సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1290వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - రెండవ భాగం

సాయిబాబుగారు బాబా తమకు ప్రసాదించిన కొన్ని  అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.


నా భార్యకు శివుడు అంటే చాలా చాలా ఇష్టం. తనకి 14 సంవత్సరాల వయసప్పుడు ప్రక్కింటి ఆవిడతో ఒకసారి గుడికి వెళ్ళి శివపార్వతులు, వినాయకుడు ఉన్న ఫోటో ఒకటి తెచ్చుకుని రోజూ శ్రద్ధగా పూజిస్తుండేది. అలా తనకు పెళ్ళి అయ్యేంతవరకు తను ఆ ఫోటోకి పూజ చేస్తూ వచ్చింది. పెళ్ళయ్యాక మా ఇంట్లో బాబాని కొలవడం మరియు 'శ్రీశిరిడీ సాయిబాబా మహాత్మ్యం' సినిమా చూడటం జరిగాక తను బాబాను కూడా శ్రద్ధగా ఆరాధించడం మొదలుపెట్టింది. ఒక సోమవారంనాడు శివునికి అభిషేకం చేయదలచి నేను, నా భార్య గుంటూరుకి, తెనాలికి మధ్యనున్న ఒక క్వారీలోని శివాలయానికి వెళ్ళాము. మేము శివలింగానికి ఎదురుగా నిలుచున్నాము. పూజారి మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తున్నాడు. అభిషేకం మొదలుపెట్టి ఐదు నిమిషాలు అవుతున్నా మా మనసు పూజ మీద నిలవడం లేదు. ఎందుకంటే, మా దృష్టి అభిషేకం చేస్తున్న శివలింగం మీద కాక, శివలింగం వెనుకనున్న గోడకు తగిలించిన శివుని క్యాలెండర్ మీద ఉంది. కారణం, ఆ క్యాలెండర్ తిన్నగా ఉండకుండా, కొంచెం ప్రక్కకు తిరిగి ఉంది. అందువలన మేము జరుగుతున్న పూజ మీద ఎంత మాత్రమూ దృష్టి పెట్టలేక, 'శుభమా అని పూజ చేయించుకుంటుంటే, క్యాలెండరులోని శివయ్య ప్రక్కకు తిరిగి ఉన్నాడేమిటా?' అని నేను, నా భార్య ఎవరి మనసులో వాళ్ళము అనుకుంటున్నాము. కానీ పూజ జరిగేటప్పుడు మాట్లాడకూడదని మౌనంగా ఉన్నాము. అయితే మన మనసు లోతుల్లో ఆలోచనలను సైతం తెలుసుకునే సమర్థ సద్గురువైన బాబా అప్పుడు ఒక విచిత్రం చేశారు. అదేమిటంటే, 'దేవుళ్ళు' సినిమాలో కనకదుర్గ అమ్మవారి విగ్రహం నుండి అమ్మవారి చేయి వచ్చి నైవేద్యం స్వీకరించిన విధంగా క్యాలెండర్ ఉన్న గోడలో నుండి ఒక చేయి వచ్చి ఆ క్యాలెండరుని సరిచేసి మళ్ళీ గోడలోకి వెళ్ళిపోయింది. ఆ దృశ్యాన్ని నేను, నా భార్య ఇద్దరమూ కనులారా చూశాము.  తలొంచుకుని అభిషేకం చేస్తున్న పూజారికి ఆ విషయం అసలు తెలియలేదు. బాబా క్యాలెండర్ సరిచేశాక మా మనసులు తేలికపడి పూజ పూర్తయిన తరువాత ఆనందంగా బయటికి వచ్చి జరిగిన విషయం ఒకరికి ఒకరు చెప్పుకుని ఆశ్చర్యపోయాము.


బాబా మేఘుడిని త్రిశూలం గీయమని చెప్పడం, అది పూర్తికాగానే అతనికి శివలింగం ఇవ్వడం మనకి తెలుసు. సచ్చరిత్రలో చదువుకున్నాం. అలాగే బాబా మాకు ఒక శివలింగం ఇచ్చారు. అది ఎలాగో చూడండి. ఒకసారి నేను, నా భార్య తన స్నేహితురాలి ఊరికి వెళ్లి పది రోజులు ఉన్నాము. అప్పుడొక సోమవారంనాడు నా భార్య శివుడి గుడికి వెళ్ళి అభిషేకం చేయించాలని అంటే ఇద్దరమూ గుడికి బయలుదేరి వెళ్తున్నాము. దారిలో రోడ్డు మీద ఆవులు కన్పించాయి. వాటిని చూడగానే ఎందుకో 'అభిషేకానికి ఆవుపాలు తీసుకెళితే తృప్తిగా ఉంటుంద'నిపించింది. ఎందుకంటే, మా ఊరిలో ఆవుపాలు దొరకవు. ప్యాకెట్ పాలే దొరుకుతాయి. సరే, ఆ ప్రాంతంలో ఎవరి ఇంట్లో ఆవులు ఉన్నాయో కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్లి, నిద్రలేపి, "అభిషేకానికి ఆవుపాలు కావాల"ని అడిగాము. వాళ్ళు పాలు పిండిస్తే, ఆ పాలు తీసుకుని గుడికి వెళ్లి శివునికి అభిషేకం చేయించాము. ప్రక్కనే బాబా ఉంటే ఆయన్ని దర్శించుకుని, బయటికి వచ్చి కూర్చున్నాము. ఒక ప్రక్కకు తిరిగి చూస్తే, అక్కడ శివునికి చాలా ఇష్టమైన 'తుమ్మిపూల' చెట్లున్నాయి. సాధారణంగా ఆ చెట్లు కనిపించడం చాలా అరుదు. అందువలన వాటిని చూడగానే నా భార్య ఉత్సుకతతో ఆ చెట్టు విత్తనాలు సేకరించి, పొట్లం కట్టి, ఇంటికి వెళ్ళాక వాటిని ఎండబెట్టి మా ఇంట్లో నారు వేసింది. కొన్నిరోజులకి మొలకలు వచ్చి, పెరిగి పెద్దవై పూలు పూయసాగాయి. అదే సమయంలో మేము ఒకరోజు గుంటూరులోని నల్లపాడు బాబా గుడికి వెళ్ళాం. అక్కడ గుడి చుట్టూ ప్రతిష్ఠించడానికని తెప్పించి పెట్టుకున్న శివలింగాలున్నాయి. వాటిని చూసిన నా భార్య, “ఇంట్లో పూజించుకోవడానికి ఒక శివలింగం తీసుకొని వెళ్ళవచ్చా?" అని బాబాను అడగమంది. నేను బాబా దగ్గరకు వెళ్ళి దణ్ణం పెట్టుకుని, బాబాని అడిగితే, “పూజించుకోవచ్చు” అని బాబా సమాధానం వచ్చింది. దాంతో అక్కడున్న మేనేజరుని, "మాకొక శివలింగం కావాల"ని అడిగితే, ఆయన సంతోషంగా మాకు ఒక శివలింగం ఇచ్చారు. అది చేతుల్లోకి తీసుకోగానే నా భార్యకు చాలా ఆనందమేసింది. దాన్ని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకుని, రోజూ మా ఇంట్లో పూసే తుమ్మిపూలు కోసి శ్రద్ధగా శివలింగానికి అష్టోత్తరంతో పూజించుకుంటూ ఆ శివలింగంలో శివుడ్ని చూసుకుంటుండేది. అలా బాబా కృపవల్ల ముందు తుమ్మిపూలు, తర్వాత శివలింగం వచ్చాయి. శివలింగం తెచ్చుకోవడానికి, పూజించుకోవడానికి అనుమతినిచ్చిన బాబాకి సర్వదా కృతజ్ఞులమై ఉంటాం మేము.


ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నవాళ్ళకి బాబా దయవల్ల కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. అలా నా ఒక్కడికే అయితే మీరు నమ్మక్కరలేదు. కానీ నాకు, నా భార్యకూ ఒకే విషయం గురించి తెలిస్తే మీరు నమ్ముతారు కదూ! అసలు విషయానికి వస్తే, బాబా మాకు ప్రసాదించిన శివలింగానికి మేము రోజూ అభిషేకం, పూజ శ్రద్ధతో చేస్తూ దాదాపు ఒక సంవత్సరం పూర్తికావస్తుండగా 2017, ఫిబ్రవరిలో నా భార్య నన్ను ఒక ప్రశ్న అడిగింది, “మీరు రోజూ శివలింగానికి అభిషేకం, పూజ చేస్తున్నారు కదా! ఆ శివలింగంలో వచ్చిన మార్పు గమనించారా?" అని. నేను, “నాకు తెలియదు” అన్నాను. అందుకామె, “నేను మీకు ఏ వివరమూ చెప్పను. ఎప్పటికైనా మీరే గమనించి నాకు చెప్పాలి” అని అంది. తర్వాత నేను అప్పుడప్పుడు, 'ఏం మార్పు వచ్చింద'ని తదేకంగా శివలింగాన్ని చూస్తుండేవాడిని. అలా మూడు రోజులు గడిచాక నాల్గవరోజు శివలింగంలో వచ్చిన మార్పు గుర్తించి నా భార్యకు చెప్పాను. ఆమె ఆశ్చర్యంగా నా వైపు అలాగే చూస్తుండిపోయింది. రెండు సెకన్ల తర్వాత ఆమె ఆనందంగా "అవును” అని చెప్పింది. బాబా దయవల్లే నేను ఆ మార్పును గుర్తించగలిగాను. కానీ బాబా ఆజ్ఞ లేనందున ఆ మార్పు ఏమిటో మీతో పంచుకోలేకపోతున్నాను. అందుకు నన్ను క్షమించాలి.


బాబాని కొన్ని సంవత్సరాలుగా సేవిస్తుండటం వల్లనేమో జరగబోయే కొన్ని సంఘటనలు ముందే తెలుస్తుంటాయి. అది మంచిదైతే సరే, చెడు అయితే దానికి తరుణోపాయం, పరిష్కారం బాబానే సూచిస్తారు. అలా చేసి చెడు నుండి బయటపడవచ్చు. విని పాటిస్తే మంచి, పాటించకపోతే చెడు. ఒకసారి మా దగ్గర బంధువు ఒకతనికి అనారోగ్యంగా ఉందని, గుంటూరులో నెలరోజుల నుండి చికిత్స పొందుతున్నాడని మాకు తెలిసింది. తరువాత ఒకరోజు అర్థరాత్రి ఉన్నట్టుండి నా భార్యకు మెలకువ రాగానే ఆ బంధువు ముఖమే గుర్తొచ్చింది. 'బాబా అతనిని ఎందుకు చూపించారు? బహుశా అతనికి బాగా సీరియస్ అయివుంటుంది, హైదరాబాదు తీసుకెళితే ఫలితం ఉంటుంద'ని మాకు అనిపించి, ఆ విషయం వాళ్ళతో చెప్పాము. వాళ్ళు వెంటనే అతన్ని హైదరాబాదు తీసుకుని వెళ్లారు. బాబా దయవల్ల వారం రోజుల్లో అతనికి నయమై ఇంటికి తిరిగి వచ్చాడు. అదే వాళ్ళు మా మాట వినకపోతే పరిస్థితి ఎలా ఉండేదో? ఇకపోతే, మాకు తెలిసిన ఇద్దరు వ్యక్తుల మరణం గురించి బాబా ముందుగా చెప్పారు. నేను వాళ్లలో ఒకరితో, “నువ్వు పోతే మాకు పనులు ఎవరు చేసిపెడతారు?” అని అన్నాను. దానికి అతను, “నాకు ఇంకా చాలా సమయముంది” అని అన్నాడు. కానీ ఒక నెలలోనే అతను ప్రాణత్యాగం చేశాడు. ఇంకొకతనికి ఆరోగ్యం సరిగా లేకుంటే నేను అతనికి తరుణోపాయం చెప్పాను. కానీ అతను పాటించలేదు. పైగా నమ్మకం లేదని అన్నాడు. కొద్దిరోజుల్లోనే అతను కూడా మరణించాడు.


మాకు ఒక్కతే అమ్మాయి. అబ్బాయిలు లేరు. మేము తనని చాలా అపురూపంగా పెంచుకునేవాళ్ళం. చిన్నవయసులో తను రెండుసార్లు తప్పిపోతే బాబానే తిరిగి మా అమ్మాయిని మాకు అప్పగించారు. ఆ వివరాల్లోకి వెళితే, మా అమ్మాయికి 2 సంవత్సరాల వయస్సున్నప్పుడు 1991లో ఒకరోజు నా భార్య అమ్మాయిని తీసుకుని గుంటూరులోని కూరగాయల మార్కెట్‍కి వెళ్ళింది. నా భార్య మార్కెట్ రోడ్డులో ఉన్న ఒక షాపులో ఏదో కొంటూ ఐదు నిమిషాల తర్వాత పక్కకి చూస్తే, అప్పటివరకు పక్కనే ఉన్న మా అమ్మాయి కనిపించలేదు. ఆమె కంగారుగా బయటికి వచ్చి వాళ్ళని, వీళ్ళని అడుగుతుంటే, వాళ్ళు 'మాకు తెలీదు' అన్నారు. అంతలో ఒకామె, "గులాబిరంగు గౌన్ వేసుకున్న ఒక పాప మార్కెట్లోకి నడుచుకుంటూ వెళ్తోంది" అని చెప్పింది. వెంటనే నా భార్య మార్కెట్ అంతా వెతుక్కుంటూ చివరివరకూ వెళ్లేసరికి, ఒక ముసలావిడ మా అమ్మాయిని తన దగ్గర కూర్చోబెట్టుకుని కనిపించింది. నా భార్య ఆ ముసలావిడకు కృతజ్ఞతలు చెప్పి పాపను తీసుకొచ్చింది. రద్దీగా ఉన్న మార్కెట్లో మా పాపని తప్పిపోకుండా ఆ ముసలావిడ రూపంలో రక్షించింది బాబానే అని మా నమ్మకం. ఇంకోసారి పెనుగంచిప్రోలు తిరునాళ్ళలో మా అమ్మాయి తప్పిపోయింది. ఆ జనంలో ఎంత వెతికినా అమ్మాయి కనిపించలేదు. బాబాను ప్రార్థిస్తే, అప్పుడు కనిపించింది. అదే పాప కనిపించకపోయుంటే ఏమిటి పరిస్థితి? తను ఎక్కడ ఉందో, ఎలా ఉందోనని మేము జీవితంలో ప్రతి నిమిషం బాధపడాల్సి వచ్చేది. ఆ నరక బాధ నుండి మమ్మల్ని రక్షించిన సాయిబాబాకు ఏమిచ్చినా ఋణం తీరదు.


మా అమ్మాయికి ఐదు సంవత్సరాల వయస్సున్నప్పుడు 1994లో ఒకరోజు అర్థరాత్రి ఆగకుండా ఒకటే వాంతులయ్యాయి. మేము కంగారుపడి ఉదయాన్నే చిన్నపిల్లల డాక్టరు జ్యోత్స్నగారి దగ్గరకు తీసుకెళితే, "మెదడువాపు వ్యాధేమోనని అనుమానంగా ఉంది" అని పిడుగులాంటి వార్త మాతో చెప్పి, వెన్నుపూసలో నీరు తీసి టెస్టింగుకి పంపింది. తరువాత, “రిపోర్ట్ రేపు వస్తుంది. మీరు రేపు రండి” అని మమ్మల్ని ఇంటికి పంపింది. మాకు మా అమ్మాయి ముఖం చూస్తుంటే, బాధతో ఏడుపు వస్తుండేది. ఆ రాత్రంతా మేము దిగులుగా గడిపాము. మరుసటిరోజు సాయంత్రం ఓ గంట ముందుగానే ఆసుపత్రికి వెళ్ళాము. ఇంకా డాక్టరు రాలేదు. క్లినిక్‍కి తాళం వేసి ఉన్నందున బయటే వేచి ఉన్నాము. కాసేపటికే డాక్టరు వచ్చి మమ్మల్ని తన గదిలోకి పిలిచారు. మేము, 'రిపోర్టులో ఏమని వచ్చిందో' అని వణుకుతూ, భయంభయంగా బాబాని తలచుకుంటూ కళ్ళల్లో నీళ్లతో లోపలికి వెళ్ళాం. మాకు నోట్లోంచి మాట రావట్లేదు. డాక్టరు రిపోర్టు చూసి ఆశ్చర్యపోతూ, “అంతా బాగానే ఉంది. మెదడువాపు వ్యాధి కేసు మామూలుగా ఎలా అయ్యింది?” అని అన్నారు. 'బాబానే మా అమ్మాయికి నయం చేశార'ని మాకు మాత్రమే తెలుసు. వెంటనే కృతజ్ఞతతో ముందు బాబా గుడికి వెళ్ళి, తరువాత సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాం. ఎంతో బాధగా వెళ్ళినవాళ్ళం ఆనందంతో ఇంటికి చేరామంటే అది ఆ సాయినాథుని దయే.


1995లో మేము శిరిడీయాత్రలో భాగంగా బాసర సరస్వతి దేవాలయానికి వెళ్ళాము. నదిలో స్నానం చేద్దామంటే అక్కడ రద్దీగా ఉందని కొంచెం ముందుకు వెళ్ళాము. అయితే, నది ఒడ్డున ఉన్న ఒక ఊబిలో ఆరేళ్ళ మా పాప నడుము వరకు దిగబడిపోయింది. చేయి అందించి తనని కాపాడటానికి ముందుకు వెళ్లిన వాళ్ళ అమ్మమ్మ కూడా మోకాళ్ళవరకు ఊబిలో దిగబడిపోయింది. ఎవరు కాలుపెట్టినా అదే పరిస్థితి. అలా ఉంది ఆ ప్రదేశం. మాకు ఏమి చేయడానికీ తోచక బాబాను తలచుకున్నాము. మరుక్షణం, చూడటానికి పల్లెవాసిలా ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతను నేలమీద ప్రాకుతూ, ఊబిలో దిగబడిపోయిన మా పాపకి, అత్తగారికి తన కండువా అందించి, వాళ్ళను బయటకు లాగాడు. అందరం ఊపిరి పీల్చుకున్నాము. ఆ వ్యక్తి రూపంలో వచ్చింది బాబానే అని నా నమ్మకం.


తరువాయి భాగం వచ్చేవారం...

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


6 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. శ్రీ షిరిడి సాయి నాథ.. నీ పాదాల మీదనే మా భారం వేసాం మమ్మల్ని రక్షించి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించు సాయిరామా.. నిన్నే నమ్ముకున్న దీనులం.. మాకు ఎవరూ లేరు మీరే తప్ప.. ఈలోకంలో మాకు ఎవరూ లేరు మీరే దిక్కు మీరే రక్ష సాయినాథ కరుణించి కాపాడి వరం ఇవ్వండి సాయి శ్వర

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. ఓం సాయి బాబా ఈరోజు సాయి బాబా అనుభవం చాలా చక్కగా వుంది. కేలండరు నుంచి చెయి రావడం సాయి లీల చాలా బాగుంది. సాయే శివుడు .నా కు శివ ఆరాథన యిష్టం. కారీక మాసం వస్తోంది శివ ఆరాధనకు చాలా చక్కగా వుంటుంది.

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo