సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1296వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - మూడవ భాగం

సాయిబాబుగారు బాబా తమకు ప్రసాదించిన కొన్ని  అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.


1998వ సంవత్సరంలో ఒకరోజు ఉదయం నేను, నా భార్య, మా అమ్మాయి నాగార్జునసాగర్ చూసొద్దామని ఇంటినుండి బయలుదేరి మాచర్ల చేరుకున్నాము. అక్కడ మాకు తెలిసినవాళ్ళుంటే వాళ్ళని కలిసి వెళదామని వాళ్ళింటికి వెళ్ళాము. తీరా చూస్తే, వాళ్ళు హైదరాబాదు వెళ్ళారని తెలిసింది. సరేనని మేము మాచర్ల నుండి సాగర్ వెళ్లే బస్సు ఎక్కాము. ఆ బస్సు కండక్టరు, "ఎత్తిపోతల జలపాతం బాగుంటుంది, చూడండి"  అని చెప్పి, ఎక్కడ దిగాలో కూడా చెప్పాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేము అక్కడ దిగాం. అదంతా అటవీ ప్రాంతం. నిర్మానుష్యంగా ఉంది. నక్సలైట్ల భయం కూడా ఉంది. మేము బాబా నామం చెప్పుకుంటూ 3కి.మీ. నడిచి ఎత్తిపోతల వద్దకు చేరుకున్నాము. బాబా దయవల్ల మాకు ఏ ఇబ్బందీ కలగలేదు. జలపాతం వద్ద సాయంత్రం వరకూ గడిపాక నాగార్జునసాగర్‌కి వెళ్లాలని చూస్తుంటే, ఒక వ్యాను వాళ్ళు మేము అడక్కుండానే మమ్మల్ని పిలిచి వ్యానులో ఎక్కించుకుని, సాగర్ రోడ్డు మీద దించారు. అక్కడ సాగర్ వెళ్లే బస్సు ఎక్కి సాగర్ చేరుకున్నాము. చీకటి పడింది. ఎక్కడ ఉండాలో తెలియలేదు. ఒక గుడి తెరచివుంటే, వెళ్ళి అక్కడ కొంతసేపు కూర్చుని, “బాబా! ఇక్కడ మాకు ఏమీ తెలీదు, ఎవరూ తెలియదు. అంతా నువ్వే చూసుకోవాలి” అని బాబాని ప్రార్థించాము. తర్వాత మేము గుడి బయటికి వస్తూనే ఒకామె మాకు ఎదురుగా వచ్చి, “ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు?" అని అడిగింది. మేము వివరాలు చెప్పాము. ఆమె మాకు ఒక హోటల్ అడ్రస్ చెప్పి,ఏ ఇబ్బందీ ఉండదు. అక్కడికి వెళ్ళండి” అని చెప్పింది. సరేనని మేము అక్కడికి వెళ్ళాము. కేవలం 50 రూపాయల అద్దెకి చాలా సౌకర్యవంతమైన రూమ్ ఇచ్చారు. ఒక గంటలో కాశ్మీర్ నుండి 30 మంది బౌద్ధమతస్థులు వచ్చి ఆ హోటల్లో దిగారు. వాళ్లే మాకు అల్పాహారం పెట్టారు. నిజానికి అక్కడ తినడానికి ఏమీ దొరకదు. బాబానే వాళ్ళ రూపంలో మా ఆకలి తీర్చారు. మరుసటిరోజు ఉదయాన్నే లాంచీ ఎక్కి కృష్ణానదిలో విహరిస్తూ నాగార్జునకొండకు వెళ్లి, సాగర్ డ్యామ్ తదితర ప్రదేశాలన్నీ చూసుకుని తిరిగి క్షేమంగా ఇంటికి చేరాము. బాబానే మాకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడా మేము ఇబ్బందిపడకుండా మా కోరిక తీర్చారని ఆ తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకున్నాము.


10 సంవత్సరాల వయసప్పుడు అకస్మాత్తుగా మా అమ్మాయికి బాగా జ్వరం వచ్చింది. గ్రామంలోని డాక్టరుని పిలిస్తే, అతను వచ్చి, ధర్మామీటరుతో జ్వరం ఎంత ఉందో చూసి కంగారుపడుతూ మాతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. మాకు భయమేసి బాబా ఫోటో ముందు కూర్చుని, "నువ్వే దిక్కు బాబా" అనుకున్నాము. పావుగంట తర్వాత ఆ డాక్టరు వచ్చి ఒకే ఒక్క ఇంజక్షన్ చేసి, "జ్వరం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అయినా భయపడాల్సిన పనిలేదు" అని ధైర్యం చెప్పి వెళ్ళాడు. సాయంత్రానికి జ్వరం తగ్గింది. బాబానే ఆ డాక్టరు రూపంలో పాపని రక్షించారని మేము తలచాము.


మా అమ్మాయి 10 తరగతి పరీక్షల కోసం బాగానే చదివింది. హాల్ టిక్కెట్టు కూడా తీసుకుంది. తీరా తను పరీక్షకు వెళ్లే ముందు ఎందుకో తెలీదుగానీ 'పరీక్షకు వెళ్లాలా, వద్దా' అని బాబాని అడగాలనిపించి బాబాని అడిగితే, "వద్దు" అని బాబా సమాధానం వచ్చింది. ఇక అంతే, ఇంకేమీ ఆలోచించకుండా ఒక సంవత్సరం వృధా అయినా ఫర్వాలేదని అమ్మాయిని పరీక్షలకు పంపలేదు. మరుసటి సంవత్సరం "పరీక్షలు వ్రాయమ"ని బాబా చెప్పడంతో మా అమ్మాయి పరీక్షలు వ్రాసి ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణురాలైంది. తరువాత ఇంటరులో మా అమ్మాయి బాబా చెప్పిన గ్రూపే తీసుకుంది. ఇంటర్ రెండో సంవత్సరం చివరి పరీక్షలు జరుగుతున్నప్పుడు ఒక పేపరులో తను చదివిన ప్రశ్నలేవీ రాలేదు. దాంతో ఆ పేపరులో కనీస మార్కులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. రిజల్ట్స్ వచ్చేరోజు మేము శిరిడీలో బాబా ముందు ఉన్నాము. నేను, "బాబా! అమ్మాయిని పాస్ చేయించే బాధ్యత నీదే" అని బాబాను వేడుకుని, అమ్మాయి హాల్‍టిక్కెట్‌ను బాబా సమాధి మీద ఉంచాను. తరువాత మందిరం బయటికి రాగానే రిజల్ట్స్ వచ్చాయని తెలిసి నెట్‍లో చూస్తే, మా పాప ఫస్ట్ క్లాసులో పాసయ్యింది. అద్భుతమేమిటంటే, కనీస మార్కులు కూడా రావనుకున్న పేపర్లోనే మిగతా అన్ని పేపర్లలో కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. అదీ బాబా దయ. పిల్లలకు పాఠాలు చెప్పే మాకు (అప్పట్లో మేము స్కూలు నడిపేవాళ్ళం), 'మా అమ్మాయే పరీక్షలో పాసవకపోతే ఎలా?' అన్న పరిస్థితి రాకుండా చేసిన బాబాకు మరుసటిరోజు కృతజ్ఞతాపూర్వకంగా దక్షిణ సమర్పించుకున్నాను. డిగ్రీలో కూడా బాబా ఏ సబ్జెక్టులు తీసుకోమని చెప్పారో అవే తీసుకుని మా అమ్మాయి డిగ్రీ పూర్తిచేసింది. చివరికి ఎమ్.సి.ఎ. కూడా మా అమ్మాయి చేత  పూర్తిచేయించారు బాబా. ఇదంతా ఆయన దయ.


మేము మా అమ్మాయి వివాహం శిరిడీలో చేయాలనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ చేయడం కుదరక ఇక్కడే లోకల్లో చేయాలనుకున్నాము. అయితే పెళ్లికి వారం రోజులే సమయం ఉందనగా ఒక్క కల్యాణ మండపం కూడా ఖాళీ లేదు. అప్పుడు మేము, "బాబా! మా అమ్మాయి వివాహం మీ సమక్షంలో జరగాలి" అని బాబాను ప్రార్థించాము. వెంటనే తెలిసినవాళ్ళ ద్వారా గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సాయిబాబా మందిరంలో వివాహం జరిపించవచ్చనే కబురు తెలిసింది. పెళ్ళి గురువారం అనగా అప్పటికి వారం రోజుల ముందు నుండి ఎడతెరిపి లేకుండా వానలు కురిసినప్పటికీ పెళ్లిరోజు వర్షం పడలేదు. ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇదంతా బాబా దయే. వివాహం అయిన వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా మందిరం నుండి పసుపుబట్టలతో బాబా ఆశీస్సుల కోసం కుటుంబసభ్యులందరమూ శిరిడీ వెళ్ళాము. అందరికీ ఆశ్చర్యం కలిగేలా బాబా ఆశీస్సులు కొత్త దంపతులకు లభించాయి. ఎలాగంటే, మేము ఉదయం శిరిడీ చేరుకోగానే, బాబా ధూళిదర్శనం కోసం లోపలికి వెళ్ళాము. అక్కడ హాలులో స్టీల్ బారికేడ్ల ముందు అందరమూ నిలుచున్నాము. నేను బాబాని చూస్తూ, "క్రొత్త జంట మీ ఆశీర్వాదం కోసం వచ్చారు. వాళ్ళని దీవించు బాబా” అని కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు బాబాను  ప్రార్థించాను. కళ్ళు తెరిచి చూస్తే, మా ముందు ఉన్న స్టీల్ రాడ్ మీద కొంచెం పసుపు, కుంకుమ, రెండు పూలమాలలు, కొంచెం అక్షింతలు ఉన్నాయి. మేము కళ్ళు మూసే ముందు అవి అక్కడ లేవని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే, ఆ స్టీల్ రాడ్ మీద, ఆ ప్రక్క రాడ్ మీద నేను నా రెండు చేతులు పెట్టి దగ్గరగా నిలుచున్నాను. బాబా ఆశీర్వాదం లభించినందుకు మాకు చాలా ఆనందమేసింది. మూడు రోజులు అక్కడే ఉండి తిరుగు ప్రయాణమయ్యాము.


మేము నారాకోడూరులో బాబా పేరు మీద 'శిరిడీసాయి పబ్లిక్ స్కూల్' అని ఒక స్కూలు పెట్టాము. ఆ స్కూలులో రోజూ ఉదయం ప్రార్థనలో భాగంగా బాబాను పూజించేవాళ్ళము. క్రమంగా పిల్లలకు బాబాపై భక్తి కుదిరి వాళ్ళు బాబాను బాగా ఇష్టపడుతుండేవాళ్ళు. వాళ్ళని చూసి కొద్దిరోజులకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాబా భక్తులయ్యారు. బాబా దయవల్ల మేము అనుకోకుండా 'దేవుళ్ళు' సినిమా చూసి అందులో ఉన్న 'సిరులనొసగి సుఖశాంతులు కూర్చును శిరిడీసాయి కథ' అనే బాబా పాటను ఆ సంవత్సరం స్కూలు వార్షికోత్సవంలో పిల్లలతో ప్రదర్శించాము. అది చూసిన పిల్లలందరిలో భక్తిభావం మరింత పెరిగింది.


ప్రతి సంవత్సరం స్కూలు వార్షికోత్సవ వేడుకలో మేము ఫస్టు, సెకండు వచ్చే పిల్లలకు బహుమతులిస్తుండేవాళ్ళము. ఆ బహుమతులు అందుకున్న పిల్లలను చూసి మిగిలిన పిల్లలు నిరాశ చెందకుండా ఉండేందుకుగానూ వాళ్ళకి కూడా వేరే బహుమతులు ఇస్తూండేవాళ్ళము. వాటిని చేతిలో పట్టుకుని నవ్వుతూ ఆనందంగా ఇళ్ళకు వెళ్తున్న పిల్లల్ని చూస్తే మాకూ ఆనందంగా ఉండేది. ఒక సంవత్సరం స్కూలు వార్షికోత్సవమప్పుడు శిరిడీ నుండి చిన్న చిన్న బాబా పాలరాతి విగ్రహాలు తెచ్చి పిల్లలందరికీ ఇచ్చాము. అప్పటినుండి పిల్లలు స్కూలుకు వచ్చేటప్పుడు బాబాకి దణ్ణం పెట్టుకునేవారు. క్రమంగా వాళ్లలో తామసగుణాలు పోయి సాత్వికగుణాలు అలవడ్డాయి.


ప్రతి సంవత్సరం వేసవిలో మేము పిల్లలను విహారయాత్రకు తీసుకెళ్ళేవాళ్ళము. బాబా దయవలన ప్రతిసారీ అన్నీ సవ్యంగా జరిగేవి. ఒక సంవత్సరం వేసవిలో స్కూలు పిల్లల్ని విజయవాడ రాజీవ్‌గాంధీ పార్కుకు తీసుకెళ్తూ దారిలో తాడేపల్లిలోని సాయిబాబా గుడి దగ్గర దిగి అందరం బాబా దర్శనం చేసుకున్నాము. బాబా పిల్లల్ని అనుగ్రహించారు. ఎలాగంటే, మేము అక్కడినుంచి బయలుదేరి ప్రకాశం బ్యారేజీ దగ్గర ఆగాము. కృష్ణానది ఒడ్డున నిలబడి నదిని, వచ్చేపోయే లాంచీలను చూస్తూ ఉన్నాము. పిల్లలందరికీ లాంచీ ఎక్కాలన్న బలమైన కోరిక కలిగింది. పైగా ఒక లాంచీ నడిపేవాడు పిల్లల్ని, "పడవ ఎక్కుతారా?" అని అడిగాడు. పిల్లలు బిక్కముఖాలతో మా వైపు చూసేసరికి మాకు చాలా బాధేసింది. కానీ మేము మా యాత్రలో లాంచీ ఎక్కడం గురించి ప్రణాళిక చేసుకోలేదు. అందువల్ల లాంచీలో ప్రయాణానికి సరిపడా డబ్బులు మా దగ్గర లేవు. ఏం చెయ్యాలో పాలుపోక అలా నిలబడి ఉన్నాం. అంతలో పిల్లల దగ్గరకి ఒక వ్యక్తి వచ్చి, "మీదేవూరు? మీ స్కూలు పేరు ఏమిటి?" అని అడిగాడు. పిల్లలు, "మాది 'నారాకోడూరు', మా స్కూలు పేరు 'శిరిడీ సాయి' పబ్లిక్ స్కూల్" అని చెప్పారు. అప్పుడు అతను, "పిల్లకాయలూ, లాంచీ ఎక్కుతారా?" అని అడిగాడు. దానికి పిల్లలందరూ, "మా దగ్గర డబ్బులేద"ని చెప్పారు. వెంటనే అతను లాంచీ అతన్ని పిలిచి, 300 రూపాయలిచ్చి, "ఈ పిల్లలందర్నీ లాంచీ ఎక్కించుకుని ఒక ట్రిప్పు వేయమ"ని చెప్పాడు. ఊహించని ఆ సంఘటనకు మేం ఆశ్చర్యపోతూ, ఆయనకు కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా లాంచి ఎక్కాము. పిల్లలు నిరాశ చెందటం చూడలేని బాబానే ఆ వ్యక్తి రూపంలో వచ్చారు. లేకపోతే ఆయనకు అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ సంఘటనతో పిల్లల్లో బాబాపట్ల భక్తిభావం మరింత పెరిగింది.


తరువాయి భాగం వచ్చేవారం...

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 



3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Sai babu gaariki baba chalaa manchi anubhavalanu prasadhinchaaru….baba meedha unna prema chala chakkaga e blog dwara maatho panchukovadam happy ga undhi ……thank you sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo