1. గులాబీమాలను స్వీకరించి దీవించిన బాబా
2. సాయిబాబాపై నమ్మకం పెట్టుకుంటే అన్నీ విజయాలే!
3. బాబాకి చెప్పుకుంటే బాధలు తీరుస్తారు
గులాబీమాలను స్వీకరించి దీవించిన బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. 'ఆధునిక సాయిచరిత్ర' లాంటి ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు శశి. మాది హైదరాబాద్. నేనొక సాయిభక్తురాలిని. మన రోజువారీ దినచర్యలో బాబా అడుగడుగునా తమ ఉనికిని తెలియజేస్తూ ఎన్నో అనుభవాలను, అనుభూతులను ప్రసాదిస్తూ ఉంటారు. వాటిలోనుండి బాబాకి మాటిచ్చిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2022, మే నెల చివరిలో లేదా జూన్ నెల ఆరంభంలో ఒకరోజు గ్యాస్ సమస్య వల్లనో, మరేదైనా కారణం వల్లనో తెలీదుకానీ నా పొట్ట దగ్గర, గుండె దగ్గర పక్కటెముకలు బాగా పట్టేసినట్లు అయి నాకు ఇబ్బందిగా అనిపించింది. ఎందుకైనా మంచిదని బాబా ఊదీ పెట్టుకుని హాస్పిటల్‍కి వెళ్తే, అక్కడ డాక్టర్ 2డి ఎకో, ఈసీజీ మొదలైన అన్ని టెస్టులు చేశారు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "అన్ని రిపోర్టులు నార్మల్‍గా వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. తరువాత నేను రిపోర్టులు వచ్చేవరకు బాబా నామాన్ని తలచుకుంటూ ఉన్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్గా వచ్చాయి. "ధన్యవాదాలు బాబా. నాకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. వాటిని తొలగించు తండ్రీ".
2022, జూలైలో మేము శిరిడీ వెళ్లాలని అనుకున్నాము. నాకు ఎప్పటినుంచో శిరిడీ సమాధిమందిరంలో బాబా మూర్తికి అలంకరించడం కోసం ఒక పెద్ద గులాబీరేకుల మాలను తీసుకెళ్లాలని కోరిక. అందువలన నేను మా ప్రయాణానికి ముందురోజు ఒక పెద్ద గులాబీమాల ఆర్డర్ పెట్టి, శిరిడీలో బాబా దర్శనానికి వెళ్లేవరకూ అది పాడైపోకుండా ఉండేలా ప్యాక్ చేయించాను. మరుసటిరోజు ఉదయం మేము కారులో బయలుదేరి సాయంత్రానికి శిరిడీ చేరుకున్నాం. తొందరగా ఫ్రెషప్ అయ్యి రాత్రి 8 గంటల దర్శనానికి టిక్కెట్లు ఉన్నప్పటికీ బాబాను దర్శించాలని ఆత్రంగా క్యూలైన్‍లోకి వెళ్ళాము. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది, "కోవిడ్ నిబంధనల వలన ఏ వస్తువులను లోపలికి అనుమతించడం లేద"ని అన్నారు. ఆ మాట చెప్పగానే నాకు చాలా బాధ కలిగి, "బాబా! ఈ మాల నీకోసం తీసుకొచ్చాను. దీన్ని ఎలా, ఎక్కడ తీసుకుంటావో నాకు తెలియదు. దయచేసి ఈ మాలను స్వీకరించు తండ్రీ. అలా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. అంతలో అక్కడున్న సెక్యూరిటీ అతను, "ద్వారకామాయిలో ప్రయత్నించండి. మీ యందు దయవుంటే బాబా స్వీకరిస్తారు" అని చెప్పారు. మేము వెంటనే ద్వారకామాయికి వెళ్ళాము. అక్కడి సెక్యూరిటీ అతను మాలను లోపలికి అనుమతించాడు. మేము లోపలికి వెళ్ళాక అక్కడున్న ఒకతను మాలను తీసుకుని పూజారికి ఇచ్చారు. కొద్దిసేపు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుని మాలను మశీదులోని నింబారుకు అలంకరించారు. అక్కడ బాబా నిల్చొని, నన్ను చూస్తూ దీవిస్తున్నట్లు నాకు అనుభూతి కలిగి అంతవరకు ఆపుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా ఆనందంతో నా కళ్ళనుండి జారిపోయాయి. పూజారి మమ్మల్ని ఆశీర్వదించి, బాబాకు నివేదించిన ప్రసాదాన్ని మాకు పెట్టారు. తర్వాత బాబా దర్శనం చేసుకుని రెండు రోజులు శిరిడీలోనే ఉండి తిరిగి క్షేమంగా హైదరాబాదు చేరుకున్నాము. "బాబా! నీ చల్లని చూపు ఎల్లప్పుడూ మా మీద ఉండేలా చూడు తండ్రీ. ఏమైనా తప్పులు ఉన్నా, అలాగే ఈ అనుభవం పంచుకోవడంలో ఆలస్యమైనందుకు క్షమించు తండ్రీ. మా కుటుంబం ఎప్పుడూ మీ రక్షణలో, మీ పాదాల చెంత ఉండేలా ఆశీర్వదించండి బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
సాయిబాబాపై నమ్మకం పెట్టుకుంటే అన్నీ విజయాలే!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును చక్కగా నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు గోపాలకృష్ణ. నేను హైదరాబాద్ నివాసిని. మన సాయితండ్రి కరుణతో నేను ఇదివరకు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ప్రతి సంవత్సరం జూన్ మొదటివారంలో నేను, నా భార్య పూర్తి బాడీ చెకప్ చేయించుకుంటాము. కానీ కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలు చేయించుకోలేకపోయాము. ఈ సంవత్సరం బాడీ చెకప్‍కి వెళ్తే, డాక్టరు అన్ని టెస్టులు చేశారు. బాబా దయవల్ల నా విషయంలో అంతా బాగానే ఉంది. కానీ నా భార్యను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. కారణమేమిటంటే, చెకప్‍కి వెళ్ళడానికి ముందు నా భార్య కుడిపాదం దగ్గర చాలా వాపు వచ్చి, నొప్పితో బాధపడింది. డాక్టరు, "ఇది ఒకరకమైన ఇన్ఫెక్షన్. వెండిపట్టీల వల్ల వచ్చింది. ఈమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ఎనిమిది రోజులు ఇంజక్షన్లతో ట్రీట్మెంట్ చేయాలి. ఒకవేళ ఆ ఇంజక్షన్లతో ఇన్ఫెక్షన్ తగ్గకపోతే ఆపరేషన్ చేయాల"ని చెప్పారు. నేను మన తండ్రి సాయినాథుని, "కేవలం ఇంజక్షన్లతో నా భార్యకి నయం కావాలి బాబా. ఆపరేషన్ అవసరం లేకుండా డిశ్చార్జ్ చేయించు తండ్రీ. మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా తోటి సాయిబంధువులతో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. సాయి దయవలన 8వ రోజుకి ఇన్ఫెక్షన్ చాలావరకు తగ్గిపోవడంతో కొన్ని రకాల టాబ్లెట్లు ఇచ్చి, నెలరోజుల తరువాత రమ్మని నా భార్యని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం నా భార్యకి పూర్తిగా నయమైంది. "ధన్యవాదాలు బాబా".
బాబా ఆశీస్సులతో 2022, ఏప్రిల్ 15న మా రెండవ అబ్బాయి పెళ్లి హైదరాబాదులో ఘనంగా జరిగింది. మా కోడలు హైదరాబాదుకి చెందిన అమ్మాయి. తను ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుంది. పెళ్లయిన తర్వాత తను తిరిగి ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే, పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయడానికి కేవలం నాలుగు నెలలే ఉందని ఎయిర్‌లైన్స్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు. సరేనని పాస్‌పోర్ట్ రెన్యూవల్ కొరకు హైదరాబాదులో ప్రయత్నిస్తే ఆగస్టు 22 వరకు స్లాట్ దొరకలేదు. అప్పుడు నేను, "సాయినాథా! పరిస్థితి మీకు తెలుసు. మీరే ఏదో ఒకటి చేయగలరు. మీ కృపతో మా కోడలి పాస్‌పోర్ట్ రెన్యువల్ అయి తను క్షేమంగా ఆస్ట్రేలియా చేరుకుని, తన ఉద్యోగంలో జాయిన్ అయినట్లయితే, నేను హైదరాబాదులోని మీ మందిరంలో పులిహోర ప్రసాదం పంచుతాను" అని మన సాయినాథునికి మొక్కుకున్నాను. తరువాత ఆశ్చర్యంగా కర్ణాటకలోని హుబ్లీలో పాస్‌పోర్ట్ రెన్యువల్‍కి స్లాట్స్ ఉన్నాయని తెలిసి, వెంటనే అక్కడికి వెళ్లి పాస్‌పోర్ట్ రెన్యువల్‍కి అప్లై చేస్తే, వారం రోజుల్లో పాస్‌పోర్ట్ రెన్యువలై వచ్చింది. 2022, జూలై 14న మా కోడలు హైదరాబాదు నుండి బయలుదేరి ఆస్ట్రేలియా వెళ్లి తన ఉద్యోగంలో జాయిన్ అయింది. అంతా ఆ సాయినాథుని దయ. ఇకపోతే, మా అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్లడం కోసం వీసాకి అప్లై చేసాము. దానికి సంబంధించి ఆగస్టు 11న మెడికల్ టెస్ట్ పూర్తయింది. అదేరోజు నేను మ్రొక్కుకున్నట్లు మన సాయినాథుని మందిరంలో సాయంత్రం హారతి సమయంలో పులిహోర ప్రసాదం పంచిపెట్టాను. ప్రస్తుతం మేము మా అబ్బాయి వీసా కోసం ఎదురుచూస్తున్నాం. బాబా ఆశీస్సులతో అది రాగానే మా అబ్బాయి కూడా ఆస్ట్రేలియా వెళ్తాడు. అది జరిగిన వెంటనే ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను. "మీరు మాపై చూపే అనుగ్రహానికి ధన్యవాదాలు సాయినాథా".
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః!!!
బాబాకి చెప్పుకుంటే బాధలు తీరుస్తారు
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు శశి. మాది తాడేపల్లిగూడెం. నేను సాయిభక్తురాలిని. నాకు ఎటువంటి సమస్య వచ్చినా సాయిబాబాకి చెప్పుకుంటే, ఆయన నా బాధలను తీరుస్తున్నారు. ఈమధ్య మా కుటుంబంతో ఒక అబ్బాయి చాలా చనువుగా స్నేహపూర్వకంగా ఉంటుంటే వాళ్ళ కుటుంబీకులకు అది నచ్చక నాకు ఫోన్లు చేసి తిట్టడం, బెదిరించడం చేస్తూండేవాళ్లు. ఆ కారణంగా నేను చాలా క్షోభను అనుభవించి, చివరికి సమస్యను బాబాకి విన్నవించుకుని, "నన్ను కాపాడండి బాబా" అని వేడుకున్నాను. బాబా దయవలన ఇప్పుడు వాళ్ళు ఫోన్లు చేయడం తగ్గించారు. "బాబా! మీకు నా హృదయపూర్వక వందనాలు తండ్రీ. నాకు ఎటువంటి సమస్యలు ఎదురైనా నన్ను రక్షిస్తూ ఎల్లవేళలా మీ ఆశీస్సులు నాకు అందించండి సాయీ".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram sai vachanamu is very nice today.today sai baba Leela's are nice.sai be with us.we are going to. Picnic to Shiva temple and another temple.From morning till night we have to travel.please take care.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai Always Be With Me
Sarvam sai mayam 🙏🙏🙏🙏🙏
ReplyDelete