1. బాబా అనుగ్రహ వీక్షణలు
2. తలుచుకోగానే ఏదో ఒక రూపంలో తమ సహాయాన్ని అందిస్తారు బాబా
3. బాబా కృపతో దొరికిన అమ్మవారి బంగారు రూపు
బాబా అనుగ్రహ వీక్షణలు
అందరికీ నమస్తే. నా పేరు అంజలి. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా బాబు స్కూలు నుండి రావడం బాగా ఆలస్యమైంది. నాకు చాలా టెన్షన్‍గా అనిపించి, "బాబా! వాడు తొందరగా ఇంటికి వచ్చేలా చూడు తండ్రి. నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అంతే, 10 నిమిషాల్లో బాబు ఇంటికి వచ్చాడు.
ఒకసారి నా బ్యాంకు అకౌంటులో ఉన్న డబ్బుల విషయంగా నాకు, మావారికి మధ్య మనస్పర్థలు వచ్చాయి. నాకు కొంచెం గిల్టీగా అనిపించి, "బాబా! మీ దయవల్ల నాకు, మావారికి మధ్య మనస్పర్థలు తొలగిపోవాలి. నా డబ్బుల గురించి ఆయన ఇంకా అడగకూడదు. అలాగే కొన్ని మంచి పనుల కోసం నేను ఉపయోగించిన డబ్బుల గురించి ఎప్పటికీ ఆయనకి తెలియకూడదు బాబా" అని బాబాని కోరుకున్నాను. బాబా దయవల్ల ఆ విషయాలు మా మధ్య చర్చకు రాకుండా అంతా మామూలుగా ఉంది.
2022, జూలై నెల చివరివారంలో మా ఇంట్లో అందరమూ రెండు సంవత్సరాల క్రిందటి మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లి, వద్దామని అనుకున్నాము. నేను మాతోపాటు మా తమ్ముడు ప్రసాద్ కూడా వస్తే బాగుంటుంది అనిపించి తనని రమ్మని అడిగితే, "మా బాబుకి జ్వరంగా ఉంది. తగ్గితే వస్తాను" అని అన్నాడు. నేను బాబాను తలుచుకుని, "బాబా! మీ దయవల్ల ఆ బాబుకి జ్వరం తగ్గి, తమ్ముడు మాతో గుడికి వస్తే, ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల బాబుకి జ్వరం తగ్గడంతో తమ్ముడు మాతో విజయవాడ రావడానికి బయలుదేరాడు. అందరం ఆనందంగా వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చాము.
ఆ మధ్య మా తమ్మునికి జ్వరం, దగ్గు వస్తే, "బాబా! మీ దయవల్ల గురువారం కల్లా తమ్ముడికి తగ్గి మామూలు మనిషి కావాల"ని బాబాను కోరుకున్నాను. జ్వరం తగ్గిందికానీ ఊపిరితిత్తులలో కొంచెం నిమ్ము ఉందని డాక్టరు చెప్పారు. అప్పుడు నేను, "బాబా! తమ్ముడికి ఆ నిమ్ము కూడా పూర్తిగా తగ్గిపోవాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు తమ్ముడికి కొంచెం పర్లేదు. అయితే తన దగ్గు ఎంతకీ తగ్గటం లేదని టీబీ టెస్టు చేశారు. బాబా దయవల్ల అది నెగిటివ్ వచ్చింది. ఆరోజు నేను బాబాని, "తమ్ముడికి ఏమీ కాకుండా చూసి వాడిని ఆరోగ్యంగా ఉంచు తండ్రి. తను అందరి గురించి ఆలోచిస్తాడు కానీ, తన గురించి పట్టించుకోడు. వాడిని నువ్వే ఎలాగైనా కాపాడు బాబా" అని బాగా వేడుకున్నాను. ఆయన కృపతో తొందరలో తమ్ముడు పూర్తిగా నార్మల్ అవుతాడని ఆశీస్తున్నాను. ఈమధ్య తమ్ముడు నాతో ఏమి మాట్లాడినా నాకు కొదవగా అనిపిస్తుంటే, "ఇలా వద్దు బాబా. తమ్ముడితో నాకు గొడవలొద్దు. ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళమో అలాగే మమ్మల్ని ఉంచండి బాబా" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు పర్లేదు. "థాంక్యూ బాబా. లవ్ యు సో మచ్ బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
తలుచుకోగానే ఏదో ఒక రూపంలో తమ సహాయాన్ని అందిస్తారు బాబా
సాయి భక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితంలో ప్రతిరోజూ బాబా నామజపంతో మొదలవుతుంది. ఏ కష్టం వచ్చినా సాయిని తలుచుకోగానే ఆయన ఏదో ఒక రూపంలో తమ సహాయాన్ని అందిస్తూ అడుగడుగునా నన్ను కాపాడుతున్నారు. బాబా దయవలన నేను ఇదివరకు కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకసారి మా అమ్మగారికి ఉన్నట్టుండి కడుపునొప్పి బాగా ఎక్కువగా వచ్చింది. అమ్మ నొప్పితో బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. వెంటనే బాబాకి నమస్కరించుకుని, "బాబా! అమ్మకి కడుపునొప్పి తగ్గిపోతే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తరువాత మా ఊరిలోని ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి అమ్మకి ఇంజక్షన్ చేసి, టాబ్లెట్లు ఇచ్చారు. కాసేపటికి అమ్మకు నొప్పి తగ్గిపోయింది. బాబానే ఆ డాక్టర్ రూపంలో తమ సహాయాన్ని అందించి అమ్మను కాపాడారని నా నమ్మకం. "థాంక్యూ సో మచ్ బాబా".
మా తమ్ముడు కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి 12 గంటలకు తన పై అధికారులు తనకి ఫోన్ చేసి తమ్ముడు పనిచేసే ప్రాంతంలో కరెంటు సరఫరా నిలిచిపోయిందని, అర్జెంటుగా రమ్మని చెప్పారు. ఆ సమయంలో తమ్ముడు జలుబు, తలనొప్పితో బాధపడుతున్నాడు. అందువల్ల నేను, 'ఇలాంటి సమయంలో ఏంటి బాబా, ఇలా రమ్మంటున్నారు?' అని అనుకుని చాలా బాధపడ్డాను. వెంటనే బాబాకి నమస్కరించుకుని, 'ఓం శ్రీసాయి ఆపద్భాంధవాయ నమః' అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ, "తమ్ముడు అవసరం అక్కడ లేకుండా ఉండేలా చూడు బాబా" అని బాబాను వేడుకున్నాను. కాసేపటికి వాళ్ళు మళ్లీ ఫోన్ చేసి, 'తమ్ముడిని రావద్దని, వేరే అతన్ని పంపిస్తున్నామని' చెప్పారు. అలా అనారోగ్యంతో బాధపడుతున్న మా తమ్ముడికి కష్టం లేకుండా చేశారు బాబా. "థాంక్యూ సో మచ్ బాబా".
నేను ఒక సన్నిహిత వ్యక్తికి మంచివాడనుకుని చాలా డబ్బులు ఇచ్చాను. కానీ అతను ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు నేను చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో నా స్నేహితుల రూపంలో బాబా నాకు చాలా ధైర్యాన్ని ప్రసాదించారు. నేను రోజూ, "నా డబ్బులు నాకు తిరిగి వచ్చేలా చూడు బాబా. డబ్బులు తిరిగొస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని రోజు ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అనుకోకుండా ఒకరోజు అతను నాకు కొంత డబ్బు పంపించేసరికి నేను చాలా సంతోషపడ్డాను. "ధన్యవాదాలు బాబా. మిగిలిన డబ్బులు కూడా నాకు అందేలా దయ చూపండి బాబా".
బాబా కృపతో దొరికిన అమ్మవారి బంగారు రూపు
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయి బంధువులందరికీ నమస్కారం. అద్భుతమైన బ్లాగును ఏర్పరిచి చక్కగా నిర్వహిస్తున్న బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు శ్వేత. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2022, ఆగస్టు రెండో వారంలో నేను శ్రీవరలక్ష్మీ వ్రతం చేసుకుంటూ మా ఇంట్లో ఉన్న అమ్మవారి బంగారు రూపాన్ని కూడా పూజించుకున్నాను. పూజ అయిన మరుసటిరోజు నేను అంతా శుభ్రం చేస్తూ పొరపాటున అక్షంతలతోపాటు ఆ బంగారు రూపాన్ని కూడా తీసి బయటపడేసాను. నాకు ఆ అమ్మవారి బంగారు రూపం గురించి అస్సలు గుర్తులేదు. పదిహేనురోజులు గడిచాక 2022, ఆగస్టు 26న నేను పూజ చేస్తున్నప్పుడు హఠాత్తుగా అమ్మవారి రూపు గుర్తొచ్చి దానికోసం వెతికాను. కానీ ఎంత వెతికినా అది కనిపించలేదు. నాకు చాలా బాధేసి, "బాబా! ఆ రూపు దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. నిజానికి అది మళ్ళీ దొరుకుతుందన్న ఆశ నాకు ఏ మాత్రమూ లేదు. తరువాత మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అమ్మ, "ఇంటి ముందున్న మొక్కల్లో అక్షంతలు వేశావు కదా! అక్కడ ఏమైనా పడిందేమో చూడు" అన్నారు. దాంతో నేను ఆ మొక్కల్లో చాలాసేపు వెతికాను కానీ, నాకు అదృష్టం లేదు. అమ్మవారి రూపు దొరకలేదు. ఇంకా ఆ రాత్రి బాధపడుతూనే నిద్రపోయాను. తెల్లవారాక మావారిని, "మీరు ఒకసారి మొక్కల్లో వెతకండి" అని అన్నాను. ఆయన వెళ్లి వెతికితే, ఒక మొక్క మొదలు వద్ద మట్టిలో ఇరుక్కుపోయి ఆ బంగారు రూపు కనిపించింది. అది చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎన్ని పూజలు చేసినా నాకు బాబా కృప లేదేమో అని చాలా బాధపడ్డాను కానీ, అది బాబా దయవల్ల దొరికింది. నాపై ఆయన కృప ఉంది. "థాంక్యూ సో మచ్ బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Jaisairam bless supraja for her neck pain and shoulder pain help her to get good health
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ అనుభవాలు చాలా బాగున్నాయి.సాయి దయ, ఆశీస్సులు వుంటే లేని యేమి లేదు.బాబా మీరు మమ్మలిని సదా కాపాడుతూ వచ్చారు.మీకుధనవాదాలు.మమలి సదా కాపాడుతూ ఉండు తండ్రి
ReplyDeleteSai ram🙏
ReplyDelete