1. బాబా విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు
2. బాబా దయతో ఆరోగ్యం
బాబా విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు
నేను సాయిభక్తురాలిని. సాయిభక్తులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న అన్నయ్యకి బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. నా భర్త చాలా కష్టపడి తన ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. తను తన వృత్తి ద్వారా వచ్చే సంపాదనను దాచిపెట్టుకుని, ఒక సంవత్సరం క్రితం ఆ డబ్బుతో మొట్టమొదటిసారి తన స్వగ్రామంలో ఆరు సెంట్ల భూమి కొన్నారు. ఆ భూమి పక్కన ఉన్న ఇంకో ఆరు సెంట్ల భూమిని ఇంకొకతను కొన్నాడు. అతను తన భూమి కొలతలు వేసేటప్పుడు మా స్థలంలోని రెండు సెంట్ల భూమిని తన స్థలంలో కలిపేసుకున్నాడు. ఆ విషయం మాకు తెలిసి మేము చాలా బాధపడ్డాం. కష్టపడి కొనుక్కున్నది ఏదైనా సరే అలా అకారణంగా ఇంకొకళ్ళు లాగేసుకుంటే బాధపడటం సహజమే కదా! మేమేమో యు.ఎస్.ఏలో ఉంటాం. అక్కడ ఊరిలో అత్తయ్యవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు చాలా నెమ్మదస్తులు. వాళ్ళకి ఇలాంటి గొడవలు ఇష్టం ఉండదు. వాటికి దూరంగా ఉంటారు. ఇట్టి స్థితిలో నేను, "బాబా! కష్టపడి సంపాదించుకున్న మొదటి ఆస్తిని వేరేవాళ్ళ సొంతం కానివ్వకండి" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. చివరికి ఏదైతే అదే అవుతుందని ప్రభుత్వ ఉద్యోగిని పిలిచి, అతని సమక్షంలో మళ్లీ కొలతలు వేయించి, మా భూమి చుట్టూ కంచె వేయించాము. నేను, "బాబా! ఎలాంటి సమస్యా రాకుండా ఉంటే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల కంచె వేసి రెండు నెలలైనా మాకు ఎలాంటి సమస్యా రాలేదు. "థాంక్యూ సో మచ్ బాబా".
నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి 32 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాలేదు. ఆ అమ్మాయికి తండ్రి లేకపోవడం వల్ల తల్లే తన పెళ్లికోసం చాలా శ్రమపడింది. కానీ ఒక్క సంబంధమూ కుదరలేదు. నేను కూడా తనకి ఏదైనా సంబంధం చూద్దామని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ, ఏదీ కలిసి రాలేదు. మరోపక్క తనకి పెళ్లి కుదరడం లేదని నా ఫ్రెండ్ మానసికంగా చాలా బాధను అనుభవిస్తుండేది. నేను ఎప్పుడూ బాబాను, "ఆ అమ్మాయికి ఒక సంబంధం కుదర్చండి బాబా" అని అడుగుతూ ఉండేదాన్ని. ఆ క్రమంలో ఒకరోజు, "బాబా! నా ఫ్రెండ్‌కి మంచి సంబంధం వచ్చి, తనకి పెళ్లి కుదిరితే, నేను మీ పాదాలకు పసుపురంగు పువ్వులు సమర్పిస్తాను. అందరూ, "మన 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటామని అనుకోగానే అన్ని పనులు అవుతున్నాయి" అని అంటారు. అదే నిజమైతే, మీరు నా ఫ్రెండ్‌కి సంబంధం కుదర్చండి. నేను మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. సాక్షాత్తూ బాబా ప్రేరణతో నడుస్తున్న ఈ బ్లాగుని నేను అలా అంటే ఆయన ఊరుకుంటారా? ఒక్క నెలలో నా ఫ్రెండ్‌కి ఒక మంచి సంబంధం వచ్చి, పెళ్లి నిశ్చయమైంది. 2022, ఆగస్టు 11న తన పెళ్లి. "మీ కృపకు ఇదే నిదర్శనం బాబా. థాంక్యూ అన్నది చాలా చిన్న మాట బాబా".
ఒకసారి గ్యాస్ట్రిక్ సమస్య వల్ల గుండెల్లో మంటతో నేను చాలా బాధను అనుభవించసాగాను. ఒకరోజు గుండె పట్టేసినట్టు, లోపల నరం లాగుతున్నట్లు అనిపించడంతో నాకు చాలా భయమేసింది. నేను వెంటనే బాబా ఊదీ రాసుకుని, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగి, సచ్చరిత్ర ప్రక్కన ఉంచుకుని, బాబాని స్మరిస్తూ, "ఈ నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల నెమ్మదిగా నేను ఆ సమస్య నుంచి బయటపడ్డాను.
ఇప్పుడు చెప్పబోయే అనుభవం చాలా చిత్రమైనది. బాబా విషయంలో మనకు కించిత్తు అనుమానం కూడా అవసరం లేదని తెలియజేసిన అనుభవమిది. ఈమధ్య నాకు కాస్త చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వస్తుంటే, నుదుటన బాబా ఊదీ ధరించి ఆయన కృపతో ఆ సమస్యల నుండి స్వస్థత పొందుతున్నాను. అయితే నా వద్దనున్న ఊదీ అయిపోవచ్చింది. అప్పుడు నేను ఒకరోజు, "నేను ఇండియా నుంచి తెచ్చుకున్న ఊదీ అయిపోతోంది. నాకు ఏ సమస్య వచ్చినా ఈ ఊదీనే నా నుదుటన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఊదీ అయిపోతే నా పరిస్థితి ఏంటి?" అని బాధపడ్డాను. మరుక్షణం ఇన్‌స్టాగ్రామ్‌లో, "ఊదీతో తొందరలో ఆరోగ్య సమస్యలు అదృశ్యమైపోతాయి. నువ్వు తొందర్లోనే నా ఊదీని అందుకుంటావు" అని మెసేజ్ వచ్చింది. అది చూసి నేను, 'ఇండియాలో అయితే ఎలాగైనా ఊదీ వస్తుందని నమ్మవచ్చు. కానీ యు.ఎస్.ఏలో ఉన్న నాకు బాబా ఊదీ ఎలా పంపుతారు?' అని అనుమానపడ్డాను. అందుకని నేను ప్రతిరోజూ మా ఇంటి దైవమైన శ్రీసుబ్రహ్మణ్యస్వామిని నా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ, బాబాను కూడా "శ్రీసుబ్రహ్మణ్యస్వామి రూపంలో నన్ను అనుగ్రహించండి" అని కోరుకుంటుండేదాన్ని. 2022, జులై 26, ఆరోజు మాసశివరాత్రి. ఆరోజు నేను, మావారు ఆరోగ్యం కోసం ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకున్నాము. అప్పుడు, "పూజ బాగా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల పూజ బాగా జరిగింది. పూజ అంతా అయిపోయాక పూజ చేయడానికి వచ్చిన అయ్యగారు పళని శ్రీసుబ్రహ్మణ్యస్వామి విభూది నాకిచ్చి, దాన్ని ప్రతిరోజూ పెట్టుకోమని చెప్పారు. చూశారా బాబా లీలను! యు.ఎస్.ఏలో ఉన్న నా వద్దకు ఊదీ ఎలా వస్తుందని సందేహపడినందుకు, అలాగే మా ఇంటిదైవమైన శ్రీసుబ్రమణ్యస్వామిలా అనుగ్రహించమని అడిగినందుకు పళని శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి విభూదిని నాకు పంపారు బాబా. "సప్తసముద్రాలకు అవతల ఉన్నా నావారి కోసం నేను వస్తాను" అన్న బాబా మాట ఒట్టి మాట కాదు, అక్షర సత్యం. "బాబా! ఎలాంటి సందేహం పెట్టుకోవద్దని మీరు నాకు ఇచ్చిన అనుభవానికి ధన్యవాదాలు".
బాబా దయతో ఆరోగ్యం
సాయినాథ్ మహరాజ్ కీ జై!!! నేను సాయిభక్తురాలిని. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. బాబా దయవలన మా అనేక సమస్యలు తీరి మేము ఈ బ్లాగ్ ద్వారా మా అనుభవాలను తోటి భక్తులతో పంచుకుంటున్నాము. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీకు తెలియజేస్తూ ఆ సాయినాథునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈమధ్య మా చెల్లెలు, తన పిల్లలు అమెరికా నుండి వచ్చి కాశీయాత్రకి వెళ్లారు. వాళ్ళ యాత్ర చివరిలో దారిలో ఓ చోట ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అయి అందరూ కొంచెం కొంచం ఎఫెక్ట్ అయ్యారు. కానీ మా చెల్లి పరిస్థితి చాలా సీరియస్ అవడంతో తనని కాశీలోని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ మరుసటిరోజే వాళ్ళు ఫ్లైట్‍లో హైదరాబాదు రావాల్సి ఉంది. ఒకవేళ వాళ్ళు ఆరోజు ఫ్లైట్ ఎక్కకపోతే మళ్ళీ వారంరోజుల వరకు ఫ్లైట్ లేదు. అప్పుడు మా చెల్లి ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళు ఫ్లైట్ ఎక్కగలరా అనిపించింది. కానీ బాబా దయవలన తనకి తాత్కాలిక ఉపశమనం వచ్చి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ చేరుకున్నారు. వెంటనే అక్కడ ఒక హాస్పిటల్లో మా చెల్లి అడ్మిట్ అయింది. బాగా నీరసించిపోయిన తనని చూస్తే మాకు చాలా భయమేసింది. నేను సాయినాథుని వేడుకుని, "మీ దయతో తను కోలుకుంటే బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. ఆ తండ్రి దయవల్ల తను మూడు, నాలుగు రోజులలో కొద్దిగా కోలుకుని ఇంటికి వచ్చింది. మరికొన్ని రోజులలో తను ఆ గండం నుంచి పూర్తిగా కోలుకుంది. కాకపోతే, నెలరోజులవుతున్నా తను సరైన ఆహారం తీసుకోలేకపోతోంది. "బాబా! మీ దయవలన తను త్వరగా కోలుకోవాలి తండ్రీ".
ఈమధ్యకాలంలో పిల్లలకు, పెద్దలకు జ్వరాలు వస్తే చాలా భయంగా ఉంటోంది. మా చెల్లెలి ఐదేళ్ల వయసున్న మనవడికి టైఫాయిడ్ జ్వరమొచ్చి, వాడు బాగా నీరసపడిపోయాడు. నేను సాయినాథునికి మ్రొక్కుకుని మనవడికి ఊదీ పెట్టాను. బాబా దయవలన వాడు కోలుకున్నాడు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మీ నామస్మరణ చేసుకునేలా నన్ను అనుగ్రహించండి బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
నీ కుటుంబం గురించి ఆందోళన పడకు అంతా బాగుంటుంది అని సాయి తెలిపారు నాకు చాలా ఆనందం కలిగింది. ఎల్లప్పుడూ యిలాగే కాపాడాలి తండ్రి. నీ రుణం తీరనిది.తల్లి రుణం కూడా తీరనిది. ఓం సాయి బాబా నీకు శత సహస్ర నమస్కారాలు
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sairam
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete