1. బాబా ఆశీస్సులు
2. 'సాయీ' అంటే 'ఓయీ' అని పలికే దైవం
3. సాయి తోడుంటే సంతోషం వెంటుంటుంది
బాబా ఆశీస్సులు
సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు సరిత. నేను ఇప్పుడు నాలుగోసారి నా అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. 2022, ఫిబ్రవరిలో నాకు తీవ్రంగా జ్వరం, జలుబు, ఒళ్ళునొప్పులు వచ్చాయి. నేను టెస్టు చేయించుకోలేదు కానీ, ఓమిక్రాన్ లక్షణాలన్నీ ఉన్నాయి. మూడు రోజుల తర్వాత కొంత తగ్గినా కూడా ముక్కు దిబ్బడ పోలేదు. ఆ కారణంగా శ్వాస తీసుకోవడం నాకెంతో కష్టంగా ఉండేది. మీరు నమ్ముతారో, లేదో గాని నేను ఆరు సీసాల నాసల్ డ్రాప్స్ వాడాను. అయినా ముక్కు దిబ్బడ తగ్గలేదు. నాకు విసుగొచ్చి, "బాబా! నేనిప్పుడు నాసల్ డ్రాప్స్ వేసుకోవడం ఆపేస్తున్నాను. మీరే నా సమస్యను పరిష్కరించాలి. ముక్కుదిబ్బడ తగ్గితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకుని అప్పటినుండి నాసల్ డ్రాప్స్ వేసుకోవడం మానేశాను. బాబా దయవలన నేను శ్వాస చాలా తేలిగ్గా తీసుకోగలిగాను. ఎంతటి మహాద్భుతమో ఇది అనుకున్నాను.
ఇప్పుడు చెప్పబోయే అనుభవం చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ ఇది నిజంగా జరిగింది. ఒకరోజు దోమల బ్యాట్ మీద పొరపాటున నీళ్లు పడి, అది పనిచేయడం మానేసింది. 15 నిమిషాల తర్వాత నేను, "బాబా! ఇప్పుడు ఈ బ్యాట్ పని చేయాలి. ఇది పనిచేస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అప్పటినుండి అది పని చేస్తుంది.
2022, మే నెల మొదటి వారంలో నేను, నా భర్త మరియు మా బాబు శిరిడీ వెళ్ళాము. వెళ్లేముందు నేను, "బాబా! ఎటువంటి సమస్యలు లేకుండా మమ్మల్ని తీసుకెళ్లి, తిరిగి తీసుకు రావయ్యా, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల శిరిడీలో వారి దర్శనం, పారాయణం బాగా జరిగి మేము క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము.
2022, జూలై నెల చివరిలో నాకు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చి వెనుక పక్కటి ఎముకల్లో పట్టేసినట్టుగా అనిపించింది. కాసేపటికి తీవ్రమైన తలనొప్పి కూడా మొదలై 36 గంటలైన తగ్గలేదు. అప్పుడింక నేను, "బాబా! ఈ తలనొప్పి తగ్గించండి. మీ దయతో నొప్పి తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకుని డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. డాక్టరు ఇచ్చిన మందులు వేసుకున్నాక తలనొప్పి తగ్గింది. "థాంక్యూ వెరీ మచ్ బాబా. ఆలస్యంగా నా అనుభవాలు పంచుకున్నందుకు నన్ను క్షమించండి".
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
'సాయీ' అంటే 'ఓయీ' అని పలికే దైవం
నా పేరు భారతి. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నమస్సుమాంజలి. అదేమిటో కానీ, సమస్య చెప్పుకుని 'బాబా! నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాము, గట్టెక్కించు తండ్రి' అని అనుకున్న వెంటనే సాయి పలకడం చూస్తుంటే, 'ఓహో సాయి మనల్ని ఈవిధంగా అనుగ్రహిస్తున్నార'ని ఆనందభాష్పాలు వస్తున్నాయి. ఇక నా అనుభవానికి వస్తే, ఇటీవల నేను జ్వరంతో తీవ్రంగా బాధపడ్డాను. మందుల దారి మందులదే గానీ 5 రోజులైనా జ్వరం తగ్గలేదు. చివరికి డాక్టరు కోవిడ్ టెస్టు చేయించమంటే, టెస్టుకి ఇచ్చాను. కానీ అప్పటినుండి ఎక్కడ పాజిటివ్ వస్తుందో అని విపరీతమైన ఆందోళన. పాజిటివ్ వస్తే ఐసోలెట్ అవ్వడానికి భయం, పైగా చేసిపెట్టేదానికి ఎవరూ లేని పరిస్థితి. ఇవన్నీ ఆలోచిస్తూ రాత్రంతా "బాబా బాబా కాపాడు" అని ఒకటే వేడుకుంటూ... "బాబా! రిపోర్టు నెగిటివ్ వస్తే, బ్లాగులో నా అనుభవం పంచుకుంటాను" అని ప్రార్ధించాను. తెల్లవారి రిపోర్టు చూడాలంటే చాలా వణికిపోయాను. భయంభయంగా తెల్లవారి 4.30కి మొబైల్‍లో రిపోర్టు చూస్తే, నెగిటివ్ అని ఉంది. ఒక్కసారిగా నా బాబా కాళ్ళ మీద పడిపోయాను. ఎన్నో భయాలతో అడుగడుగునా బాబాని వేడుకుంటూ ఉండే నన్ను ఆయన ప్రతిసారీ కాపాడుకుంటూ ఉంటారు. 'సాయి' అంటే 'నాతండ్రి' అంతే.
ఈమధ్య మా అక్కవాళ్ల ఇల్లు ఖాళీ అయిన తరువాత అద్దెకి సరైన వాళ్ళెవరూ రాలేదు. ఆ సమయంలో నేను బాబాకి మా కష్టాన్ని విన్నవించుకుని, "అద్దెకు మంచివాళ్ళు వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆ మర్నాడే ఒక మంచి కుటుంబం మా ఇంటిలోకి అద్దెకి వచ్చారు. దాంతో నా టెన్షన్ తీరింది. "ధన్యవాదాలు బాబా".
సర్వం సాయిమయం!!!
సాయి తోడుంటే సంతోషం వెంటుంటుంది
సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు ఇటీవల బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. సమయానికి నెలసరి రాని సమస్యతో నేను ఇబ్బందిపడుతున్నాను. అందుకోసం నేను ఈమధ్య హోమియోపతి మందులు వాడటం మొదలుపెట్టాను. అయితే నెల గడిచినా కూడా పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. అప్పుడు నేను, "బాబా! నా సమస్యలో మార్పు వచ్చి, నాకు నెలసరి వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల సరిగ్గా 45 రోజులకి నాకు నెలసరి వచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవం పంచుకోవటం ఆలస్యమైంది. నన్ను క్షమించు తండ్రి".
2022, ఆగస్టు నెల మొదటి ఆదివారం, ఫ్రెండ్ షిప్ డే రోజున నేను నా స్నేహితులతో కలిసి బయటికి వెళదామనుకుని, వెళ్లేముందు, "సాయీ! నేను వెళ్లే ఊరిలో బంధువులు, తెలిసినవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకెవరికీ నేను కనబడకుండా స్నేహితులతో ఫ్రెండ్‍షిప్ డేని సంతోషంగా గడిపి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల నేను సంతోషంగా గడిపి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను. ఇదేవిధంగా ఇంకోసారి పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా నేను, "సాయీ! మేము సంతోషంగా వెళ్లి, ఆనందంగా గడిపి, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. ఆయన నేను కోరుకున్నట్లే అనుగ్రహించారు. "ధన్యవాదాలు సాయి. మీరు తోడుగా ఉంటే మేము ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాము. నాకొక సమస్య ఉంది బాబా. నాకు తోడుగా ఉండి, మార్గ నిర్దేశం చేసి తొందరగా నా సమస్యను పరిష్కరించి, ముందుకు నడిపించు సాయి".
సర్వం సాయిమయం!!!
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయి బాబా యెల్ండి పిక్ నిక్ వుంది. జాగ్రత్తగా తీసుకుని వెళ్లి తిరిగి జాగ్రత్తగా తీసుకుని రండి. నాకు కాళ్ళు పటేసాయి.ఎలాగో వెళ్లి రావాలి.
ReplyDeleteSamardha sadguru sai nath maharaj ki jai🙏
ReplyDelete