- శ్రీసాయి అనుగ్రహ లీలలు - నాల్గవ భాగం
సాయిబాబుగారు బాబా తమకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.
బాబా కృపతో 1999లో మా మామయ్యగారు మాకోసం ఒక ఇల్లు కట్టించారు. 2002లో మేము కేవలం కొంచెం డబ్బు దగ్గర పెట్టుకుని బాబా అనుమతితో స్కూలు కోసం పైఅంతస్తులో నిర్మాణం మొదలుపెట్టాం. ఒకరోజు అంతా సిద్ధ చేసుకుని శ్లాబ్ పని మొదలుపెట్టాం. సాయంత్రానికి శ్లాబ్ పూర్తి కావచ్చింది. అంతలో ఆకాశంలో పడమర దిక్కు నుండి నల్లటి దట్టమైన మేఘాలు కమ్ముకుని రాసాగాయి. అందరూ భారీవర్షం కురుస్తుందనీ, శ్లాబ్ అంతా కరిగిపోవచ్చనీ అనుకున్నారు. మేము మాత్రం బాబానే చూసుకుంటారని నిర్భయంగా ఉన్నాము. దట్టమైన నల్లని మేఘాలు, చల్లని గాలితో దాదాపు వర్షం పడేలా ఉన్న వాతావరణం బాబా దయవల్ల ఒక్కసారిగా తూర్పు వైపుకు వెళ్ళిపోయింది. కనీసం ఒక చినుకైనా పడలేదు. అలా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్మాణం పూర్తిచేయించి బాబా మాకు చాలా మంచి ఇల్లు అమర్చారు. అందుకే మేము ఆ ఇంటిని 'ఇది బాబా గుడి' అనే భావనలో ఉంటాము. బిల్డింగ్ పైన, క్రింద, ముందువైపు బాబా ఫోటోలు ఉంచాము. ఇంటిని, ఇంట్లోని మమ్మల్ని బాబా సదా రక్షిస్తూ ఉంటారని భావిస్తాము. "ధన్యవాదాలు బాబా".
గుంటూరు జిల్లా, తాడికొండలో ఒక బాబా మందిరం ఉంది. అక్కడి విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, బాబాను ఒక్కొక్క దిశలో, ఒక్కొక్క కోణంలో చూస్తే వేరువేరు ముఖకవళికలు కనబడతాయి. బాబా రకరకాల వయస్సుల్లో నవ్వుతూ, శాంతంగా, కరుణగా, గంభీరంగా దర్శనమిస్తారు. (ఆ ఆలయంలో ఆ ఫోటోలు విక్రయిస్తారు.) మేము అప్పుడప్పుడు ఆ బాబా మందిరానికి వెళ్ళి పూజలు చేయించుకుంటుండేవాళ్ళము. విజయవాడ నుండి వెలువడే 'వండర్ వరల్డ్' పత్రిక అధినేత నారాయణరావుగారు ఆ ఆలయ వ్యవస్థాపకులు. మేము నెలనెలా ఆ పత్రిక కొని చదివేవాళ్ళము. 2000 సంవత్సరం తర్వాత అనుకుంటా, ఆ పత్రికలో మేము ఒక వార్త చదివాము. అది ఏమిటంటే, 'తాడికొండ బాబా ఆలయం ప్రక్కన పెద్ద హాలు నిర్మించి, అందులో భక్తుల స్వహస్తాలతో ఒక అడుగు ఎత్తు ఉన్న బాబా విగ్రహాలను ప్రతిష్ఠ చేయిస్తామని, అందుకు రుసుము కేవలం 200 రూపాయల'ని. వెంటనే మేము డబ్బు చెల్లించాము. ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ఠాపనలు జరిగేరోజు ఉదయం 9 గంటలకు మేము ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి తాడికొండ చేరుకున్నాము. జనం విపరీతంగా వచ్చారు. దాదాపు 5000 విగ్రహాలు అనుకుంటే 7000 విగ్రహాల ప్రతిష్ఠాపన జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకల్లా కార్యక్రమం పూర్తయ్యింది. అయితే బాబా విగ్రహ రూపంలో మా గృహాన్ని పావనం చేయాలనుకున్నారేమో! అనుకోకుండా మాకు ఒక తలంపు వచ్చింది. వెంటనే కార్యక్రమ నిర్వాహకులను సంప్రదించి, “మేము ఇక్కడ ఒక విగ్రహం ప్రతిష్ఠించాము, మాకు ఇంకొక విగ్రహం ఇస్తారా, ఇంట్లో పూజించుకుంటాం” అని అడిగాము. వాళ్ళు ఆలోచించుకుని మాకు ఒక బాబా విగ్రహం ఇచ్చారు. బాబాని నా చేతిలోకి తీసుకోగానే మాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. మా చేతిలో ఉన్న బాబాను చూసి కొంతమంది, "మాకు కూడా బాబా విగ్రహం కావాల"ని అడిగితే, నిర్వాహకులు ఇవ్వలేదు. ఇకపోతే, మేము బాబా అన్నప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణం అవుదామనుకుంటే 'ప్రసాదం అయిపోయింద'ని చెప్పారు. ప్రసాదం లేకుండా ఎలా వెళ్ళడమని నిరాశగా స్కూటర్ స్టార్ట్ చేస్తున్నంతలో మమ్మల్ని పిలిచి "ప్రసాదం రెడీ అయింది. భోజనం చేసి వెళ్ళండ"ని చెప్పారు. మేము సంతోషంగా బాబా ప్రసాదం తీసుకుని, బాబాతో మా ఇంటికి చేరుకున్నాము. అలా బాబా స్వయంగా మా గృహానికి విచ్చేశారు. చూసేవారికి విగ్రహమే కానీ, మాకు మాత్రం సాక్షాత్తూ బాబానే. ఆయన మా ఇంట ఆశీనులై ఒక్కొక్కసారి శాంతంగా, ఒక్కొక్కసారి గంభీరంగా, ఒక్కొక్కసారి చిరునవ్వుతో దర్శనమిస్తుంటారు. ఉదయం కాకడ ఆరతితో మొదలుకుని శేజారతి వరకు బాబా మందిరాల్లో చేసే సేవలన్నీ బాబా మాతో చేయించుకుంటూ నిత్యపూజలు అందుకుంటున్నారు. బాబా వచ్చాక, 'మా గృహం ఆయన గుడి అయిందని, ఆయన గుడిలో మేముంటున్నామని, ఆయన ప్రేమతో ఉండటానికి మాకింత చోటిచ్చారని' భావిస్తూ ఉంటాము. అది కేవలం మా భావన కాదని, నిజంగానే అది ఆయన గుడి అని కింది సంఘటన ద్వారా బాబా మాకు తెలియజేశారు.
2014లో హైదరాబాదు నుండి మాకు తెలిసిన కొందరు సాయిభక్తులు మొదటిసారి మా ఇంటికి వచ్చారు. వారిలో ఒకావిడ మా ఇంట్లో కూర్చుని, 'అన్నీ బాబా ఫోటోలే. ఇది ఇల్లులాకాక గుడిలా ఉంది' అని మనసులో అనుకుని, “బాబా! నేను వీళ్ళింట్లో ఉన్నట్లుకాక నీ గుడిలో ఉన్నట్లుంది నాకు. అదే నిజమైతే, వెంటనే హైదరాబాదులో నేను నిన్ను దర్శించే సాయిమందిరం నుంచి నా ఫోనుకొక మంచివార్త రావాలి” అని అనుకున్నారు. వెంటనే ఆమె ఫోనుకు, 'సాయి పూజకు రమ్మ'ని వచ్చింది. ఆమె ఆనందాశ్చర్యాలతో మాకు విషయం చెప్పింది. మేము కూడా సంతోషించాము. వచ్చిన సాయిభక్తులకి బాబాపై భక్తివిశ్వాసాలు అధికమయ్యాయి. మా గృహం సాయి దేవాలయం అని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం.
ఈ లీల చదివి బాబా తమ గుడికి రంగులు ఎలా ఉచితంగా వేయించారో చూడండి! 2005లో మా అమ్మాయి పెళ్లప్పుడు సమయం చాలక ఇంటికి రంగులు వేసే పని పూర్తికాలేదు. సగం సగం వేసిన రంగులతో మా ఇల్లు చాలా సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. 2017 నాటికి ఇల్లు మరీ పాతబడిపోయినట్లు ఉండేది. ఆ సమయంలో మా పక్కింటికి ఒక అబ్బాయి రంగులు వేస్తుంటే, అతనిని పిలిచి ఏయే రంగులు, ఎంతెంత కావాలో అడిగి తెలుసుకుని, వాటిని తీసుకుని రావడానికి బయలుదేరాము. కానీ బాబాని అడగకుండా వెళ్ళడానికి మనసు రాక, బాబాని అడిగితే 'వద్దని' సమాధానం వచ్చింది. అలా రెండు, మూడుసార్లు జరిగాక ఇక మా వల్ల కాదని, "బాబా! నీ గుడికి(మా ఇంటికి) నీవే రంగులు వేయించుకో" అని ఆయనకే వదిలేసాము. తరువాత ఒకసారి ఎగ్జిబిషన్‍కని 2 గంటలు ప్రయాణం చేసి విజయవాడ వెళ్ళాము. కానీ అప్పటికింకా ఎగ్జిబిషన్ పెట్టలేదు. నా భార్య, "ఏ కారణమూ లేకుండా బాబా ఇంత దూరం మనల్ని రానివ్వరు. ఏదో కారణం ఉండే ఉంటుంది" అని అంది. తర్వాత అనుకోకుండా మా కారు ట్రాఫిక్‍లో ఒక సున్నాలు, రంగులు అమ్మే షాపు ముందు చాలాసేపు ఆగిపోయింది. మేము దిగి ఆ షాపులోకి వెళ్ళి చాలా తక్కువ ఖర్చు పెట్టి రంగులు తీసుకుని కారులో వేసుకుని ఇంటికి తీసుకువచ్చాము. ఆ విధంగా రంగులు అయితే తెచ్చాము, మరి పనివాళ్ళు ఎలా? ఇల్లంతా రంగులు వేయడానికి కనీసం నెల రోజుల పడుతుంది, ఖర్చు చాలా అవుతుందని పని మొదలుపెట్టించడానికి భయపడుతూ ఉండేవాళ్ళం. అంతలో మా ఇంట్లో అద్దెకుండే అబ్బాయి వాళ్ళ కంపెనీకి రంగులు వేయిస్తూ వాళ్ళ పనయ్యాక, ముగ్గురు పనివాళ్ళను మా ఇంటికి పంపి, “నెల రోజులు పని చేయించుకోండి” అని చెప్పాడు. మాకు ఇదంతా బాబా దయే అనిపించింది. పనివాళ్ళకిచ్చే టీ, కాఫీ ఖర్చులు తప్ప అదనంగా ఒక్క రూపాయి ఖర్చు కూడా మాకు కాలేదు. మేము పనివాళ్ళకి కృతజ్ఞతతో కొత్తబట్టలు మాత్రం కొని ఇచ్చి, వాళ్ళు ఎప్పుడూ సముద్రం చూడలేదంటే, కారులో తీసుకెళ్లి సముద్రం చూపించాము, అంతే. అలా బాబా చెప్పవలసినవారికి చెప్పి, రంగులు వేయాల్సినవారితో వేయించి తమ గుడికి తామే రంగులు వేయించుకుని ఇంటిని కొత్త ఇల్లులా మార్చారు.
నాడు బాబా కొంతమంది భక్తులకు తమ స్వహస్తాలతో నాణేలను ఇచ్చి, పూజలో పెట్టుకోమని చెప్పేవారు. ఆ నాణేలు ఎంతో విలువైనవి, పరమపవిత్రమైనవి. నేడు బాబా సశరీరులుగా లేకపోయినప్పటికీ "నాకు, నా పటానికి భేదం లేద"ని చెప్పిన వారి మాటల దృష్ట్యా వారి ప్రతిరూపమైన శిరిడీ సమాధిమందిరంలోని విగ్రహానికి తాకించిన నాణేలు కూడా అంతే విలువైనవి, పవిత్రమైనవి. అట్టి నాణేలు పొందే భాగ్యం మాకు దక్కింది. శిరిడీ వెళ్ళినప్పుడల్లా బాబా దర్శనం కోసం వెళ్లేటప్పుడు మేము మా గుప్పెట్లో కొన్ని నాణేలు ఉంచుకునేవాళ్ళం. మేము అడగకుండానే అక్కడుండే పూజారి మా చేతిలోని నాణేల నుండి ఒక నాణెం తీసుకుని బాబా మూర్తికి, సమాధికి తాకించి, మాకు తిరిగిస్తూ "పూజలో పెట్టుకోమ"ని అనేవారు. ప్రత్యేకించి ఒకసారి పూజారి ఒక నాణెంపై యంత్రం ముద్రించబడి ఉండటం చూసి, “ఈ నాణెం చాలా విలువైనది. జాగ్రత్తగా పూజలో ఉంచుకోండి” అని హిందీలో చెప్పారు. అలా శిరిడీలో బాబా స్పృశించిన నాణేలు పది వరకూ మా ఇంట పూజలో ఉన్నాయి. వాటిని బాబానే మాకు ప్రసాదించారని మేము భావిస్తాము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.
బాబా లీలలు అమోఘమైనవి, ఆశ్చర్యకరమైనవి, అద్భుతమైనవి. మేము ప్రతి సోమవారం శివునికి, ప్రతి గురువారం బాబాకి అభిషేకం చేస్తాము. ఒక సోమవారం శివునికి అభిషేకం చేసేటప్పుడు చూస్తే ఆరోజు అభిషేకానికి సరిపడే తేనె మాత్రమే ఉంది. అప్పుడు నేను మనసులో, “బాబా! గురువారం మీ అభిషేకానికి తేనె సరిపోదు, ఏర్పాటు చేయవయ్యా” అని అనుకున్నాను. తరువాత అభిషేకం, పూజ పూర్తి చేసి హారతి ఇచ్చాము. అంతలో గేటు తీసిన శబ్దం అయింది. 'ఎవరా' అని చూస్తే, మాకు ఎప్పుడూ తేనె తెచ్చిచ్చే అతను. బాబానే అతనితో తేనె పంపించారని ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకున్నాము.
ఒక గురువారం ఆవుపాలు లేకపోవడంతో నీళ్లతో బాబాకి అభిషేకం చేస్తూ, "ఈరోజు ఆవుపాలతో కాకుండా నీళ్లతో అభిషేకం చేస్తున్నాము” అని నా భార్య నాతో అంది. నేను తనతో, "స్వచ్ఛమైన ఆవుపాలు దొరకవు, ప్యాకెట్ పాలు బాగుండవు" అని అన్నాను. కొద్దిసేపట్లో మా బంధువుల అబ్బాయి చిన్న చెంబులో ఆవుపాలు తెచ్చి ఇచ్చాడు. మాకు చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే, అదివరకు చాలాసార్లు ఆవుపాలు కావాలని అతన్ని అడిగితే, "దొరకవు" అని చెప్పేవాడు. అలాంటిది ఆరోజు మేము అడగకుండానే అతను ఆవుపాలు తీసుకొచ్చి ఇచ్చాడు. అతనితో ఆవుపాలు పంపింది బాబానే!
ఒక బుధవారంనాటి సాయంత్రం నేను బాబాకి పూజ చేసి, పుస్తకం చదువుతుండగా నా భార్య “అభిషేకానికి ఆవుపాలు తేలేదు, ఎందుక’ని నన్ను అడిగింది. మరుసటిరోజు గురువారం. బాబాని అభిషేకించటానికి ఆవుపాలు తేలేదన్న సంగతి నాకు అప్పటివరకు అస్సలు గుర్తులేదు. అయినా పుస్తకం చదువుతూ మధ్యలో మాట్లాడకూడదని నా భార్యకేమీ సమాధానం చెప్పలేదు. కానీ నేను చదువుతున్న పుస్తకంలో, “ఆవు పొదుగు నిండా పాలు ఉన్నాయి. దూడను విడిస్తే పాలు మెండుగా ఇస్తుంది. లేదంటే ఇవ్వదు" అన్న వాక్యాలు వచ్చాయి. అది చదివి నేను ఆశ్చర్యపోయాను. ఆ వాక్యాల ద్వారా నేను మర్చిపోయిన ఆవుపాలు విషయాన్ని బాబా కూడా గుర్తుచేస్తున్నారనిపించింది. నిజానికి ఆవుపాలతో అభిషేకం ఆయన కోరుకోరు. కానీ నేను నా నియమాన్ని తప్పకూడదని బాబా ఆ విధంగా సూచించారు. "నిత్యక్రమాన్ని మార్చకూడద"ని బాబా మహల్సాపతితో చెప్పారు కదా!
ఒక బుధవారంనాటి రాత్రి గం.7-30 నిమిషాలకు బాగా వర్షం పడుతోంది. మరుసటిరోజు గురువారం కాబట్టి బాబాకి నివేదించడానికి బయటకి వెళ్లి ఏమైనా తీసుకుని రావాల్సి ఉంది. కానీ ఎలా? వర్షం బాగా పడుతోంది. వర్షం తగ్గుతుందేమోనని చాలాసేపు చూశాను కానీ, తగ్గలేదు. నేను “ఇప్పుడెలా” అనుకుంటుండగా నా భార్య, “బాబా తమకొరకు నైవేద్యాన్ని తామే తెప్పించుకుంటారు” అని అంది. అరగంట తర్వాత ఎవరో పిలిచినట్లనిపిస్తే నా భార్య బయటికి వెళ్ళింది. ఎదురుగా మా పక్కింటి అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పెద్ద 5 స్టార్ చాక్లెట్ ఒకటి నా భార్యకిచ్చాడు. అది చూడగానే ఆమెకి క్షణం కూడా ఆలస్యం లేకుండా అరగంట క్రితం తను అన్న మాటలు గుర్తొచ్చి, “బాబా తమ నైవేద్యాన్ని ఇలా తెప్పించుకున్నారు” అని అనుకుంది. ఆ విషయం ఆ అబ్బాయికి కూడా చెప్పింది. ఆ అబ్బాయి కూడా సంతోషించాడు. అతను క్రిస్టియన్ మతస్థుడు. చాలా సంవత్సరాలుగా మమ్మల్ని చుస్తూండటం, మా మాటలు వింటుండటం వల్ల, కలిగిన కొన్ని అనుభవాల వల్ల అతని మనసులో మెల్లగా బాబా అంటే నమ్మకం ఏర్పడింది. ఒకసారి తనే ఆ విషయం పరీక్షించుకున్నాడు. ఎలా అంటే, ఒకసారి అతను కేరళ నుండి గుంటూరుకు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, 'కీ' చైనులు అమ్మే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఇతనిని దాటుకుంటూ వెళ్ళిపోయాక ఇతను తన మనసులో, 'ఆ వ్యక్తి మళ్ళీ నా దగ్గరకు రావాలి. అతని వద్ద బాబా లాకెట్టు ఉన్న 'కీ' చైన్ ఉండాలి” అని అనుకున్నాడు. వెంటనే ఆ 'కీ' చైన్లు అమ్మే వ్యక్తి ఎవరూ పిలవకుండానే వెనక్కి వచ్చాడు అతని వద్ద బాబా లాకెట్ ఉన్న 'కీ' చైన్లు కూడా ఉన్నాయి. ఆ అబ్బాయి వాటిని కొని, ఒక గురువారంనాడు మేము పూజ చేసుకుంటుండగా తెచ్చి మాకిచ్చాడు. వాటిని చూడగానే, “గురువారంనాడు బాబా మా ఇంటికి వచ్చార"ని మేము ఎంతో ఆనందించాము. తర్వాత వీటిని ఒక క్రిస్టియన్ తెచ్చి ఇవ్వడమేంటని ఆశ్చర్యపోతూ, "ఇవి నీ దగ్గరకి ఎలా వచ్చాయి?” అని మేము అతనిని అడిగితే, అతను రైల్లో జరిగినదంతా వివరంగా చెప్పాడు. ఆ సంఘటనతో అతను బాబాపట్ల విశ్వాసం మరింతగా పెంచుకున్నాడు. మాకు “సబ్ కా మాలిక్ ఏక్", "అల్లా మాలిక్” అనే బాబా మాటలు గుర్తొచ్చాయి. ఇకపోతే ఆ అబ్బాయి ఇచ్చిన 'కీ' చైన్లలో ఒకటి మా కారుకి, ఇంకొకటి బీరువాకు పెట్టుకున్నాము.
మేము రోజూ బాబాని ముందుగా బంగారుపూలతో పూజించి, తర్వాత మామూలు పూలతో అష్టోత్తరం చేస్తాము. అయితే ఒకరోజు ఒక బంగారుపువ్వు కన్పించలేదు. దానికోసం చాలాసేపు వెతికినప్పటికీ అది దొరకలేదు. మరుసటిరోజు, ‘ఆ బంగారుపువ్వు ముందురోజు తీసిన మామూలు పూలలో ఇరుక్కుపోయి ఉంద’ని బాబా సూచించారు. వెంటనే ఆ పూలన్నీ తీసి వెతికితే బంగారుపువ్వు కన్పించింది. బాబా సూచించకపోయి ఉంటే పూలే కదా అని మేము వాటిని మట్టిలో పారేసేవాళ్ళము.
మేము మా ఇంటిలో బాబాకు నైవేద్యంగా పంచదార పలుకులు పెడతాము. పూజ అయ్యాక మేము కొన్ని పలుకులు ప్రసాదంగా తీసుకుని, కొన్ని అలాగే ప్లేటులో ఉంచుతాము. అయితే తెల్లవారి చూస్తే, ఆ పలుకులు ప్లేటులో ఉండేవి కాదు. బాబా వాటిని ఎలా స్వీకరిస్తున్నారో అనిపించి ఒక అర్థరాత్రి చూస్తే, బల్లి రూపంలో బాబా ఆ పలుకులు స్వీరిస్తున్నారని అర్థమైంది. ఇంకో విషయం, ఒక శివరాత్రి పండుగరోజు మేము చేబ్రోలులోని శివాలయానికి వెళ్ళాము. పూజ అయిన తర్వాత మేము బయటికి వస్తూనే ఒక కుక్క మా దగ్గరకు వచ్చింది. అప్పుడు మా దగ్గర అరటిపండ్లు మాత్రమే ఉన్నందున ఒక పండు తీసి ఒలిచి ఆ కుక్క ముందు పెట్టాము. అది వాసన చూసి వెళ్ళిపోయింది. అప్పుడు నేను, "ఈరోజు శివరాత్రి కదా! నైవేద్యం స్వీకరించండి" అని బాబాను ప్రార్థించాను. ఆ కుక్క వెంటనే వెనక్కి తిరిగి వచ్చి ఆ అరటిపండు తినేసింది. అసలు కుక్కలు ఎక్కడైనా అరటిపండ్లు తింటాయా? బల్లులు ఎక్కడైనా పటికబెల్లం పలుకులు తింటాయా? లేదు కదా! అదే బాబా లీల.
ఒకరోజు తెల్లవారుఝామున పెద్ద గాలివాన, ఉరుములు, మెరుపులు వచ్చి కరెంటు పోయింది. అలా పోయిన కరెంట్ సాయంత్రం 5 గంటలైనా రాలేదు. నేను స్నానం చేసి వచ్చి, "బాబా! లైట్లు వేసి, దీపారాధన చేసి, నీ పూజ చేసుకోవాలి. ఆలస్యమైపోతోంది, వెంటనే కరెంటు రప్పించు” అని బాబాతో చెప్పుకున్నాను. అంతే, ఆ క్షణమే కరెంటు వచ్చింది.
ఒక మంగళవారం సాయంత్రం నేను బాబాకి నైవేద్యం పెట్టి దీపారాధన చేశాను. అయితే దీపం వెలగలేదు. ఎందుకు వెలగలేదని కొంచెంసేపు వేచిచూసి, గీసిన అగ్గిపుల్ల పారవేద్దామని వెనుకకు తిరిగి మనసులో, “బాబా దీపం వెలగలేదు. నా తప్పేమైనా ఉందా?" అని అనుకొని తిరిగి ఇంకొక అగ్గిపుల్లతో దీపం వెలిగించుదామని చూస్తే, 'నీ తప్పేమీ లేదు' అన్నట్టు ఆశ్చర్యకరంగా దీపం వెలుగుతూ కన్పించింది.
చిన్న విషయాల్లో కూడా బాబా మనకి నొప్పి తెలియనివ్వరు. ప్రతి గురువారం నేను బాబా పుస్తకంలో ఉన్న పూజావిధానం చదువుతాను. ఒక గురువారం రెండుసార్లు ప్రయత్నించినా నేను చదవాల్సిన పూజావిధానం ఉన్న పేజీ రాలేదు. అప్పుడు నేను బాబాను తలచుకుని, కళ్ళు మూసుకుని పుస్తకం తెరిస్తే, పూజావిధానమున్న పేజీ తెరుచుకుంది. ప్రతిరోజూ చదివే సచ్చరిత్ర పుస్తకం కూడా అంతే. బాబాను తలచుకుని కళ్ళు మూసుకుని సచ్చరిత్ర తెరిస్తే ఆరోజు చదవవలసిన అధ్యాయమే వచ్చేది. ఇలా చాలాసార్లు వచ్చింది. ఇప్పటికీ వస్తుంది. అది బాబా లీల.
ఒకరోజు ఉదయం పూజయ్యాక పాల ప్యాకెట్లు తెద్దామని బయలుదేరాను. కానీ శకునం బాగా లేకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చి, కొద్దిసేపు కూర్చుందామని వరండాలో కూర్చుని, ఒక చిన్న బాబా పుస్తకం తెరిచాను. అందులో మద్రాసు భజన బృందం గురించి ఉంది. అది చదివి బయటికి వెళ్ళాను. అదేరోజు సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత 'సచ్చరిత్ర'లో నేను ఆరోజు చదవవలసిన అధ్యాయం 29 తెరిచాను. అందులో కూడా మద్రాసు భజన బృందం గురించే ఉంది. నేను ఆరోజు చదివింది వేరువేరు పుస్తకాలైనా చదివిన విషయం ఒక్కటే. అంటే, బాబా ముందే సాయంత్రం చదవవలసిన అధ్యాయం కూడా ఇదేనని సూచించారు. ఆయన లీలలు ఇలాగే ఎంతో ఆలోచింపజేసేవిగా ఉంటాయి.
2017, మార్చి 27న ఉగాది పండుగరోజు ఉదయం నా భార్యకి బాబాకి శనగలు నైవేద్యం పెట్టాలని అనిపించింది. అదేరోజు సాయంత్రం పూజానంతరం సచ్చరిత్ర చదువుదామని పుస్తకం తెరిస్తే, హేమాడ్‌పంతు కోటు మడలతలలో నుండి శనగలు పడిన లీల వచ్చింది. అలా బాబా ఉదయం నా భార్య అనుకున్న శనగల నైవేద్యం గురించి గుర్తుచేశారు. మేము వెంటనే బాబా గుడికి వెళ్లి బాబాకి శనగలు నివేదించి ఆయన పాదాల చెంత 108 దీపాలు వెలిగించాము.
ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. |
|
తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.
|
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయి బాబా ఈ రోజు సాయి అనుభవం చాలా బాగుంది. బాబా భక్తుల కి ఏమి కావాలో అన్ని చూసుకుంటారు. సాయి కృప వుంటే అన్ని వున్నటేల్
ReplyDeleteJaisairam bless supraja for her neck pain and shoulder pain and help her decrease the pains Jaisairam
ReplyDeleteOm sairam
ReplyDeleteHappy Diwali , Lightening the lights all of our home
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete