సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1299వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్యలను తరిమేసి పండంటి బిడ్డను ప్రసాదించిన బాబా
2. చిన్న, పెద్ద సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్న బాబా

సమస్యలను తరిమేసి పండంటి బిడ్డను ప్రసాదించిన బాబా


నా పేరు మానస. ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి, సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సాయిభక్తులందరూ సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాను. మన సాయి తోడు ఉన్నంతవరకు సాయి కుటుంబంలోని ఎవరికీ ఏ లోటూ రాదని చెప్పడానికి నా జీవితమే ఒక మంచి ఉదాహరణ. నా జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన విషయాల గురించి నేనీరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వీటిని చదవడం వల్ల తోటి భక్తులలో బాబాపై వాళ్లకున్న నమ్మకం మరింత బలపడుతుందని అనుకుంటున్నాను. వీటిని వ్రాసే అవకాశమిచ్చిన సాయితండ్రికి వేలవేల వందనాలు. నేను ఇదివరకు 'సాయిభక్తుల అనుభవమాలిక 1028వ భాగం'లో నా అనుభవాన్ని పంచుకున్నాను. అందులో రెండుసార్లు గర్భస్రావం అయ్యాక బాబా దయవల్ల మూడోసారి నేను గర్బవతినయ్యానని పంచుకున్నాను. చాలామందికి ప్రెగ్నెన్సీ అనేది చాలా తేలిక విషయం కావచ్చు కానీ, నా విషయంలో కాదు. ముందు రెండుసార్లు గర్భస్రావం జరిగినందువల్ల నాకు ఎప్పుడూ భయంగా ఉండేది. ప్రతినెలా స్కానింగ్‌కి వెళ్ళేటప్పుడు బాబా మీద భారమేసి, "స్కానింగ్ రిపోర్ట్ బాగుంటే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకుని వెళ్లేదాన్ని. బాబా దయవల్ల ప్రతిసారీ స్కానింగ్ రిపోర్టు బాగా వచ్చేది.


ఐదో నెలలో నేను షుగర్ టెస్ట్ చేయించుకుంటే, షుగర్ కొద్దిగా బోర్డరులో ఉందని వచ్చింది. అప్పుడు డాక్టరు, "కొంచెం ఆలస్యంగా టెస్టుకి ఇవ్వడం వల్ల ఇలా వచ్చి ఉంటుంది. పొద్దుపొద్దున్నే ఇవ్వాలి. వచ్చేవారం మళ్ళీ టెస్ట్ చేయించండి" అని చెప్పారు. మరుసటివారం టెస్టుకి ఇచ్చేటప్పుడు నేను, "బాబా! రిపోర్టులో బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయవల్ల నార్మల్ వచ్చింది.


తొమ్మిదవ నెల ప్రారంభంలో చేసిన యెన్.ఎస్.టి టెస్టులో కడుపులోని బిడ్డ గుండె పనితీరు తక్కువగా ఉన్నట్లు చూపించింది. డాక్టరు, "మరేం పర్లేదు. బేబీస్ ప్రతిసారీ యాక్టివ్ ఉండరు. కొద్దిసేపు వాకింగ్ చేసి, టీ తాగి రా, మళ్లీ టెస్టు చేద్దాం" అని నన్ను పంపించారు. కానీ నాకు చాలా భయమేసి, "బాబా! ఈసారి చేసే యెన్.ఎస్.టి టెస్టు నార్మల్ వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. ఆయన దయవల్ల 30 నిమిషాల తర్వాత టెస్ట్ చేస్తే, నార్మల్ వచ్చింది.


ఇక, బాబా దయవల్ల అంతా సక్రమంగా గడిచి డెలివరీ డేట్ దగ్గరకి వచ్చినప్పుడు డాక్టర్, "ఆదివారం పది గంటలకి హాస్పిటల్లో అడ్మిట్ అవమ"ని చెప్పారు. ఆరోజు హాస్పిటల్‌కి వెళ్లేటప్పుడు నేను ఒకరి ఇంటికి వెళ్లి, అక్కడ ఫ్రెషప్ అయి ఒక డెస్క్ ఓపెన్ చేశాను. అందులో ఉన్న 'స్టెతస్కోప్ వేసుకుని ఉన్న బాబా ఫోటో'ను చూసి నిర్ఘాంతపోయాను. "అంతా నేను చూసుకుంటాన"ని బాబా చెప్తున్నట్లు నాకనిపించింది. అంతే, అప్పటివరకు డెలివరీకి సంబంధించి నాకున్న భయాలన్నీ పోయి చాలా పాజిటివ్‌గా అనిపించింది. అక్కడినుండి బయలుదేరి హాస్పిటల్‌కి వెళ్ళాను. హాస్పిటల్ గేట్ దగ్గరకి వెళ్ళగానే, 'సాయిరామ్' అంటూ ఫోన్ రింగ్‌టోన్ వినిపించింది. నా ప్రతి అడుగులో బాబా, "నేనున్నాన"ని చెప్తున్నట్లు అనిపించి నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా దయవల్ల సోమవారం సాయంత్రం నాకు నార్మల్ డెలివరీ అయి బాబు పుట్టాడు. మూడు కేజీల బరువుతో బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అందరమూ సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యాము. బాబా అనుగ్రహంతోనే అంతా మంచిగా జరిగింది. నాకు ఒక మంచి బెస్ట్ డాక్టరుని పరిచయం చేసి, ఏ సమస్యా లేకుండా ఒక మగబిడ్డని ప్రసాదించిన బాబాకి శతకోటి వందనాలు. నమ్ముకున్నవాళ్ళకి ఎన్నటికీ నష్టం జరగనివ్వరు బాబా. "ఐ లవ్యూ బాబా. డెలివరీ తరువాత నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని మీకు మ్రొక్కుకున్నట్లుగా నేను నా అనుభవాన్ని పంచుకున్నాను. కానీ ఎందుకో తెలీదు, బాబు పుట్టగానే వేరే సమస్యలు వచ్చాయి. దానివల్ల నాన్నవాళ్ళు, మేము చాలా ఇబ్బందిపడుతున్నాము బాబా. మీ దయవల్ల తొందరలోనే ఈ సమస్యలన్నీ సమసిపోవాలి. అలా జరిగితే, మీ అనుగ్రహాన్ని మళ్ళీ బ్లాగులో పంచుకుంటాను".


చివరిగా ఒక మాట: బాబా భక్తులందరూ నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి, 'బాబా మన ధర్మబద్ధమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. అది కూడా మనం అనుకున్న దానికన్నా గొప్పగా, అద్భుతంగా. కాకపోతే కొంచెం ముందు, వెనక అంతే. కాబట్టి మనం తొందరపడి కృంగిపోకూడదు. బాబాపై భారం వేసి నిశ్చింతగా, నిర్భయంగా ఉండాలి'.


చిన్న, పెద్ద సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్న బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఆధునిక సచ్చరిత్రవలె ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలి. నా పేరు రేవతి. నేను ఇదివరకు ఎన్నో అనుభవాలు ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకోబోతున్నాను. 2020, ఆగస్టు 5న మా అత్తగారి ఊరు పాలకొండలో మేము కట్టించుకున్న ఇంటి గృహప్రవేశం చేశాము. ఆ అనుభవం ఇదివరకు బ్లాగులో పంచుకున్నాను. అయితే అప్పుడు కరోనా ఉధృతంగా ఉన్న సమయం కావడం, పంతులుగారు అందుబాటులో లేకపోవడం వల్ల శ్రీసత్యనారాయణస్వామివ్రతం, హోమం చేసుకోకుండా కేవలం గృహప్రవేశం చాలా సింపుల్‌గా చేసుకున్నాము. అప్పటినుండి ఎంత ప్రయత్నిస్తున్నా ఏదో ఒక కారణం చేత వ్రతం, హోమం వాయిదాపడుతూ ఉండేవి. చివరికి ఈమధ్య నేను, "బాబా! మీ దయవలన వ్రతం, హోమం చక్కగా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా అనుగ్రహించారు. సరిగ్గా మేము గృహప్రవేశం చేసుకున్న రెండు సంవత్సరాలకి, అనగా 2022, ఆగస్టు 5, వరలక్ష్మివ్రతం రోజున మేము శ్రీసత్యనారాయణస్వామివ్రతం, హోమం మంచిగా చేసుకోగలిగాము. ఆ మరుసటిరోజు మేము తప్పనిసరిగా స్కూలుకి వెళ్లాల్సి ఉండగా, ఉదయం లేచి వెళ్తే ఇబ్బంది అవుతుందని పూజ పూర్తయిన తరువాత అదేరోజు సాయంత్రం పాలకొండ నుండి పారాపురం వెళ్లడానికి బయలుదేరాము.  దారిలో వర్షం మొదలైంది. అప్పుడు, "బాబా! ఎలాగైనా మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చండి. వర్షాన్ని ఆపగల శక్తి మీకే ఉంది. మేము క్షేమంగా ఇంటికి చేరుకుంటే, ఈ అనుభవాన్ని బ్లాగులో  పంచుకుంటామ"ని నేను, మా అమ్మ బాబాకి మ్రొక్కుకున్నాము. బాబా ఎంతో దయతో వర్షం తగ్గించి, అంత చీకటిలోనూ ఏ ప్రమాదం జరగనివ్వకుండా మమ్మల్ని క్షేమంగా మా ఇంటికి చేర్చారు. "ధన్యవాదాలు బాబా. మీకు మాట ఇచ్చినట్లే, నా అనుభవాలు బ్లాగులో  పంచుకున్నాను తండ్రీ". 


మా పాప ఎప్పటినుంచో వైజాగ్ బీచ్‌కి తీసుకెళ్లమని అడుగుతుండేది. అయితే ఏ ఆదివారం వెళదామన్నా ఆరోజు వర్షం పడటమో లేదా ఇంకేదైనా కారణం వల్లనో మేము వెళ్లలేకపోయేవాళ్ళము. అలా ప్రతిసారీ వాయిదాపడుతుంటే మా పాప బాధపడుతుండేది. నేను తన బాధ చూడలేక చివరికి ఈమధ్యన ఒకరోజు, "బాబా! ఈ ఆదివారమైనా మేము బీచ్‌కి వెళ్లి వచ్చేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల 2022, జూలై 31, ఆదివారంనాడు మేము బీచ్‌కి వెళ్లి వచ్చాము. వర్షం లేదు, ఇంకా ఏ ఇతర ఆటంకం కూడా మాకు కలగలేదు. "ధన్యవాదాలు బాబా".


ఈమధ్య ఒకరోజు రాత్రి మా పాపకి విపరీతంగా చెవినొప్పి వచ్చింది. నేను పాప చెవికి ఊదీ రాసి, బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఉదయానికి చెవినొప్పి తగ్గింది. ఇలా నాకు వచ్చే చిన్న, పెద్ద సమస్యలన్నిటినీ నా బాబా పరిష్కరిస్తున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇంకా ఏవైనా అనుభవాలు మర్చిపోయివుంటే మన్నించండి బాబా".


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయి రామ్ మా భార్యకు అనారోగ్యం నుండి ఇప్పుడే మంచిగా ఆరోగ్యవంతురాలుగా చేయండి బాబా..

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo