- శ్రీసాయి అనుగ్రహ జల్లులు
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నేను సాయిభక్తురాలిని. ముందుగా, నా అనుభవాలను ఆలస్యంగా పంచుకుంటున్నందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటూ, ఆయన నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. బాబా దయవల్ల 2016, మార్చి నెలలో నేను బీ.టెక్ చదువుతున్నప్పుడు ఒక పెద్ద ఎం.ఎన్.సి కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. డిసెంబరులో నేను ఆ కంపెనీలో జాయిన్ అయి రెండు నెలల ట్రైనింగ్ కోసం కేరళలోని త్రివేండ్రం వెళ్లాను. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వర్కింగ్ లొకేషన్ 'కొచ్చి' బ్రాంచికి ఇచ్చారు. కొచ్చిలో నాకు ఎవరూ తెలియనందువల్ల, "బాబా! ఎలాగైనా హెచ్ఆర్ నా వర్క్ లొకేషన్ మార్చేలా చూడండి" అని బాబాను వేడుకుని హెచ్ఆర్‍ని అడిగితే, ఆయన వెంటనే నన్ను హైదరాబాదుకి మార్చారు. హైదరాబాద్ వచ్చాక ప్రాజెక్టులేవీ లేనందున నేను మూడు నెలలు ఖాళీగా ఉన్నాను. తర్వాత ఒక ప్రాజెక్టులో వేశారు, కానీ నేను ఇంట్లోవాళ్ళని వదిలి ఉండలేకపోయాను. ఎలాగో కష్టంగా రెండు నెలలు గడిపేసరికి ఇంట్లోవాళ్ళకి దూరంగా ఉండటం అలవాటైంది. అలా ఉండగా, ఒక అబ్బాయి బాగుండేవాడని నేను అతన్ని చూస్తుండేదాన్ని. తర్వాత ఆ అబ్బాయితో పరిచయమై ఇద్దరం బాగా మాట్లాడుకుంటూ కుదిరితే పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ ఎందుకో తెలీదు, ఉన్నట్టుండి అతని పట్ల నాకు ప్రతికూల భావం ఏర్పడింది. బహుశా బాబానే అటువంటి భావం కలిగేలా చేసి వుంటారు. క్రమంగా నేను అతనితో మాట్లాడటం మానేశాను. అతను కూడా నాతో మాట్లాడలేదు. మూడు నెలలయ్యాక ఆఫీసులోని వేరేవాళ్ల ద్వారా తెలిసిన విషయమేమిటంటే, 'ఆ అబ్బాయికి అంతకుముందే పెళ్ళై, ఒక బాబు కూడా ఉన్నాడ'ని. అప్పుడు బాబా నన్ను చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడారని అర్థమై బాబాకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. కొన్ని నెలలయ్యాక నా ఫ్రెండ్ ద్వారా ఇంకో అబ్బాయి పరిచయమయ్యాడు. ఆ అబ్బాయి మాకు దూరపు బంధువే. అప్పటికే అటు ఆ అబ్బాయికి, ఇటు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బాబా దయవల్ల మా ఇద్దరికీ సంబంధం కుదిరి మా పెళ్లి జరిగింది. బాబానే ముందు అబ్బాయిని నా జీవితంలో నుంచి తొలగించి, నా భర్తను నాకు అనుగ్రహించారు. అయితే మాకు పెళ్ళైన రెండు సంవత్సరాల వరకు ఒక సమస్య ఉండేది. ఆ విషయమై నేను సాయి దివ్యపూజ ఐదు రోజులు చేశాను. అంతే, రెండు సంవత్సరాల సమస్యను ఐదు రోజుల్లో తీసేశారు బాబా.
నేను మొదటి కంపెనీలో నాలుగు సంవత్సరాల ఐదు నెలలు పనిచేశాక నా సహోద్యోగి ఒకాయన, "వేరే కంపెనీలో జాబ్ చూసుకోండి. బయట మంచి జీతం ఇస్తారు" అని నన్ను ప్రోత్సహించారు. నేను అలాగే ప్రయత్నిస్తే, బాబా దయవల్ల 110% అదనపు జీతంతో నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ కొన్నాళ్ళు పనిచేశాక నేను వేరే ఉద్యోగం కోసం ప్రయత్నించాను. ఆ క్రమంలో నాకు రెండు కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. వాటిలో ఒక కంపెనీలో జాయిన్ అవడానికి ఇష్టపడి, 'నేను అడిగిన జీతం నాకు ఇవ్వండి' అని అడిగితే, వాళ్ళు ఏవో అప్రూవల్స్ కావాలని అన్నారు. అప్పుడు నేను, "ప్లీజ్ బాబా, నాకు అడిగింది ఇవ్వండి" అని బాబాను అడిగాను. ఆరోజు రాత్రి కలలో బాబా, "నీ కోరికలు నెరవేరుతాయి. నువ్వు వాటి ఫలాలను అందుకుంటావు" అని చెప్పారు. ఉదయం నిద్రలేచాక ఆ కలను గుర్తుచేసుకుని, బాబా నేను కోరుకున్నది తప్పకుండా నాకు ఇస్తారని అనుకున్నాను. కానీ ఆ కంపెనీవాళ్ళు నేను అడిగిన జీతం ఇవ్వలేమని అన్నారు. అప్పుడు నేను saispeeks అనే వెబ్‌సైటులో బాబాను అడిగితే, "అనుమానించకు, సాయిని నమ్ము. ఆయన నిన్ను సంతృప్తిపరుస్తారు" అని వచ్చింది. అదేరోజు సాయంత్రం నేను ఆ కంపెనీవాళ్లతో, "నేను అడిగిన జీతంకన్నా కొంచెం తక్కువైనా పర్లేదు. నాకు ఆఫర్ లెటర్ ఇవ్వండి" అని అడిగాను. అయితే బాబా దయవల్ల వాళ్ళు నేను ముందు అడిగిన జీతంతోనే ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నేను అస్సలు నమ్మలేకపోయాను. బాబా చెప్పింది అక్షరాలా నిజమైంది.
నేను ప్రస్తుతం చేస్తున్న కంపెనీలో ఉద్యోగస్తుల పనితీరు బాగుంటే ఆరునెలలు పూర్తయిన తరువాత పర్మినెంట్ చేస్తారని, ఒకవేళ పనితీరు నచ్చకపోతే మరో ఆరునెలలు పొడిగిస్తారని నాతో తోటి ఉద్యోగస్తులు చెప్పారు. అది విన్నాక నాకు భయమేసి, "బాబా! ఏ ఆటంకం లేకుండా నా ఉద్యోగం పర్మినెంట్ చేయండి. అలా అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల అంతా సవ్యంగా జరిగి ఏ ఆటంకం లేకుండా నా జాబ్ పర్మినెంట్ అయింది.
2021, నవంబర్ 25న మా చెల్లి ఆస్ట్రేలియా నుంచి 3 లక్షలు నా అకౌంటుకి పంపింది. ఆ డబ్బులు నా అకౌంట్లో జమ అయ్యాయి కూడా. అయితే ఐదు రోజుల తరువాత మా చెల్లి, "మూడు లక్షలు వచ్చాయా?" అని అడిగితే, నేను తను మళ్ళీ పంపిందేమో అనుకొని, "ఇంకా రాలేద"ని చెప్పాను. తరువాత నేను మా అమ్మతో, "చెల్లి బాగానే సంపాదిస్తోంది" అని అన్నాను. తరువాతరోజు చెల్లి అడిగిన మరో మూడు లక్షలు వచ్చాయేమోనని చూస్తే, రాలేదు. దాంతో, 'చెల్లి అకౌంట్లోని డబ్బులు కట్ అయిపోయాయి. నాకేమో రాలేదు. అసలే నిన్న చెల్లి బాగా సంపాదిస్తోందని అన్నాను. నేను అన్న మాటలకే ఇప్పుడు ఈ మూడు లక్షలు పోయాయనుకుంటారేమో!' అని నాకు భయమేసి, "బాబా! దయచేసి ఎలాగైనా రేపు ఉదయానికి ఆ మూడు లక్షలు నా అకౌంట్లోకి వచ్చేలా చూడండి, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. ఆరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా ఏదో అద్భుతం చేస్తుంటే, నేను దానికి, "ఓ మై గాడ్, బాబా!!" అని ఆశ్చర్యపోతున్నాను. మరుసటిరోజు మా చెల్లి నవంబర్ 25న వేసిన మూడు లక్షలు గురించే అడిగిందని, మరో మూడు లక్షలు వేయలేదని తెలిసి నా ఆందోళన పోయింది. అదే విషయాన్నే ముందురోజు అద్భుతం జరిగినట్టు కలలో చూపించారు. అడిగినంతనే ఆందోళనను తీసేసి నన్ను కాపాడిన బాబాకు కృతజ్ఞతలు.
నా భర్త ఉద్యోగ విషయంలో బాబా సహాయం:
మొదట్లో నా భర్త సేల్స్ విభాగంలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ ఉద్యోగంలో నిలకడ ఉండేది కాదు. తరచూ ఉద్యోగం మారాల్సి వస్తుండేది. ఆ కారణంగా మా ఇద్దరి మధ్య చాలా గొడవలు వస్తుండేవి. దాంతో ఆయన ఎలాగైనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలని అనుకున్నారు. ఆ సమయంలో నా పాత స్నేహితుడు ఒకతను సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తుంటారని తెలిసి అతన్ని సంప్రదించాము. అతను 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నాడు. మేము ఆ డబ్బు కట్టడానికి సిద్ధపడ్డాము. కానీ తర్వాత వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు అదంతా అనవసరమేమోననిపించి డబ్బులు కట్టలేదు. తరువాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలోకి ఎలా వెళ్లాలని మార్గం వెతుకుతుండగా నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ విషయంలో సహాయం చేస్తారని తెలిసి, అతన్ని కలిసాము. అతను, "లక్షలు అవసరం లేదు. 40,000లతో అయిపోతుంది. మీరు ఎలాగూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కదా! మీరు మీవారికి సాఫ్ట్‌వేర్ నేర్పించండి" అని అన్నారు. సరే, అలానే చేద్దామని అనుకున్నాం. ఇక బాబా కథ ఎలా నడిపారో చూడండి. ఆయన దయవల్ల నా ఫ్రెండ్ తన కంపెనీలో ఓపెనింగ్స్ పడ్డాయని, మావారిని అప్లై చేయమని చెప్పారు. మావారికి, నా ఫ్రెండుకి పరిచయం ఉందన్న విషయం కంపెనీవాళ్లకి తెలియదు. అందుచేత నా భర్త ఎక్కడా నా ఫ్రెండ్ పేరు ప్రస్తావించకుండా నేరుగా కన్సల్టెన్సీ వాళ్ళకి రెజ్యూమ్ మెయిల్ చేశారు. బాబా దయవల్ల మావారి రెజ్యూమ్ షార్ట్‌లిస్ట్ అయింది. ఇంక నా భర్త ఎలాగైనా ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తిచేయాలని ప్రిపేర్ అవసాగారు. అంతలో బాబా అద్భుతంగా ప్లాన్ చేశారు. నా భర్తని ఇంటర్వ్యూ చేసే ఇంటర్వ్యూ ప్యానల్ మెంబరుగా నా ఫ్రెండునే వేశారు. ఇంక నా ఫ్రెండ్ ఎలాగైనా నా భర్తని సెలెక్ట్ చేస్తారు కాబట్టి, కొద్దిగా ప్రిపేరై మావారు ఇంటర్వ్యూకి వెళ్లారు. అనుకున్నట్లే నా ఫ్రెండ్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్, అంటే తదుపరి రౌండ్‌కి సెలెక్ట్ అయినట్లు ఇచ్చారు. ఆ రౌండ్‌లో జీతం గురించే మాట్లాడతారు కాబట్టి, బాబా దయవల్ల నా భర్తకి జాబ్ పక్కా అనుకున్నాము. అయితే రెండు రోజులు వేచి చూశాక మావారికి కంపెనీ నుండి ఒక మెయిల్ వచ్చింది. అందులోని విషయమేంటంటే, 'కంపెనీలో ఉన్న ఖాళీలు ఫుల్ అయిపోయాయి. కానీ ఇద్దరు వ్యక్తులు ఇంకా జాబ్ ఆఫర్ కన్ఫర్మ్ చేయలేదు. వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నాము. వాళ్లలో ఎవరైనా జాయిన్ అవకపోతే, మీకు అవకాశం ఇస్తామ"ని. అది చూసి నేను, "బాబా! మీరే నా ఫ్రెండుని ఇంటర్వ్యూ ప్యానల్‌లో వేసి మావారికి జాబ్ ఇచ్చారనుకున్నాను. మరి ఇలా అయిందేంటి?" అని చాలా బాధపడ్డాను. మావారు, "దరిద్రం అలా ఉంది. కన్‌ఫర్మ్ అనుకున్న జాబ్ ఇలా అయింది" అని తను కూడా బాధపడ్డారు. నేను ఇంక బాబాతో ఇలా చెప్పుకున్నాను, "బాబాతండ్రీ! నా భర్తకి ఈ గురువారం లోపు ఆఫర్ లెటర్ వస్తే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో నేను ఈ అనుభవాన్ని పంచుకుంటాను" అని. తరువాత రెండు రోజులు వేచి ఉన్నాక బుధవారం వచ్చింది. ఆ కంపెనీవాళ్ళు నా భర్తకి ఫోన్ చేసి, అదేరోజు రెండో రౌండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. అదేరోజు రాత్రి 11 గంటలకు నా భర్తకి ఆఫర్ లెటర్ వచ్చేలా బాబా అనుగ్రహించారు. బాబా తమ మీద మాకున్న నమ్మకాన్ని దృఢపరిచేందుకే ఖాళీలు ఫుల్ అయిపోయేలా చేసి, మమ్మల్ని వెయిట్ చేయించి, బ్లాగులో మా అనుభవం పంచుకుంటామనుకునేలా చేసి చివరికి ఉద్యోగం ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే బాబా ఎంత బాగా అనుగ్రహించారో అనిపిస్తుంది. ఒకవేళ బాబా అలా చేయకుండా వెంటనే ఉద్యోగం ఇచ్చేసి ఉంటే మాకు బాబా అనుగ్రహం ఇంత స్పష్టంగా అర్థమయ్యేది కాదేమో! "లవ్ యు బాబా. నేను అనుకున్నట్లే గురువారంరోజున నా అనుభవాన్ని బ్లాగుకి పంపాను".
2022, మే నెలలో నేను హైదరాబాద్ వెళ్లి, అక్కడినుండి మా ఊరు వెళ్ళాను. నేను మా అమ్మవాళ్ల ఇంటికి చేరుకున్న వెంటనే నాకు, మా అమ్మకి బాగా జ్వరం వచ్చింది. ఆ జ్వరంతో నేను, అమ్మ చాలా ఇబ్బందిపడ్డాం. అప్పడు నేను, బాబాతో, "మా ఇద్దరికీ జ్వరం తగ్గిపోయేలా చూడండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను తండ్రీ" అని చెప్పుకున్నాను. ఆయన ఏ హానీ లేకుండా ఒక్క వారంలో మా ఇద్దరికీ జ్వరం తగ్గిపోయేలా చేశారు. "మా ఆరోగ్య విషయంలో మీ అనుగ్రహానికి ధన్యవాదాలు బాబా".
నేను ఒక సంవత్సరం క్రితం వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి బాబా వద్ద అనుమతి తీసుకుని కూడా కుదరక తర్వాత ఎప్పుడైనా వేయించుకుందామని వేయించుకోలేదు. తరువాత బాబాను మళ్ళీ అనుమతి అడిగితే, ఆయన ఇవ్వలేదు. అప్పుడు, "బాబా! మీ ఆజ్ఞ విషయంలో అశ్రద్ధ వహించినందుకు నన్ను క్షమించండి" అని బాబాకు క్షమాపణలు చెప్పుకుని, గురువారం వ్యాక్సిన్ చేయించుకోవడానికి బాబా అనుమతి తీసుకున్నాను. కానీ అదే వారంలో నేను తిరుపతి వెళ్లాల్సి ఉన్నందున వ్యాక్సిన్ వేయించుకున్నాక జ్వరం వస్తుందేమో, తిరుపతి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందేమో అని భయపడ్డాను. అయినా బాబా ఉండగా మనకి భయమెందుకని, "బాబా! వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత నాకు జ్వరం రాకుండా చూడండి. తిరుపతి ప్రయాణానికి ఏ ఇబ్బందీ ఉండకూడదు. అలా అయితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని వ్యాక్సిన్ వేయించుకున్నాను. బాబా దయవల్ల నాకు జ్వరం అస్సలు రాలేదు. అంతా బాగుంది. అయితే నేను తిరుపతికి ప్రయాణమయ్యేరోజు నాకు విరేచనాలు అవసాగాయి. నాకు భయమేసి, "బాబా! విరేచనాలు ఆగిపోయి, తిరుపతి ప్రయాణానికి ఏ ఆటంకం లేకుండా ఉంటే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల నేను ప్రయాణమయ్యే సమయానికి విరేచనాలు ఆగిపోయేలా చేసి నాకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బాబా కాపాడారు. తరువాత ఒకతను తిరుమలలో స్వామివారి అర్చన టికెట్లు ఇప్పిస్తానని అంటే, మేము బ్లాక్‌లో టికెట్లు బుక్ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చాము. అప్పుడు నేను, "బాబా! అతను టిక్కెట్లు కన్‌ఫర్మ్ చేస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అయితే బాబా అర్చన టిక్కెట్లు కాకుండా సుపథం దర్శనభాగ్యాన్ని ప్రసాదించారు. 'బ్లాగులో పంచుకుంటామంటే సమస్య సమసిపోతుంది' అంటే ఈ బ్లాగ్ ఎంత పవర్‌ఫుల్లో అర్థమవుతుంది కదా! నా అనుభవాలను బట్టి బాబా మనపై చూపించే అనుగ్రహాన్ని అందరితో పంచుకోవడం వల్ల అవి ఇతరులకు బాబా పట్ల నమ్మకం పెంచుకోవడంలో సహాయపడతాయని, అందుకే మనకి తెలియకుండానే మనతో 'ఇలా జరిగితే, బ్లాగులో పంచుకుంటామ'ని అనుకునేలా బాబా మనతో చేయిస్తున్నారేమో అనిపిస్తుంది. అన్నీ చేసేది ఆయనే కదా మరి. "బాబా! మీకు మాటిచ్చినట్టుగా నా అనుభవాలు పంచుకున్నాను బాబా. మమ్మల్ని సదా రక్షిస్తూ, మార్గనిర్దేశం చేస్తూ అంతటా, అందరిలో మీ ఉనికిని తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు బాబా. నా అనుభవాలేవైనా మర్చిపోయి ఉంటే క్షమించండి బాబా. వాటిని మీరే గుర్తుచేసి మళ్లీ ఇక్కడ పంచుకునేలా చేయండి బాబా".
సర్వం సాయిబాబా!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం శ్రీ సాయి బాబా నీకు వంద నము.ఈరోజు మా బాబు పుట్టినరోజు సాయి శుభాకాంక్షలు అందించు.బాబు కి సంపూర్ణంగా ఆయుష్షు యివ్వు తండ్రి నీకు మేము యిద్దరము శత సహస్ర నమస్కారాలు సమర్పిసునాము
ReplyDeleteOm sairam
ReplyDeleteSai always be with me