సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1284వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - మొదటి భాగం

గురువులకు గురువు, సమర్థ సద్గురువు, పిలిస్తే పలికే కలియుగ దైవం అయిన శ్రీ శిరిడీ సాయిబాబా భక్తుడినైన నేను, నా జన్మకు కారణమైన ఆ సద్గురుని కీర్తించి, వారి మహిమను, లీలలను లోకానికి వెల్లడి చేయడం గురుసేవలోనే ఉత్కృష్టమైన సేవగా భావిస్తూ 1960 నుండి 2019 వరకు బాబా నాకు, నా కుటుంబానికి ప్రసాదించిన ఎన్నో అనుభవాలను మీ అందరితో పంచుకుంటున్నాను.

అది 1960వ సంవత్సరం. అప్పట్లో మా కుటుంబం గుంటూరులో ఉండేది. మాది గౌరవప్రదమైన పెద్ద ఉమ్మడి కుటుంబం. ఒకప్పుడు మా అమ్మగారు కుటుంబంలోని కొన్ని కారణాల వల్ల తనువు చాలించాలని నిరాహారదీక్ష చేపట్టారు. ఆ సమయంలో ఒకరోజు రాత్రి ఆమెకు కలలో ఒక సాధువు కనపడి, “అమ్మా! నువ్వు చేస్తున్నది మంచిది కాదు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీకు ఆసరాగా ఒక కుమారుడు జన్మిస్తాడు” అని చెప్పాడు. ఆ సాధువు ఎవరో తెలియదుకానీ, వారి మాటపై నమ్మకముంచి అమ్మ తన నిరాహారదీక్షను విరమించింది. కొన్నిరోజుల తర్వాత మా అమ్మ, మా పెద్దమ్మ బజారులో నడుస్తూ ఉండగా, ఫోటో ఫ్రేములు కట్టే ఒక షాపులో అమ్మకు ఒక ఫోటో కన్పించింది. ఆ ఫోటోలోని ఫకీరు, తనకు కలలో కన్పించిన సాధువు ఒక్కరేనని గుర్తించిన అమ్మ ఆ షాపువారిని ఆరా తీస్తే, ఆ ఫోటోలో ఉన్నది ‘శ్రీ శిరిడీ సాయిబాబా’ అని, ఆయన మహారాష్ట్రలోని శిరిడీ గ్రామంలో వెలసిన గొప్ప మహాత్ములని చెప్పారు. అమ్మ ఆ ఫోటో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని, భక్తిశ్రద్ధలతో పూజించసాగింది. 1961వ సంవత్సరంలో అమ్మ ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ బిడ్డ వేరెవరో కాదు, అది నేనే. బాబా కలలో చెప్పిన మాట ఇలలో నిజమైంది కనుక నాకు 'సాయిబాబు' అని నామకరణం చేసి, నా పుట్టువెంట్రుకలు శిరిడీలో తీయించాలని అమ్మ మ్రొక్కుకుంది. ఆ మొక్కు తీర్చుకునేందుకు శిరిడీ ఎక్కడ ఉందో, ఎలా వెళ్ళాలో తెలియక నాన్నగారు నాకు 7 సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ కాలయాపన చేశారు. అప్పటికి నా జుట్టు ఆడపిల్లల జుట్టు మాదిరిగా పెరిగిపోయింది. చివరికి 1967లో అమ్మ బాబానే శరణుజొచ్చి, "ఈ సంవత్సరం ఎలాగైనా మమ్మల్ని శిరిడీకి రప్పించుకుని నీ దర్శనభాగ్యాన్ని మాకు ప్రసాదించి, మ్రొక్కు తీర్చుకునేలా అనుగ్రహించమ"ని ప్రార్థించింది. అడిగిందే తడవుగా బాబా మా అమ్మ కోరిక నెరవేర్చారు. ఎలాగంటే, మాటల సందర్భంలో మా నాన్నగారి స్నేహితుడు విషయం తెలుసుకుని, తన అంబాసిడర్ కారు ఇచ్చి శిరిడీ వెళ్ళి రమ్మన్నారు. అలా మొదటిసారి శిరిడీకి ప్రయాణమైన మేము హైదరాబాదులో ఇండియా మ్యాప్ కొని, దాని ఆధారంగా రూటు తెలుసుకుంటూ పూనా ఘాట్ చేరేసరికి చీకటి పడసాగింది. అప్పట్లో అంతగా వాహనాల రద్దీ ఉండేది కాదు ఆ మార్గంలో. పైగా దొంగల భయం ఎక్కువ. అందువలన భయంతో మేము బాబా నామస్మరణ చేసుకుంటూ ప్రయాణం సాగిస్తుండగా కొంతదూరంలో ఒక కారు ఆగి ఉండడం కనిపించింది. మేము కారు ఆపి, వాళ్ళని హిందీలో విషయం అడిగితే, 'తమ కారు ఇంజన్లో చిన్న పార్టు చెడిపోయింద'ని చెప్పారు. అదృష్టవశాత్తూ ఆ పార్టు మా కారులో ఉండటం వల్ల మేము వాళ్ళకి సహాయం చేయగలిగాము. కృతజ్ఞతతో వారు మమ్మల్ని తమ ఇంటికి ఆహ్వానించి సకల మర్యాదలు చేసి, శిరిడీకి ఎలా వెళ్ళాలో వివరంగా తెలియపరచి వీడ్కోలు చెప్పారు. ఇది బాబా లీల కాదంటారా! తరువాత మేము శిరిడీ సమీపిస్తుండగా దారిలో చిన్న చప్టా లాంటిది వచ్చింది. అందులో మా కారు ఇరుక్కుపోయి, ఇంజన్ ఆగిపోయింది. పొగగొట్టంలోకి నీళ్ళు వెళ్లి కారు స్టార్ట్ అవలేదు. మాకు ఏం చేయాలో తెలియక బాబానే తలచుకున్నాము. అంతలో ఎక్కడినుండి వచ్చారో ఆజానుబాహులైన నలుగురు వ్యక్తులు వచ్చి మా కారును ఎత్తి, నీళ్ళల్లో నుండి దాటించి మారుమాట్లాడకుండా వెళ్లిపోయారు. చూడటానికి చాలా దృఢంగా, బలంగా, పంచెకట్టుతో ఉన్న వారి రూపం 7 సంవత్సరాల వయస్సున్న నా మదిలో అలాగే ముద్రించుకుపోయింది. బాబానే వాళ్ళ రూపంలో సహాయం చేశారని ఆనందంగా శిరిడీ చేరుకుని గురుస్థానంలో వేపచెట్టు ముందు కారు ఆపి, సమాధిమందిరంలోకి వెళ్ళాము. ఆ సమయంలో ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువమంది భక్తులు అక్కడ లేరు. మేము సమాధిని తాకి బాబా దర్శనం చేసుకుని, తరువాత తలనీలాల మ్రొక్కు తీర్చుకుని అరగంట తరువాత తిరుగు ప్రయాణమయ్యాము. దారిలో గోదావరి నదిలో స్నానం చేసి, పండరిపురం దర్శించుకుని గుంటూరుకి తిరిగి వచ్చాము. నేను, అమ్మ ప్రతిరోజూ బాబాకు పూజ చేస్తుండేవాళ్ళము. నేను తరచుగా బాబా గుడికి వెళ్తుండేవాడిని. బాబా అనుక్షణం మమ్మల్ని రక్షిస్తూ ఉండేవారు. ఆయన దయవల్లే అంతా సాఫీగా జరుగుతుండేది.


1980వ సంవత్సరంలో మా రెండవ అన్నయ్య(కజిన్) వివాహానికి హాజరయ్యేందుకు తెనాలి దగ్గరున్న లంక గ్రామానికి ముగ్గురు స్నేహితులం బైక్ మీద బయల్దేరాము. అదంతా ఇసుకనేల, పైగా చీకటి కావడం వలన మేము దారి తప్పాము. నేరుగా దారి ఉందనుకుంటూ వెళితే, ఒక ప్రదేశం దగ్గరకు వెళ్ళి ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే, ఇంక ముందుకు రోడ్డు లేదు. బైక్ యొక్క హెడ్ లైట్ కాంతిలో ముందున్న ప్రదేశాన్ని చూసి మేము భయకంపితులయ్యాం. ఎందుకంటే, అది స్మశానం. అప్పుడు నేను, "బాబా! నువ్వే మాకు దారి చూపించు" అని ప్రార్థించాను. మరుక్షణం ఎవరో ఒక వ్యక్తి టార్చిలైటు వెలుగు చూపుతూ, “ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు" అని అడిగి, మా వివరాలు తెలుసుకుని, పెళ్లి జరుగుతున్న గ్రామం వరకూ దారి చూపించి మమ్మల్ని క్షేమంగా అక్కడికి చేర్చాడు. పెళ్ళి లైటింగ్‍ను చూసిన ఆనందంలో ఒక్క నిమిషం ఆగి, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెబుదామని వెనక్కి తిరిగి చూస్తే, అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ వ్యక్తి బాబానేనని ఆనందంతో నా మనసు పులకరించిపోయింది.


నేను వ్యాపార నిమిత్తం ఎక్కువగా లారీల్లో ప్రయాణం చేయవలసి వచ్చేది. నంద్యాల ఘాట్ రోడ్డులో నేను ఎన్నో రాత్రులు ప్రయాణం చేశాను. ఆ మార్గంలో దొంగలు మరియు క్రూరజంతువుల సంచారం చాలా ఎక్కువ. కానీ బాబా నాకు ఏ రోజూ, ఏ చిన్న ప్రమాదమూ జరగనివ్వలేదు. నేను ఆ మార్గంలో వెళ్లొచ్చిన మరుసటిరోజు పేపర్లో రాత్రి ఆ మార్గంలో దొంగలు ఆర్.టి.సి. బస్సునో, లారీనో దోచుకున్నారనే వార్త చదివినప్పుడు, 'నాకు అలాంటి ప్రమాదం కలుగకుండా రక్షించింది బాబానే' అనిపించేది.


1983లో ఒకసారి నంద్యాల ఘాట్ రోడ్డులో చాలా ఎత్తుగా ఉన్న చోట నేను ప్రయాణిస్తున్న లారీ అతి కష్టంగా పైకి ఎక్కుతున్నప్పుడు ఎదురుగా చాలా బలిష్ఠంగా ఉన్న అడవిదున్న ఒకటి వస్తూ కనిపించింది. అది ఎక్కడ మా లారీని ఢీకొడుతుందో అని నేను భయపడ్డాను. కానీ మనసులో బాబాని తలచుకోగానే ఒక విచిత్రం జరిగింది. ఎవరో పెద్ద కర్రతో దాని వీపు మీద బాదినట్లు అది ఉలిక్కిపడి ప్రక్కకు ఒక గంతువేసి అడవిలోకి పారిపోయింది.


ఇంకోసారి అదే మార్గంలో ఒక అర్థరాత్రివేళ అడవి మధ్యలో మా లారీ చెడిపోయింది. నంద్యాల వెళ్లడానికి చెయ్యెత్తి ఆపుతుంటే ఒక్క వాహనం కూడా ఆపట్లేదు. ఆ చీకట్లో ఎలుగుబంట్లు తిరుగుతుంటాయని జ్ఞాపకమొచ్చి నాకు ఒక్కసారిగా భయమేసి, 'బాబా నీవే దిక్కు' అని అనుకున్నాను. అంతలో ఒక లారీ వచ్చి మా ముందు ఆగింది. అందులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. అతను మేమేమీ అడగకుండానే, "మిమ్మల్ని నంద్యాలలో దించుతాను, ఎక్కండి” అని అన్నాడు. మేం నంద్యాల వెళ్తున్నామని ఆయనకెలా తెలిసిందని మాకు చాలా ఆశ్చర్యమేసింది. ఇప్పుడు అనిపిస్తుంది, 'ఆ వచ్చింది బాబానే' అని.


1984లో ఒకసారి నేను నా స్నేహితులతో కలిసి రాయలసీమలోని 'పెనకచర్ల' డ్యామ్ చూడటానికి వెళ్లి, డ్యామ్‍ పైకి వెళ్ళడానికి అక్కడున్న ఇనుపమెట్లు ఎక్కుతున్నాము. క్రింద పెద్ద కాలువ ఉంది. అనుకోకుండా నేను నా కాలుజారి పడిపోబోయాను. అంతలో ఎవరో వెనుక నుంచి నా చొక్కా పట్టి లాగినట్లనిపించింది. కానీ నా వెనుక ఎవరూ లేరు. నేనే చివర ఉన్నాను. నన్ను పడిపోకుండా ఆపింది బాబానే.


1990లో ఒకసారి మా లారీ మట్టి క్వారీలో చాలా ఎత్తు నుండి కిందకు పడిపోయింది. ఆ దుర్ఘటనలో డ్రైవరుకుగానీ, లారీకిగానీ ఏమీ కాలేదు. ఎందుకంటే, లారీలో ఎప్పుడూ బాబా ఫోటో ఉంటుంది. బాబాకు, వారి ఫోటోకు, విగ్రహానికి తేడా లేదని స్వయంగా బాబానే చెప్పారు కదా! మనసుతో చూస్తే శూన్యంలో కూడా దర్శనమిస్తారు బాబా. నాకు ప్రతి పౌర్ణమి చంద్రుడిలో బాబా ముఖదర్శనమవుతుంది. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిచేటంత మనోహరంగా దర్శనమిస్తారు బాబా.


1993లో మేము ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. ఆ ఇంటి యజమానులు మేము బాబాకు చేసే పూజను గమనించి, మాకు ఒక అద్భుతం చూపించారు. అది ఎప్పుడో దాదాపు 50 సంవత్సరాల క్రితం తీసిన ఒక ముసలావిడ ఫోటో. ఆ ఫొటోలోని ముసలావిడ శరీరంలోని అర్థభాగం 90 సంవత్సరాల వయసు గల బాబా అర్థభాగంగా దర్శనమిస్తుంది. అది చూసి మేం చాలా ఆశ్చర్యపోయాము. అసలు విషయమేమిటంటే, ఆ ముసలావిడ బాబా భక్తురాలు. ఆవిడ భక్తిని చూసి, అప్పటి బాబా భక్తులు ఆమెను నిలబెట్టి ఒక ఫోటో తీశారు. ఆ ఫోటో కడిగిన తర్వాత చూస్తే, ఆ ఫోటోలో సగభాగం ఆవిడ, మిగతా సగభాగం బాబా ఉన్నారు. బాబా వేసుకున్న జుబ్బా చిరుగు, కొంచెం తెల్లని గడ్డం, తలపాగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ముసలావిడకు ఒక ఫోటో కాపీ ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు. ఆవిడ తదనంతరం ఆవిడ వారసులు ఆ ఫోటోను భద్రంగా చూసుకుంటున్నారు. ఆమె చాలా అదృష్టవంతురాలు.  ఆ ఫోటోను చూసిన మేము ధన్యులం.


నోట్:- సాయిబాబుగారు బాబా తమకు ప్రసాదించిన అసంఖ్యాక అనుభవాలను సాయి ఆశీస్సులతో 100+ పేజీల ఒక పుస్తకంగా ముద్రించారు. ఆ పుస్తకంలోని అనుభవాల రూపంలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన బాబా ప్రేమను మన అందరికీ పంచాలని సుమారు 7, 8 నెలల క్రితం ఆ పుస్తకాన్ని బ్లాగుకి పంపారు. ఆ పుస్తకంలోని అనుభవాలను వారంలో ఒకరోజు చొప్పున ప్రచురించాలన్న ఉద్దేశ్యంతో ఈరోజు మొదటి భాగం మీ ముందు ఉంచాము. తరువాయి భాగం వచ్చేవారం..   

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

6 comments:

  1. Very nice to listen ur experiences saibabu garu

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Samardha sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI....OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo