ఈ భాగంలో అనుభవాలు:
1. చిన్న చిన్న అనుభవాలు బాబా దయ మన మీద ఉందనడానికి ఉదాహరణలు
2. బాబా దయవల్ల కొడుకు
3. వేడుకున్నంతనే చైన్ దొరికేలా అనుగ్రహించిన బాబా
చిన్న చిన్న అనుభవాలు బాబా దయ మన మీద ఉందనడానికి ఉదాహరణలు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ముందుగా సాయిభక్తులందరికీ, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఈ బ్లాగ్ వలన ప్రతిరోజు 'సాయి సత్సంగం'లో పాల్గొన్నట్లు అనిపిస్తుంది. బాబా ప్రసాదించిన అనుభవాలను తోటి భక్తులతో పంచుకుని ఎంతో ఆనందిస్తున్నాము. నా పేరు చైతన్య. నేను సాయిభక్తురాలిని. సాయిని నమ్ముకుంటే, అసాధ్యమనుకున్న సమస్యలు చాలా సుళువుగా పరిష్కారమవుతాయి. మనం చేయవలసినదల్లా భారం బాబాపై వేసి నమ్మకం, ఓపికతో వేచి ఉండటమే. నేను ఇదివరకు చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. ఈమధ్య మా చెల్లెలి కొడుకు 10వ తరగతి పరీక్షలు వ్రాశాాడు. అయితే తను లెక్కల పరీక్ష సరిగా వ్రాయలేదు. అందువల్ల లెక్కల పరీక్షలో ఫెయిల్ అవుతానని అనుకున్నాడు. మా చెల్లి కూడా సాయిభక్తురాలు. తను, తన కొడుకుకి మంచి మార్కులు రావాలని శ్రీసాయిసచ్చరిత్ర సప్తాహపారాయణ చేసింది. బాబా దయవల్ల బాబుకి లెక్కల్లో మంచి మార్కులు రావడమే కాకుండా మొత్తం అన్ని సబ్జెక్టుల్లో తను అనుకున్న దానికంటే చాలా మంచి మార్కులు వచ్చాయి.
ఈమధ్య మేము ఇల్లు మారాము. అనుకోకుండా మెయిన్ బెడ్‌రూమ్ డోర్ లాక్ పడిపోయింది. ఇంటి తాళాలన్నీ ఆ గది లోపలే ఉండిపోవడంతో మేము కంగారుపడి తాళం తీయడానికి ప్రయత్నించాము. కానీ ఎంత ప్రయత్నించినా తాళం తీయడానికి రాలేదు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా తలుపు డ్యామేజ్ కాకుండా తెరచుకునేలా చూడండి. డోర్ ఓపెన్ అయితే, మీ కృపను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. సరిగా ఆ సమయంలో మా పైఇంట్లో కర్రపని చేసేవాళ్లు ఉన్నారు. వాళ్ళకి విషయం చెప్తే, వాళ్ళు వచ్చి చాలాసేపు ప్రయత్నించారు. కానీ, డోర్ ఓపెన్ కాలేదు. అప్పుడు నేను బాబా నామస్మరణ చేస్తే డోర్ లాక్ ఓపెన్ అయింది. "థాంక్యూ బాబా". ఇవి మనకు చిన్న అనుభవాలుగా అనిపిస్తాయి. కానీ, బాబా దయ మన మీద ఉందనడానికి ఇవి చిన్న చిన్న ఉదాహరణలు.
ఒకరోజు మా బాబు స్కూల్లో తన బుక్స్ కరెక్షన్‍కి ఇచ్చాడు. తరువాత క్లాసులో అందరి బుక్స్ తిరిగి ఇచ్చారు కానీ, మా బాబు బుక్ ఇవ్వలేదు. బాబు క్లాసు టీచరుని అడిగితే, "నా దగ్గర లేవు. నేను అంతా వెతికాను. నువ్వు ఇంటి దగ్గర ఏమైనా పెట్టావేమో, చూడు" అని చెప్పారు. మా బాబు ఇంటికి వచ్చి, "నా బుక్స్ (సోషల్ & సైన్స్) కనపడటం లేదు. టీచర్ ఆ బుక్స్ కనపడకపోతే, కొత్త బుక్స్ తీసుకుని, వ్రాసుకోమని చెప్పారు" అని చెప్పాడు. అంతేకాదు, "చాలా లెసన్స్ పూర్తయ్యాయి. అవన్నీ నేను ఎలా వ్రాయాలి?" అని బాధపడ్డాడు. అప్పుడు నేను బాబుతో, "నువ్వు బాధపడకు. బుక్స్ దొరుకుతాయి. అవి ఎక్కడికీ పోవు. నువ్వు రేపు స్కూలుకి వెళ్లి 'సాయిబాబా' అని అనుకో. నేను నీ బుక్స్ దొరికితే, బాబా అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పాను. తరువాత నేను, 'శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని చెప్పుకున్నాను. మరుసటిరోజు బాబు స్కూలుకి వెళితే, వాడి టీచర్ "నీ బుక్స్ వేరే సెక్షన్‍లో ఉన్నాయి" అని చెప్పి ఇచ్చారు. దాంతో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
ఒకరోజు హఠాత్తుగా నాకు కడుపునొప్పి, నడుమునొప్పి వచ్చి చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు నేను బాబా ఊదీ నీళ్లలో వేసి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకుని ఆ నీళ్లు త్రాగాను. కాసేపటికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఇలా ప్రతిరోజు బాబా మనకు చాలా అనుభవాలు ప్రసాదిస్తూ ఉంటారు. మనం మన భారాలు బాబా మీద వేస్తే, మనకి ఏది మంచిదో అది జరిగేలా బాబా చేస్తారు. ఏది జరిగినా అది బాబా మనకు ఇచ్చిన అవకాశం అనుకుని పూర్తి విశ్వాసంతో మనం ముందుకు పోవాలి. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. మేము మా పెద్దబాబు చదువు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము తనకి ఏది మంచిదో సరైన నిర్ణయం తీసుకునేలా అనుగ్రహించండి బాబా. మేము మా పిల్లల బాధ్యతలన్నీ మీకే అప్పగించాము. మీరు వాళ్లకు మంచి భవిష్యత్తునిస్తారని నా నమ్మకం బాబా".
బాబా దయవల్ల కొడుకు
నా పేరు మధుసూధన్. మాది జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం. బాబా అనుగ్రహం వల్ల మొదటిసారి మేము కోరుకున్నట్లు మాకు పాప పుట్టింది. పాపకి 9 నెలల వయసు ఉన్నప్పుడు నా భార్య మళ్లీ గర్భవతి అయ్యింది. తను 3 నెలల గర్భవతిగా ఉన్నపుడు మా అత్తగారికి, నాకు చిన్న గొడవ జరిగింది. "పాప చాలా చిన్నది. ఇంతలోనే మళ్లీ గర్భం ఏమిటి? ఆ గర్భం తీయించేయండి" అని మా అత్తయ్యవాళ్ళు, "వద్దు, ఉండనీ" అని నేను. చివరికి నా అనుమతి లేకుండానే నా భార్య గర్భం తీయించేద్దామన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ బాబా దయవల్ల డాక్టర్ ఒప్పుకోకపోవడంతో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. నాకు ఆ విషయం తెలిసినరోజునుంచి నేను బాబాని, మా కులదైవాన్ని, "నాకు కొడుకుని ప్రసాదించమ"ని అడుగుతుండేవాడిని. ఒకరోజు కలలో పెద్ద మామిడితోట కనపడింది. ఆ తోటలోని చెట్ల కింద ఆరబోసినట్లుగా బోలెడన్ని మామిడికాయలు పడివున్నాయి. నేను వాటిని తీసుకోవడానికి ముందుకు వెళ్తుంటే, తలపాగా చుట్టుకుని, తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వృద్ధుడు నా వైపుగా నడుచుకుంటూ వచ్చి, "ఇందులోంచి ఒక్క కాయ ముట్టినా 5000 రూపాయలు జరిమానా" అని నాతో అన్నాడు. నేను, "అన్ని మామిడికాయలు నీ దగ్గర పెట్టుకున్నావు. ఒక్క కాయ ఇవ్వొచ్చు కదా!" అని అడిగాను. వెంటనే ఆయన రెండు చిన్న చిన్న మామిడికాయలు తీసి నా చేతికి ఇచ్చారు. అంతటితో ఆ కల ముగిసింది. తరువాత కొద్దిరోజులకి నాకు కొడుకు పుట్టినట్లు, బాబు బరువు తక్కువగా ఉందని తనని ఇన్‌క్యుబేటర్‌లో పెట్టినట్లు మరో కల వచ్చింది. నేను ఆ కల గురించి చెప్తే, ఇంట్లో ఎవ్వరూ నమ్మలేదు. కానీ తరువాత 2022, జూలై నెల చివరి వారంలో నాకు కొడుకు పుట్టాడు. అచ్చంగా బాబా ఆ కలలో చూపించినట్లే బాబు బరువు తక్కువగా ఉన్నాడని తనని ఇన్‌క్యుబేటర్‌లో ఉంచారు. బాబా, శివుని దయవల్ల నాలుగు రోజులకి తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".
వేడుకున్నంతనే చైన్ దొరికేలా అనుగ్రహించిన బాబా
నేను సాయిభక్తురాలిని. ఒకరోజు నా చైన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. తరువాత దానికోసం ఇల్లంతా వెతికినా అది కనిపించలేదు. అప్పుడు నేను, "బాబా! ఆ చైన్ దొరికితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల వెంటనే ఆ చైన్ మావారికి దొరికింది. ఇలా బాబా నా మీద ఎప్పుడూ కరుణ చూపుతూనే ఉన్నారు. "నమస్కారాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
సర్వం సాయి మయం
ReplyDeleteసద్గురు శ్రీ సత్య సాయి మయం 🙏🙏🙏🙏🙏
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete