- కష్టమేదైనా 'బాబా' అనగానే ఆదుకునే తండ్రి
నేను సాయిభక్తురాలిని. కలియుగంలో ఈ బ్లాగ్ నిజంగా కల్పవృక్షం. ఏ సమస్య వచ్చినా 'బ్లాగులో పంచుకుంటామ'ని అనుకోగానే పరిష్కారమైపోతుంది. ఈ బ్లాగును నడుపుతున్న సాయికి చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఎంతో ఓపికగా మేము పంపే అనుభవాలను జాగ్రత్తగా చదివి, వాటిని చాలా అందంగా కూర్చి ప్రచురిస్తున్నారు. మీరు చేసే సేవకు సాయిబంధువులందరి తరపున నమస్కారాలు. నేను ఇదివరకు ఈ బ్లాగులోని 'సాయిభక్తుల అనుభవమాలిక' 1201వ భాగంలో 'సాయి కృప అద్భుతం' అనే టైటిల్‍తో రెండు అనుభవాలు పంచుకున్నాను. ఆ అనుభవాల చివరిలో నేను, "మేము సొంత ఇంటికోసం ప్రయత్నిస్తున్నాం సాయీ, అనుగ్రహించండి" అని బాబాను అడిగాను. ఆ అనుభవాలు బ్లాగులో పబ్లిష్ అయినరోజున బ్లాగ్ నిర్వహించే సాయి, 'మీ అనుభవాలు ఈరోజు బ్లాగులో పబ్లిష్ అయ్యాయ'ని నాకు లింక్ షేర్ చేశారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే బ్లాగులో మొట్టమొదట, "త్వరగా ఇంటిని నిర్మించు. నేను అక్కడికి రావాలనుకుంటున్నాను" అనే సాయివచనం నా కంటపడింది. దాంతో, 'తొందర్లోనే నా కోరిక తీరుస్తాన'ని బాబా చెప్తున్నారనిపించి నాకు చాలా సంతోషమేసింది.
సాయితల్లి నా జీవితంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది. కానీ ఆయన చాలా అద్భుతాలు చూపుతున్నారు. మేము ఇంకా శిరిడీ దర్శించలేదు. మాకు దగ్గరలో ఉన్న మందిరంలో నుండి తెచ్చుకున్న ఊదీనే బాబా ప్రసాదంగా వాడుకుంటున్నాము. ఊదీ నిజంగా సాయి అనుగ్రహచిహ్నం. ఇది సత్యం. ఏ అనారోగ్య సమస్య అయినా ఊదీ వాడినంతనే ఇట్టే తగ్గిపోతుంది. అయితే ఒకసారి నా మనసుకెందుకో, 'శిరిడీ ఊదీ ఎలా ఉంటుందో! ఒక పెద్ద ప్యాకెట్ ఊదీ వస్తే బాగుంటుంది' అనిపించింది. కానీ ఇదెలా సాధ్యమవుతుందనుకుని ఆ సంగతి పూర్తిగా మర్చిపోయాను. సుమారు నెలా 20 రోజుల తర్వాత నా భర్త ఒక ప్యాకెట్ తెచ్చి, "ఇది నీకోసమే" అని నాకిచ్చారు. అది ఓపెన్ చేస్తే, అందులో శిరిడీ ఊదీ చాలా ఉంది. సుమారు 100 గ్రాముల వరకు ఉంటుంది. నా భర్త తన ఆఫీసులోని తెలిసినవాళ్ల ద్వారా ఆ ఊదీ తెప్పించారట. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే, నేను మావారితో ఊదీ కావాలని అస్సలు చెప్పలేదు. అలాంటిది బాబా తమ కృపను ఊదీ ద్వారా పంపారని అర్థమై నాకు చాలా సంతోషంగా అనిపించింది. మనం బాబాను అడిగి మర్చిపోతాం. కానీ, బాబా మనం చెప్పేది విని అస్సలు మర్చిపోరు. తప్పక మన కోరికను తీరుస్తారు. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ తప్పనిసరిగా మనం కోరుకున్నది ఇస్తారు "లవ్ యు సాయిదేవా".
ఒకసారి నా ఎడమచేయి బరువుగా అనిపించింది. అలా ఒక వారంపాటు ఉండేసరికి నేను బాబా ఊదీ రాసుకుని, "ఈ సమస్యను తగ్గించండి బాబా" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల మరో వారంలో తగ్గిపోయింది. తరువాత ఒకరోజు రాత్రి నా కుడికాలి చీలమండ దగ్గర గట్టిగా దెబ్బ తగిలి బాగా నొప్పితోపాటు కొద్దిగా వాపు వచ్చి నడవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. మరుసటిరోజు తప్పకుండా ఆఫీసుకు వెళ్లాల్సి ఉన్నందున నేను, "ఇలా అయితే ఎలా బాబా? దీని సంగతి మీరే చూసుకోవాలి" అని ఊదీ రాసుకుని పడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి కొద్దిపాటి నొప్పి మాత్రమే ఉండి, నేను ఆఫీసుకు వెళ్ళగలిగాను. రెండు, మూడు రోజులలో ఆ నొప్పి కూడా తగ్గిపోయి మామూలుగా అయిపోయింది. అయితే ఆ తర్వాత మళ్ళీ కాస్త ఎక్కువగానే నొప్పి అనిపించింది. ఎందుకిలా ఉంటుందని నేను మళ్ళీ ఊదీ రాస్తూ ఉంటే తగ్గిపోయింది. అప్పుడు నాకు బాబా ఏదో అనుభవించవలసిన కర్మను కాస్త పోస్ట్‌పోన్ చేసి మళ్ళీ అనుభవింపజేశారు అనిపించింది. బాబాకు ఏదైనా సాధ్యమే కదా!
అప్పుడప్పుడు నాకు లెగ్ క్రామ్ప్స్ (నిద్రలో కాళ్లు బిగుసుకుపోవటం) సమస్య వస్తుంటుంది. ఒకరోజు రాత్రి పదిన్నరప్పుడు ఎడమకాలు బిగుసుకుపోయి, బాగా నొప్పి పెట్టింది. వెంటనే నేను ఊదీని కాలికి రాశాను. మరుక్షణమే ఆ సమస్య తగ్గింది. "కష్టం ఏదైనా 'బాబా' అనగానే ఆదుకుంటున్నావు బాబా. చాలా చాలా ధన్యవాదాలు".
2002, జూన్ నెలలో స్కూల్స్ తిరిగి ప్రారంభమవడానికి నాలుగు రోజుల ముందు మా ఇద్దరు పిల్లలకీ జలుబు, జ్వరము వచ్చాయి. నాకు చాలా భయమేసి, "బాబా! ఎలాగైనా పిల్లలకి తగ్గేలా చూడండి" అని బాబాతో చెప్పుకుని ఊదీని నీళ్లలో కలిపి పిల్లలకి ఇస్తూ, మందులు కూడా వేశాను. బాబా దయవల్ల స్కూలు తెరిచేరోజుకి పిల్లలు కోలుకుని స్కూలుకు వెళ్లారు.
ఒకసారి మా బాబుకి కళ్ళ దగ్గర స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు నేను, "బాబా! బాబుకి తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకుని ఊదీ రాస్తే, బాబుకి తగ్గింది. కానీ నేను బ్లాగులో పంచుకోవడం ఆలస్యం చేసేసరికి కొన్నిరోజుల తర్వాత మళ్లీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది. పైగా ఈసారి ఇంకా ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికి మందులు వాడుతూ, ఊదీ రాస్తున్నాను. బాబా దయవల్ల ఎలాగైనా ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుందని నమ్మకంతో నా అనుభవాన్ని ముందుగానే పంచుకున్నాను. "నేను చేసిన ఆలస్యానికి క్షమించు సాయిదేవా! కరుణామయా!".
మా పాపకి కాలినొప్పి వచ్చినప్పుడు కూడా ఊదీ రాస్తే తగ్గిపోయింది. ఇంకోసారి మా పాపను నాలుగు రోజులు మా అమ్మ దగ్గర ఉంచాము. అప్పుడొకరోజు రాత్రి పాపకు హఠాత్తుగా వాంతి అయింది. ఆ రాత్రివేళ మందులకోసం బయటకి వెళ్లే పరిస్థితి లేదు. అందువల్ల నేను, "బాబా! తనకింక వాంతులు కాకూడదు" అని బాబాను వేడుకున్నాను. మరుసటిరోజు నేను ఫోన్ చేస్తే, "పాపకి మళ్లీ వాంతి కాలేదు, బాగానే ఉంది. కానీ విరేచనాలు మొదలయ్యాయి. పొద్దుపొద్దున్నే షాపులేవీ తెరిచిలేవు" అని చెప్పారు. అప్పుడు నేను, "బాబా! ఒక మెడికల్ షాప్ తెరిచి ఉండేలా అనుగ్రహించండి" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత చూస్తే, ఆ కాలనీలో ఒక షాపు తెరిచి ఉంది. ఆ షాపులో ఉన్నతను మంచి మెడిసిన్ ఇచ్చాడు. దాంతో వెంటనే పాపకి విరేచనాలు తగ్గిపోయాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సంవత్సరం క్రిందట డాక్టరు మా అమ్మ కళ్ళను పరీక్షించి, "కంట్లో శుక్లం ఏర్పడింది. తొలిదశలో ఉంది. మూడో దశకి వస్తే గనక సర్జరీ చేయాలి" అని అన్నారు. అమ్మ వయసు 60 సంవత్సరాల పైమాటే. ఆమె సర్జరీకి సిద్ధంగా లేదు. తరచూ చెకప్ చేయిస్తున్నా ఈసారి చెకప్‍కి వెళ్ళినప్పుడు నేను బాబాని, "బాబా! అమ్మ కంటి పరిస్థితి స్థిరంగా ఉందనీ, సర్జరీ అవసరం లేదనీ డాక్టరు చెప్పాలి" అని వేడుకున్నాను. డాక్టరు నేను కోరుకున్నట్లే చెప్పారు. "థాంక్యూ బాబా".
మేము దత్తభక్తులం. 2022, జూన్ మొదటి వారంలో అనుకోకుండా నా భర్త శ్రీపాదశ్రీవల్లభ దర్శనార్థం కురవపురం వెళదామని అన్నారు. మేము అదే మొదటిసారి అక్కడికి వెళ్లడం. ముందుగా అక్కడ ఉండటానికి వసతి బుక్ చేసుకోకుండానే మేము బయలుదేరాము. ఎందుకంటే, అక్కడ ఎలా ఉంటుందన్నది మాకు ఏ మాత్రం అవగాహన లేదు. మేము అక్కడికి చేరుకునేసరికి రాత్రి 9:30 గంటలైంది. చూస్తే, అది కృష్ణానది పక్కన ఉన్న ఒక చిన్న అందమైన గ్రామం. అక్కడ వసతి, భోజన సదుపాయాలేమీ లేవు. అందుచేత నేను టెన్షన్ పడుతుంటే, మా బాబు, "అమ్మా, టెన్షన్ ఎందుకు? శ్రీపాదస్వామి అన్నీ చూసుకుంటారులే" అని చిన్నవాడైనా పెద్ద మాటతో నాకు ధైర్యం చెప్పాడు. తరువాత కొన్ని యూట్యూబ్ వీడియోలలో విట్టల్‌బాబా ఆశ్రమంలో వసతి, భోజన సదుపాయాలు ఉంటాయని చూసి ఆ ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడ అడిగితే, "ఈరోజు సాయంత్రం అనుకోకుండా మహారాష్ట్ర నుండి చాలామంది భక్తులు వచ్చినందున వసతి ఏర్పాటు చేయలేము. కానీ, ముందు భోజనం చేయండి" అని అన్నారు. నేను భోజనం చేస్తున్నంతసేపు, "శ్రీపాదా! భోజన సమస్య తీర్చావు కానీ, చిన్నపిల్లలతో ఈ రాత్రి ఎక్కడ ఉండాలి?" అని బాధపడుతూనే ఉన్నాను. భోజనానంతరం ఆశ్రమ నిర్వాహకులను, "చిన్నపిల్లలున్నారు. దయచేసి మాకు ఏదైనా గది ఇవ్వండి" అని మరోసారి అడిగితే, "మండపంలో ఉండండి" అన్నారు. కానీ మండపంలో ఉండటానికి నేను ఒక్క బెడ్‌షీట్ కూడా తీసుకెళ్లలేదు. నాకు చాలా బాధేసి, "ఎందుకు మమ్మల్ని రప్పించుకున్నావు? మాకు ఎందుకు ఈ బాధ?" అని శ్రీపాదుణ్ణి అడిగి పక్కకు చూసేసరికి, అక్కడ పెద్ద సాయిబాబా విగ్రహం దర్శనమిచ్చింది. (విట్టల్‌బాబాగారు కొన్ని వందల మందిరాల్లో సాయిబాబా విగ్రహాలు ప్రతిష్టించారు.) బాబా దగ్గరకి వెళ్లి, దణ్ణం పెట్టుకుని, "ఒక గది ఇప్పించండి బాబా" అని వేడుకున్నాను. బాబా అనుగ్రహించారు. వేరేవాళ్ళు, "కొద్దిదూరంలో వేరే ఆశ్రమం ఉంది. అక్కడ ప్రయత్నించండి" అని చెప్పారు. సరేనని, మేము అక్కడికి వెళ్ళాము. కానీ, ఇక్కడ కూడా వసతి దొరకదేమోనన్న అపనమ్మకంతోనే నేను కార్యాలయ గదికి వెళ్లి, "గది దొరుకుతుందా?" అని అడిగాను. అందుకు వాళ్ళు, "ఏసీ గది ఉంది" అని చెప్పారు. నిజానికి అప్పటికింకా వర్షాలు మొదలు కాలేదు. ఆరోజు చాలా వేడిగా ఉంది. అందువలన ఏసీ గది అనేసరికి నాకు చాలా సంతోషమేసింది. అసలు అద్భుతమేమిటంటే, వాళ్ళు ఆ గది తాళాలిస్తూ, "ఈ గదిని స్వామి మీకోసమే అట్టిపెట్టారు" అని అన్నారు. నాకేం అర్థం కాలేదు. అంతలో వాళ్ళు, "గదులు భక్తులకిచ్చే అతను భోజనానికి వెళ్తూ వేరే అతనిని ఆఫీసులో కూర్చోబెట్టి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేలోపు పది, పన్నెండు కుటుంబాలు గది కావాలని వచ్చినప్పటికీ కంప్యూటరులో గదులు ఖాళీ ఉన్నట్టు చూపించలేదు. అందువల్ల గదులు ఖాళీగా లేవని చెప్పి పంపేయడం జరిగింది. తరువాత అసలు వ్యక్తి వచ్చేసరికి రాత్రి 10:00 అయింది. చూస్తే, ఇంకా రెండు గదులు ఖాళీగా ఉన్నాయి. 'ఇంక ఈ సమయంలో వసతికోసం ఎవరూ రారు' అని అనుకుంటున్న సమయంలో మీరు వచ్చారు" అని అన్నారు. అలా చాలా సౌకర్యంగా ఉండే ఏసీ రూమును బాబా, శ్రీపాదులు మాకు ఇచ్చారని నేను వారికి వేలవేల కృతజ్ఞతలు తెలుపుకున్నాను. వారి అనుగ్రహంతో మేము చాలా సంతోషంగా తిరిగి వచ్చాము. "థాంక్యూ దత్తసాయీ".
ఈమధ్య ఒకరోజు మా ఇంట్లో ఉన్న అన్ని దుప్పట్లు, కొన్ని బట్టలు తప్పనిసరిగా వాష్ చేయవలసి వచ్చింది. అంతకు ముందురోజు బాగా వర్షం పడింది. ఆరోజు కూడా వాతావరణం వర్షం పడేటట్టుగానే ఉంది. అందువలన, 'అన్ని బట్టలు ఉతికిన తరువాత వర్షం పడితే ఎలా?' అని ఆలోచనలో ఉండగా హఠాత్తుగా ఈమధ్యనే నేను బ్లాగులో చదివిన ఒక భక్తురాలి అనుభవం గుర్తొచ్చింది. ఆమె వర్షం పడి బట్టలు తడిసిపోకూడదని బాబాను వేడుకుంటే, బాబా వర్షం పడకుండా అనుగ్రహించారని పంచుకున్నారు. దాంతో నేను కూడా, "బాబా! వర్షం వల్ల ఈ బట్టలన్నీ తడిసిపోకుండా సహాయం చేయండి" అని బాబాను అడిగాను. ఆశ్చర్యంగా ఒక గంటలో ఎండ వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటలకల్లా బట్టలన్నీ ఆరిపోయాయి. ఆ సాయంత్రం వర్షం పడింది. కొన్నిరోజుల ముందే ఆ అనుభవం చదవడం, సమయానికది గుర్తురావడం చూస్తుంటే, నాకు రాబోయే సమస్య గురించి బాబాకి ముందే తెలిసి ఆ అనుభవం నేను చదివేలా చేశారేమో అనిపిస్తుంది. "ఓ సాయిదేవా! మహానుభావా! ఇంకా ఏవైనా అనుభవాలు మర్చిపోయానేమో తెలియదు. మర్చిపోయివుంటే క్షమించండి బాబా. ప్రతి నిమిషానికి, ప్రతి అవసరానికి 'బాబా!' అని పిలవడమే తరువాయి, చిన్నవి పెద్దవి అనకుండా మమ్మల్ని ఆదుకున్న సందర్భాలు లెక్కలేనన్ని. అయినా ఇంకా సమస్యలు ఉండనే ఉన్నాయి. మీ చరణాలు పట్టుకుని వేడుకోవటం తప్ప వేరే దిక్కులేని మీ బిడ్డలం. నిన్ను నమ్మే ప్రతి ఒక్కరినీ కాపాడు తండ్రీ. ఈ ప్రపంచం శాంతిగా ఉండేలా అనుగ్రహించు. అన్నిటికీ ధన్యవాదాలు బాబా".
సర్వం శ్రీదత్తసాయి కృప!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam help supraja to heal neck pains and shoulder pains
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
దిగంబరా దిగంబరా sri sai vallabha దిగంబరా 🙏🙏🙏🙏🙏
ReplyDelete