుకు పోట్లాడుతున్నావు? నీకు నువ్వుగా అర్థం చేసుకుంటావని నేను ఏడేళ్ళు సమయమిచ్చాను, కానీ నువ్వు విఫలమయ్యావు. నీవు కృష్ణదస్సాను బాధపెట్టావు, నా ఏజెంటును అగౌరవపరిచావు. దానధర్మాలు, ప్రార్థనలు అసంఖ్యాకంగా చేసినంత మాత్రాన అవి నీకు శాంతిని ఇవ్వవు. ఎందుకంటే, నీవు కృష్ణదస్సాకు చాలా బాకీ ఉన్నావు.

నీ చెడుకాలంలో నీవు నాకు చేసిన వాగ్ధానాలు మొత్తం నెరవేర్చావు. కానీ, కృష్ణదస్సాకు నీవు చేసిన వాగ్దానాల సంగతి ఏమిటి? నీవు అతని చివరిశ్వాస వరకు అతనితో ఉంటానని వాగ్దానం చేశావు, కానీ ఇప్పుడు అతనెక్కడ ఉంటున్నాడో కూడా నీకు తెలియదు. అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా తెలియదు. నీవు నీ అవసరాన్ని బట్టి అతనికి వాగ్దానం చేశావేగానీ, అతడిపట్ల ప్రేమతో కాదు. నీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వ్యాపార భాగస్వాములు మొదలైన వారు నీతో లేనప్పుడు అతను నీతో ఉన్నాడు. అందరూ నిన్ను ఎగతాళి చేసినప్పుడు నీకు తోడుగా నిలుచున్న ఏకైక వ్యక్తి అతను. అటువంటి అతని పట్ల ఇలా చేయడం వల్ల నీవు నీ ప్రారబ్ధ కర్మను పాడుచేసుకున్నావు. అందువలన ఇప్పుడు బాధపడుతున్నావు. ఇప్పుడు వెళ్ళి అతనెక్కడ ఉన్నదీ కనుక్కో. త్వరలో నీవు సమస్యల నుండి విముక్తి పొందుతావు.

శ్రావణికుమార్ నిద్రలేచి, కన్నీళ్లతో బాబాను క్షమాపణ అడిగాడు. ఆ ఉదయం నుండి తను కృష్ణదస్సా కోసం వెతకటం ప్రారంభించాడు. కృష్ణదస్సా 3 సంవత్సరాల ముందే ముంబై వదిలిపెట్టాడనీ, కలకత్తా దగ్గర ఉన్న తన గ్రామానికి వెళ్లిపోయాడనీ తెలుసుకోవడానికి 10 రోజులు పట్టింది.

శ్రావణికుమార్ తన స్నేహితుని గ్రామానికి వెళ్లి అతనిని కలుసుకొని, తాను చేసిన తప్పిదానికి మనస్పూర్తిగా అతనికి క్షమాపణలు చెప్పాడు. తరువాత త్వరలోనే బాబా శ్రావణి కుమార్‌ని ఆశీర్వదించి అతని సమస్యలను పరిష్కరించారు.

ఇది శ్రావణికుమార్ మాత్రమే కాక, సాయిబిడ్డలందరూ నేర్చుకోవాల్సిన మంచి పాఠం. మన జీవితాల్లో ఏదో ఒక సమయంలో ఇలాంటివి చేస్తాము. చెడుకాలంలో ప్రేమతో మనకు అండగా నిలబడే బాబా యొక్క ప్రతినిధులను హృదయపూర్వకంగా గౌరవిద్దాం. అందుకు వారు నిజంగా అర్హులు. వారిని వెళ్లనివ్వకుండా గట్టిగా పట్టుకోండి. మన బాబా మన శ్రేయస్సు కోసం మన జీవితాల్లోకి పంపిన ప్రతినిధుల చేతులను విడిచిపెట్టవద్దు, అది బాబాకి నిజంగా ఆనందానిస్తుంది.


ఓం శ్రీ సాయినాథాయ నమః.


2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo