సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1314వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - ఆరవ భాగం

శిరిడీ యాత్ర


సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.

1995, వేసవి సెలవుల్లో మేము శిరిడీ వెళ్లాలనుకున్నాము. అప్పుడు మా అమ్మాయి, “ముందు ఊటీ వెళ్లి, అక్కడినుండి తిరిగి వచ్చాక ఒక వారం ఆగి శిరిడీ వెళదాం” అంది. మేము సరేనన్నాము. కానీ ఏదో ఆటంకమొచ్చి ఊటీ వెళ్ళలేకపోయాము. పోనీ, శిరిడీ అయినా వెళ్ళొద్దామని టిక్కెట్ల కోసం గుంటూరు, తెనాలి, విజయవాడ, హైదరాబాదుల నుండి బస్సులకు, రైళ్ళకు, ట్రావెలర్స్‌కు ఎన్నోవిధాల ప్రయత్నించాము. అప్పట్లో సెల్ ఫోన్లు లేనందున ల్యాండ్ లైన్ ద్వారా కనీసం ఒక యాభై ఫోన్లు చేసుంటాము. అందరూ టిక్కెట్లు లేవనే చెప్పారు. ‘ఇంతకుముందు ఎప్పుడు శిరిడీ వెళ్దామనుకున్నా టిక్కెట్లకోసం ఎటువంటి ఇబ్బందీ పడలేదు. మరి ఇప్పుడెందుకు ఇలా జరుగుతుంద’ని ఆలోచిస్తే, 'మొదట శిరిడీ వెళదామనుకుని, మా అమ్మాయి అడిగిందని ఊటీ వెళ్లొచ్చిన తర్వాత శిరిడీ వెళదామని అనుకున్నందువల్లే బాబా మమ్మల్ని శిరిడీ రావడానికి అనుమతించట్లేదు' అనిపించింది. వెంటనే మేము బాబా మందిరానికి వెళ్ళి, బాబా పాదాలు పట్టుకుని క్షమించమని వేడుకున్నాము. బాబా దయార్ద్రహృదయులు కదా! వెంటనే టిక్కెట్లు దొరికేలా అనుగ్రహించారు. ఇంకేముంది, మేము రైలులో శిరిడీ వెళ్ళి, ఒకటి రెండు రోజులు కాదు, ఏకంగా 20 రోజులు బాబా సన్నిధిలో గడిపి వచ్చాము. బాబా అనుమతి లేనిదే శిరిడీలో అడుగుపెట్టడం అసంభవమనడానికి ఈ లీలయే నిదర్శనం.


1995లోనే మేము శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్న తరువాత, బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారిని సేవించుకున్న భక్తుల ఇళ్ళు చూడాలనుకున్నాం. కానీ అవి ఎక్కడో తెలియక ఎవరినైనా అడిగి కనుక్కుందామని అక్కడే నిలుచున్నాం. అంతలో ఒక సాధువు వచ్చి, "మీరు చూడవలసిన ఇళ్లను నేను చూపిస్తాను" అని చెప్పి, గంటసేపు మాతోనే ఉండి ఆ ఇళ్లను చూపించాడు. తరువాత ఆ సాధువుకు కొంత డబ్బు ఇద్దామని డబ్బులు తీసి ఇచ్చేలోపు అతను అదృశ్యమయ్యాడు. ప్రక్కనున్న షాపువాళ్ళని ఆ సాధువు గురించి అడిగితే, “మేము చూడలేదు, మాకు తెలీదు" అన్నారు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి బాబా ఏమోననిపించి, 'ఇంతసేపూ మేము బాబాతో ఉన్నామా!" అని ఆశ్చర్యంతో మా మనసు పులకరించిపోయింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం బాబా మమ్మల్ని శిరిడీ రప్పించుకుంటున్నారు.


1996వ సంవత్సరం మే నెల సెలవుల్లో నేను నా భార్య, మా అమ్మాయి, నా మేనకోడలితో కలిసి  శిరిడీ వెళ్ళి, అక్కడ 20 రోజులు ఉండాలని అనుకున్నాను. ముందుగా మేము గుంటూరు ఆర్.అగ్రహారంలోని బాబా గుడికి వెళ్లి, బాబా ఆశీస్సులు తీసుకోవాలని అక్కడికి వెళ్ళాము. బాబా(నల్లరాతి విగ్రహం)ని దర్శించుకుని, "శిరిడీలో 20 రోజులకు వసతి, భోజనం మీరే ఏర్పాటు చేయాలి బాబా” అని కోరుకున్నాము. తరువాత మాటల మధ్యలో ఆ గుడికి సంబంధించినవాళ్ళు విషయం తెలుసుకుని, "మీకు శిరిడీలో భోజనానికి ఏ ఇబ్బందీ ఉండదు. అక్కడ మన ఆంధ్రావాళ్ళు బాబా సేవలో భాగంగా అన్నదానం చేస్తున్నార"ని చెప్పి అడ్రసు ఇచ్చారు. తరువాత మేము శిరిడీ వెళ్లి ముందుగా ధూళిదర్శనం చేసుకుని బయటకు రాగానే, మాకు బాగా పరిచయమున్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన కూడా మాలాగే బాబా దర్శనానికి శిరిడీ వచ్చాడనుకున్నాం. కానీ ఆయన మా దగ్గరకు వచ్చి, కుశల ప్రశ్నలు వేసి, “మీరు భోజనానికి ఇబ్బందిపడవద్దు, నన్ను ఆంధ్రా భోజనశాలవాళ్ళు పంపారు. మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు భోజనానికి వచ్చి సాయిప్రసాదం స్వీకరించండి" అని అడ్రస్ ఇచ్చారు. గుంటూరులో గుడివాళ్ళు ఇచ్చిన అడ్రస్, అతను ఇచ్చిన అడ్రస్ ఒకటే అయ్యేసరికి మేము ఆశ్చర్యపోయాము. బాబా దయవల్ల అన్నప్రసాదానికి లోటు లేదు. 'మరి బస ఎక్కడ?' అనుకుంటే, దాన్ని కూడా బాబానే ఏర్పాటు చేశారు. అదెలాగో చూడండి.


అప్పుడు శిరిడీలో బాగా రద్దీగా ఉండటం వలన మాకు రూములు దొరకక సంస్థాన్ వారి హాలులో మొదటిరోజు ఉన్నాము. రెండవరోజు అన్నప్రసాదాలయం దగ్గర భవనంలో గదుల రిజర్వేషన్ కౌంటర్లో రూమ్ కావాలని అడిగితే, ఆ కౌంటరులో ఉన్న వ్యక్తి, "ఖాళీ లేవమ్మా" అని చెప్పాడు. ఏమీ పాలుపోక ఒక గంటసేపు అక్కడే బయట వేచి ఉన్న మేము బాబాను ప్రార్థించాము. బాబా దయవల్ల ఆ కౌంటరులోని వ్యక్తి మమ్మల్ని లోపలికి పిలిచి, “మీకు మంచి రూమ్ ఇస్తాను. కానీ, ఒక ఫర్లాంగు దూరం వెళ్ళాలి. ఎందుకంటే, దగ్గరలో రూములు లేవు. అయితే రూమ్ మాత్రం చాలా బాగుంటుంది. కొత్త రూమ్, గీజరు సౌకర్యం కూడా ఉంది" అని చెప్పి ఒక రూమ్ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి చూస్తే, ఆ రూమ్ కొత్త కప్‌బోర్డులతో, అద్దాలతో చాలా బాగుంది. ఆ బిల్డింగ్ అప్పట్లో ఒక వ్యక్తి 25 లక్షలు పెట్టి కట్టించి సాయి సంస్థానానికి ఇచ్చాడట. ముందురోజు హాలులో ఎంత ఇబ్బందిపడ్డామో, తర్వాతరోజు ఆ రూములో అంత హాయిగా ఉన్నాము. బాబానే మాకు ఆ కొత్త రూము ఇప్పించారనుకున్నాం. ఆ తరువాత మేము భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడొక తెలిసిన వ్యక్తి తారసపడ్డాడు. నేను అతన్ని, "ఇక్కడ ఉన్నావేంటి?” అని అడిగాను. దానికి అతను, "నేను ఇక్కడ గుంటూరువారి సత్రంలో వాచ్‌మన్‍గా చేస్తున్నాను. ఆ సత్రం ఇంకా ప్రారంభం కాలేదు" అని చెప్పి, ఒక ఫోన్ నెంబర్ నాకిచ్చి, "మీరు అక్కడ ఉండాలనుకుంటే, ఈ నెంబరుకి ఫోన్ చేసి మాట్లాడండి" అని అన్నాడు. తీరా చూస్తే, ఆ బిల్డింగ్ ఛైర్మన్ మాకు తెలిసిన అన్నయ్య వరసయిన వ్యక్తి. వెంటనే మేము ఆయనకు ఫోన్ చేసి, "అన్నయ్యా! మేము శిరిడీ వచ్చాం. 20 రోజులు ఎక్కడ ఉండాలో తెలియటం లేదు"' అని అంటే, అందుకాయన, "ఎక్కడో ఎందుకురా? మన గుంటూరువారి సత్రం రెడీ అయింది. ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు నిశ్చింతగా ఉండండి” అని అన్నాడు. ఆ మాట వినగానే మాకు పెద్ద భారం దిగినట్టయ్యింది. అలా బాబానే ఆయా వ్యక్తుల రూపంలో ఆ 20 రోజులు మాకు భోజనానికి, వసతికి ఇబ్బంది లేకుండా చేశారని బాబాకి మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాము.


1995 లేదా 96లో మేము దర్శనం కోసం సమాధిమందిరం లోపలికి వెళ్ళే హడావిడిలో మా చెప్పులు అక్కడున్న పూలమొక్కల పక్కన వదిలి వెళ్ళాము. తీరా దర్శనమయ్యాక వచ్చి చూస్తే, మా చెప్పులు అక్కడ లేవు. నేను, నా భార్య అక్కడే ఒక షాపులో క్రొత్త చెప్పులు కొనుక్కున్నాం. కానీ మా అమ్మాయి చెప్పులు కొనుక్కోకుండా ఎండలో అలాగే నడచి రూముకు వచ్చింది. తరువాత కూడా చెప్పులు లేకుండానే ఎండలో బాబా దర్శనానికి వస్తూ, పోతూ ఉండేది. రెండు రోజుల తర్వాత మేము గురుస్థాన్ దగ్గరలో టీ తాగుతూ ఒక గట్టుమీద కూర్చొని బాబా గురించి మాట్లాడుకున్నాము. ఒక పావుగంట తర్వాత రూముకు వెళదామని బయలుదేరుతుంటే మా అమ్మాయికి తన కాళ్ళకు ప్రక్కగా రెండురోజుల క్రితం పోయిన తన చెప్పులు కన్పించాయి. ఎంత ఆశ్చర్యం! మా అమ్మాయి ఎక్కడో దూరాన పోయిన చెప్పులు రెండు రోజుల తర్వాత తన ప్రక్కనే ఉండటం చూసి సంతోషంతో, “ఎండలో నడచి దర్శనానికి వస్తున్న నా బాధను చూడలేక బాబా నా చెప్పులు నాకు దొరికేలా చేశారు" అని అంది.


ఒకసారి శిరిడీలో ఏం జరిగిందో చదవండి. నేను, నా భార్య, మా అమ్మాయి సమాధిమందిరంలో దర్శనానికి వెళ్తూ బాబా కోసం పాలకోవా తీసుకుని వెళ్ళాము. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడున్న పూజారికి మా చేతిలో ఉన్న పాలకోవా ప్యాకెట్లు ఇస్తే, అతను జనం ఎక్కువగా ఉండటం వల్ల ప్యాకెట్లు విప్పకుండా అలాగే బాబాకి చూపించి, మాకు తిరిగి ఇచ్చేశారు. బాబా దర్శనం అయిందన్న ఆనందంతో మేము బయటికి వచ్చాక నా భార్య నాతో, "ఈ ప్యాకెట్లు విప్పి బాబాకి నివేదించి ఉంటే తృప్తిగా ఉండేది” అని అంది. రెండు నిమిషాల తర్వాత నా భార్య ఆ ప్యాకెట్లు విప్పి, బాబా వచ్చి స్వీకరిస్తారనే దృఢవిశ్వాసంతో పాలకోవా అరచేతిలో పెట్టుకుని ద్వారకామాయి వైపు నడిచింది. అక్కడికి చేరుకున్నాక ద్వారకామాయి లోపలికి వెళ్ళడానికి లైన్‍లో చివరన నిల్చొని తల త్రిప్పి పక్కకు చూసింది. తలకు తలగుడ్డ కట్టుకుని, ముతక బట్టలు ధరించి ఆరడుగుల ఎత్తున్న ఒక వ్యక్తి నా భార్య దగ్గరకు వస్తూ కనిపించాడు. ఆమె అతని ముఖంకేసి చూస్తుంటే, అతని కళ్ళలోని కాంతి, ముఖంలోని తేజస్సుకి తనకు తెలియకుండానే తన చేతిలో ఉన్న పాలకోవా అతనికి ఇచ్చింది. అది చూసి, మరో ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఆయనకు ప్రసాదం పెట్టారు. నా భార్య బాబానే స్వయంగా వచ్చి పాలకోవా స్వీకరించారని చాలా ఆనందపడింది.


ఒకసారి శిరిడీలో మేము సంధ్య ఆరతికి సమాధిమందిరంలో ఉన్నాము. ఆరతి జరుగుతుండగా మందిరం 4 గేట్లు మూసివేసి ఆరతి అయ్యాక లోపలివారిని బయటికి పోనివ్వలేదు. ఎందుకని అడిగితే, "మందిరం గోడకు ఆనుకుని బయట ఉన్న షాపులన్నీ క్రేన్ సహాయంతో పడేస్తున్నారు. షాపులవాళ్ళకు, మందిరంవాళ్ళకు మధ్య గొడవ జరుగుతోంద"ని చెప్పారు. ఆ కారణంగా దాదాపు 2 గంటలు సమయం మందిరం లోపలే బాబా సమక్షంలో గడిపే భాగ్యం మాకు దక్కింది. తర్వాత ఒక గంటసేపు ఆగకుండా పెద్ద వర్షం కురిసింది. ప్రక్షాళన కోసమే బాబా అలా వర్షం కురిపించారని భావించాము. ఇకపోతే, పల్లకీ సేవను వీక్షించే మరియు పల్లకీని తాకే భాగ్యం, అలాగే పల్లకీలోని పూలు, బాబాని అభిషేకించిన జలం, బాబాకి నైవేద్యంగా పెట్టిన వెన్న, బాబా ధరించిన వస్త్రాలు(కఫ్నీ, శాలువా), బాబాకి వేసిన పూలమాలలు, గురుస్థాన్‌లోని వేపచెట్టు నుండి రాలిన వేపాకులు, బాబా మూర్తికి తాకించిన నాణాలు, ద్వారకామాయిలో బాబా ఉపయోగించిన కుండలోని మంచినీరు మొదలైన అన్నీ బాబా అనుగ్రహ ప్రసాదంగా మాకు లభించాయి.


నేను శిరిడీ వెళ్ళినప్పుడు, "మరల శిరిడీ వచ్చేవరకూ నాకు ఇష్టమైన ఆహారం స్వీకరించన"ని బాబాకు విన్నవించుకుంటూ ఉంటాను. ఒకసారి 'నాకు ఇష్టమైన తీపిపదార్థాలు తీసుకోను' అనుకుని ఒక సంవత్సరంపాటు తీపిపదార్థాలు తినలేదు. తర్వాత శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుని మేమున్న బసకు వెళ్ళగానే, ఎదురింట్లో ఉన్న మరాఠీయులు వాళ్ళ బాబుకు ఉపనయనం చేస్తూ, మమ్మల్ని భోజనానికి రమ్మని పిలిచారు. 'వాళ్ళెవరో తెలియకుండా ఎలా వెళ్ళడమ'ని మేము సంశయిస్తుంటే, వాళ్ళే మా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి పంక్తిలో కూర్చోబెట్టారు. ముందుగా వడ్డించింది ఏమిటో తెలుసా? 'జిలేబి'! దాన్ని బాబాకు అర్పించి స్వీకరించాను. ఇంకొక సంవత్సరం ఇష్టమైన ఇడ్లీ స్వీకరించలేదు. తరువాత శిరిడీ వెళ్ళినప్పుడు బాబా దర్శనం చేసుకుని, గదికి వెళ్ళగానే బాబా ఇడ్లీలు అమ్మే వ్యక్తిని నా వద్దకు పంపారు. మొదటి ఇడ్లీ బాబాకు అర్పించి, నా పక్కన ఉన్న వేరొకరికి ఇచ్చి తర్వాత నేను స్వీకరించాను.


ఈ లీల చదివితే బాబా అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. 1995 నుండి మేము ప్రతి సంవత్సరం శిరిడీ వెళ్తూ, మాతో ఒకరిని బాబా దర్శనానికి తీసుకువెళ్తుండేవాళ్ళం. ఒకసారి శిరిడీ వెళ్ళడానికి రిజర్వేషన్ కోసం గుంటూరు రైల్వేస్టేషనుకు వెళ్ళాము. అప్పుడు మాతో మా కుటుంబ స్నేహితుడు ఒకతను ఉన్నాడు. అతను క్రైస్తవుడు. మేము బాబాను, "ఇతన్ని మా వెంట శిరిడీ తీసుకుని రావచ్చా?" అని అడిగితే, “తీసుకురండి” అని బాబా సమాధానమిచ్చారు. అందువలన మేము రిజర్వేషన్ ఫారంలో మా పేర్లతో పాటు అతని పేరు కూడా వ్రాసి ఆ ఫారం, డబ్బులు అతని చేతికిచ్చి, "రిజర్వేషన్ చేయించమ"ని కౌంటర్ దగ్గరకు పంపాము. అతను క్లర్కు చేతికి ఫారం ఇచ్చిన మరుక్షణంలో కంప్యూటర్లన్నీ ఆగిపోయాయి(సహజంగా రైల్వే కంప్యూటర్స్ ఆగటం అనేది చాలా అరుదుగాగానీ జరగదు). అస్సలు పనిచేయలేదు. దాంతో క్లర్క్, "కాసేపు వేచి ఉండమ"ని త్రిప్పి పంపించాడు. మేము, 'ఏమైంద'ని అతని చేతిలో ఫారం తీసుకుని చూస్తే, చివరన వ్రాసిన అతని పేరు పెన్నుతో కొట్టేసి ఉంది. అతను తన పేరు కొట్టేసి ఫారం క్లర్కుకి ఇచ్చాడు. మాకు విషయం అర్థమై అతనితో, “బాబా నిన్ను కూడా శిరిడీకి తీసుకురమ్మన్నారు. కాబట్టి ఈసారి నీ పేరు ఫారంలో వ్రాసి క్లర్కుకు ఇవ్వు” అని చెప్పాము. అతను అలాగే చేశాడు. వెంటనే కంప్యూటర్స్ పనిచేయడం ప్రారంభించాయి. అతను మాతో, శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా అనుగ్రహంతో అతను కోరుకున్న కోరిక నెరవేరింది.


1999లో మేము ఒకసారి శిరిడీ వెళ్తూ నాగర్‌సోల్ స్టేషన్లో రైలు దిగి, అక్కడ ఒక బస్సు ఎక్కాము. బస్సులో 15 మంది యువకులు బాబా భజన చేస్తున్నారు. అయితే వాళ్ళు భక్తితోకాక గోలగోలగా చేస్తున్నారు. శిరిడీలో మేము బస్సు దిగిన తర్వాత వాళ్లలో ఒకతనిని పిలిచి, “బాబూ! ఇది శిరిడీ. మీరంతా కుర్రాళ్ళు. బాబాకు భక్తితో చేయండి, గోలగా కాదు” అని చెప్పాము. అప్పుడు అతను, "అలాగే"నని ఒక బాబా పుస్తకం మాకిచ్చి, “ఈ పుస్తకం మీకోసమే. ఉండనీయండి" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఉచితంగా ఇచ్చిన ఆ పుస్తకంలో బాబా గురించి, ఆరతులు, అష్టకం అన్నీ వివరంగా ఉన్నాయి. వాళ్ళు గోల చేయడం, మేము వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు మాకు బాబా పుస్తకాలు ఇవ్వడం అంతా బాబా లీల. మా దారిన మేము బస్సు దిగి నిశ్శబ్దంగా వెళ్ళిపోయి ఉంటే బాబా పుస్తకం మాకు లభించేనా? అప్పటినుండి బాబా తమకు సంబంధించిన పుస్తకాలు మా వద్దకు చేరుస్తున్నారు.


ఒకసారి మేము శిరిడీ వెళ్ళినప్పుడు మధ్యాహ్న భోజనం తర్వాత ఒకచోట విశ్రాంతిగా కూర్చున్నాము. ఆ ప్రక్కనే ఉన్న ఇంటివాళ్ళు సామాను సర్ది బయట పెట్టుకుంటున్నారు. నాలుగు బస్తాలనిండా ఉన్న కాగితాలు మమ్మల్ని ఆకర్షించాయి. మేము అవి ఏమిటని దగ్గరకు వెళ్ళి చూస్తే, 'బాబా సంపద'. మేము వాళ్ళని, “వీటిని ఏమి చేస్తారు” అని అడిగాము. వాళ్ళు, “అలాగే ఉంచుతాము. మీకు కావాలంటే ఉచితంగా తీసుకువెళ్ళండి” అని అన్నారు. మేము ఆనందంగా మా వద్ద ఉన్న పెద్ద కవర్ల నిండా ఆ బాబా సంపదను, అంటే ఆరతి పుస్తకాలు, బాబా స్టికర్లు, చిన్నచిన్న బాబా ఫోటోలు, పేపర్లు తీసుకున్నాము. అవన్నీ షాపులో కొనాలంటే చాలా డబ్బులు పెట్టాలి. అలాంటిది, బాబా మాపై దయతో ఉచితంగా ఇప్పించారు. శిరిడీ నుండి ఇంటికి వచ్చిన తర్వాత వాటిని చాలావరకూ బాబా భక్తులకు ఇచ్చాము. కాదు, బాబానే మాతో వారికి ఇప్పించారు.


ఇప్పుడు సాయి సచ్చరిత్ర పారాయణ ఫలితంగా నాకు బాబా అనుగ్రహం ఏ విధంగా లభించిందో వివరిస్తాను. 1995 నుండి మా కుటుంబం ప్రతి సంవత్సరం శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వస్తుండేవాళ్ళము. అలా 2012 వరకు అందరం కలిసి శిరిడీ వెళ్ళొచ్చాము. ఆ తర్వాత మాత్రం 2016 వరకు నాలుగు సంవత్సరాలపాటు మా కుటుంబంలో నేను తప్ప మిగతా అందరూ శిరిడీ వెళ్లొచ్చారు. కారణం, బాబా నాకు అనుమతినివ్వలేదు. 2017లో నేను బాధను తట్టుకోలేక, “బాబా! నేను శిరిడీ రానా?” అని బాబాను అడిగాను. కానీ ఎన్నిసార్లు అడిగినా బాబా నుండి  'వద్దు' అనే సమాధానం వస్తుండేది. చేసేదిలేక నేను రోజూ టీవీలో ఆరతి సమయంలో బాబాను చూస్తూ శిరిడీలో ఉన్నట్లే భావించుకుంటూ ఉండేవాడిని. కానీ తృప్తి ఉండేది కాదు. అప్పుడు 'మన భక్తికి బాబాకు దయ కలగకుండా ఉంటుందా?' అని పట్టుదలతో వారంరోజులు సచ్చరిత్ర నిష్ఠగా భక్తితో పారాయణ చేస్తే, బాబా నుండి శిరిడీ వెళ్ళడానికి అనుమతి లభించింది. అయితే నాకు తోడు ఎవరూ లేరు. అప్పటివరకూ నేను ఎన్నడూ ఒక్కడినే  శిరిడీ వెళ్ళలేదు. అదే ఆలోచిస్తుంటే, “బాబానే తోడుంటారు. ఇంకెవరి తోడూ అవసరం లేదు” అని నా భార్య అంది. దాంతో బాబానే ముందుండి నన్ను నడిపిస్తారనే నమ్మకంతో శిరిడీ ప్రయాణానికి సిద్ధమయ్యాను. అన్నీ సర్దుకుని ఉదయం 10 గంటలకు నేను ఇంటినుండి బయటికి వెళ్ళగానే మా స్టూడెంట్ ఒకబ్బాయి ఎదురొచ్చి, తన బైకు మీద నన్ను బస్టాప్ వద్ద దించాడు. నేను విజయవాడ బస్సు ఎక్కాను. ఆ బస్సు ముందు వెళ్తున్న కారు వెనక అద్దం మీద బాబా ముఖచిత్రం దర్శనమిచ్చింది. అది చూడగానే 'బాబా నా ముందే ఉన్నార'ని నాకు ధైర్యం వచ్చింది. విజయవాడ రైల్వేస్టేషన్‍కి చేరుకుని రైలు ఎక్కాను. నా ప్రక్క బెర్తులో ఉన్న అతను కూడా శిరిడీకే ప్రయాణమవుతున్నారు. అయితే అతను నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాత్రంతా ప్రయాణమయ్యాక ఉదయం నా ఎదురుగా ఉన్న మధ్యవయస్కులైన భార్యాభర్తలు నాకు కొంచెం కారం అటుకులిచ్చి తినమన్నారు. మామూలుగా అయితే బయటివాళ్ళు ఇచ్చినవి నేను తీసుకోను. కానీ బాబా చరిత్రలో పుండలీకరావు శిరిడీయాత్రలో కారం అటుకులు తినడం గుర్తొచ్చి, “వాటిని బాబానే ఇప్పిస్తున్నారేమో” అని తీసుకున్నాను. ఇకపోతే, నేను శిరిడీలో ఎప్పుడూ వెళ్ళే రూముకే వెళదామనుకుంటూ కూడా 'ఆ రూమ్ మందిరానికి దూరంగా ఉంటుంది. ఒక్కడినే గుడికి రాలేను, పోలేను. మరి ఎలా?' అని అనుకుంటుంటే నా పక్క బెర్తులో ఉన్నతను నన్ను పలకరించి నా వివరాలు అడిగి, ‘తాము శిరిడీలో ఇల్లు కట్టుకుని 20 సంవత్సరాలుగా భక్తులకు భోజన, వసతి ఏర్పాట్లు చేస్తున్నామ'ని చెప్పి, నన్ను వాళ్ళింటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ అంతా సౌకర్యంగా ఉండటంతో నేను రెండు రోజులు అక్కడే ఉన్నాను. వాళ్ళు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చూసుకుని, నేనున్న రెండు రోజులకూ నామమాత్రపు రుసుమే తీసుకున్నారు. అంతేకాక, నా తిరుగు ప్రయాణానికి టిక్కెట్టు కూడా వాళ్లే ఏర్పాటు చేసి రైలులో తినడానికి ఫలహారం, పులిహోర ప్యాకెట్లు ఇచ్చారు. మామూలుగా అయితే డబ్బు ఖర్చే కానీ పొట్ట నిండదు. ఇకపోతే నేను వెళ్లిన సమయంలో వరుసగా మూడు రోజులు సెలవు దినాలు రావడం, అదీకాక హోళీ పండుగ ఉండటం వల్ల దర్శనానికి చాలా జనం ఉన్నారు. అయినప్పటికీ బాబా నాకు మొదటిరోజు ఒక్క గంటలో, రెండోరోజు ముప్పావు గంట సమయంలోనే తమ దర్శనాన్ని అనుగ్రహించారు. పూజారి నా వద్ద ఉన్న ప్రసాదం ప్యాకెట్‍ను బాబా విగ్రహానికి తాకించి ఇచ్చారు. నేను డొనేషన్ కౌంటర్లో డొనేషన్ కడితే వాళ్ళు చాలా ఊదీ ప్యాకెట్లను, బాబా తలకు కట్టే వస్త్రాన్ని నాకు ఉచితంగా ఇచ్చారు. నేను సంతోషంగా బాబాకి, ఆ క్లర్కుకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. 1916 నాటి బ్లాక్&వైట్ బాబా చావడి ఉత్సవం ఒరిజినల్ ఫోటో ఒక షాపులో కన్పిస్తే, అది కూడా తీసుకుని అతి తక్కువ ఖర్చుతో శిరిడీ యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చాను. చివరిగా ఇంకో విషయం చెప్పాలి, నేను ఇంటినుండి శిరిడీకి ప్రయాణమయ్యే ముందు నా భార్య బాబాను, “నా భర్త శిరిడీ వస్తున్నారు. ఆయన తీసుకొస్తున్న డబ్బులు ఖర్చులకు సరిపోతాయా?" అని అడిగితే, “సరిపోగా ఇంకా మిగులుతాయి" అని బాబా సమాధానం వచ్చింది. అది అక్షరాలా నిజమైంది. అలా సచ్చరిత్ర పారాయణ ఫలితంగా నేను శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వచ్చాను.


తరువాయి భాగం వచ్చేవారం...

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


2 comments:

  1. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo