సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

'దేవుడే లేడు' అనే అతను బాబా దాసుడైన లీల


ఇప్పుడు మీరు చదవబోయే లీల ఒక వింతైన లీల. 'భగవంతుడే లేడు' అనే నాస్తికుడిని, 'భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు' అనే ఆస్తికుడిగా మార్చారు మన సాయిబాబా. అది ఎలానో తెలుసుకుందాం.

జీవితమనే పరమపద సోపానంలో మనం పైకి, క్రిందికి అవుతూ ఉంటాము. అది అందరికీ తెలుసు. కానీ ఆయనకు అవన్నీ తెలీదు. మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, పెద్ద బంగ్లాలాంటి ఇల్లు, ఇంటినిండా పనివాళ్ళతో ఆయన జీవితం సుఖంగా గడిచేది. ఆయన పేరు మాణిక్యం. చెన్నై హైకోర్టులో రిజిస్ట్రార్‌గా పనిచేసేవారు. బాబా ఆయన జీవితాన్ని మార్చేశారు. అది ఎలా జరిగిందంటే...

ఒక గురువారంరోజు మాణిక్యం తన కారులో ఆఫీసుకు వెళ్తూ వుంటే, ఒక మశీదు దగ్గర ఒక శ్రీవైష్ణవ బ్రాహ్మణుడు ఆయన వెళ్తున్న కారును ఆపి, "మనం గత ఎన్నో జన్మలుగా కలిసి ఉన్నాము, మర్చిపోయావా?" అన్నారు. మాణిక్యానికి కోపం వచ్చి కారు స్టార్ట్ చేసుకొని వెళ్లిపోయారు. ఇంకో గురువారంనాడు ఒక వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర ఒక ముస్లిం వేషంలో వచ్చి, మళ్ళీ అదే మాట, "మనం గత ఎన్నో జన్మలుగా కలిసివున్నాం, ఎలా మర్చిపోయావు?" అన్నారు. మాణిక్యం మళ్ళీ కోపంతో వెళ్లిపోయారు. ఇంకో గురువారం చర్చి దగ్గర క్రైస్తవునిగా కనపడి మళ్ళీ అదే మాట అన్నారు. ఈసారి కూడా మాణిక్యం కోపంతో ఇంటికి వెళ్లిపోయారు.


ఆ తరువాత ఒక శనివారంనాడు తన స్నేహితుడు ఇంటికి వస్తే, జరిగిన విషయాలన్నీ అతనితో చెప్పారు మాణిక్యం. అందుకా స్నేహితుడు, "ఏమోలే పద. ఈరోజు శనివారం. వెంకటేశ్వరస్వామి గుడికి వెళదాం, రా" అని అన్నారు. మాణిక్యానికి గుడికి వెళ్ళడం ఇష్టం లేకపోయినప్పటికీ స్నేహితుని బలవంతంపై గుడికి బయలుదేరారు. ఐతే ముందే చెప్పారు స్నేహితునితో, "నేను గుడి లోపల దైవదర్శనం కోసం లైనులో నిలబడను. నువ్వు వెళ్లి దర్శనం చేసుకొని రా" అని. స్నేహితుడు అందుకు అంగీకరించారు. ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు. మాణిక్యం గుడి బయట నిలబడి వున్నారు. ఆయన స్నేహితుడు గుడి లోపలికి వెళ్ళాడు. తాను ఒకటి తలచిన దైవం ఇంకొకటి తలచును" అని ఒక సామెత ఉంది. అలా బయట నిలుచుని ఉన్న మాణిక్యం దగ్గరికి ఎవరో ఒక పెద్దావిడ మంచి పట్టుచీర కట్టుకుని, నిండుగా నగలు, పెద్ద జడ, పువ్వులతో స్వయం పద్మావతి అమ్మవారిలా వచ్చి, మాణిక్యం చెయ్యి పట్టుకొని, ఎంత చెప్పినా రావా?" అంటూ గబగబా ఆయనను తీసుకెళ్లి, రెప్పపాటులో లోపల వెంకటేశ్వరస్వామి ముందర నిలబెట్టింది. ఎంత అదృష్టం ఆయనది!

మాణిక్యం తలెత్తి చూసేసరికి ఎదురుగా నిలువెత్తు వెంకటేశ్వస్వామి ఉన్నారు. అంతలోనే మన శిరిడీ సాయినాథుడు చిరునవ్వులు చిందిస్తూ, చెప్పానుగా, మనం ఎన్నో జన్మలుగా కలిసి ఉన్నాం. నువ్వు సంసారంలో పడి నన్ను మర్చిపోయావు. కానీ నేను నిన్ను ఎలా మర్చిపోగలను?" అని అనేసరికి మాణిక్యానికి ఏమి చేయాలో పాలుపోలేదు. ఆ స్వామిని అలా చూస్తూ ఉండిపోయారు. కొంతసేపటికి స్వామి ముందర నిలుచునివున్న మాణిక్యాన్ని చూసిన ఆయన స్నేహితుడు ఆశ్చర్యపోయి, ఆయన చెయ్యి పట్టి బయటికి లాక్కుని వెళ్ళాడు.

ఆరోజునుంచి మాణిక్యం జీవితమే మారిపోయింది. తన మొత్తం ఆస్తిని బీదవాళ్లకు ఇచ్చేశారు. సదా సర్వదా సాయి నామము, సాయి స్మరణతో గడిపారు. ఎప్పుడూ బాబా ధ్యాసే. వేరే ధ్యాసే లేకుండా పోయింది.

ఒకరోజు మాణిక్యం, నేను గతజన్మలో ఎవరిని?” అని బాబాను అడిగారు. అప్పుడు బాబా, నీవు, నేను శిరిడీలో ఉండగా నువ్వు నానావలీవి, తరువాత మధురై మీనాక్షి గుడిలో అమ్మవారి పూజారివి. అప్పుడు కూడా నీకు సంసారం లేదు. ఈ జన్మలో సంసారం కావాలని అడిగావు, ఇచ్చాను అని చెప్పి, ఇకపై నీవు నా సేవలోనే ఉంటూ తరిస్తావు అని అన్నారు. అందుకే మాణిక్యాన్ని వెతుకుతూ బాబానే కుల, మత, వర్ణ వ్యవస్థలకు అతీతంగా ఆయనకు దర్శనం ఇచ్చారు.

మాణిక్యం ప్రతిరోజూ రాత్రి 12 గంటల నుంచి తెల్లవారి గంటల వరకు ధ్యానంలోనే ఉండేవారు. ఆరోగ్యం బాగలేనివారి కోసం, కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన బాబాను ధ్యానిస్తూనే ఉండేవారు.

నాకు ఆయన చాలా బాగా పరిచయం. ఆయన ద్వారానే పై వివరాలన్నీ నేను విన్నాను. ఆయన 2014, జనవరి నెల మకరసంక్రాంతిరోజున బాబాలో ఐక్యమయ్యారు, బాబా చెంతనే ఉంటారు.


సేకరణ:
శ్రీమతి మాధవి,
భువనేశ్వర్.


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo