సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1309వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాపై నమ్మకం
2. శ్రీసాయినాథుని అపార అనుగ్రహం

బాబాపై నమ్మకం


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నేను బాబా భక్తురాలిని. ముందుగా, ఈ బ్లాగును ఏర్పాటు చేసినవారికి ధన్యవాదాలు. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు ఆ సాయినాథుని దయతో మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. నేను కొన్ని రోజుల క్రితం పంచుకున్న నా గత అనుభవంలో నా తమ్ముడికి బాబు పుట్టాడనీ, తన శరీరంలో కొన్ని లెవెల్స్ అబ్‌నార్మల్‍గా ఉన్నాయనీ, 'వాటిని నార్మల్ చేస్తే, తమ్ముడిని తీసుకుని శిరిడీ వస్తాన'ని బాబాని ప్రార్థిస్తే, బాబా వాటిని నార్మల్ చేశారనీ మీతో పంచుకున్నాను. తరువాత బాబాకి మాటనిచ్చిన ప్రకారం నేను, నా తమ్ముడు వీలైనంత త్వరగా శిరిడీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాం. అయితే బాబా దయ లేనిదే శిరిడీ వెళ్లలేము కదా! అందువల్ల నేను, "బాబా! ఏ ఆటంకం లేకుండా శిరిడీ వచ్చి వెళ్లేలా చూడండి. అంతా మంచిగా జరిగితే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత శిరిడీలో ఉండటానికి రూమ్ బుక్ చేయాలని చూస్తే, అది వారాంతం రద్దీ వలన రూమ్స్ అందుబాటులో లేవు. అదివరకు మేము వెళ్లిన హోటల్లో కూడా రూమ్స్ బుక్ అయిపోయాయి. ఇప్పుడేం చేయాలి అనుకుంటుండగా మరో హోటల్ మా కంటపడింది. అందులో రూమ్ బుక్ చేసుకున్నాము. ఆ తర్వాత మళ్లీ చూస్తే, ఆ హోటల్ కూడా ఫుల్ అయిపోయింది. నిజంగా ఇది బాబా అనుగ్రహమే. తరువాత మేము బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ బస్సు నడుపుతున్న వేగానికి  భయమేసి బాబాని, "ఏ ఇబ్బందీ లేకుండా క్షేమంగా తీసుకెళ్లమ"ని కోరుకున్నాను. ఆరోజు రాత్రి తమ్ముడికి బాబా స్వప్నదర్శనమిచ్చారు. అది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ స్వప్నం ద్వారా తమ్ముడికి తమపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచారు బాబా. ఆయన దయవలన మేము క్షేమంగా శిరిడీ చేరుకున్నాము. దర్శనం కూడా బాగా జరిగింది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


2022, జూలై నెలాఖరులో తమ్ముడి కొడుకుకి టెస్టు చేసినప్పుడు అన్నీ నార్మల్ వచ్చాయి. డాక్టర్ ఆ రిపోర్టులు చూసి, "టాబ్లెట్ వేయడం మానేసి, ఈసారి కొంచెం ఎక్కువ వ్యవధి ఇచ్చి మళ్ళీ టెస్టు చేద్దాం" అని అన్నారు. అలాగేనని ఒక 15 రోజుల తర్వాత టెస్టు చేస్తే, బాబు శరీరంలో కొన్ని లెవల్స్ మళ్లీ కొంచెం పెరిగాయి. అది తెలిసి నేను, "బాబా! మీ మీదే నమ్మకముంచాను. నువ్వే బాబుని కాపాడాలి" అని దృఢంగా బాబాను కోరుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులు వేరే డాక్టరుకి చూపిస్తే, "కొంచెం ఆ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ మిగతా అంతా బాగుంది. ఒకవేళ బాబుకి ఏదైనా సమస్య ఉంటే, మిగిలిన వాటిలో కూడా ఏదో ఒక సమస్య కనిపించేది. కేవలం ఆ లెవల్సే కాబట్టి సమస్యేమీ లేదు" అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకి ధన్యవాదాలు చెప్పుకుని, ఆయనకి మాట ఇచ్చినట్లే ఈ అనుభవాన్ని మీతో పంచుకున్నాను.


ఆన్లైన్లో టీవీ ఆర్డర్ చేస్తే, అది ఎలా వస్తుందో అన్న భయంతో నేనెప్పుడూ ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు. కానీ ఈమధ్య నేను మా ఇంట్లోకి ఆన్లైన్లో టీవీ తీసుకుందామనుకుని బాబాని తలచుకుని, "ఎలాంటి డామేజ్ లేకుండా టీవీ వచ్చేలా చూడండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల ఏ సమస్యా లేకుండా టీవీ డెలివరీ అయింది. కానీ ఇన్స్టలేషన్‍లో ఒక చిన్న సమస్య వచ్చింది. అది సరిచేయాల్సిన అతను మళ్ళీ వచ్చి సెట్ చేస్తానన్నాడు. "ఏ సమస్యా లేకుండా అది సెట్ అయ్యేలా చూడండి బాబా. చాలా చాలా ధన్యవాదాలు బాబా".


మా పిన్నివాళ్ళ అబ్బాయి ఎమ్మెస్ చేయడానికి యుఎస్ వెళ్లాలనుకున్నాడు. బాబా దయవల్ల తనకి వీసా కూడా వచ్చింది. ఆ అబ్బాయి చాలా మంచివాడు. కానీ కొంచెం సున్నితస్థుడు. అలాంటి తను ఒక్కడే అంతదూరం వెళుతుంటే ఎలా వెళ్తాడో, అక్కడ ఎలా ఉంటాడో అని నేను బాబాను, "తనకి ప్రయాణంలో ఏ సమస్యా లేకుండా చూసి, క్షేమంగా తనని యూఎస్ చేర్చండి. అలా జరిగితే నేను మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. బాబా దయవల్ల ఏ సమస్యా లేకుండా ఆ అబ్బాయి యుఎస్ వెళ్లి, అక్కడొక  రూమ్ కూడా తీసుకున్నాడు. "చాలా థాంక్స్ బాబా. తను, వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ పార్ట్ టైం జాబ్ కోసం చూస్తున్నారు. ఎలాగైనా వాళ్ళకి మంచి పార్ట్ టైం జాబ్, అదికూడా ఇద్దరిద్దరికి ఒకేచోట దొరికేలా అనుగ్రహించండి బాబా. మళ్ళీ మీ కృపను మీ బ్లాగులో పంచుకుంటాను".


నేను వారంలో మూడురోజులు ఆఫీసుకి వెళ్లాల్సి ఉండగా, ప్రయాణానికి భయపడి 2022, ఆగస్టులో వరుసగా రెండు వారాలు ఆఫీసుకి వెళ్ళకుండా ఇంటి నుండే వర్క్ చేశాను.  నేను ఆఫీసుకి వెళ్లకపోయినా మా మేనేజర్ అడగలేదు. ఆమె అడగలేదని నేను కూడా ఏం చెప్పలేదు. అయితే రెండో వారం మధ్యలో ఆమె, "నువ్వు గతవారం ఆఫీసుకి వచ్చావా?" అని అడిగింది. అప్పుడు నేను, "ఈ వారమూ, గత వారమూ ఆఫీసుకి రాలేదు" అని చెప్పాను. అప్పుడు ఆమె, "కనీసం రావట్లేదని తెలియజేయాలి కదా" అని అంది. ఆ మాటలు ఆమె కొంచెం కోపంగా అన్నట్లు నాకనిపించింది. అయితే ఆ వారం మధ్యలో ఒకరోజు సెలవు తీసుకోవాలనుకుంటున్న నేను, 'అసలే ఈమె కోపంగా ఉంది. ఈ స్థితిలో సెలవు గురించి చెప్తే ఆమె ఏమంటుందో?' అని చాలా టెన్షన్‍గా అనిపించింది. వెంటనే నేను బాబాని తలచుకుని, "సెలవు గురించి నా మేనేజరుకి మెసేజ్ చేస్తున్నాను బాబా. ఆమె ఏమీ అనకుండా ఒప్పుకుంటే, నా అనుభవాన్ని ఆలస్యం చేయకుండా 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాన"ని చెప్పుకుని ఆమెకి మెసేజ్ పెట్టాను. ఆమె పెద్దగా ఏమీ అనకుండానే, 'సరే' అంది. "ఆమె కోపంగా నన్ను ఏమీ అనకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ ఇలాగే తోడు ఉండండి. ఎందుకంటే, మీరు లేని నేను లేను. మీరు లేకుండా నేను ఈ ప్రపంచంలో దేన్నీ ఎదుర్కోలేను".


నేను ఈమధ్య ఒకసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు మా డాడీ జలుబుతో ఇబ్బందిపడుతున్నారు. అమ్మని అడిగితే, "దాదాపు 15 రోజులు నుంచి ఆయనకి గొంతులో తేడాగా ఉంది" అని చెప్పింది. అది విని నాకు చాలా భయమేసింది. కానీ, టాబ్లెట్స్, డాక్టర్స్ అన్నిటికంటే ముందు నాకు బాబా గుర్తొచ్చారు. వెంటనే బాబాని ప్రార్థించి, "నాన్నకి జలుబు తగ్గేలా చేయండి బాబా. మీ కృపతో నాన్నకి తగ్గితే, బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు నాన్నకి బాగానే ఉంది. "నాన్నకి పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వండి బాబా. ఈ విషయం, ఆ విషయం అని లేకుండా ప్రతి విషయంలో తోడుగా ఉంటూ ప్రతి సమస్య నుంచి కాపాడుతున్న మీకు ధన్యవాదాలు చెప్పడం తప్ప ఏం చేయగలను బాబా? మీరు నా జీవితంలో ప్రతిక్షణం, ప్రతి విషయంలో తలచుకోగానే నాకు తోడుగా ఉంటున్నారన్నదానికి సాక్ష్యంగా నా అనుభవాలను పంచుకోవాలంటే నేను ఎప్పటికీ చెప్తూనే ఉండాలేమో! అంతలా మీరు నా జీవితంలో ఉన్నారు. వాటన్నిటికీ నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను బాబా. ఏదైనా విషయంగానీ, అనుభవంగానీ మర్చిపోతే పెద్ద మనసుతో నన్ను క్షమించి, వాటిని గుర్తుచేయండి. ఆఫీసులో నాకు ఇంటినుండి పనిచేసుకునే సదుపాయం ఇచ్చేలా చేయండి, ప్లీజ్ బాబా. ప్రతీ వారం ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉంటోంది. అలాగే, నేను ఒక విషయంలో బాధపడుతున్నాను. ఆ బాధ కూడా మీరు తీర్చాలి. ఎందుకంటే, మీరు తప్ప నాకు ఎవరూ లేరు. మీ మీదే నమ్మకం ఉంచుకున్నాను బాబా".


ఓం శ్రీ సాయినాథాయ నమః!!!


శ్రీసాయినాథుని అపార అనుగ్రహం

సాయి కుటుంబసభ్యులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి అభినందనలు. నేనొక సాయిభక్తుడిని. నేను మొదటిసారి నా అనుభవాలను సాయి కుటుంబసభ్యులతో పంచుకుంటున్నాను. నాకు సాయిదేవునిపై ఎటువంటి అవగాహనా లేని సమయంలోనే ఒక యాత్రలో భాగంగా నేను శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకునే భాగ్యం నాకు దక్కింది. తరువాత నేను ఒక హత్యానేరంలో విశాఖపట్నం జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న సమయంలో ఒక ఖైదీ మిత్రుడు/సోదరుని ద్వారా సాయిబాబా గురించి తెలుసుకునే భాగ్యం నాకు లభించింది. ఆ మిత్రుడు నాకు శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథాన్ని బహూకరించాడు. ఇది 2010వ సంవత్సరంలో జరిగింది. అప్పటినుంచి నేను శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. ఆ గ్రంథ పారాయణ ప్రారంభించాక సత్ప్రవర్తన కలిగి ఉన్నానని జైలునుండి నన్ను విడుదల చేశారు. నేను జైలునుండి ఇంటికి వచ్చేనాటికి నా కూతురికి 29 సంవత్సరాల వయసు వచ్చినా వివాహం కాలేదు. నాకు తెలిసిన ఒక మిత్రుడు, "మా గ్రామంలో సామూహిక సాయిసత్యవ్రతాలు చేస్తున్నాము. మీరు మీ కుమార్తెను తీసుకొచ్చి వ్రతంలో పాల్గొనండి" అని చెబితే, మేము మా కుమార్తెను తీసుకువెళ్లి సాయిసత్యవ్రతం చేసుకున్నాము. ఆ సాయినాథుని దయవలన ఒక ఖైదీ కుమార్తె అని ఆలోచించకుండా మగపెళ్లివారు వెంటనే వివాహానికి అంగీకారం తెలిపారు. 20 రోజులలో నా కూతురు పెళ్లి ఘనంగా జరిగింది. ఇప్పుడు తను సుఖంగా ఉంది. కాకపోతే బాబా ఇంకా తనకి సంతానం ప్రసాదించలేదు. తప్పకుండా బాబా అనుగ్రహంతో వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్మకంతో ఆయనను ప్రార్థిస్తున్నాను. ఇకపోతే, యాక్టివా బండి మీద వెళ్తుంటే నాకు నాలుగుసార్లు యాక్సిడెంట్లు జరిగినా ఒక్క చిన్న దెబ్బ కూడా తగలకుండా సాయి నన్ను రక్షించారు.

నేను ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పథకానికి అర్హుడిని. కానీ గత మూడు సంవత్సరాలుగా నేను ఎన్నిసార్లు అప్లై చేసినా నాకు పెన్షన్ శాంక్షన్ కాలేదు. ఆ సమయంలో అదివరకు జైలులో కలిసిన ఒక మిత్రుని ద్వారా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ గురించి తెలిసింది. ఎందరో భక్తులు, 'తమ కోర్కెలు తీరితే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా తమ అనుభవాలను సాయి కుటుంబసభ్యులతో పంచుకుంటామ'ని సాయిదేవునికి మ్రొక్కుకుంటే, ఆయన వాళ్ల కోరికలను ఖచ్చితంగా తీరుస్తున్నార'ని నేను ఈ బ్లాగ్ ద్వారా తెలుసుకుని, నేను కూడా ఆ సాయిదేవునికి మ్రొక్కుకున్నాను. అంతే! మొన్న(2022) ఆగస్టు ఒకటో తారీఖున వాలంటీర్ మా ఇంటికి వచ్చి నాకు పెన్షన్ ఇచ్చింది. "సాయిదేవునికి సహస్ర వందనాలు".


సాయిభక్తుల అనుభవమాలిక 1308వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - ఐదవ భాగం


బాబా ఉనికి

సాయిబాబుగారు బాబా తమకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.


1918లో విజయదశమి రోజున బాబా మహాసమాధి చెంది భౌతికంగా భక్తులకు దూరమైనా, “పిలిస్తే పలుకుతాన”ని తామిచ్చిన వాగ్దానాన్ని అనుసరించి సమాధి అనంతరం కూడా ఆయన కొందరికి సశరీరులుగా, కొందరికి స్వప్నంలో, మరికొందరికి వాక్కు ద్వారా, ఇంకొందరికి ఇతర రూపాలలో, ఇంక ఇతరత్రా మార్గాలలో తమ ఉనికిని తెలియజేస్తున్నారు. సుమారు 50 సంవత్సరాల మా బాబా ఆరాధనలో నాలుగుసార్లు బాబా నాకు నిజదర్శనం ఇచ్చారు. 2002లో ఒకరోజు సాయంత్రం మా స్వగృహమందు నేను యధావిధిగా బాబాకి పూజ చేసి, నైవేద్యం సమర్పించాను. అనంతరం హారతికి కొంచెం సమయముందని బయట ఖాళీ ప్రదేశంలో కూర్చున్నాను. స్కూలు పిల్లలు ట్యూషనుకు వచ్చారు. నా మేనకోడలు కూడా ట్యూషనుకు వచ్చింది. తన పేరు హనీ. తనకప్పుడు 7 సంవత్సరాలు ఉంటాయి. చిన్నతనం నుండి రోజూ మా ఇంటికి రావడం, బాబా పూజలో పాల్గొనడం వల్ల తనకి చిన్నవయసులోనే బాబాపట్ల భక్తి అబ్బింది. తను రాగానే నేను, “హనీ! బాబాకి పూజ చేసాను. నువ్వు హారతి ఇవ్వు” అని పూజ గదిలోకి పంపాను. తను లోపలికి వెళ్ళి బాబాకి హారతి ఇచ్చి, హారతి కళ్ళకద్దుకుని గడప బయటకు ఒక అడుగువేసి, మళ్ళీ వెంటనే లోపలికి అడుగువేసి, “ఎవరూ, ఎవరూ” అంటూ చూస్తూ నిలబడిపోయింది. నేను వెంటనే పూజ గదిలోకి వెళ్ళి, తూర్పున ఉన్న గది వైపు చూసి నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. కాషాయ వస్త్రాలు ధరించి ఆజానుబాహులుగా ఉన్న బాబా ఎడమ చేతిని నేను స్పష్టంగా చూశాను. ఆయన భుజం నుండి హస్తం వరకూ భారీగా ఉంది. ఆయన నడుచుకుంటూ తూర్పున ఉన్న గదిని దాటి, ప్రధాన ద్వారం గుండా బయటకు అడుగు వేసి, కుడివైపుకు తిరిగి అక్కడ గోడకున్న పెద్ద లామినేషన్ ఫోటో లోనికి(ఆ ఫొటోలో బాబా నిలబడి ఉంటారు) వెళ్లిపోయారు. అంటే బాబా పూజ గదిలో ప్రత్యక్షమై నడుచుకుంటూ తూర్పు గది మీదుగా బయట ఉన్న ఆయన ఫోటోలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఆనాడు శిరిడీలో బాబా శ్యామాకు, బూటీకి ఒకేసారి కలలో కనపడి, సమాధి మందిర నిర్మాణం గురించి చెప్పినట్లు ఈనాడు నాకు, నా మేనకోడలు హనీకి ఒకేసారి నిజ దర్శనమిచ్చారు. నేను, మా హనీ కళ్లారా చూసిన బాబా నిజరూపదర్శనమది.


2003లో మా అమ్మాయి ఇంటర్ రెండవ సంవత్సరం చివరి పరీక్షలు వ్రాయడానికి తెనాలి వెళ్లాల్సి ఉండగా తనతోపాటు, నేను, నా మేనకోడలు హనీ స్కూటర్ మీద తెనాలి వెళ్ళాము. పరీక్ష మొదలవడానికి చాలా సమయం ఉన్నందున మేము బాబా ఆశీస్సుల కోసం సుల్తానాబాదులో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళాం. ఆ రోజు గురువారం కానందున గుడిలో భక్తుల రద్దీ అంతగా లేదు. మేము బాబాకి నమస్కరిస్తూ నిలబడి ఉండగా 80 ఏళ్ల ఒక ముసలావిడ బాబా ముందుకు వచ్చి, బాబానే చూస్తూ, తన్మయత్వంతో మధురంగా బాబా పాటలు పాడసాగింది. ఆవిడ అలా దాదాపు అరగంటసేపు పాడుతూనే ఉంది. మేము ముగ్గురమూ ఆ పాటలు వింటూ బాబానే చూస్తూ చుట్టూ పరిసరాలను మరచిపోయాము. అప్పుడు ఒక వింత జరిగింది. దర్శనమయ్యాక బయటకు వస్తూ నేను మా అమ్మాయితో, "శ్రావ్యా! బాబా ఇప్పుడు ఏం చేశారో తెలుసా?" అని జరిగింది చెప్పబోయాను. అంతలో మా హనీ, “అదేమిటంటే అక్కా! బాబా కళ్ళు మూసి, తెరిచారు” అంది. నేను చెప్పబోయింది కూడా ఆ దృశ్యం గురించే. విషయమేమిటంటే, ఆ ముసలావిడ పాటలకు తన్మయులైన బాబా తమ నయనాలు నెమ్మదిగా మూసి, తెరిచారు. అది మేము చాలా స్పష్టంగా చూసాము. అలా రెండోసారి నాకు, హనీకి ఒకే సమయంలో బాబా నిజ దర్శనమైంది.


శిరిడీ సమాధి మందిరంలో మూడోసారి బాబా ఇచ్చిన దర్శనం: 2004లో మా కుటుంబం బాబా దర్శనానికి శిరిడీ వెళ్ళాము. అప్పుడు ఒకరోజు మధ్యాహ్న హారతికి సమాధి మందిరం హాల్లో ఉన్నాము. నేను వెనుక ఉన్న డయాస్ మెట్లపై కూర్చొని హారతి చూస్తున్నాను. హారతి ముగిసే సమయానికి నా ముందున్న వారిని గమనించాను. ప్రక్కప్రక్కనే కూర్చున్న 17-18 సంవత్సరాల వయసున్న ఇద్దరు యువకులు మెల్లగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లలో ఒకరి ముఖం నాకు కనిపించింది. వాళ్ళు తెలుగువాళ్లే. వాళ్ళ పక్కన 40 సంవత్సరాల ఒక మరాఠీ స్త్రీ కూర్చొని ఉంది. ఆమె చేతిలో పూలు, బాబా తలకు కట్టే 'సాయిరాం' అని రాసి ఉన్న గుడ్డ ఉంది. వాటిని ఆమె బాబాకు సమర్పించాలని తీసుకుందనుకుంటాను. నాకు ఒక ఆలోచన వచ్చి మనస్సులో, “బాబా! ఈ హాల్లో సుమారు 1000 మంది భక్తులు ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఏదైనా లీలను ప్రదర్శిస్తే, వీళ్ళు ఆ లీలను బయట చాలా మందికి తెలియచేస్తారు. మీ కీర్తి (నీ తత్వం) పెరుగుతుంది” అని అనుకున్నాను. అంతే, ఒక్క నిమిషంలో నా ముందున్న యువకుడు చిన్నగా వణుకుతూ హిందీలో ఏదో మాట్లాడుతూ, తల కూడా బాబాలాగా కదిలించడం చేస్తున్నాడు. అతని ప్రక్కనున్న మరో యువకుడు అతనికి ఏమైందోనని కంగారుపడిపోయాడు. పక్కనున్న మరాఠీ స్త్రీ తన చేతిలోని గుడ్డను ఆ వణుకుతున్న యువకుని తలచుట్టూ చుట్టేసింది. హాల్లో కలకలం బయలుదేరింది. బాబా సమాధి వద్ద ఉన్న పూజారి పరుగున ఆ కుర్రవాడి వద్దకు వచ్చి మరాఠీలో, “ఏమిటి బాబా ఇలా వచ్చారు? ఏమైంది? మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా?” అని అడుగుతూ ఆ కుర్రవాడి చెయ్యి పట్టుకుని బాబా విగ్రహం వద్దకు తీసుకెళ్తున్నాడు. అదంతా గమనిస్తున్న నేను వాళ్ళ వెనుకే గబగబా వెళ్ళాను. బాబా విగ్రహం దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ యువకుడి ముఖం నేను చూశాను. ఆ యువకుడి ముఖంలో అరవై సంవత్సరాల వయస్సున్న ముసలివానిలా శ్రీసాయినాథుని దివ్య మంగళ ముఖారవిందం నాకు దర్శనమైంది. తర్వాత రోజు దర్శనానికి హాల్లో వేచి ఉన్న నేను నా ప్రక్కనున్న వాళ్ళతో, 'బాబా నాకు 60 సంవత్సరాల ముసలివాని ముఖంతో దర్శనమిచ్చార'ని ముందురోజు జరిగిన సంఘటన గురించి వివరంగా చెప్పాను. ఐదు నిమిషాల తర్వాత ప్రక్కనున్న ఒకతని చేతిలో ఉన్న 'నేనుండగా భయమేలా?' అని వ్రాసి ఉన్న బాబా పుస్తకం అడిగి తీసుకుని ఒక పేజీ తెరిచాను. అందులో నేను చదివిన మొదటి వాక్యం: "ఏమిటీ, నేను ముసలివాడినా! నాకు లక్షల సంవత్సరాల వయస్సు" అని. అలా బాబా నన్ను ఆ పుస్తకంలోని వాక్యం ద్వారా నేను వారిని ముసలివానిలా ఉన్నారన్నందుకు మందలిస్తున్నారనిపించింది. అంతేకాదు, 'అన్ని రూపాలలో ఉన్నది తామేనని, తమకు వయస్సుతో నిమిత్తం లేద'ని బాబా నాకు తెలియజెప్తున్నారనిపించింది. ఎంత ఆశ్చర్యం! చూశారా బాబా లీల. 'పిలిస్తే బాబా పలుకుతాడు' అనే మాటలో సందేహం లేదు.


ఇంకోసారి నేను, నా భార్య, మా అమ్మాయి సమాధి మందిరంలో ఒక గోడ పక్కనే నిల్చుని బాబాని చూస్తూ ఉన్నాము. హఠాత్తుగా బాబా అక్కడున్న గోడలో నుండి కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సాధువు రూపంలో బయటకు వచ్చి మా ముగ్గురి నుదుటన ఊదీ పెట్టి, తిరిగి గోడలోకి వెళ్ళిపోయారు. మేము ఆశ్చర్యంతో మా పక్కన నిల్చున్నవారిని, "మా నుదుటన ఊదీ ఉందా?" అని అడిగితే, "ఉంది" అని చెప్పారు. "ధన్యవాదాలు సాయీ".


ఒకసారి మేము బట్టలు కొనడానికని ఒక షాపుకు వెళ్ళి కొన్ని బట్టలు ఎంచుకున్న తర్వాత, “రేటు చూసి వేయండి" అని అన్నాము. ఆ షాపువాళ్లు కూడా బాబా భక్తులే. షాపులో పెద్ద బాబా ఫోటో పెట్టుకున్నారు. వాళ్ళు, "మాకు వచ్చిన రేటుకు స్వల్ప లాభం వేసుకుని ఇస్తున్నాము" అని చెప్పి మాటల మధ్యలో మేము కూడా సాయిని ఆరాధిస్తామని తెలిసి, మాకొక బహుమానం ఇచ్చారు. శిరిడీ సమాధి మందిరంలో బాబా విగ్రహం ప్రతిష్టించక ముందు ఒక బాబా ఫోటో ఉండేది. అటువంటి ఛాయాచిత్రం చాలా అరుదుగా దొరుకుతుంది. బాబా దయవల్ల ఆ బట్టల షాపువాళ్ళు మాకు అటువంటి ఛాయాచిత్రాన్ని మాకు ఇచ్చారు. బాబానే మాకు ఆ ఫోటోని అనుగ్రహించారు. మేము ఆ ఛాయాచిత్రానికి ఫ్రేము కట్టించి పూజలో పెట్టుకున్నాము. మేము ఒకసారి పూజలో ఉన్న ఆ బాబా ఫోటోను సెల్‌ఫోన్‍తో ఫోటో తీస్తే ఆ ఫోటోకి, మామూలుగా పూజలో ఉన్న ఫోటోకి ఎంతో వ్యత్యాసముంది. సెల్‌ఫోన్‍లో తీసిన ఫొటోలో సశరీరులుగా ఉన్న  బాబా ముఖము, చేయి కనిపించాయి. ఆయన గడ్డం తెల్లగా ఉంది.


ఒక గురుపౌర్ణమినాడు నేను, నా భార్య చేబ్రోలులో ఉన్న బాబా గుడికి వెళ్ళాము. గుడిని చాలా అందంగా అలంకరించారు. ఆ ఆలయ ధర్మకర్త, అతని భార్య బాబాకి విశేష పూజ చేయనుండగా ఆ పూజలో నేను, నా భార్య కూడా పాల్గొన్నాము. బాబా మాకు మాత్రమే ఆ మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. పూజ పూర్తయిన తరవాత పాలరాతి పాదాలను పూలతో నిండుగా అలంకరించారు. ఆ పాదాలపై శిరస్సు ఉంచి నమస్కరించుకున్న తరువాత సెల్‌ఫోన్‌లో ఫోటో తీస్తే నిండుగా పూలతో కప్పబడ్డ పాలరాతి పాదాలకు బదులుగా నిజమైన బాబా పాదాలు స్పష్టంగా కనిపించాయి. అది గురుపూర్ణిమినాడు బాబా మాకిచ్చిన గొప్ప ఆశీర్వాదము.


ఒకసారి నా భార్య స్నేహితురాలు పిలిస్తే మేము అనంతపురం వెళ్ళాము. అక్కడ బాబా మందిరాలు చాలా ఉన్నాయి. ఒక గురువారం బాబా దర్శనం కోసమని మేము ఒక మందిరానికి వెళ్ళాము. అక్కడ బాబా సజీవమూర్తి ఉన్నారు. చూసేవారికి అది విగ్రహమే. మాకు మాత్రం బాబానే దర్శనమిచ్చారు. ఆయననలా చూస్తుంటే నా కన్నుల నుండి నీళ్ళు వచ్చేశాయి.


బాబా పలుకులు నా చెవిలో మారుమ్రోగిన వైనం: ఒకరోజు నేను స్కూటర్ మీద చేబ్రోలు చాలా వేగంగా వెళ్తున్నాను. కొద్దిసేపట్లో చేబ్రోలు చేరుకుంటాననగా నా చెవిలో ఏవో మాటలు విన్పించాయి. కొంచెం శ్రద్ధ పెట్టి వినగా, “ఎందుకంత వేగంగా వెళ్తున్నావు? ముందు చూడు, ముందుకి చూసి వెళ్ళు” అని పదేపదే వినపడింది. అన్నిసార్లు వినిపించేసరికి నేను వేగం తగ్గించి, ముందుకు చూసాను. కొద్ది దూరంలో ఉన్న పోలీసు స్టేషను ముందు పోలీసులు వాహనాలను ఆపడం కన్పించింది. వాళ్ళు ఖచ్చితంగా నా బండిని కూడా ఆపుతారు. కానీ హడావిడిగా బయలుదేరడంలో నేను స్కూటరుకి సంబంధించిన కాగితాలు ఇంట్లోనే మర్చిపోయాను. అందుకే బాబా నా చెవిలో తమ స్వరాన్ని వినిపించి హెచ్చరించడమే కాకుండా 'నిదానమే ప్రధానమ'ని తెలియజేసారు. నేను వెంటనే బండి వెనుకకు త్రిప్పి ఇంటికి వచ్చేసి, కాగితాలు తీసుకుని తర్వాత వెళ్ళాను.


2019, జూలై మొదటి వారంలో నేను బెంగుళూరులో ఉన్న మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడు ఒక శనివారం సాయంత్రం 6 గంటలప్పుడు మేము దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళాము. ఆ గుడి అచ్చం శిరిడిలో ఉన్న బాబా మందిరంలా ఉంది. నేను మా అమ్మాయితో, “వీడియో కాల్ చేసి, మమ్మీ (నా భార్య)కి ఈ గుడి చూపించు” అని అన్నాను. అందుకు మా అమ్మాయి, "వద్దు” అని అంది. సరిగ్గా అదే సమయంలో నారాకోడూరులో పూజ చేసుకుంటున్న నా భార్యకి “బెంగుళూరుకి ఫోన్ చేయి” అని బాబా చెప్తున్నట్లు వినిపించి ఆమె వెంటనే వీడియోకాల్ చేసింది. అంతే మా అమ్మాయి మందిరం అంతా ఆమెకి ఫోన్‍లో చూపించింది. అది చూసిన నా భార్య శిరిడీ దర్శించినంత సంబరపడిపోయింది. అలా బాబా మనోవాంఛలను తీరుస్తారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. నేను మొదట 1967లో శిరిడీ దర్శించాను. మేము వెళ్ళిన ఆ గుడి నిర్మించినతను కూడా 1967లోనే మొట్టమొదట శిరిడీ దర్శించారట. చూశారా, బాబా సాయి బంధువులను ఎలా కలుపుతారో.


మేము 1995లో గుంటూరు నుండి నారాకోడూరుకి మారాం. మేము అక్కడికి వచ్చిన క్రొత్తలో శిరిడీలో బాబా సమాధికి తాకించి తెచ్చుకున్న ఒక బాబా ఫోటో ఫ్రేము మా ఇంటిలో ఒక గోడకు తగిలించాము. రాత్రిళ్ళు ఆ ఫోటోలో నుండి ఒక వెలుగు వచ్చి, గదంతా తిరిగి మళ్ళీ ఆ ఫోటోలోకి వెళ్ళిపోతుండేది. ఆ వెలుగును మేము అందరం చూశాము.


2015వ సంవత్సరం చివరిలో ఒక గురువారం నాడు మేము చేబ్రోలులోని బాబా మందిరానికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చాము. మరునాడు శుక్రవారం ఉదయం మా ఇంట్లోని బాబా విగ్రహానికి కుడివైపున పాదాల వద్ద ఊదీ ఉండటం చూసి ఆనందంతో మా కన్నులలో నీళ్ళొచ్చాయి. మా భక్తికి మెచ్చి బాబా మాకు చూపిన లీల ఇది. మేము ఆ ఊదీని తీసి పొట్లం కట్టి భద్రపరిచాము.


ఒకప్పుడు టీవీలో శిరిడీ హారతులు వచ్చేవి కాదు. కేవలం టేప్‍రికార్డులో పెట్టుకుని వినేవాళ్ళం. ఇప్పుడు టీవీలో, వెబ్‍సైటులో బాబాను ప్రత్యక్షంగా వీక్షించగలుగుతున్నాము. మనం అంతదూరం ప్రయాణించి శిరిడీ వెళ్ళలేమని ఆయనే స్వయంగా మన ఇళ్ళకు వస్తున్నారు. "ఎంత కరుణామూర్తివయ్యా సాయి!". ఇక విషయానికి వస్తే, మేము ఇదివరకు ప్రతిరోజు ఉదయం 4-30కి కాకడ హారతి దర్శించేవాళ్ళము. ఒకరోజు హారతిలో బాబా మూర్తి యొక్క ముఖంలో స్పష్టత లేదు. అప్పుడు నేను మనసులో “ఎందుకు బాబా? ఈ రోజు దర్శనం సరిగ్గా ఇవ్వలేదు” అని అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం మళ్ళీ కాకడ హారతి చూస్తున్నప్పుడు బాబా ముఖం మాత్రమే టీ.వి. స్క్రీన్ మొత్తం కనిపించి, తర్వాత బాబా చరణాలు, బాబా హస్తం ఒక్కొక్కటిగా చాలా స్పష్టంగా కనిపించాయి. హారతి అయ్యేంతవరకూ అలా కన్పిస్తూనే ఉన్నాయి. మామూలుగా అయితే మొత్తం బాబా మూర్తి, సమాధి కనిపించాలి. కానీ ముందురోజు నేను నా మనసులో అనుకున్న దానికి బాబా ఆ రోజు నాకు అలా దర్శనం ఇచ్చారు.


మేము స్కూలు నడుపుతున్నప్పుడు ఒక సమస్య గురించి వ్రాసి గుడిలో బాబా ముందుంచాము. మామూలుగా ఆ గుడిలో భక్తులు కాగితంలో వ్రాసే విషయాలను శేజారతికి ముందు చదువుతారు. అయితే మా విషయంలో ఏం జరిగిందో చూడండి. మేము, పూజారి చూస్తుండగానే మేము వ్రాసిన కాగితం గుండ్రంగా దొర్లుకుంటూ బాబా పాదం చుట్టూ ఉన్న ఇత్తడి రేకు క్రిందకి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ గాలిగాని, ఫ్యాన్‍గాని లేవు. పూజారి, "బాబా మీరు వ్రాసిన కాగితాన్ని తీసుకుని ఆ రేకు కింద పెట్టుకున్నట్లుంది. మీ విన్నపం బాబా చదివేశారు. మీరు అందులో వ్రాసింది తప్పక అయి తీరుతుంద"ని అన్నారు. అలాగే జరిగింది.


మేము ఒకసారి బజారులో కారు పార్క్ చేసి నడుస్తుంటే, ఒక పంటి డాక్టరు క్లినిక్ బోర్డు కనిపించింది. నిజానికి మేము ఏ వ్యాధికైనా డాక్టరు దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడం. అటువంటిది ఆరోజు మాకు తెలియకుండానే మేము ఆ క్లినిక్ లోపలికి వెళ్ళాము. అక్కడ ఒక కుర్ర డాక్టరు ఉన్నాడు. జనరల్ చెకప్ అయిన తర్వాత మేము ఆ డాక్టరుతో, "ఉదయం హాస్పిటల్‍కు రాగానే బాబాని తలుచుకుని, నీ పని మొదలుపెట్టుకో. అంతా మంచే జరుగుతుంద"ని చెప్పాము. వెంటనే ఆ డాక్టరు, "అలాగే నండి" అని, తనకు తెలిసిన సాయి భక్తుల గురించి మాతో చెప్పి, వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చి కలవమని చెప్పాడు. ఇంటికి వెళ్ళడానికి ఆలస్యమవుతున్నా మేము పట్టించుకోకుండా వెంటనే ఆ డాక్టరు ఇచ్చిన అడ్రస్‍కి వెళ్లి, ఆ ఇంటి లోపలికి వెళ్ళాము. ఆశ్చర్యం! అక్కడ పెద్ద బాబా ఫోటో, దాని ముందు బాబా హస్తంలో నుండి రాలిపడుతున్న పెద్ద విభూది కుప్ప ఉంది. ఆ ఇంటివాళ్ళు ఎంతో ఆప్యాయంగా మాతో మాట్లాడి ఆ కుప్పలోని విబూది పొట్లం కట్టి మాకిచ్చారు. మేము కొంచెం సేపు అక్కడే నిలబడి బాబా కుడి హస్తం నుండి పడుతున్న విబూదిని చూసి నమస్కారం చేసుకుని, ఆ ఇంటి యజమాని వ్రాసిన 'సాయి సన్నిధి' అనే పుస్తకం తీసుకుని ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాము.


2018వ సంవత్సరం, మే నెల మొదట్లో మా అమ్మాయి మాతో, "తెనాలిలోని బాబా భక్తులు 'సాయి నామ కోటి' చేస్తున్నారు. మీరు కూడా మీ వంతు నామం చేయండి” అని చెప్పింది. "అలాగే"నని, నేను, నా భార్య అదేరోజు 'ఓం శ్రీసాయినాథాయ నమః' అనే నామజపం ప్రారంభించి 40 రోజులు పూర్తయిన తర్వాత పూర్ణాహుతికి ముందురోజు మేము తెనాలిలోని ఆ భక్తుల ఇంటికి వెళ్ళాము. వాళ్ళు తమ ఇంటిలో ఒక హాలంతా బాబాకి కేటాయించారు. సాయి నామకోటి చేసిన దానికి ప్రతిఫలంగా బాబా ఆ హాలంతా విబూది కురిపించారు. మా అనుభవాలు వాళ్ళకి, వాళ్ళ అనుభవాలు మాకు చెప్పుకుంటూ బాబా గురించి మాట్లాడుకుంటుంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇలా బాబా తమను అత్యంత భక్తితో పూజించే భక్తులను బంధువులుగా మాకు పరిచయం చేస్తుండేవారు. సిరిపురం, గుంటూరు, తెనాలిలో మాకు చాలామంది సాయి బంధువులు ఉన్నారు. "ధన్యవాదాలు బాబా.


తరువాయి భాగం వచ్చేవారం...

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


సాయిభక్తుల అనుభవమాలిక 1307వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహ వీక్షణలు
2. తలుచుకోగానే ఏదో ఒక రూపంలో తమ సహాయాన్ని అందిస్తారు బాబా
3. బాబా కృపతో దొరికిన అమ్మవారి బంగారు రూపు

బాబా అనుగ్రహ వీక్షణలు


అందరికీ నమస్తే. నా పేరు అంజలి. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా బాబు స్కూలు నుండి రావడం బాగా ఆలస్యమైంది. నాకు చాలా టెన్షన్‍గా అనిపించి, "బాబా! వాడు తొందరగా ఇంటికి వచ్చేలా చూడు తండ్రి. నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అంతే, 10 నిమిషాల్లో బాబు ఇంటికి వచ్చాడు.


ఒకసారి నా బ్యాంకు అకౌంటులో ఉన్న డబ్బుల విషయంగా నాకు, మావారికి మధ్య మనస్పర్థలు వచ్చాయి. నాకు కొంచెం గిల్టీగా అనిపించి, "బాబా! మీ దయవల్ల నాకు, మావారికి మధ్య మనస్పర్థలు తొలగిపోవాలి. నా డబ్బుల గురించి ఆయన ఇంకా అడగకూడదు. అలాగే కొన్ని మంచి పనుల కోసం నేను ఉపయోగించిన డబ్బుల గురించి ఎప్పటికీ ఆయనకి తెలియకూడదు బాబా" అని బాబాని కోరుకున్నాను. బాబా దయవల్ల ఆ విషయాలు మా మధ్య చర్చకు రాకుండా అంతా మామూలుగా ఉంది.


2022, జూలై నెల చివరివారంలో మా ఇంట్లో అందరమూ రెండు సంవత్సరాల క్రిందటి మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లి, వద్దామని అనుకున్నాము. నేను మాతోపాటు మా తమ్ముడు ప్రసాద్ కూడా వస్తే బాగుంటుంది అనిపించి తనని రమ్మని అడిగితే, "మా బాబుకి జ్వరంగా ఉంది. తగ్గితే వస్తాను" అని అన్నాడు. నేను బాబాను తలుచుకుని, "బాబా! మీ దయవల్ల ఆ బాబుకి జ్వరం తగ్గి, తమ్ముడు మాతో గుడికి వస్తే, ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల బాబుకి జ్వరం తగ్గడంతో తమ్ముడు మాతో విజయవాడ రావడానికి బయలుదేరాడు. అందరం ఆనందంగా వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చాము.


ఆ మధ్య మా తమ్మునికి జ్వరం, దగ్గు వస్తే, "బాబా! మీ దయవల్ల గురువారం కల్లా తమ్ముడికి తగ్గి మామూలు మనిషి కావాల"ని బాబాను కోరుకున్నాను. జ్వరం తగ్గిందికానీ ఊపిరితిత్తులలో కొంచెం నిమ్ము ఉందని డాక్టరు చెప్పారు. అప్పుడు నేను, "బాబా! తమ్ముడికి ఆ నిమ్ము కూడా పూర్తిగా తగ్గిపోవాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు తమ్ముడికి కొంచెం పర్లేదు. అయితే తన దగ్గు ఎంతకీ తగ్గటం లేదని టీబీ టెస్టు చేశారు. బాబా దయవల్ల అది నెగిటివ్ వచ్చింది. ఆరోజు నేను బాబాని, "తమ్ముడికి ఏమీ కాకుండా చూసి వాడిని ఆరోగ్యంగా ఉంచు తండ్రి.  తను అందరి గురించి ఆలోచిస్తాడు కానీ, తన గురించి పట్టించుకోడు. వాడిని నువ్వే ఎలాగైనా కాపాడు బాబా" అని బాగా వేడుకున్నాను. ఆయన కృపతో తొందరలో తమ్ముడు పూర్తిగా నార్మల్ అవుతాడని ఆశీస్తున్నాను. ఈమధ్య తమ్ముడు నాతో ఏమి మాట్లాడినా నాకు కొదవగా అనిపిస్తుంటే, "ఇలా వద్దు బాబా. తమ్ముడితో నాకు గొడవలొద్దు. ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళమో అలాగే మమ్మల్ని ఉంచండి బాబా" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు పర్లేదు. "థాంక్యూ బాబా. లవ్ యు సో మచ్ బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


తలుచుకోగానే ఏదో ఒక రూపంలో తమ సహాయాన్ని అందిస్తారు బాబా


సాయి భక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితంలో ప్రతిరోజూ బాబా నామజపంతో మొదలవుతుంది. ఏ కష్టం వచ్చినా సాయిని తలుచుకోగానే ఆయన ఏదో ఒక రూపంలో తమ సహాయాన్ని అందిస్తూ అడుగడుగునా నన్ను కాపాడుతున్నారు. బాబా దయవలన నేను ఇదివరకు కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకసారి మా అమ్మగారికి ఉన్నట్టుండి కడుపునొప్పి బాగా ఎక్కువగా వచ్చింది. అమ్మ నొప్పితో బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. వెంటనే బాబాకి నమస్కరించుకుని, "బాబా! అమ్మకి కడుపునొప్పి తగ్గిపోతే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తరువాత మా ఊరిలోని ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి అమ్మకి ఇంజక్షన్ చేసి, టాబ్లెట్లు ఇచ్చారు. కాసేపటికి అమ్మకు నొప్పి తగ్గిపోయింది. బాబానే ఆ డాక్టర్ రూపంలో తమ సహాయాన్ని అందించి అమ్మను కాపాడారని నా నమ్మకం. "థాంక్యూ సో మచ్ బాబా".


మా తమ్ముడు కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి 12 గంటలకు తన పై అధికారులు తనకి ఫోన్ చేసి తమ్ముడు పనిచేసే ప్రాంతంలో కరెంటు సరఫరా నిలిచిపోయిందని, అర్జెంటుగా రమ్మని చెప్పారు. ఆ సమయంలో తమ్ముడు జలుబు, తలనొప్పితో బాధపడుతున్నాడు. అందువల్ల నేను, 'ఇలాంటి సమయంలో ఏంటి బాబా, ఇలా రమ్మంటున్నారు?' అని అనుకుని చాలా బాధపడ్డాను. వెంటనే బాబాకి నమస్కరించుకుని, 'ఓం శ్రీసాయి ఆపద్భాంధవాయ నమః' అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ, "తమ్ముడు అవసరం అక్కడ లేకుండా ఉండేలా చూడు బాబా" అని బాబాను వేడుకున్నాను. కాసేపటికి వాళ్ళు మళ్లీ ఫోన్ చేసి, 'తమ్ముడిని రావద్దని, వేరే అతన్ని పంపిస్తున్నామని' చెప్పారు. అలా అనారోగ్యంతో బాధపడుతున్న మా తమ్ముడికి కష్టం లేకుండా చేశారు బాబా. "థాంక్యూ సో మచ్ బాబా".


నేను ఒక సన్నిహిత వ్యక్తికి మంచివాడనుకుని చాలా డబ్బులు ఇచ్చాను. కానీ అతను ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు నేను చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో నా స్నేహితుల రూపంలో బాబా నాకు చాలా ధైర్యాన్ని ప్రసాదించారు. నేను రోజూ, "నా డబ్బులు నాకు తిరిగి వచ్చేలా చూడు బాబా. డబ్బులు తిరిగొస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని రోజు ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అనుకోకుండా ఒకరోజు అతను నాకు కొంత డబ్బు పంపించేసరికి నేను చాలా సంతోషపడ్డాను. "ధన్యవాదాలు బాబా. మిగిలిన డబ్బులు కూడా నాకు అందేలా దయ చూపండి బాబా".


బాబా కృపతో దొరికిన అమ్మవారి బంగారు రూపు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి బంధువులందరికీ నమస్కారం. అద్భుతమైన బ్లాగును ఏర్పరిచి చక్కగా నిర్వహిస్తున్న బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు శ్వేత. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2022, ఆగస్టు రెండో వారంలో నేను శ్రీవరలక్ష్మీ వ్రతం చేసుకుంటూ మా ఇంట్లో ఉన్న అమ్మవారి బంగారు రూపాన్ని కూడా పూజించుకున్నాను. పూజ అయిన మరుసటిరోజు నేను అంతా శుభ్రం చేస్తూ పొరపాటున అక్షంతలతోపాటు ఆ బంగారు రూపాన్ని కూడా తీసి బయటపడేసాను. నాకు ఆ అమ్మవారి బంగారు రూపం గురించి అస్సలు గుర్తులేదు. పదిహేనురోజులు గడిచాక 2022, ఆగస్టు 26న నేను పూజ చేస్తున్నప్పుడు హఠాత్తుగా అమ్మవారి రూపు గుర్తొచ్చి దానికోసం వెతికాను. కానీ ఎంత వెతికినా అది కనిపించలేదు. నాకు చాలా బాధేసి, "బాబా! ఆ రూపు దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. నిజానికి అది మళ్ళీ దొరుకుతుందన్న ఆశ నాకు ఏ మాత్రమూ లేదు. తరువాత మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అమ్మ, "ఇంటి ముందున్న మొక్కల్లో అక్షంతలు వేశావు కదా! అక్కడ ఏమైనా పడిందేమో చూడు" అన్నారు. దాంతో నేను ఆ మొక్కల్లో చాలాసేపు వెతికాను కానీ, నాకు అదృష్టం లేదు. అమ్మవారి రూపు దొరకలేదు. ఇంకా ఆ రాత్రి బాధపడుతూనే నిద్రపోయాను. తెల్లవారాక మావారిని, "మీరు ఒకసారి మొక్కల్లో వెతకండి" అని అన్నాను. ఆయన వెళ్లి వెతికితే, ఒక మొక్క మొదలు వద్ద మట్టిలో ఇరుక్కుపోయి ఆ బంగారు రూపు కనిపించింది. అది చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎన్ని పూజలు చేసినా నాకు బాబా కృప లేదేమో అని చాలా బాధపడ్డాను కానీ, అది బాబా దయవల్ల దొరికింది. నాపై ఆయన కృప ఉంది. "థాంక్యూ సో మచ్ బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1306వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. దయతో సమస్యలను తొలగించిన బాబా
2. ప్రమోషన్ సమస్యను పరిష్కరించిన బాబా
3. ప్రేమతో సమస్యను పరిష్కరించిన బాబా

దయతో సమస్యలను తొలగించిన బాబా


ముందుగా బ్లాగును నిర్వహించే సాయికి నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకరోజు నాకు గొంతు సమస్య వచ్చి ఏది తిన్నా మంటగా ఉండేది. చివరికి నీళ్లు త్రాగినా మంట. అలా మంట ఎక్కువగా ఉండటం వల్ల ఏది తినాలన్నా భయంతో తినకపోయేదాన్ని.

అట్టి స్థితిలో నేను బాబాతో నా బాధ చెప్పుకుని, "ఈ గొంతు సమస్య తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. దయామయుడైన బాబా వారంరోజుల్లో సమస్య పూర్తిగా తగ్గిపోయేలా అనుగ్రహించారు


ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మా ఇంట్లోకి గండుచీమలు చాలా విపరీతంగా వస్తుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని రాకుండా నియంత్రించడం మా వల్ల కాదు. వర్షం పడినరోజు ఇంట్లో ఉన్న 6 గదుల్లో ఐదు గదుల నిండా చీమలే. కొన్నిసార్లు క్రింద ఉన్న బండలు అస్సలు కనిపించవు, అంతలా చీమలు చేరుతాయి. మేము క్రింద నిల్చోలేము, నడవలేము. ఒకవేళ కుటుంబంలోని వ్యక్తులందరూ ఇంట్లో ఉంటే గనక పడుకోవడం కూడా కష్టం. ఈమధ్య ఒకరోజు పడుకోవడానికి అస్సలు చోటు లేక అర్థరాత్రి వరకు కుర్చీలలో కూర్చుని ఉన్నాము. ఇక అప్పుడు నేను, "బాబా! చీమలు రావడం తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. కాసేపటికి చీమలు రావడం చాలావరకు తగ్గింది. బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. కొన్నిరోజుల వరకు బాగానే ఉంది. కానీ బహుశా బ్లాగులో పంచుకుంటానని చెప్పి పంచుకోవడం ఆలస్యమైనందువల్లనేమో ప్రస్తుతం చీమలు మళ్లీ వస్తున్నాయి. "బాబా! దయచేసి నా అనుభవం పంచుకోవడం ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించి, మా బాధను తొలగించు తండ్రీ".


మా సిస్టర్‌కి ఒక పాప. పాప ఇంకా చిన్నగా ఉండగానే, అంటే తను పుట్టిన కొద్దిరోజులకే మా సిస్టర్ మళ్ళీ గర్భవతి అయ్యింది. పాప చాలా అల్లరి చేస్తుంది, అసలు మాట వినదు. అందువలన మా సిస్టర్ అబార్షన్ చేయించుకోవాలని అనుకుంది. అందుకోసం హాస్పిటల్లో అడిగితే, మందులిచ్చారు. ఆ మందులు వేసుకున్నా కొన్నిరోజుల వరకు తనకి అబార్షన్ కాలేదు. అప్పుడు తను, "నాకు సర్జరీ ఏదీ అవసరం లేకుండానే మందులతో అబార్షన్ అవ్వాలి బాబా. అలా అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకుంది. అయితే తనకి అబార్షన్ చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో మా సిస్టర్ చాలా కష్టాన్ని, బాధను అనుభవించింది. మందులతో అబార్షన్ అయితే తనకి అంత బాధ, కష్టం ఉండదని తను బాబాను చాలా వేడుకుంది. కానీ కొన్నిసార్లు ఏది చేస్తే మనకి మంచిదో బాబాకే తెలుసు. ఆయన దయవల్ల ఇప్పుడు మా సిస్టర్ బాగుంది. "బాబా! అనుకున్న ప్రకారం నా అనుభవాలను పంచుకున్నాను. ఇప్పటివరకు చాలా సమస్యలకి పరిష్కారం చూపావు బాబా. వాటినన్నిటినీ పరిష్కరించిన మీరు నాకున్న ఒక సమస్యను మాత్రం ఎందుకు పరిష్కరించట్లేదో అర్థం కావట్లేదు. ఆ విషయంలో మీపై నాకు ఎన్నిసార్లు కోపం వచ్చినా మళ్ళీ 'నా బాబానే కదా' అని సమాధానపరచుకుంటున్నాను. నాకున్న సమస్యని పరిష్కరించి మానసిక ధైర్యాన్ని ఇవ్వు తండ్రీ. ఇక మీ దయ, ఎలా నా జీవితానికి ఒక దారి చూపుతావో!"


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


ప్రమోషన్ సమస్యను పరిష్కరించిన బాబా


ముందుగా బాబాకు నమస్కారాలు. బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నా పేరు రత్నాజీ. నా ఉద్యోగం, ప్రమోషన్, పెళ్లి, పిల్లలు అన్నీ బాబా నాకు ప్రసాదించిన భిక్ష. ఆయన దయతో నేను కోరుకున్నట్లు మొదట బాబుని(సాయి సుధన్వ్), రెండోసారి పాపను(సాయిశ్రీ అనఘ, నాలుగు నెలల వయసు) మాకు ప్రసాదించారు. బాబా దయవల్లే నాకు కోర్టులో ఉద్యోగం వచ్చింది. కానీ ప్రమోషన్ విషయంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పైస్థాయి జీతమిస్తూ డ్యూటీ మాత్రం పాతదే చేయించేవారు. కానీ ఉన్నత హోదాను ఎవరు వదులుకుంటారు? ఒక సంవత్సర కాలం గడిచాక నేను అవమానభారంతో, "బాబా! మీ దయతో నా సమస్య తీరి నాకు ప్రమోషన్ వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. ఆయన కృపవలన ఒక హైకోర్టు జడ్జి జిల్లా జడ్జికి నా పేరు చెప్పడం, క్షణాల్లో సమస్య పరిష్కారమవడం జరిగిపోయాయి. నాకు మంచి హోదాతో కూడిన పోస్టు ఇచ్చి సమీపాన ఉన్న ఊరికి బదిలీ చేసారు. ఇది సాయి దయతోనే సాధ్యమైంది. బాబా కరుణతో కురిపించే అవ్యాజమైన ప్రేమకు ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి? ఇలా బ్లాగులో పంచుకోవడమైనా ఆయన ఇచ్చిన అవకాశమే కదా! "ధ్యన్యవాదాలు బాబా. ఇలాగే మీ కరుణాకటాక్షాలు ఎప్పటికీ నాపై, నా కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. పిల్లలతో కొత్త ఇంటికి మారుతున్నాము. అన్నీ మీరే చూసుకోవాలి బాబా. సొంతింటి కలను నెరవేర్చు తండ్రి. అలాగే తదుపరి ప్రమోషన్ కోసం అప్పీల్‍కి వెళ్ళాను. అవి నెరవేరితే మరల నా అనుభవాలు మీ బ్లాగులో పంచుకుంటాను. మా జీవిత పగ్గాలు మీ చేతుల్లో పెడుతున్నాము, మీ దయ తండ్రి".


ప్రేమతో సమస్యను పరిష్కరించిన బాబా


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఎనిమిది సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. నేను ఈరోజు ప్రాణాలతో ఉండటానికి కారణం బాబాయే. ఆయన నా జీవితంలోకి ప్రవేశించినప్పటి నుండి ప్రతి విషయంలో నా వెన్నంటే ఉండి, నన్ను ముందుకు నడిపిస్తూ ఎన్నో కష్టాలను గట్టెక్కించారు. ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఈమధ్య కూడా ఒక సమస్యని తీర్చారు. అదేమిటంటే, ఈమధ్య నేను మా పుట్టింట్లో ఉన్నప్పుడు బంధువుల కారణంగా నాకు, నా భర్తకు మధ్య చిన్న గొడవ జరిగింది. దాంతో ఆయన నాతో రెండురోజులు మాట్లాడలేదు. సమస్య పెద్దది అవుతుందేమోనని భయమేసి బాబాను ప్రార్థించాను. ఆయన ప్రేమతో నా సమస్యను పరిష్కరించారు. మావారు తనంతట తానే నాకు ఫోన్ చేసి, నన్ను మా ఇంటికి తీసుకొచ్చారు. బాబానే నాకున్న బంధాన్ని నిలిపారు. "బాబా! ఈ బంధాన్ని కడవరకు తోడుగా ఉండేలా, నా సమస్యలను అర్థం చేసుకుని ముందుకు సాగేలా ఆశీర్వదించు తండ్రి. అదేవిధంగా మా బాబు భవిష్యత్తు కూడా బాగుండేలా చూడు స్వామి. మీ సచ్చరిత్ర నిత్య పారాయణ వల్ల ఎంత చెప్పినా తక్కువే అనిపించేలా ఎన్నో అనుభవాలు నేను పొందాను. ప్రస్తుతం నాకున్న సమస్య ఏమిటో మీకు తెలుసు బాబా. దాన్ని కూడా తీర్చి మరల ఈ బ్లాగు ద్వారా నా అనుభవాలను పంచుకునే అవకాశాన్ని ప్రసాదించు తండ్రి. చివరిగా మా కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రి. మీకు నా శతకోటి వందనాలు బాబా".


ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1305వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా
2. బాబాకి చెప్పుకున్నాక ఏదైనా జరగకుండా ఉంటుందా!
3. ఈసీజీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించిన బాబా

అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా


ఈ బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. మా పాపకి ఇప్పుడు పది నెలల వయసు. తనకి పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లం ఉన్నందున ప్రతినెలా తన సాచురేషన్ లెవల్స్ చెక్ చేయడం, మూడు నెలలకొకసారి హార్ట్ డాక్టరుకి చూపించడం వంటివి చేయాల్సి ఉంది. అందులో భాగంగా మేము ఆరవ నెల చివరిలో హార్ట్ డాక్టరుని సంప్రదించినప్పుడు, "పాపకి 10వ నెలలో 90% ఆపరేషన్ ఉండొచ్చు. అప్పుడు తీసుకుని రండి" అని అన్నారు. నేను రోజూ బాబాకి దణ్ణం పెట్టుకుని, ఊదీ మంత్రం పఠించి పాపకి బాబా ఊదీ పెడుతుండేదాన్ని. ఒక్కో నెలకు పాప మంచిగా ఎదుగుతూ, హుషారుగా నవ్వుతూ, దోగాడుతూ నాకు చాలా అలవాటైపోయింది. ఎంతైనా నా కన్నబిడ్డ కదా! ఇంక పదో నెల వచ్చాక మా గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. అప్పుడే తల్లిప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది. చాలా అంటే చాలా టెన్షన్ అనుభవించాను. ఇక రేపు హాస్పిటల్‌కి వెళ్ళాలనగా ఆ ముందురోజైతే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఆ టెన్షన్‌లో నేను, "పాపకి అప్పుడే ఆపరేషన్ వద్దని డాక్టరు చెప్పాలి బాబా. హాస్పిటల్లో పని ఒక్క గంటలో అయిపోవాలి. సాచురేషన్ చెక్ చేసేటప్పుడు పాప ఎక్కువగా ఏడవకుండా చూడండి. అలాగే తన సాచురేషన్ 90% పైన ఉండేలా అనుగ్రహించండి బాబా. అలా జరిగితే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను.


హాస్పిటల్‌కి వెళ్లేరోజు రానే వచ్చింది. ఎందుకో, 'హాస్పిటల్‌కి వెళ్లడం ఆలస్యమైనా పర్లేదు, ముందు గుడికి వెళ్ళాల'నిపించి మా ఇంటికి దగ్గరలో ఉన్న గణేష్ మందిరానికి వెళ్ళాము. అద్భుతమేమిటంటే, అక్కడ ఒకపక్కగా బాబా విగ్రహం ఉంది. బాబాను చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడున్న ఒక పంతులుగారు నాకు, మా పాపకి, నా భర్తకి ఊదీ మరియు కుంకుమతో బొట్టు పెట్టారు. తరువాత మేము అక్కడినుండి హాస్పిటల్‌కి వెళ్ళాము. వెళుతూనే పాప ఏడవటం మొదలుపెట్టింది. 'ఏడిస్తే స్కానింగ్ తీయడానికి రాదు, ఇప్పుడెలా?' అనుకుంటుంటే, "పాపకి 9 నెలలు నిండాయి కాబట్టి, మత్తుమందు వంటి డ్రాప్స్ ఇద్దామ"ని చెప్పి 4ml మందు పాపకి ఇచ్చారు. ఒక అరగంటకి పాప నిద్రపోయింది. సాధారణంగా మత్తు డ్రాప్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అందరు పిల్లలకి ఇవ్వరు. కానీ బాబా దయతో ఆవిధంగా స్కానింగ్‌కి ఇబ్బంది లేకుండా కాపాడారు. ఇంక చక్కగా స్కానింగ్ పూర్తయింది. రెండు గంటల తరువాత పాప లేచి, బాగా నవ్వుతూ ఆడుకుంది. ఇదంతా బాబా దయ.


ఇకపోతే స్కానింగ్ రిపోర్టులు రావడానికి చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. అవి వచ్చాక డాక్టరు మమ్మల్ని తన గది లోపలికి పిలిచారు. నేను, నా భర్త వణుకుతూ డాక్టరు గదిలోకి వెళ్ళాము. ఏమంటారోనని ఒకటే టెన్షన్. అయితే బాబా అతిపెద్ద అద్భుతం చేశారు. నిజానికి హార్ట్ సమస్య ఉన్న పాప ఎనిమిది కేజీల బరువుంటేనే ఆపరేషన్ చేయాలి. అలాంటిది మా పాప ఐదు కేజీల బరువే ఉంది. అందువలన డాక్టరు, "పాపకి ఇప్పుడే ఆపరేషన్ అవసరం లేదు. సర్జరీ అత్యవసరం కాదు. ఇంకా కొంతకాలం ఆగవచ్చు. ప్రస్తుతం తనకు అంతా బాగానే ఉంది. రెండు నెలల తరవాత మళ్ళీ రండి" అని చెప్పి మందులు రాసిచ్చారు. అది విని నేను, నా భర్త ఎంత సంతోషపడ్డామో మాటల్లో చెప్పలేను. ఉదయం 9 గంటలకి వెళ్లిన మేము సాయంత్రం 4 గంటలకి ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ బాబా నేను కోరుకున్నట్లు అనుగ్రహించారు. "బాబా! మీకు కృతజ్ఞతలు చెప్పడం చాలా తక్కువేమో అనిపిస్తుంది. కానీ చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే నా బిడ్డని, నా కుటుంబాన్ని సదా కాపాడండి బాబా. దయచేసి ఆపరేషన్ అవసరం లేకుండా నా బిడ్డని జీవితాంతం కాపాడండి బాబా".


ఒకరోజు నా భర్త కంట్లో ఏదో పడి చాలా ఇబ్బందిపడ్డారు. ఒక రోజు గడిచినా నొప్పి, కంటి నుండి నీరు కారడం తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! నా భర్త కన్ను బాగైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తర్వాత నా భర్త హాస్పిటల్‌కి వెళ్తే, డాక్టరు ఐ-డ్రాప్స్ ఇచ్చారు. ఆ డ్రాప్స్ వేసుకున్నాక నా భర్త కన్ను నుండి పసుపురంగులో ఏదో పస బయటికి వచ్చి కన్ను బాగైంది. "అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఐ లవ్ యు బాబా. ఏదైనా మర్చిపోయివుంటే క్షమించండి బాబా".


ఓం సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!


బాబాకి చెప్పుకున్నాక ఏదైనా జరగకుండా ఉంటుందా!


ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు, తోటి సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. బాబా నాకు అనుగ్రహించిన అనుభవాలను నేనిప్పుడు నా తోటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రతి సంవత్సరం రాఖీపౌర్ణమినాడు వేరే ఊరిలో ఉన్న మా అన్నయ్యలకి రాఖీలు పంపిస్తుంటాను. అలాగే ఈ సంవత్సరం కూడా పంపించాను. కానీ అవి సమయానికి వెళ్తాయో, లేదో అని భయపడి, "బాబా! రాఖీలు అన్నయ్యలకు సమయానికి చేరేలా చూడండి" అని బాబాకి చెప్పుకున్నాను. ఇంక ఆయనకి చెప్పుకున్నాక ఏదైనా జరగకుండా ఉంటుందా! రాఖీలు సమయానికి వెళ్ళాయి. నేను చాలా సంతోషించాను. అలానే ఇంకో అన్నయ్యకి ఈ సంవత్సరం రాఖీ కడతానో, లేదో అని భయపడ్డాను. ఎందుకంటే, ఇంట్లో కొంచెం గొడవలు ఉన్నాయి. కానీ బాబా దయవల్ల అన్నయ్యకి రాఖీ కట్టగలిగాను


నేను డిగ్రీ చదువుతున్నాను. పరీక్షలు వ్రాయడానికి హాల్ టికెట్ తీసుకుందామంటే ఫీజు కట్టాలి. కానీ నాకు రావలసిన స్కాలర్‌షిప్ డబ్బులు రాలేదు. ఆ సమయంలో ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందుచేత నేను ఫీజు తరువాత కడతానని చెప్పాలనుకున్నాను. కానీ కాలేజీవాళ్ళు హాల్ టికెట్ ఇస్తారో, లేదో అని భయపడి నా సమస్య గురించి బాబాకి చెప్పుకుని కాలేజీకి వెళ్ళాను. వాళ్ళు ఫీజు అడిగితే, తరువాత కడతానని చెప్పాను. బాబా దయవల్ల వాళ్ళు నన్ను ఇబ్బందిపెట్టకుండా హాల్ టికెట్ ఇచ్చారు. "థాంక్యూ సో మచ్ బాబా".


సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


ఈసీజీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించిన బాబా


ఎందరో బాబా బిడ్డలలో నేనూ ఒకదాన్ని. నా పేరు ఇందిర. ప్రస్తుతం మేము ఇండియాలో ఉన్నాము. నిజానికి మేము దుబాయిలో ఉంటాము. అక్కడ ఉన్నప్పుడే నాకు గ్యాస్ ప్రాబ్లం మొదలైంది. 'pan D' టాబ్లెట్ వేసుకున్నా ఆ గ్యాస్ సమస్య నుండి ఉపశమనం లభించకపోవడంతో హాస్పిటల్‌కి వెళ్లాను. డాక్టరు, "బీపీ చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి ఈసీజీ తీయించండి" అని అన్నారు. కానీ నాకు భయమేసి ఈసీజీ చేయించుకోకుండానే ఇంటికి వచ్చేశాను. తరువాత బీపీ మెషీన్ తీసుకుని బీపీ చెక్ చేసుకుంటే ఒక్కోసారి ఒక్కోలా చూపిస్తుండేది. అస్సలు కంట్రోల్ అయ్యేది కాదు. పైగా గ్యాస్ సమస్య ఎక్కువై ఒక రాత్రి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించింది. దాంతో నేను హాస్పిటల్‌కి వెళ్లి ఈసీజీ చేయించుకుందామనుకుని బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! బీపీ వల్ల నా గుండెకి ఎటువంటి తేడా రాకుండా మీరు చూడాలి. నాకు ఏ సమస్య లేనట్లయితే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాన"ని వేడుకున్నాను. బాబా దయవల్ల ఈసీజీ రిపోర్టు నార్మల్ వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ నా బీపీ అలానే ఉంది. "బాబా! ఎప్పుడూ లేనిది బీపీ ఇలా ఎందుకు పెరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. దుబాయ్ వెళ్లే లోపల మందులు వాడకుండానే బీపీ కంట్రోల్ అయ్యేలా చూడు బాబా. ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను. దయచేసి నన్ను రక్షించండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1304వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపతో సమస్యల నుండి విముక్తి 
2. స్తవనమంజరి పారాయణతో శ్రీహనుమాన్ మ్రొక్కు తీర్చుకునేలా అనుగ్రహించిన బాబా 
3. బాబా అనుగ్రహం

బాబా కృపతో సమస్యల నుండి విముక్తి 


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు రఘు. మాది హైదరాబాద్. నేను గతంలో కొన్ని అనుభవాలను మన ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా, అనుభవాలను ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఎం.బి.ఏ చేస్తున్నాను. దానికి సంబంధించి ప్రతి శనివారం ఆన్లైన్లో క్లాసులు జరుగుతాయి. బాబా దయవలన నేను 4 మాడ్యూల్స్ పాసయ్యాను. ఇంకా 6 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక శనివారం పరీక్ష ఉందని నేను ముందురోజు శుక్రవారంనాడు పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుండగా హఠాత్తుగా నా లాప్టాప్ రీస్టార్ట్ అయింది. రీస్టార్ట్ అవటానికి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ లాప్టాప్ పనిచేస్తుందిలే అనుకున్నాను. కానీ పది నిమిషాల తరువాత మళ్ళీ రీస్టార్ట్ అయి అప్పుడు కూడా చాలా సమయం తీసుకుంది. దాంతో, 'ఇలా అయితే రేపటి పరీక్షకి ఎలా ప్రిపేరవ్వాలి? అంతేకాదు, రేపు కూడా ఇలాగే రీస్టార్ట్ అయితే నేను పరీక్షలో ఫెయిల్ అవుతాను" అన్న భయంతో చాలా టెన్షన్‌గా అనిపించింది. వెంటనే, "సహాయం చేయండి బాబా. లాప్టాప్‌కి ఎటువంటి సమస్యా రాకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా అద్భుతం చేశారు. అప్పటినుండి లాప్టాప్ రీస్టార్ట్ సమస్య మళ్ళీ రాలేదు. బాబా దయవలన నేను శనివారం పరీక్ష బాగా వ్రాసి పాసయ్యాను. "ధన్యవాదాలు బాబా. మీరే నాకు సహాయం చేసి మిగిలిన మాడ్యూల్స్ కూడా పాస్ చేయించి మంచి గ్రేడ్ వచ్చేటట్లు దీవించండి స్వామీ".


బాబా దయవలన మేము ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని దాన్ని అద్దెకు ఇచ్చాము. ఆ అద్దె డబ్బులే EMI కట్టడానికి నాకు ఉపయోగపడుతుండేవి. బాబా దయవల్ల కరోనా సమయంలో కూడా ఆ ఇల్లు ఖాళీగా లేదు. అలాంటిది 2022, ఏప్రిల్ నెలలో ఆ ఇంట్లో అద్దెకుండేవాళ్ళు హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేశారు. సరేనని టులెట్ బోర్డు పెట్టి, "సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. కానీ రెండు నెలలు గడిచినా ఎవరూ ఆ ఇంటిలోకి అద్దెకు రాలేదు. ఇల్లు చూడటానికి వచ్చిన వాళ్ళందరూ మరీ తక్కువ డబ్బులకు అద్దెకు అడుగుతుండేవాళ్లు. నేను రోజూ బాబాను, "అద్దె విషయంలో సహాయం చేయండి బాబా. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒకరోజు హఠాత్తుగా ఒక కుటుంబం నాకు ఫోన్ చేసి ఇంటి అడ్రస్ అడిగారు. వాళ్ళకి నా ఇల్లు గురించి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదుగానీ బాబా దయవల్ల వాళ్ళు ఇల్లు చూసి అడ్వాన్స్ ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా. వాళ్ళు ఎక్కువ రోజులు ఆ ఇంటిలో ఉండేటట్టు అనుగ్రహించండి స్వామీ".


2022, జూలై నెల చివరివారంలో ఒకరోజు ఉదయం నాకు కొద్దిగా జలుబు ఉన్నప్పటికీ బాగానే ఉన్నందువల్ల నేను మూమూలుగానే ఆఫీసుకి వెళ్ళాను. అయితే సాయంత్రానికి జ్వరం వచ్చింది. ఆ రాత్రి టాబ్లెట్లు వేసుకుని పడుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి జ్వరం లేదుగానీ ఒళ్ళునొప్పులు, దగ్గు, జలుబు ఉండేసరికి నా స్నేహితుడికి ఫోన్ చేస్తే తనకి కూడా ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు ఉన్నాయని చెప్పాడు. ఇంకా నాకు భయమేసింది. ఎందుకంటే, కోవిడ్ మొదటి వేవ్‌లో మా కుటుంబమంతా కరోనా ప్రభావానికి గురై బాగా ఇబ్బందిపడ్డాము. బాబా దయవల్లే కోలుకున్నాము. నేను టాబ్లెట్లు వేసుకుని ఆవిరి పట్టాను. కానీ, రాత్రికి జ్వరం వచ్చింది. రెండు రోజులైనా కూడా జ్వరం, ఒళ్ళునొప్పులు, దగ్గు మరియు జలుబు తగ్గలేదు. అప్పుడు నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరిస్తూ, "బాబా! దయచేసి నా ఆరోగ్యాన్ని బాగుచేసి నాకు సహాయం చేయండి. మీ దయతో నాకు నయమైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. అంతే, బాబా దయవలన జ్వరం తగ్గిపోయింది. "బాబా! మీకు వందనాలు. మీరే నాకు తల్లి, తండ్రి మరియు గురువు. మీ ఆశీస్సులు మా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలి తండ్రీ. ఇంకా నాకున్న ఆరోగ్య సమస్యను  తగ్గేలా చేయండి బాబా. అలాగే నాకున్న సొంతింటి కోరికను కూడా తీరుస్తారని ఆశిస్తున్నాను బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

శ్రీసాయినాథార్పణమస్తు!!!


స్తవనమంజరి పారాయణతో శ్రీహనుమాన్ మ్రొక్కు తీర్చుకునేలా అనుగ్రహించిన బాబా 


సాటి సాయిబంధువులకు, బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేను పంచుకుంటున్నాను. ఒకరోజు నేను మా తొమ్మిది నెలల పాపని బంతితో ఆడిస్తున్నప్పుడు పొరపాటున ఆ బంతి మా ఇంటి హాల్లో ఉన్న శ్రీహనుమంతుని ఫోటోకి తగిలింది. ఆ సంఘటనతో నాకు చాలా బాధ, భయం కలిగాయి. వెంటనే హనుమంతునికి క్షమాపణలు చెప్పుకుని, "108 సార్లు గుంజీలు తీస్తాన"ని మొక్కుకున్నాను. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో బెడ్‌రెస్ట్ తీసుకోవడం వల్ల నేను బరువు పెరగడం, పైగా వ్యాయామం చేసి చాలా రోజులు అవడం వల్ల 11 గుంజీలు తీసేసరికి బాగా అలసిపోయాను. కొన్నిరోజుల తర్వాత ఒక సాయిభక్తుని ద్వారా 'సాయి స్తవనమంజరి' గురించి తెలుసుకుని 2022, ఆగస్టు 22న శ్రద్ధగా చదివాను. తరువాత అనుకోకుండా నేను హనుమంతుని ఫోటో ముందు నిలబడి టీవీలో హనుమాన్ చాలీసా పెట్టుకుని 108 గుంజీలు తీసేశాను. ఇంకొక విచిత్రం ఏంటంటే, గుంజీలు తీసిన తరువాత  రోజువారీ అలవాటు ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి సాయి ఫోటోలు పెడదామని ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, మొట్టమొదట హనుమంతుని ఫోటో నాకు దర్శనమిచ్చింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మ్రొక్కు తీర్చగానే ఫోటో రూపంలో ఆయన తమ దర్శనంతో నన్ను ఆశీర్వదించారని అనిపించింది. "బాబా! మీ స్తవనమంజరి చదివిన తరువాతే నేను మ్రొక్కు తీర్చుకోగలిగాను. మీకు, హనుమంతునికి ధన్యవాదాలు. ఇంకా మా మ్రొక్కులు కొన్ని తీర్చుకోనందుకు నన్ను, నా కుటుంబాన్ని క్షమించి, ఆ మ్రొక్కులు తీర్చుకునే శక్తిని ప్రసాదించండి బాబా. తప్పులేవైనా వ్రాసివుంటే క్షమించండి బాబా".


ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబా అనుగ్రహం


సోదరభావంతో తోటి సాయిభక్తులకు బాబా తమకు ప్రసాదించిన అనుభవాలను సోదర సాయిభక్తులతో పంచుకునే అద్భుత అవకాశాన్నిస్తున్న బ్లాగ్ నిర్వాహకులైన సాయికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిభక్తులందరికీ నా వినయపూర్వక ప్రణామాలు. నా పేరు బాలాజీ. నేను సాయిభక్తుడిని. నేను ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని పంచుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా మాతో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి ఇటీవల జీతం పెంచాల్సి ఉండగా నేను ప్రతిపాదించే ఇంక్రిమెంట్‌కు భాగస్వాములు అంగీకరిస్తారా, లేదా అనే సందేహం నా మనసులో మెదిలింది. అప్పుడు నేను సాయి భగవానుని, ఆ విషయంలో అనుగ్రహించమని ప్రార్థించి, "అలా జరిగితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. సాయి ఆశీస్సులతో నా భాగస్వాములు అతనికి నేను ప్రతిపాదించిన ఇంక్రిమెంట్ ఇవ్వడానికే కాకుండా అతన్ని కూడా ఒక భాగస్వామిగా తీసుకోవడానికి అంగీకరించారు. "బాబా! నేను మీకు వాగ్దానం చేసినట్లుగా ఈ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటూ మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను".


శ్రీ సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1303వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ
2. సాయితండ్రిని నమ్ముకున్నవారికి తిరుగులేదు

బాబా దయ


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి పాదాభివందనాలు. బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నేను సాయిభక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఆమధ్య మా ఊరిలో బంధువులందరూ పదిరోజులు కాశీయాత్రకి వెళ్లారు. వాళ్లలో చాలా పెద్దవాళ్ళు, చాలా చిన్నపిల్లలు ఉన్నందున నేను, 'వాళ్ళందరూ క్షేమంగా వెళ్లి, దర్శనాలన్నీ బాగా చేసుకుని ఎవరింటికి వాళ్ళు తిరిగి వస్తే, బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. ముఖ్యంగా నేనే వాళ్ళందరినీ వెళ్లిరమ్మని చెప్పి పంపినందువల్ల వాళ్ళు వెళ్ళింది మొదలు తిరిగి వచ్చేవరకు వాళ్ళ క్షేమం గురించి బాబాని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. యాత్రలో ఒకరోజు పూరి, కూర తిన్నాక వాళ్ళందరూ వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఇబ్బందిపడ్డారు. ఆ విషయం తెలిసి నేను ముందు భయపడినప్పటికీ 'బాబా ఉన్నార'ని, "వాళ్ళకి ఏమీ కాకూడదు" అని బాబాను ప్రార్థించి, ఊదీ తీసుకున్నాను. అక్కడ వాళ్ళందరినీ ఒక డాక్టరు చూసి మందులివ్వడంతో వాళ్లంతా కష్టం నుండి గట్టెక్కారు. అలా బాబా అందరినీ కాపాడారు. ఆయన కృపవల్ల అందరూ క్షేమంగా తిరిగి వచ్చారు.


మా కోడలికి కాన్పు సమయం దగ్గరైనప్పుడు నేను బాబాను, "బాబా! కోడలికి నార్మల్ డెలివరీ అయి తల్లి, బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. అలా జరిగితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా మా కోడలికి నార్మల్ డెలివరీ అయి ఆడపిల్ల పుట్టింది. మా కొడుకు, కోడలికి అదివరకే ఒక బాబు ఉన్నాడు. పిల్లలిద్దరూ బాబా అనుగ్రహ ప్రసాదమే. 21వ రోజున పాప బారసాల, నామకరణము బాబా తమ గుడిలోనే చేసుకునేలా ఏర్పాటు చేశారు. బాబా, దుర్గమ్మతల్లి దయతో అంతా బాగా జరిగింది. మేము చాలా సంతోషించాము. 


బాబా దయతో మా పిల్లలు అమెరికాలో పాత ఇల్లు అమ్మేసి వేరే రాష్ట్రంలో కొత్త ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇంటి గృహప్రవేశ సమయానికి బ్రాహ్మణులు దొరకక చాలా ఇబ్బంది అయింది. ఆ ముహూర్తం తప్పితే తరువాత మంచి ముహూర్తాలు లేవని పిల్లలు భయపడ్డారు. అయితే బాబా దయవల్ల చివరి నిమిషంలో బ్రాహ్మణుడు దొరకడంతో కార్యక్రమం చక్కగా జరిగింది. తరువాత పిల్లలు ఇంతకుముందు ఉంటున్న రాష్ట్రం నుండి కొత్తగా ఇల్లు తీసుకున్న రాష్ట్రానికి మారారు. అప్పుడు చిన్న మనవరాలికి రెండు నెలల వయస్సు అయినందున ప్రయాణానికి భయపడ్డాము. నేను, "బాబా! వాళ్ళు చిన్నపిల్లలతో వెళ్తున్నారు. మీరు కూడా వెళ్లి అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. మీ అనుగ్రహాన్ని నేను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబాకు పగ్గాలు అప్పగించిన తరువాత మనకి భయం అక్కరలేదు.


పిల్లలతో ఎయిర్‌పోర్టుకి వెళ్లేసరికి బాగా ఆలస్యమవడంతో వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు. అదీకాక, ఆఫీసర్లు వాళ్ళ లగేజీని కేబిన్ రూమ్‌లో కాకుండా చెక్‌ఇన్‌లో వేయమన్నారు. అయితే వాటిలో చాలా బంగారం ఉన్నందున కొంచెం భయపడినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో లగేజీ అంతా చెక్‌ఇన్‌లో వేశారు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతూనే డోర్స్ క్లోజ్ చేశారు. నేను కంగారుపడతానని ఆ విషయాలేవీ వాళ్ళు నాకు చెప్పకుండా 'ఆల్ ఒకే' అని మాత్రం మెసేజ్ పెట్టారు. కానీ నాకెందుకో వాళ్ళ ఫోన్లకు బాబా, శ్రీవెంకటేశ్వరస్వామి, శ్రీలక్ష్మీదేవి, అమ్మవార్ల ఫోటోలు పంపాలనిపించి, వాటిని పంపి, "వీళ్ళందరూ మీతో వస్తున్నారు" అని మెసేజ్ పెట్టాను. అంతా బాబా సంకల్పం. బాబా దయవల్ల అందరూ క్షేమంగా వేరే రాష్ట్రానికి చేరుకున్నారు. ప్యాకింగ్ వాళ్ళకి ఇచ్చిన సామాన్లు కూడా ఎటువంటి సమస్య లేకుండా చేరాయి. అవే కాకుండా కార్లు కూడా బాగా వచ్చాయని పిల్లలు చెప్పారు. పిల్లల్ని స్కూలులో జాయిన్ చేసి ఇప్పుడు అందరూ బాగున్నారు. ఇలా పాత ఇల్లు అమ్మడం దగ్గరనుంచి కొత్తింటి గృహప్రవేశం, ప్రయాణాలు, పిల్లల స్కూల్ జాయినింగ్ అన్నీ బాబా మా కుటుంబ పెద్దగా చూసుకున్నారు. “ధన్యవాదాలు బాబా”.


ఒకరోజు మా ఇంట్లో ఐఫోన్ కనిపించకుండా పోయింది. వేరే ఫోనుతో ఆ ఫోనుకి కాల్ చేస్తే, ఫోనులో ఛార్జింగ్ లేకపోవడం వల్ల రింగ్ రాలేదు. అప్పుడు నేను, "బాబా! ఫోన్ కనిపిస్తే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో మీ దయను పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని జపించాను. బాబా దయవల్ల ఒక్కరోజులోనే ఎప్పుడూ పెట్టని గిన్నెలు పెట్టే చోట ఆ ఫోన్ కనిపించింది. ఇది చిన్న విషయమే అయినా బాబా ప్రేమకు ఆనందంతో నాకు ఏడుపొచ్చింది. "బాబా! మీకు నేను చాలా ఋణపడి ఉన్నాను తండ్రీ. ఎంత చెప్పినా, వ్రాసినా అన్నీ తక్కువే. ఏదో నా ఆరాటం కొలదీ వ్రాస్తున్నాను. నా కుటుంబ బాధ్యత అంతా మీదే తండ్రీ. మేమందరమూ తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి నాన్నా. మా పెద్దమ్మ గురించి మిమ్మల్ని వేడుకున్నాను. దానికి సంబంధించిన వివరాలు వ్రాయలేకపోయాను మన్నించండి ప్రభూ. ఈమధ్య మా అమ్మ ఆరోగ్యం కొంచెం బాగాలేదు తండ్రీ, మీ దయతో తనకి నయమైతే బ్లాగులో పంచుకుంటాను బాబా".


సాయితండ్రిని నమ్ముకున్నవారికి తిరుగులేదు


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! ముందుగా సాయి పాదములకు నా అనంతకోటి నమస్కారాలు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. నా పేరు రమాదేవి. సాతులూరు గ్రామం. నేను అంగన్‌వాడీ టీచర్ని. నేను సాయిబాబా భక్తురాలిని. నాకు ఏ సమస్య వచ్చినా 'బాబా' అని పిలిచినంతనే ఆ తండ్రి నాకు తోడూనీడై సహాయం అందిస్తున్నారు. ఆయన ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఆలస్యంగా పంచుకుంటున్నందుకు ముందుగా బాబాకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నేను క్రాఫ్ట్(పంట) లోన్ తీసుకుని 2022, జూలై 11కి ఒక సంవత్సరం అవుతున్నందున రెన్యూవల్ చేయిద్దామని బ్యాంకుకి వెళ్తే, "అడంగల్, 1బి, ఈసీ కావాల"ని బ్యాంకువాళ్ళు చెప్పారు. రెన్యూవల్‍కి అవన్నీ ఉండాలని తెలియక నేను వాటిని తీసుకుని వెళ్ళలేదు. ఆ విషయమే నేను చెప్తే, "11వ తేదీలోగా రెన్యూవల్ చేసుకోకపోతే వడ్డీ రేటు పెరుగుతుంది" అని చెప్పారు. సరేనని నేను అడంగల్, 1బి కోసం సచివాలయానికి వెళ్తే, "సర్వర్ పనిచేయటం లేదు, నాదెండ్ల  M.R.O ఆఫీసుకి వెళ్లి క్లియర్ చేయించుకుని తీసుకురండి" అని అన్నారు. కానీ ఆ సమయంలో MROగారు సెలవులో ఉన్నారు. నాలుగురోజుల తరువాత వస్తారని చెప్పారు. నాకు ఏం చేయాలో తోచక, "బాబా! 11వ తేదీకల్లా పని అవ్వాలి. నాకు మీరు తప్ప ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు" అని కన్నీళ్లు పెట్టుకున్నాను. బాబా దయ చూపారు. మరునాడు గురువారం సచివాలయం నుండి డేటా ఆపరేటర్ ఫోన్ చేసి, "మేడం, సర్వర్ పని చేస్తోంది. మీ సర్వే నెంబరుకి క్లియరెన్స్ వచ్చింది. అడంగల్, 1బి వచ్చాయి. వచ్చి తీసుకుని వెళ్ళండి" అని చెప్పారు. అవి తీసుకుని వెళ్తే బ్యాంకువాళ్ళు వెంటనే రెన్యూవల్ చేశారు. "వేలవేల కృతజ్ఞతలు బాబా".


ఈమధ్య నా స్నేహితురాలిపై తన భర్త పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. డాక్టరు, "తన శరీరం 50 శాతం కాలిపోయింది. తను బ్రతుకుతుందో, లేదో చెప్పలేం. ఎటువంటి నమ్మకం ఇవ్వలేము. గొంతు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అలా అయితే ఇంకేమీ చేయలేము" అని చేప్పారు. ఆ విషయం నాకు తెలిసి, "బాబా! ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. పెళ్ళైన దగ్గర నుండి తను కష్టాలు పడుతోంది. తనకి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఆ పిల్లలకు అమ్మ లేకపోతే ఎంతో బాధ తండ్రీ. దయచేసి వాళ్ళమ్మకు ఏమీ కాకుండా కాపాడు బాబా" అని బాబాను వేడుకుని బాగా ఏడ్చాను. బాబా దయవలన నా స్నేహితురాలి పైచర్మం మాత్రమే కాలింది. ఇంకా లోపల ఇన్ఫెక్షన్ రాకుండా చేసి తనని, అనాధలు కాకుండా ఆ పిల్లలని సాయి కాపాడారు. నాకు తోడునీడ అయిన నా సాయితండ్రిని నమ్ముకున్నవారికి తిరుగులేదు. 'సాయీ' అని పిలిచిన వెంటనే 'ఓయీ' అని పలికే నా తండ్రికి నా కృతజ్ఞతలు.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo