1. ఏ కీడూ జరగకుండా చూసిన బాబా
2. సాయినాథుని కరుణ
3. బాబా కరుణ
ఏ కీడూ జరగకుండా చూసిన బాబా
శ్రీసాయిబాబాకు నా శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు ఉమ. నేను సాయిభక్తురాలిని. ఏ సమస్య/కష్టం వచ్చినా అది చిన్నదైనా, పెద్దదైనా శ్రీసాయిబాబానే నాకు దిక్కు. ఆయన ప్రతిసారీ ఏదో ఒక రూపంలో ఆ సమస్యలకి పరిష్కారం చూపి నన్ను కష్టం నుంచి బయటపడేస్తున్నారు. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. నా భర్తది ఎరువుల వ్యాపారం. ఆ వ్యాపార విషయంగా మావారికి అప్పుడప్పుడు మీటింగులు ఉంటుంటాయి. అలాగే 2022, జూలై 28, గురువారంనాడు రాజమండ్రిలో మీటింగ్ ఉండగా ముందురోజు బుధవారం అర్థరాత్రి నాకు ఒక దుస్వప్నం వచ్చింది. ఆ కలలో ఏదో చెడు జరుగుతున్నట్లుగా ఉండటంతో నాకు ఒక్కసారిగా మెలకువ వచ్చి గుండె దడ ఎక్కువగా వచ్చింది. వెంటనే లేచి కొంచెం మంచినీళ్ళు తాగి, శ్రీసాయిబాబాని తలచుకుని, వారికి దణ్ణం పెట్టుకున్నాను. ఆ కల గురించి నేను ఎవరితోనూ చెప్పలేదు. మావారు మీటింగుకి వెళ్తూ పనిలో పనిగా అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి దర్శనానికి వెళ్తున్నారు. ఆ దైవకార్యం కూడా ఉన్నందున నేను మావారితో మీటింగుకు వెళ్లొద్దని అనలేదు. ఇకపోతే, నాకు వచ్చిన ఆ కల వల్ల మా నాన్నకి ఏదైనా చెడు జరుగుతుందేమో అని అనిపించింది. ఇంక అప్పటినుండి నా మనసులో తీవ్రమైన ఆందోళనను అనుభవిస్తూ భయంతో శ్రీసాయిబాబాకి నమస్కరించి, "మావారికి, మా నాన్నకి, అలాగే కుటుంబంలో ఎవరికీ ఎలాంటి కీడూ జరగకుండా కాపాడండి. మావారు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేలా చేయండి. అలా జరిగితే, ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా నా మొర ఆలకించి నా భర్తకి ఏ ఇబ్బందీ కలుగకుండా చూసి, అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి దర్శనం బాగా జరిగేలా చేసి క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకొచ్చారు.
2022, ఆగష్టు 5, రెండవ శ్రావణ శుక్రవారంనాడు నేను శ్రీవరలక్ష్మిదేవి పూజ చేసుకుందామని పూజాసామాగ్రి అంతా సిద్దం చేసుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి నా కడుపులో నొప్పి మొదలై విరోచనాలు అవసాగాయి. 'ఈ స్థితిలో నేను పూజ చేసుకోగలనా, లేదా' అని ఒకటే కంగారుగా అనిపించి నేను భయంతో శ్రీసాయిబాబాను మనసులో తలచుకుని, "నాకు కడుపునొప్పి, విరేచనాలు తగ్గి ఎలాంటి విఘ్నాలు లేకుండా నేను నిర్విఘ్నంగా శ్రీలక్ష్మిదేవి పూజ చేసుకోగలిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల కాసేపటికి నాకొచ్చిన సమస్య తగ్గిపోయి నేను శ్రీవరలక్ష్మిదేవి పూజ చేసుకున్నాను.
"సాయిబాబా! మీకు నా శతకోటి వందనాలు తండ్రీ. ఎల్లవేళలా మా కుటుంబంలోని అందరినీ చల్లగా కాపాడండి బాబా. నా భర్తకున్న షుగర్‌ని కంట్రోల్లో ఉంచి వేరే ఏ అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడండి. త్వరలో మమ్మల్ని శిరిడీకి రప్పించి మీ దర్శనభాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా ఇంట్లో నాకు, పిల్లలకి ఎవరికి బాగలేకపోయినా మీ ఊదీయే మాకు ఔషధం. ఆ ఊదీ అయిపోవస్తోంది. ఏదో ఒక రూపంలో ఊదీ మాకు అందేలా చేయండి. అయినా మీకు తెలియనిది ఏముంది బాబా? నేను అనుకున్నట్లు నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకున్నాను. పొరపాటున ఏదైనా తప్పు జరిగినా, మరిచిపోయినా నన్ను క్షమించండి బాబా. మేము తెలిసో, తెలియకో చేసిన తప్పులను, పాపాలను మన్నించండి. ఈర్ష్య, అసూయలను తొలగించి మాకు మంచి బుద్ధిని ప్రసాదించండి. చివరిగా, ఎల్లప్పుడూ మీ దయ మా కుటుంబంపై ఉండాలని ప్రార్థిస్తూ మరొక్కసారి నా సాష్టాంగ ప్రణామాలు".
సర్వం శ్రీసాయిమయం!!!
సాయినాథుని కరుణ
నా పేరు వెంకట రాధారత్నం. నేనొక సాయిభక్తురాలిని. శ్రీ శిరిడీ సాయినాథుని ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉన్నారని, ఉంటారని ఆశిస్తూ నా స్వీయానుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు బాబా గుడిలో ప్రవచనం చెప్తున్నారని నేను, మావారు గుడికి బయలుదేరాము. అనుకోకుండా బస్ స్టేషనులో కొబ్బరికాయలు కనిపిస్తే, "ఎలాగూ గుడికి వెళ్తున్నాం కదా, ఒక కొబ్బరికాయ కొందామ"ని నేను మావారితో అన్నాను. కానీ మావారు, "గుడి బయట దొరుకుతాయి కదా, అక్కడ తీసుకుందాంలే" అని ఊరుకున్నారు. బాబా గుడికి సమీపంలో మా బంధువుల ఇల్లు ఉంది. మేము ఎప్పుడు గుడికి వెళ్లినా వాళ్ళింటికి వెళ్లిరావటం మాకు అలవాటు. ఎప్పటిలా ఆరోజు కూడా వాళ్ళింటికి వెళ్ళి కాసేపు కూర్చొని గుడికి బయలుదేరాము. అప్పటికే ప్రవచనం మొదలైపోయిందని మేము కంగారుగా గుడిలోకి వెళ్ళిపోయాము. కాసేపటికి మా చుట్టాల ఇంట్లో పనిచేసే అమ్మాయి వచ్చి, నాకొక కొబ్బరికాయ ఇస్తూ, "అమ్మగారు దీన్ని మీకు ఇవ్వటం మర్చిపోయానని చెప్పి, మీకు ఇచ్చి రమ్మన్నారు" అని చెప్పింది. అప్పటికిగానీ బాబా కోసం కొబ్బరికాయ తీసుకుని రాకుండానే వచ్చేశామని నాకు గుర్తుకు రాలేదు. కానీ నేను మర్చిపోయినా నాకు కొబ్బరికాయను అందించి, నా కోరిక తీర్చిన బాబా ప్రేమకు ఆనందభాష్పాలతో శతకోటి నమస్కారాలు సమర్పించుకున్నాను. నేను ఇప్పటికీ ఆనాటి బాబా ప్రేమను గుర్తుచేసుకుంటూ ఉంటాను.
మేము మొట్టమొదటిసారి శిరిడీ ప్రయాణం పెట్టుకున్నప్పుడు, "మాకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా మీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించు బాబా" అని నేను సాయినాథునికి దణ్ణం పెట్టుకున్నాను. తరువాత ప్రయాణంరోజున స్టేషనుకు చేరుకుని ప్లాట్‌ఫాం మీదకి వెళ్ళాక ట్రైన్ వచ్చింది కానీ, కంపార్ట్‌మెంట్ తలుపులు మూసేసి ఉన్నాయి. ట్రైన్ రెండు నిమిషాలే ఆగుతుందని మాకు చాలా కంగారుగా అనిపించి తలుపులు బాగా తట్టాము. బాబా దయవల్ల తోటి ప్రయాణికుడు ఒకతను వచ్చి తలుపు తీస్తే, ఆఖరి నిమిషంలో ట్రైన్ ఎక్కగలిగాం. తరువాత నాగర్‌సోల్‍లో ట్రైన్ దిగి ఒక ఆటో ఎక్కాము. ఆ ఆటో అతనితో 'మందిరానికి దగ్గరలో ఏదైనా సత్రం వద్ద ఆపమ'ని అడిగాము. అతను ఒకచోట మమ్మల్ని దింపి, "ఇక్కడినుండి ఉచిత బస్సు సదుపాయం ఉంద"ని తెలిపాడు. మేము స్నానాలు ముగించుకుని బస్సులో బాబా దర్శనానికి వెళ్ళాము. బాబా మాకు తమ దర్శనంతో పాటు ఆరతి దర్శనభాగ్యాన్ని కూడా ప్రసాదించారు. తిరుగు ప్రయాణంలో మేము నాగపూరులో ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్ళాం. అక్కడ శిరిడీ విశేషాలు గురించి మాట్లాడుకుంటుండగా వాళ్ళు, "మా ఇంటికి దగ్గరలో బాబా గుడి ఉంది. మీరు తప్పక చూడాలి" అని మమ్మల్ని ఆ గుడికి తీసుకుని వెళ్లారు. ఆవిధంగా శిరిడీలోనూ, నాగపూరులోనూ తమ దర్శనభాగ్యాన్ని మాకు ప్రసాదించిన బాబాకు మనసారా నమస్కరించుకున్నాను. ఆ సాయినాథుని కరుణాకటాక్షాలు ఎల్లవేళలా నాకు, నా పిల్లలకి మరియు సమస్త ప్రపంచానికి ఉండాలని బాబా పాదాలకు శరణు వేడుకుంటున్నాను.
బాబా కరుణ
సాయిబంధువులకు, బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. ఒకసారి నాకు కొన్ని రోజుల పాటు జ్వరం వస్తూ ఉంటే మా అమ్మావాళ్ళింటికి వెళ్లాను. ఆ మరుసటిరోజు హాస్పిటల్‍కి వెళ్తే, డాక్టరు బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. అలాగేనని చేయించుకుంటే రిపోర్టులో నాకు టైఫాయిడ్ అని వచ్చింది. అది కూడా ఎక్కువగా ఉందని చెప్పి టాబ్లెట్లు ఇచ్చారు. కానీ జ్వరం తగ్గలేదు. దాంతో మా ఆయన నా దగ్గరకి వస్తానని అన్నారు. అయితే అప్పటికే చీకటిపడినందువల్ల నేను రావద్దని ఎంతగానో చెప్పాను. ఆయన, "సరే రాను, ఇంటికి వెళ్తాను" అని నాతో చెప్పారు. కానీ, నా వద్దకి రావడానికి బయలుదేరారు. ఆ విషయం నాకు తెలీదు. నేను ఫోన్ చేస్తుంటే ఆయన అస్సలు లిఫ్ట్ చేయలేదు. నాకు కంగారుగా అనిపించి, "బాబా ప్లీజ్, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆయన క్షేమంగా ఉండేలా చూడు. నేను మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకుని ఆయన మీదే భారం వేశాను. అంతలో ఆయన వచ్చి బైక్ హార్న్ కొట్టారు. ఆ శబ్దం వింటూనే ఆయన వచ్చారని నాకు అర్థమై ప్రాణం లేచివచ్చినట్లు అనిపించి బాబాకి థాంక్స్ చెప్పుకున్నాను. "ధన్యవాదాలు బాబా. మీకు మాట ఇచ్చినట్లుగా నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకున్నాను".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai Always Be With Me
Om sai ram your blog is very nice.Radha krishna maai episodes are very nice.she is Baba's devotee.All sai Baba's experiences are very nice.This God is Srmuti matra prasannadu.
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete