1. నమ్మిన భక్తుల వెన్నంటే ఉండి రక్షిస్తారు బాబా
2. బాబా చేసిన సహాయాలు
3. నా ఆరోగ్యం గురించిన అనుమానాలకు స్వప్నంలో సమాధానమిచ్చిన బాబా
నమ్మిన భక్తుల వెన్నంటే ఉండి రక్షిస్తారు బాబా
అందరికీ నమస్కారం. నా పేరు అంజలి. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు నేను స్కూటీ మీద మా పాపని స్కూలుకి తీసుకుని వెళుతున్నప్పుడు కాసేపు ఆగితే మంచిదేమో అని నాకు అనిపించింది. కానీ బాబా మీద భారమేసి అలాగే వెళ్లిపోయాను. సరిగ్గా నల్గొండలోని శ్రీఆంజనేయస్వామి గుడికి ఎదురుగా వెళ్లేసరికి స్కూటీ కంట్రోల్ కాక నేను, పాప క్రింద పడిపోయాము. వెంటనే చుట్టూ ఉన్నవాళ్లు వచ్చి నన్ను, స్కూటీని పైకి లేపారు. బాబా దయవల్ల నాకు, పాపకి పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. కుడిచేయి నేలమీద కొంచెం నొక్కుకుపోయింది అంతే. తెల్లారికి అంతా నార్మల్ అయింది. ఆ ప్రమాదం నుండి బాబా తప్ప ఎవరు కాపాడగలరు? తమని నమ్మిన భక్తులను ఎల్లవేళలా వెన్నంటే ఉండి రక్షిస్తారు బాబా. "థాంక్యూ అండ్ లవ్ యు సో మచ్ బాబా".
2022, జూలై 17, ఆదివారం ఉదయానే మా తమ్ముడు ప్రసాద్ నల్గొండ నుండి హైదరాబాద్ వెళ్లి కరెంటు డిపార్ట్‌మెంటుకి సంబంధించిన ఒక టెస్టు వ్రాశాడు. బాబా దయవల్ల అతనికి ఆ జాబ్ వస్తే బావుండు. నేను ఆరోజు ఇంట్లో వంట చేస్తూ రాత్రి భోజనానికి తమ్ముడు వస్తే బాగుంటుందనుకుని, "బాబా! మీరే తమ్ముడిని భోజనానికి ఇంటికి రప్పించండి" అని చెప్పుకున్నాను. మావారు తమ్ముడికి ఫోన్ చేసి, "రాత్రి భోజనానికి ఇంటికి వచ్చేయి" అని చెప్పారు. అందుకు తను, "వస్తాను, కానీ వర్షం పడితే మాత్రం నేరుగా మా ఇంటికి వెళ్ళిపోతాన"ని చెప్పాడు. ఆరోజు నల్గొండలో చాలా పెద్ద వర్షం పడింది. అప్పుడు నేను బాబాతో, "తమ్ముడు ఎలాగైనా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లేలా చూడండి బాబా" అని చెప్పుకున్నాను. బాబా చేసిన లీల చూడండి. రాత్రి 9:30కి తమ్ముడు నల్గొండలో బస్సు దిగే సమయానికి వర్షం లేకుండా చేశారు బాబా. తమ్ముడు మా ఇంటికి వచ్చి తృప్తిగా భోజనం చేసి వెళ్ళాడు. తను ఇంటి నుండి బయలుదేరిన తరువాత పెద్ద వర్షం పడింది. పాపం తమ్ముడు దారిలో తడిసిపోతాడేమో అని నాకనిపించి, "బాబా! తమ్ముడిని క్షేమంగా ఇంటికి చేర్చండి, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల తమ్ముడు వర్షంలో తడవకుండా క్షేమంగా తన ఇంటికి చేరుకున్నాడు. బాబాని తలచుకుంటే జరగనిది ఏముంది? ఆరోజు అంత వర్షం కురిసినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నా కోరిక తీర్చారు బాబా.
2022, జూలై మూడోవారం చివరిలో నాకు బాగా జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నాకొచ్చింది నార్మల్ జ్వరమే అయివుండి, తొందరగా తగ్గేలా చూడు తండ్రీ. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల నేను కేవలం రెండురోజుల్లో నార్మల్ అయ్యాను. గురువారానికి పూర్తిగా కోలుకుని మహాపారాయణలో పాల్గొన్నాను. ఈమధ్య మావారి వీపు మీద పురుగు పాకి అలెర్జీ అయింది. బాబా దయవల్ల అది పూర్తిగా తగ్గిపోతే, మన ఈ బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవల్ల అది పూర్తిగా తగ్గిపోయింది. నిజంగా ఈ బ్లాగ్ చాలా పవర్‌ఫుల్. బాబా దగ్గరుండి ఈ బ్లాగును నడిపిస్తున్నారు. ఎంత చిన్న విషయమైనా ఈ బ్లాగులో పంచుకుంటామనుకుంటే కోరుకున్నది తప్పకుండా జరిగి తీరుతుంది. అలా నాకు చాలా అనుభవాలు జరిగాయి. బాబా దయతో ఇంకా ఎన్నో అనుభావాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. "అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబా చేసిన సహాయాలు
నా పేరు లక్ష్మి. మాది హైదరాబాద్. ఈ బ్లాగ్ నిర్వాహకులకు బాబా ఆశీస్సులు ఉండాలని, భక్తులకు బాబా ఎల్లవేళలా అన్ని విషయాలలో తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు మాకు బాగా అయినవాళ్ళు డబ్బులు అడిగితే, మేము 'దగ్గరవాళ్లే కదా!' అని ఇచ్చాము. అలా చాలాసార్లు మేము వాళ్ళకి ధనసహాయం చేశాము. వాళ్ళు మాకు ఆరోగ్యం బాగాలేకపోతే వచ్చి చాలా సహాయం చేశారు. మా కుటుంబం వాళ్ళని చాలా నమ్మింది. అయితే వాళ్ళు నెమ్మదిగా మా వ్యక్తిగత విషయాలలో కల్పించుకోవడం, మా ఇంటికి వచ్చి మా మీదే పెత్తనం చేయటం, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే వాళ్ళకు గిట్టనివాళ్ళని పిలవొద్దని అనటం, ఇంకా మాకు నచ్చనివి చేస్తూండటంతో నెమ్మదిగా వాళ్ళ నిజస్వరూపం బయటపడింది. దాంతో మేము వాళ్ళని దూరంగా పెట్టసాగాము. ఆలోగా వాళ్ళు మాకు ఇవ్వాల్సిన డబ్బు కొంత ఇచ్చారుగాని, ఇంకా కొంచెం డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇక్కడొక విషయం చెప్పాలి, వాళ్ళ పరిస్థితి బాగాలేదని వాళ్ళబ్బాయిని మా ఇంట్లో 2 సంవత్సరాలు ఉంచుకుని, అన్నీ మేము చూసుకున్నాము. తనకి ఉద్యోగం వచ్చిన తరువాత కూడా మేము నెలనెలా కొంత డబ్బు వాళ్ళ బ్యాంకు అకౌంటులో వేసేవాళ్ళము. అలా కొన్ని నెలలు వేసాక వాళ్లకు, మాకు గొడవ జరిగి డబ్బులు వేయడం మానేసాము. ఆ బ్యాంకులో వేసిన డబ్బులే మాకు రావాల్సి ఉండి ఆ డబ్బుల కోసం ఎప్పుడు అడిగినా వాళ్ళు, 'ఇస్తాము, ఇస్తాము' అనేవాళ్ళే కానీ ఇచ్చేవాళ్ళు కాదు. అలా దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలైంది. నాకైతే ఆ డబ్బులు తిరిగి వస్తాయన్న నమ్మకం పోయింది. అట్టి స్థితిలో వాళ్ళు వేరేవాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని కొంతమందికి తిరిగి ఇవ్వలేదని మాకు తెలిసింది. అప్పుడు నేను 'మా డబ్బులు మాకు రావాల'ని సాయి దివ్యపూజ చేసి, బాబాను ఒకటే అడిగాను: "మేము ఎవరికీ అన్యాయం చేయలేదు. వాళ్ళని నమ్మి సహాయం చేశాము. మీకు న్యాయం అనిపిస్తే, మాకు సహాయం చేయండి. మా డబ్బులు మాకు వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని. బాబా దయవలన వాళ్ళు మా డబ్బులు మాకు ఇచ్చేశారు. "థాంక్యూ బాబా". తొందరపడి నమ్మి ఎవరికీ ధనసహాయం చేయకండి. మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
నా ఆరోగ్యం గురించిన అనుమానాలకు స్వప్నంలో సమాధానమిచ్చిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నేనొక సాయిభక్తురాలిని. నాకు గ్యాస్ వల్ల చేయినొప్పి మరియు స్ట్రెస్ వల్ల, బెణుకు వల్ల ఇతర నొప్పులు వస్తే, కొన్నిరోజులుగా నేను ఏదో టెన్షన్‍లో నాకేదో ఆరోగ్య సమస్య ఉందని ఊరికే ఆలోచిస్తూ ఉండేదాన్ని. అంతటితో ఆగక భయంతో డాక్టర్ దగ్గరకి పరిగెత్తేదాన్ని. రోజూ ఉదయం, సాయంత్రం బాబా ఊదీ పెట్టుకుంటూ ఉండేదాన్ని. అలా రోజులు నడుస్తుండగా ఈమధ్య డాక్టర్ దగ్గరకి వెళ్లకుండా, "బాబా! పూర్వజన్మ కర్మఫలాలను నేను ఇలా అనుభవించాలంటే అలాగే కానివ్వు. నేను నిన్నే నమ్ముకున్నాను" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత 2022, ఆగస్టు 6వ తేదీ రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నా అనుమానాలేవైతే ఉన్నాయో అవి నిజమై ఉంటాయని ఒక డాక్టరు చాలా టెస్టులు వ్రాశారు. ఆ టెస్టులన్నీ చేయించాక ఏ సమస్యలూ లేవని, ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం బలహీనపడిపోయిందని, మంచిగా రోగనిరోధక శక్తి పెంచుకోమని చెప్పారు. అంతేకాదు, అంతా నార్మల్ అని ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు చెప్పారు. ఇది బాబా సూచన. నా ఆలోచనలు తప్పని నిద్రలోనే నా సమస్యను పటాపంచలు చేసారు బాబా. నేను నిద్ర లేవగానే బాబాను తలుచుకుని ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మా అబ్బాయి ఆరోగ్యం విషయంలో కూడా బాబా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటున్నారు. "ధన్యవాదాలు బాబా. మీకు మేము ఋణపడి ఉంటాము తండ్రి".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete