సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1279వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఊహకందని బాబా అనుగ్రహం
2. నచ్చిన చోటుకి బదిలీ చేసిన బాబా
3. ఎలర్జీ సమస్యను పరిష్కరించిన బాబా

ఊహకందని బాబా అనుగ్రహం


నేను ఒక సాయి భక్తురాలిని. మాది హైదరాబాద్. కరోనాకి ముందు ప్రైవేట్ స్కూల్లో టీచరుగా పని చేసిన నేను కరోనా కారణంగా స్కూలుకి వెళ్లడం మానేసి రెండేళ్లు ఇంట్లోనే ఉన్నాను. ఇటీవల నేను మళ్లీ స్కూల్లో టీచరుగా చేరాలనుకుని నాకు అనుకూలమైన సమయాలకు అనుగుణంగా ఉన్న స్కూళ్లకోసం వెతికాను. ఆ క్రమంలో మా ఇంటికి అతి సమీపంలో ఒక స్కూలు ఉందని తెలిసి నేను ఆ స్కూళ్ళో చేరాలని అనుకున్నాను. కానీ 2 సంవత్సరాల గ్యాప్ వలన డెమో క్లాసు గురించి భయపడ్డాను. అందువలన నేను స్కూలుకి వెళ్లడానికి సంకోచించాను. ఇలా ఉండగా ఒకరోజు మా ఎదురింటి ఆవిడ వాళ్ళ స్కూళ్ళో కొన్ని ఖాళీలున్నాయని, మీకు ఆసక్తి ఉంటే దరఖాస్తు చేయండి అని చెప్పారు. నేను డెమో క్లాసు విషయంలో టెన్షన్ పడి, "బాబా! మీరు నాతో వచ్చి, సహాయం చేయండి" అని అడిగి గురువారం నాడే స్కూలుకి వెళ్ళాను. నేను ఆ స్కూల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించడం కోసం రెజ్యూమ్‌ సబ్మిట్ చేసి డైరెక్టర్ని కలవడానికి వేచి ఉన్నాను. ఆ సమయంలో నేను నా మనస్సులో, "బాబా! మీరు ఈ ఉద్యోగం ఇస్తే, నేను స్కూలుకు వెళ్తాను. ఒకవేళ ఇవ్వకపోయినా అది మీ ఇష్టం" అని బాబాతో చెప్పుకుని నన్ను నేను శాంతపరుచుకున్నాను. ఇంకా బాబా నామస్మరణ చేసుకుంటూ టెన్షన్, ఆందోళన ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా కూర్చున్నాను. కొంతసేపటికి నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. బాబా దయవల్ల డెమో క్లాసు చెప్పమనకుండానే నేరుగా నన్ను ఇంగ్లీష్ టీచరుగా అపాయింట్ చేసారు. వాళ్ళు ఆఫర్ చేసిన అంత మొత్తం జీతాన్ని నేను అస్సలు ఊహించలేదు. అది బాబా నాకు అనుగ్రహించిన భిక్ష. ఇదంతా ఆయన దయ. "థాంక్యూ సాయి".


కొన్ని నెలలుగా మా కుటుంబం కాలినడకన తిరుమల కొండెక్కి మొక్కు తీర్చుకోవాలని ప్రణాళిక చేసుకుంటున్నప్పటికీ మేము వెళ్లలేకపోయాము. ఒకసారి ట్రైన్ టిక్కెట్లు, ఇంకోసారి స్వామివారి దర్శనం టిక్కెట్లు దొరకలేదు. ఇలా చాలా సమస్యలు వచ్చాయి. చివరికి నేను బాబాను, "బాబా! మా మ్రొక్కు తీర్చుకునేలా అనుగ్రహించండి" అని వేడుకుని 2022, మేలో తిరుపతి వెళ్లడానికి అన్నీ బుక్ చేసాను. అయితే రెండు రోజుల్లో ప్రయాణమనగా మావారికి అత్యవసరమైన ఆఫీస్ వర్క్ పడి, తిరుపతి వెళ్ళడానికి కుదరదని ట్రైన్ టిక్కెట్లు క్యాన్సిల్ చేసారు. ఆయన, నేను ఇద్దరమూ బాధపడ్డాము. నేను, "సహాయం చేయమ"ని బాబాను అడిగాను. అప్పుడొక రోజు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న మా అమ్మాయి ఫోన్ చేసి, "పరీక్షలు అయిపోయిన తరువాత ఒక వారం రోజులు సెలవులు ఉంటాయ"ని చెప్పింది. దాంతో నేను ఆ సెలవుల్లో శిరిడీ వెళ్ళొద్దామని ప్లాన్ చేస్తే, మావారు, "నాకు ఆఫీస్ వర్క్ ఉంది. సెలవు దొరకడం కష్టం. అందువలన నేను రాను" అని అన్నారు. సరేనని, నేను నాకు, మా అమ్మాయికి 2022, జూన్ 26న శిరిడీ వెళ్ళడానికి ట్రైన్ టిక్కెట్లు, దర్శనం టిక్కెట్లు, వసతి బుక్ చేశాను. అయితే మా ప్రయాణానికి రెండు రోజుల ముందు తిరుగు ప్రయాణంలో మేము ఎక్కాల్సిన అజంతా ఎక్స్ ప్రెస్ క్యాన్సిల్ చేసినట్టు IRCTC నుండి నాకు మెసేజ్ వచ్చింది. నేను, "బాబా! మాకు మీ దర్శనం లభించటం లేద"ని చాలా బాధపడ్డాను. అంతలో నా మనసుకి, 'తిరుపతి దర్శనానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది?' అని అనిపించింది. బాబాకి దణ్ణం పెట్టుకుని కొన్ని ప్రయత్నాలు చేశాను. కానీ స్వామివారి దర్శనం టిక్కెట్లు అందుబాటులో లేవు. ఎంత ప్రయత్నించినా వాటిని పొందే మార్గం దొరకలేదు. నాకు చాలా బాధేసి బాబా దగ్గర ఏడ్చేసాను. బాబాని, వేంకటేశ్వరస్వామిని, "ఏదోవిధంగా నాకు సహాయం చేయండి" అని అడిగాను. ఆ సాయంత్రం నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, 'స్వామివారి దర్శనం టిక్కెట్లు లేకపోయినా కాలినడకన కొండెక్కి, శ్రీవరాహస్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేద్దామ'ని. అంతే, నేను ట్రైన్ టిక్కెట్లు బుక్ చేద్దామని ప్రయత్నించాను. బాబా దయవల్ల సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్ళడానికి టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. కానీ తిరుగు ప్రయాణం టిక్కెట్లు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఆ సమయంలో వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు అయినా ఉన్నాయని అనుకున్నాను కానీ, అవి కన్ఫర్మ్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా రద్దు అయిపోతాయన్న ఆలోచనే నాకు లేక కంఫర్మ్ అవుతాయిలే అని వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసాను. ఇక తిరుపతిలో కాటేజ్ బుకింగ్ ఎలా అన్న ఆలోచన మొదలైంది. నా భర్త పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో పని చేస్తున్నారు. కాబట్టి తిరుపతిలో బ్యాంకువాళ్ళ గెస్ట్ హౌస్ కోసం ప్రయత్నిస్తే, ఖాళీ లేవని చెప్పారు. మళ్ళీ టెన్షన్ మొదలై, "బాబా! దయచేసి సహాయం చేయండి" అని బాబాని అడుగుతూ ఉంటే బాబా నాకు ఒక ఆలోచన ఇచ్చారు. దాన్ని అనుసరించి ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్న నా స్నేహితుడు ఒకరికి ఫోన్ చేసి తిరుపతిలో గెస్ట్ హౌస్ బుకింగ్ విషయంలో సహాయం అడిగాను. అప్పుడు అతను, "ఎప్పుడు తిరుపతి వెళుతున్నారు?" అని అడిగారు. నేను ఫలానా రోజు అని చెప్పగానే, "నేను కూడా అదే రోజుల్లో వెళ్తున్నాను. కాబట్టి మనం అక్కడ కలుద్దాం, కలిసి కొండ ఎక్కుదాము" అని వెంటనే గెస్ట్ హౌస్ బుక్ చేసారు. తరువాత అతను మా దర్శనం గురించి అడిగారు. నేను, "దర్శనానికి మాకు టిక్కెట్లు లేవు" అని చెప్పాను. అతను, "వెంటనే మీ ఆధార్ కార్డులు పంపండి. నేను వివిఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తాను" అని చెప్పారు. మేము ఒక్కసారిగా షాక్ అయ్యాము. బాబా సహాయం చేయకుంటే ముమూలు దర్శనమే కష్టం అయ్యేది. అలాంటిది ఏకంగా వివిఐపి బ్రేక్ దర్శనం దొరికింది. అలా బాబా దయతో మాకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చాలా బాగా జరిగింది. శిరిడీలో సాయిని దర్శించాల్సిన అదే రోజున తిరుపతిలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శిస్తామని నేను అస్సలు అనుకోలేదు. ఇదంతా బాబా దయకాక మరేంటి? నిజంగా ఇది ఆయన చేసిన అద్భుతం! బాబా చాలా నెలలుగా పెండింగ్‌లో ఉన్న మ్రొక్కు తీర్చుకునేలా చేసి మాకు చాలా సంతోషాన్నివ్వడమేకాక 'తాము, వెంకటేశ్వరస్వామి ఒక్కటేన'ని నిరూపించారు. బాబాకు హృదయపూర్వక ధన్యవాదాలు.


నచ్చిన చోటుకి బదిలీ చేసిన బాబా 


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు మాధవి. ఆ సాయినాథుని దయవల్ల నేను, నా కుటుంబం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నామని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ సమస్య వచ్చినా కళ్ళు మూసుకుని మన బాధను చెప్పుకుని కష్టాన్ని తొలగించమంటే వెంటనే అనుగ్రహించే శ్రీసాయినాథుని పాదపద్మములకు సాష్టాంగ నమస్కారాలు తెలుపుకుంటూ ఆయన ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. బాబా అనుగ్రహంతో నా భర్తకి పంచాయతీ సెక్రెటరీగా ప్రభుత్వోద్యోగం వచ్చింది. నెల్లూరులో పోస్టింగ్ ఇచ్చారు. దాంతో మేము నెల్లూరు వచ్చి నివాసముంటుండేవాళ్ళం. కానీ పెళ్ళైనప్పటి నుండి మేము శ్రీకాళహస్తిలో ఉన్నందువల్ల తిరిగి అక్కడికే వెళ్లిపోవాలన్నది మా కోరిక. అయితే అక్కడికి బదిలీ మీద వెళదామంటే శ్రీకాళహస్తి, అక్కడి పరిసర పంచాయితీల్లో ఖాళీ లేక ఆగిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం కూడా కొన్నాళ్లపాటు బదిలీలు నిలుపు చేసి మళ్ళీ ఈమధ్య అనుమతించింది. కానీ మావారిని నెల్లూరు నుండి పంపడానికి ఎంపీడీఓ గారు ఇష్టపడలేదు. అదీకాక శ్రీకాళహస్తి పరిసరాల్లో ఖాళీ లేదు. ఇంకా నేను ఆ సాయినాథునికి నా బాధ చెప్పుకుని, "బాబా! మీ దయతో మాకు నచ్చిన చోటుకి బదిలీ అయి మా కోరిక నెరవేరితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. అంతే, బాబా ఆశీస్సులతో మావారికి శ్రీకాళహస్తికి సమీపంలో ఉన్న చోటుకి బదిలీ అయింది. ఇప్పుడు మా కుటుంబం శ్రీకాళహస్తిలో సంతోషంగా ఉంటున్నాము. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా. ఏ జన్మ పుణ్యఫలమో మేమందరమూ మీ భక్తులమయ్యాము. నా ఈ జీవితం మీకు అంకితం బాబా".


సర్వం శ్రీసాయినాథాయ నమః!!!


ఎలర్జీ సమస్యను పరిష్కరించిన బాబా


నాపేరు కృష్ణమూర్తి. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ బ్లాగులో రెండోసారి నా అనుభవం పంచుకుంటున్నాను. నేను ఈమధ్య  ఎలర్జీతో 20 రోజులు ఇబ్బందిపడ్డాను. ఏం చేసినా ఎంతకీ తగ్గలేదు. చివరికి బాబాను వేడుకున్నాను. ఆయన కృపవల్ల అన్ని రోజులుగా పరిష్కారం కాని సమస్య రెండు రోజుల్లో పరిష్కారమైంది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే నేను క్లైమ్ చేసిన EPF త్వరగా వచ్చేలా చూడమని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను తండ్రి. త్వరగా అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాను బాబా".


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయి బాబా మొదటి అనుభవం చాలా బాగా వుంది. నా పుట్టినరోజు న మా అబ్బాయి తిరుపతి లో వెంకన్న దర్శణం. ఏర్పాటు చేసాడు. నేను చాలా ఆనందించాను.బాబా ఆ శ్రీ నివాసుడే

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Actually Everybodies Either she r Him like that Only - I Will manage with pvt job Done like this Some Times with Depend's on on my Eaning's

    ReplyDelete
  5. Sri samardha sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo