1. అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా
2. బాబాకి చెప్పుకున్నాక ఏదైనా జరగకుండా ఉంటుందా!
3. ఈసీజీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా
ఈ బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. మా పాపకి ఇప్పుడు పది నెలల వయసు. తనకి పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లం ఉన్నందున ప్రతినెలా తన సాచురేషన్ లెవల్స్ చెక్ చేయడం, మూడు నెలలకొకసారి హార్ట్ డాక్టరుకి చూపించడం వంటివి చేయాల్సి ఉంది. అందులో భాగంగా మేము ఆరవ నెల చివరిలో హార్ట్ డాక్టరుని సంప్రదించినప్పుడు, "పాపకి 10వ నెలలో 90% ఆపరేషన్ ఉండొచ్చు. అప్పుడు తీసుకుని రండి" అని అన్నారు. నేను రోజూ బాబాకి దణ్ణం పెట్టుకుని, ఊదీ మంత్రం పఠించి పాపకి బాబా ఊదీ పెడుతుండేదాన్ని. ఒక్కో నెలకు పాప మంచిగా ఎదుగుతూ, హుషారుగా నవ్వుతూ, దోగాడుతూ నాకు చాలా అలవాటైపోయింది. ఎంతైనా నా కన్నబిడ్డ కదా! ఇంక పదో నెల వచ్చాక మా గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. అప్పుడే తల్లిప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది. చాలా అంటే చాలా టెన్షన్ అనుభవించాను. ఇక రేపు హాస్పిటల్‌కి వెళ్ళాలనగా ఆ ముందురోజైతే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఆ టెన్షన్‌లో నేను, "పాపకి అప్పుడే ఆపరేషన్ వద్దని డాక్టరు చెప్పాలి బాబా. హాస్పిటల్లో పని ఒక్క గంటలో అయిపోవాలి. సాచురేషన్ చెక్ చేసేటప్పుడు పాప ఎక్కువగా ఏడవకుండా చూడండి. అలాగే తన సాచురేషన్ 90% పైన ఉండేలా అనుగ్రహించండి బాబా. అలా జరిగితే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను.
హాస్పిటల్‌కి వెళ్లేరోజు రానే వచ్చింది. ఎందుకో, 'హాస్పిటల్‌కి వెళ్లడం ఆలస్యమైనా పర్లేదు, ముందు గుడికి వెళ్ళాల'నిపించి మా ఇంటికి దగ్గరలో ఉన్న గణేష్ మందిరానికి వెళ్ళాము. అద్భుతమేమిటంటే, అక్కడ ఒకపక్కగా బాబా విగ్రహం ఉంది. బాబాను చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడున్న ఒక పంతులుగారు నాకు, మా పాపకి, నా భర్తకి ఊదీ మరియు కుంకుమతో బొట్టు పెట్టారు. తరువాత మేము అక్కడినుండి హాస్పిటల్‌కి వెళ్ళాము. వెళుతూనే పాప ఏడవటం మొదలుపెట్టింది. 'ఏడిస్తే స్కానింగ్ తీయడానికి రాదు, ఇప్పుడెలా?' అనుకుంటుంటే, "పాపకి 9 నెలలు నిండాయి కాబట్టి, మత్తుమందు వంటి డ్రాప్స్ ఇద్దామ"ని చెప్పి 4ml మందు పాపకి ఇచ్చారు. ఒక అరగంటకి పాప నిద్రపోయింది. సాధారణంగా మత్తు డ్రాప్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అందరు పిల్లలకి ఇవ్వరు. కానీ బాబా దయతో ఆవిధంగా స్కానింగ్‌కి ఇబ్బంది లేకుండా కాపాడారు. ఇంక చక్కగా స్కానింగ్ పూర్తయింది. రెండు గంటల తరువాత పాప లేచి, బాగా నవ్వుతూ ఆడుకుంది. ఇదంతా బాబా దయ.
ఇకపోతే స్కానింగ్ రిపోర్టులు రావడానికి చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. అవి వచ్చాక డాక్టరు మమ్మల్ని తన గది లోపలికి పిలిచారు. నేను, నా భర్త వణుకుతూ డాక్టరు గదిలోకి వెళ్ళాము. ఏమంటారోనని ఒకటే టెన్షన్. అయితే బాబా అతిపెద్ద అద్భుతం చేశారు. నిజానికి హార్ట్ సమస్య ఉన్న పాప ఎనిమిది కేజీల బరువుంటేనే ఆపరేషన్ చేయాలి. అలాంటిది మా పాప ఐదు కేజీల బరువే ఉంది. అందువలన డాక్టరు, "పాపకి ఇప్పుడే ఆపరేషన్ అవసరం లేదు. సర్జరీ అత్యవసరం కాదు. ఇంకా కొంతకాలం ఆగవచ్చు. ప్రస్తుతం తనకు అంతా బాగానే ఉంది. రెండు నెలల తరవాత మళ్ళీ రండి" అని చెప్పి మందులు రాసిచ్చారు. అది విని నేను, నా భర్త ఎంత సంతోషపడ్డామో మాటల్లో చెప్పలేను. ఉదయం 9 గంటలకి వెళ్లిన మేము సాయంత్రం 4 గంటలకి ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ బాబా నేను కోరుకున్నట్లు అనుగ్రహించారు. "బాబా! మీకు కృతజ్ఞతలు చెప్పడం చాలా తక్కువేమో అనిపిస్తుంది. కానీ చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే నా బిడ్డని, నా కుటుంబాన్ని సదా కాపాడండి బాబా. దయచేసి ఆపరేషన్ అవసరం లేకుండా నా బిడ్డని జీవితాంతం కాపాడండి బాబా".
ఒకరోజు నా భర్త కంట్లో ఏదో పడి చాలా ఇబ్బందిపడ్డారు. ఒక రోజు గడిచినా నొప్పి, కంటి నుండి నీరు కారడం తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! నా భర్త కన్ను బాగైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తర్వాత నా భర్త హాస్పిటల్‌కి వెళ్తే, డాక్టరు ఐ-డ్రాప్స్ ఇచ్చారు. ఆ డ్రాప్స్ వేసుకున్నాక నా భర్త కన్ను నుండి పసుపురంగులో ఏదో పస బయటికి వచ్చి కన్ను బాగైంది. "అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఐ లవ్ యు బాబా. ఏదైనా మర్చిపోయివుంటే క్షమించండి బాబా".
ఓం సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!
బాబాకి చెప్పుకున్నాక ఏదైనా జరగకుండా ఉంటుందా!
ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు, తోటి సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. బాబా నాకు అనుగ్రహించిన అనుభవాలను నేనిప్పుడు నా తోటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రతి సంవత్సరం రాఖీపౌర్ణమినాడు వేరే ఊరిలో ఉన్న మా అన్నయ్యలకి రాఖీలు పంపిస్తుంటాను. అలాగే ఈ సంవత్సరం కూడా పంపించాను. కానీ అవి సమయానికి వెళ్తాయో, లేదో అని భయపడి, "బాబా! రాఖీలు అన్నయ్యలకు సమయానికి చేరేలా చూడండి" అని బాబాకి చెప్పుకున్నాను. ఇంక ఆయనకి చెప్పుకున్నాక ఏదైనా జరగకుండా ఉంటుందా! రాఖీలు సమయానికి వెళ్ళాయి. నేను చాలా సంతోషించాను. అలానే ఇంకో అన్నయ్యకి ఈ సంవత్సరం రాఖీ కడతానో, లేదో అని భయపడ్డాను. ఎందుకంటే, ఇంట్లో కొంచెం గొడవలు ఉన్నాయి. కానీ బాబా దయవల్ల అన్నయ్యకి రాఖీ కట్టగలిగాను.
నేను డిగ్రీ చదువుతున్నాను. పరీక్షలు వ్రాయడానికి హాల్ టికెట్ తీసుకుందామంటే ఫీజు కట్టాలి. కానీ నాకు రావలసిన స్కాలర్‌షిప్ డబ్బులు రాలేదు. ఆ సమయంలో ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందుచేత నేను ఫీజు తరువాత కడతానని చెప్పాలనుకున్నాను. కానీ కాలేజీవాళ్ళు హాల్ టికెట్ ఇస్తారో, లేదో అని భయపడి నా సమస్య గురించి బాబాకి చెప్పుకుని కాలేజీకి వెళ్ళాను. వాళ్ళు ఫీజు అడిగితే, తరువాత కడతానని చెప్పాను. బాబా దయవల్ల వాళ్ళు నన్ను ఇబ్బందిపెట్టకుండా హాల్ టికెట్ ఇచ్చారు. "థాంక్యూ సో మచ్ బాబా".
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!
ఈసీజీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
ఎందరో బాబా బిడ్డలలో నేనూ ఒకదాన్ని. నా పేరు ఇందిర. ప్రస్తుతం మేము ఇండియాలో ఉన్నాము. నిజానికి మేము దుబాయిలో ఉంటాము. అక్కడ ఉన్నప్పుడే నాకు గ్యాస్ ప్రాబ్లం మొదలైంది. 'pan D' టాబ్లెట్ వేసుకున్నా ఆ గ్యాస్ సమస్య నుండి ఉపశమనం లభించకపోవడంతో హాస్పిటల్‌కి వెళ్లాను. డాక్టరు, "బీపీ చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి ఈసీజీ తీయించండి" అని అన్నారు. కానీ నాకు భయమేసి ఈసీజీ చేయించుకోకుండానే ఇంటికి వచ్చేశాను. తరువాత బీపీ మెషీన్ తీసుకుని బీపీ చెక్ చేసుకుంటే ఒక్కోసారి ఒక్కోలా చూపిస్తుండేది. అస్సలు కంట్రోల్ అయ్యేది కాదు. పైగా గ్యాస్ సమస్య ఎక్కువై ఒక రాత్రి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించింది. దాంతో నేను హాస్పిటల్‌కి వెళ్లి ఈసీజీ చేయించుకుందామనుకుని బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! బీపీ వల్ల నా గుండెకి ఎటువంటి తేడా రాకుండా మీరు చూడాలి. నాకు ఏ సమస్య లేనట్లయితే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాన"ని వేడుకున్నాను. బాబా దయవల్ల ఈసీజీ రిపోర్టు నార్మల్ వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ నా బీపీ అలానే ఉంది. "బాబా! ఎప్పుడూ లేనిది బీపీ ఇలా ఎందుకు పెరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. దుబాయ్ వెళ్లే లోపల మందులు వాడకుండానే బీపీ కంట్రోల్ అయ్యేలా చూడు బాబా. ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను. దయచేసి నన్ను రక్షించండి బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Bless supraja for her neck pain and shoulder pain .decrher health problems Jaisairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me