నా పేరు సునీత, మావారి పేరు మధుసూదనరావు. మేము ఉండేది విజయవాడ. మాకు 'శ్రీ ద్వారకామాయి ఇండ్రస్ట్రీస్' అనే పేరుతో వ్యాపారం ఉంది. బాబా లీలలు ఎన్నో అనుభవించి ఆనందంతో బాబాకు సర్వస్య శరణాగతి పొందిన అశేష భక్తజన సందోహంలో మేము ఒకరము. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మాకు ఆ సాయినాథుడే. మాకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చిన బాబా లీలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
మేము ప్రతి నెలా బాబా అనుమతితో 'గురుచరిత్ర' పారాయణ చేస్తాము. ఒకసారి భార్యాభర్తలిద్దరం ఎంతో నిష్ఠతో గురులీలామృత సప్తాహపారాయణ అనంతరం పూజ ముగించుకుని, "బాబా! ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరించండి" అని బాబాను కోరుకున్నాము. ఆరు ఇళ్ళు ఉన్న గృహసముదాయంలో మాది మధ్యలో ఇల్లు. ఆరోజు ఉదయం "అల్లా అచ్ఛా కరేగా, సబ్ కా మాలిక్ ఏక్" అంటూ బాబా పాటలు పాడుతూ ఒక ఫకీరు అచ్చం మన బాబా వేషధారణలో వచ్చి మా గుమ్మం ముందు మాత్రమే ఆగారు. ఆయన ఏ ఇంటికీ వెళ్ళకుండా తిన్నగా మా ఇంటికే వచ్చారు. నేను ప్రసాదం ఒక గిన్నెలో తీసుకువచ్చి ఆయనకు సమర్పించి నమస్కరించాను. నావైపు ఆయన దృష్టి పడినప్పుడు ఆయన కన్నులలో సూర్యచంద్రుల వంటి తేజస్సు చూశాను. వారి దివ్యదృష్టి నాపై ప్రసరించిన వెంటనే ఒళ్ళంతా రోమాంచితమవగా కన్నుల వెంట నీరు కారిపోయింది. తరువాత మేము, "ప్రతి నెలా బాబా పేరుతో పేదలకు అన్నం పొట్లాలు పంచిపెడతాము. ఈరోజు మధ్యాహ్నం పారాయణ ముగించుకొని అన్నసంతర్పణ చేస్తున్నాము. మీరు తప్పక రావాల"ని ఆయనను అడిగాము. "నా బిడ్డ అన్నం పెడతానంటే ఎందుకు రాను?" అని ఆయన వెళ్లిపోయారు. అలా ఆయన అన్న మాటలు ఇప్పటికీ మా చెవులలో మారుమ్రోగుతుంటాయి. మా ఇల్లు దాటి మూడు రోడ్లు దాటితే గానీ మెయిన్ రోడ్డు రాదు. చాలా నెమ్మదిగా నడుస్తున్న ఆయన మా 6 పోర్షన్లు దాటగానే, మళ్ళీ ఒక్కసారి ఆయనను చూడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆయన కనుచూపుమేరలో ఎక్కడా లేరు. మావారు బండి వేసుకొని నాలుగు దిక్కులు వెతికారు. కానీ ఆ తండ్రి మళ్ళీ కనిపించలేదు. అప్పుడు అర్ధమయ్యింది, 'ఆయన సాక్షాత్తూ మన తండ్రి బాబానే' అని. ఎంత త్వరగా నడచినా ఎవరూ సందు దాటి వెళ్ళలేరు. అలాంటిది ఆయన ఏమైనారు? బాబా లీలలు అమృతగుళికలు.
ఈ లీలను ఈరోజే అప్లోడ్ చేయడం వెనక ఉన్న బాబా లీల:
గత పది పదిహేను రోజుల క్రితమే సాయిసోదరి సునీతగారి అనుభవం అప్లోడ్ చేయాలని సిద్ధం చేశాను. కానీ ఎందుకో ఏరోజుకారోజు వేరే లీలలను అప్లోడ్ చేశాను. నిన్న మధ్యాహ్నం మాత్రం, "రేపు సునీతగారి అనుభవాన్నే అప్లోడ్ చేయాల"ని స్ట్రాంగ్‌గా అనిపించింది. అలా ఎందుకు అనిపించింది అన్నది ఆ సమయంలో నాకు తెలియదు. కానీ దాని వెనుక బాబా సంకల్పం ఉందని తర్వాతే తెలిసింది. చాలా రోజుల తరువాత "రేపు మీ అనుభవం అప్లోడ్ చేస్తున్నాన"ని చెప్పాలని రాత్రి నేను సునీతగారికి ఫోన్ చేశాను. ఆమెకు ఈ విషయం చెప్పగానే ఆమె చాలా సంతోషించారు. ఎందుకంటే ఈరోజు ఆమె పుట్టినరోజట. 'నా పుట్టినరోజునాడు నా అనుభవాన్ని బ్లాగులో అప్లోడ్ చేసేలా బాబా చేశార'ని ఆమె చాలా చాలా ఆనందించారు. అప్పుడు నాకు అర్థమైంది, గత 15 రోజులుగా అప్లోడ్ చేయాలనుకున్నా చేయలేకపోవడం, ఈరోజే అప్లోడ్ చేయాలని స్ట్రాంగ్‌గా అనిపించడం - ఇదంతా బాబా లీల అని.
"నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు" అన్నారు కదా బాబా. ఈ లీల ద్వారా మన ఆలోచనలు కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయని తెలియజేశారు. మన హృదయవాసుడై సదా మనకు సూచనలు ఇస్తూ సరైన మార్గంలో నడపడానికే ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. మనమే ఆయన ఆజ్ఞలు అర్థం చేసుకోలేక దారి తప్పి కష్టాల బారిన పడుతూ ఉంటాం. మనం ఎంతగా బాబా స్మరణలో, ఆయన ధ్యాసలో ఉంటూ ఉంటామో అంతగా ఆయన అనుగ్రహాన్ని, సూచనలని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. అందువలన సాయిబంధువులందరూ సాధనతో ఆవిధంగా ఉండటానికి ప్రయత్నించి బాబా అనుగ్రహాన్ని పొందాలని మనసారా కోరుకుంటున్నాను.