అనుభవాలలో లుప్తమైపోతున్న బాబా ప్రేమ కొరకు ఆవేదన - సాయిభక్తులందరికీ మా హృదయ నివేదన
సాయిభక్తులకు నమస్కారం! ముందుగా, బాబా ఎంతో ప్రేమతో ప్రసాదించిన ఈ ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగులో తమ తమ అనుభవాలను పంచుకుంటున్న సాయిభక్తులందరికీ మనసారా మా ధన్యవాదాలు. ఈ బ్లాగులో అనుభవాలు పంచుకునే విషయంలో సాయిభక్తులందరికీ ఒక చిన్న మనవి. అసలు ఈ బ్లాగ్ ప్రారంభించడంలోని మా ప్రధాన ఉద్దేశ్యం.. బాబా మనకి ప్రసాదించే అనుభవాలను ప్రచురించే క్రమంలో ఆ అనుభవాలలోని బాబా ప్రేమను మేము ఆస్వాదిస్తూ, ఆ ప్రేమను సాటివారితో పంచుకుంటూ, బాబా స్మరణలో అందరమూ ఆనందంగా ఉండాలని. అందుకోసం మీ అనుభవాలను వివరంగా వ్రాయమని ఈ బ్లాగ్ వేదికగా మిమ్మల్ని ఇదివరకు ఒకసారి అభ్యర్థించాము. కొంతమంది మా అభ్యర్థనను మన్నించి వారి అనుభవాలను చక్కగా వివరంగా వ్రాసి పంపుతున్నారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే, కొంతమంది భక్తులు ఇప్పటికీ తమ అనుభవాలను క్లుప్తంగానే వ్రాస్తున్నారు. ముఖ్యంగా చాలామంది భక్తులు తమ సమస్యలు తీరితే ఈ బ్లాగులో పంచుకుంటామని బాబాకు మ్రొక్కుకొని, వాటిని పంచుకుంటున్నారు. అలా మ్రొక్కుకోవద్దని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. నిజానికి, చాలామంది సాయిభక్తుల అనుభవాలలో, వారు ఎంతోకాలం సమస్యలతో సతమతమై, చివరికి ఈ బ్లాగులో పంచుకుంటానని మ్రొక్కుకున్న తరువాతనే బాబా దయతో వారి సమస్యలు తీరాయని వ్రాస్తున్నారు. అంటే, బాబానే ఈ బ్లాగ్ మాధ్యమంగా ఆయా భక్తులను అనుగ్రహిస్తున్నారన్నది స్పష్టం. కాబట్టి అటువంటి అనుభవాలను కాదనటానికి మాకు ఎటువంటి అర్హతా లేదు. కానీ, బాబా ప్రసాదించిన అనుభవాలను ఏదో మ్రొక్కుబడిగా, చాలా క్లుప్తంగా వ్రాసి పంపిస్తుంటే, ఎందుకోసమైతే ఈ బ్లాగును ప్రారంభించామో ఆ బాబా ప్రేమ ఆ అనుభవాలలో కనిపించక మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి. బాబా పట్ల ఎంతో ప్రేమతో ప్రారంభించిన ఈ బ్లాగ్ చివరికి మ్రొక్కుబడులు తీర్చుకునే వేదికగా మారుతున్నందుకు మా ప్రాణాలు విలవిలలాడిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఈ బ్లాగును నిలిపివేయాల్సి వస్తుందేమోనని మేమంతా ఎంతో వేదనకు గురవుతున్నాము. కానీ, బాబా ఎంతో ప్రేమతో అనుగ్రహించిన ఈ బ్లాగును నిలిపివేయడం మా అభిమతం కాదు. కాబట్టి, నిజంగా మీ అనుభవాలను ఈ బ్లాగులో పంచుకుంటామని బాబాకు మ్రొక్కుకున్నట్లయితే, వాటిని బ్లాగులో ప్రచురించాలని హృదయపూర్వకంగా కోరుకున్నట్లయితే, దయచేసి మా వేదనను మీరంతా సహృదయంతో అర్థం చేసుకుని, బాబా మీకు ప్రసాదించిన అనుభవాలను ఏదో మ్రొక్కుబడిగా కాకుండా వివరంగా పంచుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే ఆ అనుభవాలలో బాబా ప్రేమ వ్యక్తమవుతుంది. నిజానికి అనుభవాన్ని పంచుకోవడమంటే బాబా ప్రేమను పంచుకోవడమే. అందుచేత, అనుభవాన్ని పొందే క్రమంలో మీకు ఎదురైన సమస్య, దానివల్ల మీరు పొందిన ఆందోళన, ఆ సమస్య తీరడం కోసం బాబాపై ఆధారపడిన విషయం, బాబా అనుగ్రహించిన తీరు, ఆ అనుభవం ద్వారా మీరు పొందిన ఆనందానుభూతిని వివరిస్తూ బాబా ప్రేమ తెలిసే విధంగా వ్రాయడానికి ప్రయత్నించండి. అలా వ్రాస్తే, వ్రాసే మీరు, ప్రచురించే మేము, మనతోపాటు సాటి సాయిభక్తులు కూడా ఆ ఆనందాన్ని, బాబా ప్రేమను ఆస్వాదిస్తారు. అంతేకాదు, బాబా చేసిన ఏ లీల అయినా ఎంతో ప్రబోధాత్మకంగా ఉంటుంది. మీరు పొందిన అనుభవాలలో మీరు బాబా బోధను గ్రహించగలిగితే ఆ వివరాన్ని కూడా పంచుకోవడానికి ప్రయత్నించండి. ఆ అనుభవం ఎంతోమంది సాయిభక్తులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలా కాకుండా అనుభవాలను క్లుప్తంగా, బాబా ప్రేమను వ్యక్తపరచకుండా వ్రాసి పంపితే మాత్రం ఇకపై బ్లాగులో ప్రచురించలేమని ఈ సందర్భంగా అందరికీ విన్నవించుకుంటున్నాము. నిజానికి అలా చేయడం మా మనసులకి కష్టంగానే ఉంటుంది. అందుచేతనే ఇప్పటివరకు అలాంటి వాటిని కూడా ప్రచురించాము. కానీ ఈ బ్లాగు మ్రొక్కుబడులు తీర్చుకునే వేదికగా మిగిలిపోకుండా బాబా ప్రేమకు నిలయంగా ఉంచడానికి ఈ నిర్ణయం మాకు తప్పనిసరైంది. దయచేసి ఎవ్వరూ అన్యథా భావించకండి.
అలాగే, అందరికీ మరొక్క మనవి.. మీరంతా శ్రీహేమాడ్‌పంత్ రచించిన శ్రీసాయిసచ్చరిత్ర, శ్రీబి.వి.నరసింహస్వామి రచించిన భక్తుల అనుభవాలు మొదలైన సద్గ్రంథాలు, ఈ బ్లాగులో ప్రచురించిన బాబా సమకాలీన భక్తుల అనుభవాలు చదివే ఉంటారు. వాటిలో ప్రచురించిన భక్తుల అనుభవాలలోనూ, అలాగే ఈనాటి సాయిభక్తులలో కొంతమంది పంచుకున్న అనుభవాలలోనూ, వారు బాబా వద్దకు ప్రప్రథమంగా ఎలా వచ్చారో, ఆ ప్రథమ దర్శనంతోనే వారు ఎంతగా బాబా పట్ల ఆకర్షితులయ్యారో, బాబా ప్రసాదించిన అనుభవాల వల్ల వారి జీవితాలు ఎంత చక్కగా మార్పు చెందాయో, ఆయా అనుభవాల ద్వారా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు వచ్చిందో మనం తెలుసుకున్నాం. ఆయా భక్తులు ఈ విషయాలన్నీ వివరంగా చెప్పకపోయుంటే బాబా ప్రేమను మనం ఇంతగా అనుభూతి చెందేవాళ్ళం కాదేమో! కాబట్టి మీరంతా కూడా కేవలం ప్రస్తుత అనుభవాలను, ఈ బ్లాగులో పంచుకుంటామని బాబాకు మ్రొక్కుకున్న అనుభవాలనే కాకుండా, అసలు మొట్టమొదట బాబా మీ జీవితాలలోకి ఎలా ప్రవేశించారో, మీరు బాబా పట్ల ఎలా ఆకర్షితులయ్యారో, మీ జీవితాలను బాబా ఎలా చక్కగా తీర్చిదిద్దారో, ఆ అనుభవాల ద్వారా మీ జీవితాలలో ఎలాంటి పరివర్తన కలిగిందోనన్న విషయాలను కూడా వివరంగా పంచుకుంటే మీతో పాటు మేమంతా కూడా బాబా ప్రేమలో ఓలలాడతాము. మా మనవిని అర్థం చేసుకుని మీరంతా బాబా మీపై చూపిన ప్రేమను మాతో పంచుకుంటారని ఆశిస్తూ..
- 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ టీం.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai Always Be With Me
Samardha sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJA KI JAI...OM SAI RAM
ReplyDelete