- శ్రీసాయి అనుగ్రహ లీలలు - ఐదవ భాగం
బాబా ఉనికి
సాయిబాబుగారు బాబా తమకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.
1918లో విజయదశమి రోజున బాబా మహాసమాధి చెంది భౌతికంగా భక్తులకు దూరమైనా, “పిలిస్తే పలుకుతాన”ని తామిచ్చిన వాగ్దానాన్ని అనుసరించి సమాధి అనంతరం కూడా ఆయన కొందరికి సశరీరులుగా, కొందరికి స్వప్నంలో, మరికొందరికి వాక్కు ద్వారా, ఇంకొందరికి ఇతర రూపాలలో, ఇంక ఇతరత్రా మార్గాలలో తమ ఉనికిని తెలియజేస్తున్నారు. సుమారు 50 సంవత్సరాల మా బాబా ఆరాధనలో నాలుగుసార్లు బాబా నాకు నిజదర్శనం ఇచ్చారు. 2002లో ఒకరోజు సాయంత్రం మా స్వగృహమందు నేను యధావిధిగా బాబాకి పూజ చేసి, నైవేద్యం సమర్పించాను. అనంతరం హారతికి కొంచెం సమయముందని బయట ఖాళీ ప్రదేశంలో కూర్చున్నాను. స్కూలు పిల్లలు ట్యూషనుకు వచ్చారు. నా మేనకోడలు కూడా ట్యూషనుకు వచ్చింది. తన పేరు హనీ. తనకప్పుడు 7 సంవత్సరాలు ఉంటాయి. చిన్నతనం నుండి రోజూ మా ఇంటికి రావడం, బాబా పూజలో పాల్గొనడం వల్ల తనకి చిన్నవయసులోనే బాబాపట్ల భక్తి అబ్బింది. తను రాగానే నేను, “హనీ! బాబాకి పూజ చేసాను. నువ్వు హారతి ఇవ్వు” అని పూజ గదిలోకి పంపాను. తను లోపలికి వెళ్ళి బాబాకి హారతి ఇచ్చి, హారతి కళ్ళకద్దుకుని గడప బయటకు ఒక అడుగువేసి, మళ్ళీ వెంటనే లోపలికి అడుగువేసి, “ఎవరూ, ఎవరూ” అంటూ చూస్తూ నిలబడిపోయింది. నేను వెంటనే పూజ గదిలోకి వెళ్ళి, తూర్పున ఉన్న గది వైపు చూసి నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. కాషాయ వస్త్రాలు ధరించి ఆజానుబాహులుగా ఉన్న బాబా ఎడమ చేతిని నేను స్పష్టంగా చూశాను. ఆయన భుజం నుండి హస్తం వరకూ భారీగా ఉంది. ఆయన నడుచుకుంటూ తూర్పున ఉన్న గదిని దాటి, ప్రధాన ద్వారం గుండా బయటకు అడుగు వేసి, కుడివైపుకు తిరిగి అక్కడ గోడకున్న పెద్ద లామినేషన్ ఫోటో లోనికి(ఆ ఫొటోలో బాబా నిలబడి ఉంటారు) వెళ్లిపోయారు. అంటే బాబా పూజ గదిలో ప్రత్యక్షమై నడుచుకుంటూ తూర్పు గది మీదుగా బయట ఉన్న ఆయన ఫోటోలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఆనాడు శిరిడీలో బాబా శ్యామాకు, బూటీకి ఒకేసారి కలలో కనపడి, సమాధి మందిర నిర్మాణం గురించి చెప్పినట్లు ఈనాడు నాకు, నా మేనకోడలు హనీకి ఒకేసారి నిజ దర్శనమిచ్చారు. నేను, మా హనీ కళ్లారా చూసిన బాబా నిజరూపదర్శనమది.
2003లో మా అమ్మాయి ఇంటర్ రెండవ సంవత్సరం చివరి పరీక్షలు వ్రాయడానికి తెనాలి వెళ్లాల్సి ఉండగా తనతోపాటు, నేను, నా మేనకోడలు హనీ స్కూటర్ మీద తెనాలి వెళ్ళాము. పరీక్ష మొదలవడానికి చాలా సమయం ఉన్నందున మేము బాబా ఆశీస్సుల కోసం సుల్తానాబాదులో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళాం. ఆ రోజు గురువారం కానందున గుడిలో భక్తుల రద్దీ అంతగా లేదు. మేము బాబాకి నమస్కరిస్తూ నిలబడి ఉండగా 80 ఏళ్ల ఒక ముసలావిడ బాబా ముందుకు వచ్చి, బాబానే చూస్తూ, తన్మయత్వంతో మధురంగా బాబా పాటలు పాడసాగింది. ఆవిడ అలా దాదాపు అరగంటసేపు పాడుతూనే ఉంది. మేము ముగ్గురమూ ఆ పాటలు వింటూ బాబానే చూస్తూ చుట్టూ పరిసరాలను మరచిపోయాము. అప్పుడు ఒక వింత జరిగింది. దర్శనమయ్యాక బయటకు వస్తూ నేను మా అమ్మాయితో, "శ్రావ్యా! బాబా ఇప్పుడు ఏం చేశారో తెలుసా?" అని జరిగింది చెప్పబోయాను. అంతలో మా హనీ, “అదేమిటంటే అక్కా! బాబా కళ్ళు మూసి, తెరిచారు” అంది. నేను చెప్పబోయింది కూడా ఆ దృశ్యం గురించే. విషయమేమిటంటే, ఆ ముసలావిడ పాటలకు తన్మయులైన బాబా తమ నయనాలు నెమ్మదిగా మూసి, తెరిచారు. అది మేము చాలా స్పష్టంగా చూసాము. అలా రెండోసారి నాకు, హనీకి ఒకే సమయంలో బాబా నిజ దర్శనమైంది.
శిరిడీ సమాధి మందిరంలో మూడోసారి బాబా ఇచ్చిన దర్శనం: 2004లో మా కుటుంబం బాబా దర్శనానికి శిరిడీ వెళ్ళాము. అప్పుడు ఒకరోజు మధ్యాహ్న హారతికి సమాధి మందిరం హాల్లో ఉన్నాము. నేను వెనుక ఉన్న డయాస్ మెట్లపై కూర్చొని హారతి చూస్తున్నాను. హారతి ముగిసే సమయానికి నా ముందున్న వారిని గమనించాను. ప్రక్కప్రక్కనే కూర్చున్న 17-18 సంవత్సరాల వయసున్న ఇద్దరు యువకులు మెల్లగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లలో ఒకరి ముఖం నాకు కనిపించింది. వాళ్ళు తెలుగువాళ్లే. వాళ్ళ పక్కన 40 సంవత్సరాల ఒక మరాఠీ స్త్రీ కూర్చొని ఉంది. ఆమె చేతిలో పూలు, బాబా తలకు కట్టే 'సాయిరాం' అని రాసి ఉన్న గుడ్డ ఉంది. వాటిని ఆమె బాబాకు సమర్పించాలని తీసుకుందనుకుంటాను. నాకు ఒక ఆలోచన వచ్చి మనస్సులో, “బాబా! ఈ హాల్లో సుమారు 1000 మంది భక్తులు ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఏదైనా లీలను ప్రదర్శిస్తే, వీళ్ళు ఆ లీలను బయట చాలా మందికి తెలియచేస్తారు. మీ కీర్తి (నీ తత్వం) పెరుగుతుంది” అని అనుకున్నాను. అంతే, ఒక్క నిమిషంలో నా ముందున్న యువకుడు చిన్నగా వణుకుతూ హిందీలో ఏదో మాట్లాడుతూ, తల కూడా బాబాలాగా కదిలించడం చేస్తున్నాడు. అతని ప్రక్కనున్న మరో యువకుడు అతనికి ఏమైందోనని కంగారుపడిపోయాడు. పక్కనున్న మరాఠీ స్త్రీ తన చేతిలోని గుడ్డను ఆ వణుకుతున్న యువకుని తలచుట్టూ చుట్టేసింది. హాల్లో కలకలం బయలుదేరింది. బాబా సమాధి వద్ద ఉన్న పూజారి పరుగున ఆ కుర్రవాడి వద్దకు వచ్చి మరాఠీలో, “ఏమిటి బాబా ఇలా వచ్చారు? ఏమైంది? మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా?” అని అడుగుతూ ఆ కుర్రవాడి చెయ్యి పట్టుకుని బాబా విగ్రహం వద్దకు తీసుకెళ్తున్నాడు. అదంతా గమనిస్తున్న నేను వాళ్ళ వెనుకే గబగబా వెళ్ళాను. బాబా విగ్రహం దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ యువకుడి ముఖం నేను చూశాను. ఆ యువకుడి ముఖంలో అరవై సంవత్సరాల వయస్సున్న ముసలివానిలా శ్రీసాయినాథుని దివ్య మంగళ ముఖారవిందం నాకు దర్శనమైంది. తర్వాత రోజు దర్శనానికి హాల్లో వేచి ఉన్న నేను నా ప్రక్కనున్న వాళ్ళతో, 'బాబా నాకు 60 సంవత్సరాల ముసలివాని ముఖంతో దర్శనమిచ్చార'ని ముందురోజు జరిగిన సంఘటన గురించి వివరంగా చెప్పాను. ఐదు నిమిషాల తర్వాత ప్రక్కనున్న ఒకతని చేతిలో ఉన్న 'నేనుండగా భయమేలా?' అని వ్రాసి ఉన్న బాబా పుస్తకం అడిగి తీసుకుని ఒక పేజీ తెరిచాను. అందులో నేను చదివిన మొదటి వాక్యం: "ఏమిటీ, నేను ముసలివాడినా! నాకు లక్షల సంవత్సరాల వయస్సు" అని. అలా బాబా నన్ను ఆ పుస్తకంలోని వాక్యం ద్వారా నేను వారిని ముసలివానిలా ఉన్నారన్నందుకు మందలిస్తున్నారనిపించింది. అంతేకాదు, 'అన్ని రూపాలలో ఉన్నది తామేనని, తమకు వయస్సుతో నిమిత్తం లేద'ని బాబా నాకు తెలియజెప్తున్నారనిపించింది. ఎంత ఆశ్చర్యం! చూశారా బాబా లీల. 'పిలిస్తే బాబా పలుకుతాడు' అనే మాటలో సందేహం లేదు.
ఇంకోసారి నేను, నా భార్య, మా అమ్మాయి సమాధి మందిరంలో ఒక గోడ పక్కనే నిల్చుని బాబాని చూస్తూ ఉన్నాము. హఠాత్తుగా బాబా అక్కడున్న గోడలో నుండి కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సాధువు రూపంలో బయటకు వచ్చి మా ముగ్గురి నుదుటన ఊదీ పెట్టి, తిరిగి గోడలోకి వెళ్ళిపోయారు. మేము ఆశ్చర్యంతో మా పక్కన నిల్చున్నవారిని, "మా నుదుటన ఊదీ ఉందా?" అని అడిగితే, "ఉంది" అని చెప్పారు. "ధన్యవాదాలు సాయీ".
ఒకసారి మేము బట్టలు కొనడానికని ఒక షాపుకు వెళ్ళి కొన్ని బట్టలు ఎంచుకున్న తర్వాత, “రేటు చూసి వేయండి" అని అన్నాము. ఆ షాపువాళ్లు కూడా బాబా భక్తులే. షాపులో పెద్ద బాబా ఫోటో పెట్టుకున్నారు. వాళ్ళు, "మాకు వచ్చిన రేటుకు స్వల్ప లాభం వేసుకుని ఇస్తున్నాము" అని చెప్పి మాటల మధ్యలో మేము కూడా సాయిని ఆరాధిస్తామని తెలిసి, మాకొక బహుమానం ఇచ్చారు. శిరిడీ సమాధి మందిరంలో బాబా విగ్రహం ప్రతిష్టించక ముందు ఒక బాబా ఫోటో ఉండేది. అటువంటి ఛాయాచిత్రం చాలా అరుదుగా దొరుకుతుంది. బాబా దయవల్ల ఆ బట్టల షాపువాళ్ళు మాకు అటువంటి ఛాయాచిత్రాన్ని మాకు ఇచ్చారు. బాబానే మాకు ఆ ఫోటోని అనుగ్రహించారు. మేము ఆ ఛాయాచిత్రానికి ఫ్రేము కట్టించి పూజలో పెట్టుకున్నాము. మేము ఒకసారి పూజలో ఉన్న ఆ బాబా ఫోటోను సెల్‌ఫోన్‍తో ఫోటో తీస్తే ఆ ఫోటోకి, మామూలుగా పూజలో ఉన్న ఫోటోకి ఎంతో వ్యత్యాసముంది. సెల్‌ఫోన్‍లో తీసిన ఫొటోలో సశరీరులుగా ఉన్న బాబా ముఖము, చేయి కనిపించాయి. ఆయన గడ్డం తెల్లగా ఉంది.
ఒక గురుపౌర్ణమినాడు నేను, నా భార్య చేబ్రోలులో ఉన్న బాబా గుడికి వెళ్ళాము. గుడిని చాలా అందంగా అలంకరించారు. ఆ ఆలయ ధర్మకర్త, అతని భార్య బాబాకి విశేష పూజ చేయనుండగా ఆ పూజలో నేను, నా భార్య కూడా పాల్గొన్నాము. బాబా మాకు మాత్రమే ఆ మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. పూజ పూర్తయిన తరవాత పాలరాతి పాదాలను పూలతో నిండుగా అలంకరించారు. ఆ పాదాలపై శిరస్సు ఉంచి నమస్కరించుకున్న తరువాత సెల్‌ఫోన్‌లో ఫోటో తీస్తే నిండుగా పూలతో కప్పబడ్డ పాలరాతి పాదాలకు బదులుగా నిజమైన బాబా పాదాలు స్పష్టంగా కనిపించాయి. అది గురుపూర్ణిమినాడు బాబా మాకిచ్చిన గొప్ప ఆశీర్వాదము.
ఒకసారి నా భార్య స్నేహితురాలు పిలిస్తే మేము అనంతపురం వెళ్ళాము. అక్కడ బాబా మందిరాలు చాలా ఉన్నాయి. ఒక గురువారం బాబా దర్శనం కోసమని మేము ఒక మందిరానికి వెళ్ళాము. అక్కడ బాబా సజీవమూర్తి ఉన్నారు. చూసేవారికి అది విగ్రహమే. మాకు మాత్రం బాబానే దర్శనమిచ్చారు. ఆయననలా చూస్తుంటే నా కన్నుల నుండి నీళ్ళు వచ్చేశాయి.
బాబా పలుకులు నా చెవిలో మారుమ్రోగిన వైనం: ఒకరోజు నేను స్కూటర్ మీద చేబ్రోలు చాలా వేగంగా వెళ్తున్నాను. కొద్దిసేపట్లో చేబ్రోలు చేరుకుంటాననగా నా చెవిలో ఏవో మాటలు విన్పించాయి. కొంచెం శ్రద్ధ పెట్టి వినగా, “ఎందుకంత వేగంగా వెళ్తున్నావు? ముందు చూడు, ముందుకి చూసి వెళ్ళు” అని పదేపదే వినపడింది. అన్నిసార్లు వినిపించేసరికి నేను వేగం తగ్గించి, ముందుకు చూసాను. కొద్ది దూరంలో ఉన్న పోలీసు స్టేషను ముందు పోలీసులు వాహనాలను ఆపడం కన్పించింది. వాళ్ళు ఖచ్చితంగా నా బండిని కూడా ఆపుతారు. కానీ హడావిడిగా బయలుదేరడంలో నేను స్కూటరుకి సంబంధించిన కాగితాలు ఇంట్లోనే మర్చిపోయాను. అందుకే బాబా నా చెవిలో తమ స్వరాన్ని వినిపించి హెచ్చరించడమే కాకుండా 'నిదానమే ప్రధానమ'ని తెలియజేసారు. నేను వెంటనే బండి వెనుకకు త్రిప్పి ఇంటికి వచ్చేసి, కాగితాలు తీసుకుని తర్వాత వెళ్ళాను.
2019, జూలై మొదటి వారంలో నేను బెంగుళూరులో ఉన్న మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడు ఒక శనివారం సాయంత్రం 6 గంటలప్పుడు మేము దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళాము. ఆ గుడి అచ్చం శిరిడిలో ఉన్న బాబా మందిరంలా ఉంది. నేను మా అమ్మాయితో, “వీడియో కాల్ చేసి, మమ్మీ (నా భార్య)కి ఈ గుడి చూపించు” అని అన్నాను. అందుకు మా అమ్మాయి, "వద్దు” అని అంది. సరిగ్గా అదే సమయంలో నారాకోడూరులో పూజ చేసుకుంటున్న నా భార్యకి “బెంగుళూరుకి ఫోన్ చేయి” అని బాబా చెప్తున్నట్లు వినిపించి ఆమె వెంటనే వీడియోకాల్ చేసింది. అంతే మా అమ్మాయి మందిరం అంతా ఆమెకి ఫోన్‍లో చూపించింది. అది చూసిన నా భార్య శిరిడీ దర్శించినంత సంబరపడిపోయింది. అలా బాబా మనోవాంఛలను తీరుస్తారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. నేను మొదట 1967లో శిరిడీ దర్శించాను. మేము వెళ్ళిన ఆ గుడి నిర్మించినతను కూడా 1967లోనే మొట్టమొదట శిరిడీ దర్శించారట. చూశారా, బాబా సాయి బంధువులను ఎలా కలుపుతారో.
మేము 1995లో గుంటూరు నుండి నారాకోడూరుకి మారాం. మేము అక్కడికి వచ్చిన క్రొత్తలో శిరిడీలో బాబా సమాధికి తాకించి తెచ్చుకున్న ఒక బాబా ఫోటో ఫ్రేము మా ఇంటిలో ఒక గోడకు తగిలించాము. రాత్రిళ్ళు ఆ ఫోటోలో నుండి ఒక వెలుగు వచ్చి, గదంతా తిరిగి మళ్ళీ ఆ ఫోటోలోకి వెళ్ళిపోతుండేది. ఆ వెలుగును మేము అందరం చూశాము.
2015వ సంవత్సరం చివరిలో ఒక గురువారం నాడు మేము చేబ్రోలులోని బాబా మందిరానికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చాము. మరునాడు శుక్రవారం ఉదయం మా ఇంట్లోని బాబా విగ్రహానికి కుడివైపున పాదాల వద్ద ఊదీ ఉండటం చూసి ఆనందంతో మా కన్నులలో నీళ్ళొచ్చాయి. మా భక్తికి మెచ్చి బాబా మాకు చూపిన లీల ఇది. మేము ఆ ఊదీని తీసి పొట్లం కట్టి భద్రపరిచాము.
ఒకప్పుడు టీవీలో శిరిడీ హారతులు వచ్చేవి కాదు. కేవలం టేప్‍రికార్డులో పెట్టుకుని వినేవాళ్ళం. ఇప్పుడు టీవీలో, వెబ్‍సైటులో బాబాను ప్రత్యక్షంగా వీక్షించగలుగుతున్నాము. మనం అంతదూరం ప్రయాణించి శిరిడీ వెళ్ళలేమని ఆయనే స్వయంగా మన ఇళ్ళకు వస్తున్నారు. "ఎంత కరుణామూర్తివయ్యా సాయి!". ఇక విషయానికి వస్తే, మేము ఇదివరకు ప్రతిరోజు ఉదయం 4-30కి కాకడ హారతి దర్శించేవాళ్ళము. ఒకరోజు హారతిలో బాబా మూర్తి యొక్క ముఖంలో స్పష్టత లేదు. అప్పుడు నేను మనసులో “ఎందుకు బాబా? ఈ రోజు దర్శనం సరిగ్గా ఇవ్వలేదు” అని అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం మళ్ళీ కాకడ హారతి చూస్తున్నప్పుడు బాబా ముఖం మాత్రమే టీ.వి. స్క్రీన్ మొత్తం కనిపించి, తర్వాత బాబా చరణాలు, బాబా హస్తం ఒక్కొక్కటిగా చాలా స్పష్టంగా కనిపించాయి. హారతి అయ్యేంతవరకూ అలా కన్పిస్తూనే ఉన్నాయి. మామూలుగా అయితే మొత్తం బాబా మూర్తి, సమాధి కనిపించాలి. కానీ ముందురోజు నేను నా మనసులో అనుకున్న దానికి బాబా ఆ రోజు నాకు అలా దర్శనం ఇచ్చారు.
మేము స్కూలు నడుపుతున్నప్పుడు ఒక సమస్య గురించి వ్రాసి గుడిలో బాబా ముందుంచాము. మామూలుగా ఆ గుడిలో భక్తులు కాగితంలో వ్రాసే విషయాలను శేజారతికి ముందు చదువుతారు. అయితే మా విషయంలో ఏం జరిగిందో చూడండి. మేము, పూజారి చూస్తుండగానే మేము వ్రాసిన కాగితం గుండ్రంగా దొర్లుకుంటూ బాబా పాదం చుట్టూ ఉన్న ఇత్తడి రేకు క్రిందకి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ గాలిగాని, ఫ్యాన్‍గాని లేవు. పూజారి, "బాబా మీరు వ్రాసిన కాగితాన్ని తీసుకుని ఆ రేకు కింద పెట్టుకున్నట్లుంది. మీ విన్నపం బాబా చదివేశారు. మీరు అందులో వ్రాసింది తప్పక అయి తీరుతుంద"ని అన్నారు. అలాగే జరిగింది.
మేము ఒకసారి బజారులో కారు పార్క్ చేసి నడుస్తుంటే, ఒక పంటి డాక్టరు క్లినిక్ బోర్డు కనిపించింది. నిజానికి మేము ఏ వ్యాధికైనా డాక్టరు దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడం. అటువంటిది ఆరోజు మాకు తెలియకుండానే మేము ఆ క్లినిక్ లోపలికి వెళ్ళాము. అక్కడ ఒక కుర్ర డాక్టరు ఉన్నాడు. జనరల్ చెకప్ అయిన తర్వాత మేము ఆ డాక్టరుతో, "ఉదయం హాస్పిటల్‍కు రాగానే బాబాని తలుచుకుని, నీ పని మొదలుపెట్టుకో. అంతా మంచే జరుగుతుంద"ని చెప్పాము. వెంటనే ఆ డాక్టరు, "అలాగే నండి" అని, తనకు తెలిసిన సాయి భక్తుల గురించి మాతో చెప్పి, వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చి కలవమని చెప్పాడు. ఇంటికి వెళ్ళడానికి ఆలస్యమవుతున్నా మేము పట్టించుకోకుండా వెంటనే ఆ డాక్టరు ఇచ్చిన అడ్రస్‍కి వెళ్లి, ఆ ఇంటి లోపలికి వెళ్ళాము. ఆశ్చర్యం! అక్కడ పెద్ద బాబా ఫోటో, దాని ముందు బాబా హస్తంలో నుండి రాలిపడుతున్న పెద్ద విభూది కుప్ప ఉంది. ఆ ఇంటివాళ్ళు ఎంతో ఆప్యాయంగా మాతో మాట్లాడి ఆ కుప్పలోని విబూది పొట్లం కట్టి మాకిచ్చారు. మేము కొంచెం సేపు అక్కడే నిలబడి బాబా కుడి హస్తం నుండి పడుతున్న విబూదిని చూసి నమస్కారం చేసుకుని, ఆ ఇంటి యజమాని వ్రాసిన 'సాయి సన్నిధి' అనే పుస్తకం తీసుకుని ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాము.
2018వ సంవత్సరం, మే నెల మొదట్లో మా అమ్మాయి మాతో, "తెనాలిలోని బాబా భక్తులు 'సాయి నామ కోటి' చేస్తున్నారు. మీరు కూడా మీ వంతు నామం చేయండి” అని చెప్పింది. "అలాగే"నని, నేను, నా భార్య అదేరోజు 'ఓం శ్రీసాయినాథాయ నమః' అనే నామజపం ప్రారంభించి 40 రోజులు పూర్తయిన తర్వాత పూర్ణాహుతికి ముందురోజు మేము తెనాలిలోని ఆ భక్తుల ఇంటికి వెళ్ళాము. వాళ్ళు తమ ఇంటిలో ఒక హాలంతా బాబాకి కేటాయించారు. సాయి నామకోటి చేసిన దానికి ప్రతిఫలంగా బాబా ఆ హాలంతా విబూది కురిపించారు. మా అనుభవాలు వాళ్ళకి, వాళ్ళ అనుభవాలు మాకు చెప్పుకుంటూ బాబా గురించి మాట్లాడుకుంటుంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇలా బాబా తమను అత్యంత భక్తితో పూజించే భక్తులను బంధువులుగా మాకు పరిచయం చేస్తుండేవారు. సిరిపురం, గుంటూరు, తెనాలిలో మాకు చాలామంది సాయి బంధువులు ఉన్నారు. "ధన్యవాదాలు బాబా.
ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. |
|
తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.
|
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram 🙏🏻 బాబా గారు మీకు ఇలాంటి అనుభవాలు ఇచ్చినందుకు మీరు చాలా అదృష్టవంతులు.
ReplyDeleteOm sairam
ReplyDeleteSai always be with me
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam
ReplyDeleteSamardha sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏
ReplyDeleteOme sai ram🙏
ReplyDeleteసాయిరాం! ఎవరైనా దయచేసి చెప్పండి షిర్డీ లాంటి మందిరం(పై పోస్ట్ లో చెప్పబడిన) బెంగళూరు లో ఎక్కడ వుంది అని. ప్లీజ్
ReplyDelete