సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 699వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. సాయినాథుడు నమ్ముకున్నవారిని ఎల్లప్పుడూ చల్లగా చూస్తారు
  2. మరచిపోయినా గుర్తుచేసి నైవేద్యం పెట్టించుకున్న బాబా

సాయినాథుడు నమ్ముకున్నవారిని ఎల్లప్పుడూ చల్లగా చూస్తారు


దుబాయ్ నుండి పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


సాయిబంధువులకు నా నమస్కారం. మేము దుబాయిలో ఉంటున్నాము. నా చిన్నప్పటినుండి నేను బాబాకు భక్తురాలిని. బాబా ఎల్లప్పుడూ తండ్రిలా నన్ను ఆదుకుంటూనే ఉన్నారు. అలాంటి ఎన్నో అనుభవాలలో ఒకదానిని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 


ఇటీవలి కాలంలో కరోనా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎంతో భయాందోళనలకు గురిచేసింది. ఆ కరోనా భయం నుండి బయటపడినవారిలో మేము కూడా ఉన్నాము. 2020, మే నెలలో మావారికి ఒళ్ళునొప్పులతో పాటు కొద్దిగా జ్వరం కూడా వచ్చింది. ఆయనకి జ్వరం వచ్చిన మరుసటిరోజు మా అమ్మకి కూడా అచ్చం మావారికి వచ్చినట్లుగానే జ్వరం వచ్చింది. ఆ తరువాత నాకు కూడా జ్వరం వచ్చింది. ఇలా మా ముగ్గురికీ ఒకే లక్షణాలతో జ్వరం వచ్చింది. బాబా దయవల్ల మా బాబు ఒక్కడూ ఈ బాధనుండి తప్పించుకున్నాడు. రెండు మూడు రోజుల తరువాత మేము ముగ్గురం నార్మల్ అయ్యాము. కానీ మేమంతా రుచి, వాసన కోల్పోయాము. ఆ లక్షణాలను చూసి మాకు చాలా భయమేసింది. దాంతో ముందుగా మావారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవటానికి వెళ్ళారు. మా ప్రక్కింటివాళ్ళు మాతో చాలా సన్నిహితంగా ఉండటం వల్ల వాళ్ళు కూడా మాలాగే ఇబ్బందిపడ్డారు. మేమంతా మావారి టెస్ట్ రిజల్ట్ ఏమి వస్తుందా అని ఎదురుచూడసాగాము. మూడు రోజులైనా తన టెస్ట్ రిపోర్టు రాకపోయేటప్పటికి తనకి కోవిడ్ నెగిటివ్ అయివుంటుందని మేమంతా రిలాక్స్ అయిపోయాము. ఉన్నట్టుండి ఒకరోజు మావారికి కోవిడ్ పాజిటివ్ అని టెస్టింగ్ సెంటర్ నుండి కాల్ వచ్చింది. ఆ వార్త విని ఏం చేయాలో, ఎలా ప్రతిస్పందించాలో తెలియని గందరగోళంలో పడ్డాము మేము. మా మూలంగా మా ప్రక్కింటివాళ్ళు కూడా ఇబ్బందిపడుతున్నారని చాలా బాధపడ్డాము. నేను బాబాను స్మరించుకుని, “బాబా! తొందరగా ఈ విపత్తు నుండి మమ్మల్ని బయటపడెయ్యి తండ్రీ. ఇండియా వచ్చాక మా కుటుంబమంతా కలిసి నీ దర్శనానికి శిరిడీ వస్తాము” అని మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు నేను, మా పిల్లలు, ఇంకా మా ప్రక్కింటివాళ్ళు అందరం కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాము. నేను, పిల్లలు టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చి ఇంటికి వచ్చాక మావారు నాతో, “నన్ను క్వారంటైన్ సెంటరుకి తీసుకెళ్తామని కాల్ చేశారు” అని చెప్పారు. నేను, మావారు ఆరోజు ఎంతగా ఏడ్చామో! ‘నిజంగా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఇంక ఎప్పుడూ రాకూడదు, ఒక్కసారి అన్నీ మారిపోతే బాగుండు’ అనుకుంటూ ఎంతో ఏడ్చాము. నేను, పిల్లలు ఎలా ఉంటామోనని ఆయన ఎంతగానో బాధపడ్డారు. కాసేపటికి క్వారంటైన్ సెంటర్ వాళ్ళు వచ్చి మావారిని తమతో తీసుకెళ్ళారు. ‘మావారికి అక్కడ ఎలా ఉంటుందో’ అని నేను ఎంతో దిగులుపడుతూ ఉన్నాను. ఒక రెండు గంటలు గడిచాక మావారు నాకు ఫోన్ చేసి, “క్వారంటైన్ సెంటర్లో బెడ్స్ ఖాళీ లేవట, నన్ను ఇంటికి తిరిగి తీసుకొస్తున్నారు” అని చెప్పారు. ఆ మాట విని పట్టలేని ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నా బాబా మాతోనే ఉన్నారు, ఉంటారు. మనందరికీ ఇదే పెద్ద అనుభవం. తరువాత మావారు ఇంటికి వచ్చి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. తరువాత మావి, మా ప్రక్కింటివాళ్ళవి టెస్ట్ రిపోర్టులు వచ్చాయి. నాకు, పిల్లలకి నెగిటివ్ వచ్చింది. మా ప్రక్కింటివాళ్ళలో కూడా ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మిగతా అందరికీ నెగిటివ్ వచ్చింది. కానీ, పాజిటివ్ వచ్చినాయనకి డయాబెటిస్ ఉండటం వల్ల మేము కాస్త భయపడ్డాము. కానీ బాబా అనుగ్రహంతో మావారికి, ఆయనకి కూడా ఒక నెలరోజుల్లో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఎంతో సంతోషంతో అందరం బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. 


సాయినాథుడు మమ్మల్ని ఇంతటి విపత్తు నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా ఇప్పుడు నేను, మా ప్రక్కింటావిడ ప్రతి పౌర్ణమికి ఒక్కొక్కరి ఇంట్లో బాబా వ్రతం చేసుకుంటున్నాము. సాయినాథుడు తనను నమ్ముకున్నవారిని ఎల్లప్పుడూ చల్లగా చూస్తారు. అనుక్షణం బాబాను స్మరిస్తే ఆయన మనతోనే ఉంటారు.


ప్రస్తుతం నేను గత 3 నెలలుగా కాలినొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ సలహా మేరకు ఎక్స్-రే తీయించుకుంటే అందులో అంతా నార్మల్‌గా ఉంది. కానీ కాలినొప్పి ఏమాత్రం తగ్గకపోయేసరికి MRI స్కాన్ చేయించుకోమని డాక్టర్ సూచించారు. నేను ఆ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలి. ఆ టెస్ట్ చేసే సమయంలో నా బాబా నాకు తోడుగా ఉండి అంతా మంచిగా ఉండేలా చూసుకుంటారని ఆశిస్తున్నాను. బాబా అనుగ్రహంతో అంతా బాగున్నాక ఆ అనుభవాన్ని కూడా మీతో పంచుకుంటాను. “తెలిసీ తెలియక ఏమైనా తప్పులు చేస్తే నన్ను మన్నించు బాబా!”


మరచిపోయినా గుర్తుచేసి నైవేద్యం పెట్టించుకున్న బాబా

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

శిరిడీవాసా సాయిప్రభో – జగతికి మూలం నీవె ప్రభో

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను నా గత అనుభవంలో బాబా నాకు స్వప్నంలో కనిపించి, తనకు రొట్టెలు కావాలని అడిగారని చెప్పాను. ఆ అనుభవాన్నే నేనిప్పుడు పంచుకోబోతున్నాను. సుమారు 5 సంవత్సరాల క్రితం జరిగిన అనుభవం ఇది. నేను అప్పుడప్పుడే సాయి సచ్చరిత్ర పారాయణ చేయటం, మా ఇంటికి దగ్గరలో ఉండే సాయిబాబా మందిరానికి వెళ్ళటం ప్రారంభించిన రోజులవి. ఒకరోజు నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను రొట్టెలు చేస్తున్నాను. అలాగే నాకు బాగా పరిచయస్థురాలైన ఒకామె కూడా రొట్టెలు చేస్తోంది. ఇంతలో అచ్చం బాబాలాగే జోలె ధరించిన ఒకాయన నా దగ్గరకు వచ్చి,నాకు రొట్టెలు ఇవ్వు!” అని అన్నారు. అందుకు నేను, “నా రొట్టెలు చిరిగిపోతున్నాయి. (నాతో పాటు రొట్టెలు చేస్తున్న ఆమెను చూపుతూ) ఆమెను అడిగి ఇప్పించుకో!” అన్నాను. అప్పుడాయన, “నాకు ఆమె రొట్టెలు వద్దు, నీ రొట్టెలే కావాలి. చిరిగిపోయిన రొట్టెలు మీ పనిపాపకు ఇవ్వు. నాకు మంచి రొట్టెలు ఇవ్వు” అన్నారు. అంతటితో నా కల ముగిసింది. తరువాత నేను నాకు బాగా తెలిసిన ఒక సాయిభక్తురాలికి ఫోన్ చేసి, నా కల విషయం చెప్పి, దాని అంతరార్థమేమిటని అడిగాను. అప్పుడు ఆమె, “నీవు ఎంత అదృష్టవంతురాలివి! బాబా స్వయంగా వచ్చి నిన్ను రొట్టెలు అడుగుతున్నారు” అన్నది. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, నేను బాబాకు రొట్టెలు, వంకాయ కూర నైవేద్యంగా సమర్పించుకుంటానని మ్రొక్కుకున్న సంగతి. తరువాత నేను రొట్టెలు, వంకాయ కూర చేసి ఎంతో సంతోషంగా బాబాకు నైవేద్యం సమర్పించుకున్నాను. నా మ్రొక్కు సంగతి నేను మరచిపోయినా బాబానే స్వయంగా నాకు గుర్తుచేసి నాతో నైవేద్యం పెట్టించుకున్నారు. “ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడు బాబా!”.


సాయిభక్తుల అనుభవమాలిక 698వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా దయవల్ల కష్టాలు తీరాయి
  2. కరోనా నుంచి రక్షించడమే కాదు, తమకు అంకిత భక్తునిగా మలుచుకున్న బాబా

బాబా దయవల్ల కష్టాలు తీరాయి


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


సాయిబంధువులకు నమస్కారం. నేను గత రెండు సంవత్సరాల నుండి నా అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుందామని అనుకుంటున్నాను. కానీ ఎలా పంపాలో తెలియక పంపలేదు. ఇప్పుడు ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయి సహాయంతో బాబా ప్రసాదించిన అనుభవాన్ని అందరికీ పంచగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది.


2020, ఫిబ్రవరి నెలలో మావారికి క్రొత్త కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దాంతో మావారు తాను పనిచేస్తున్న కంపెనీలో నోటీస్ పీరియడ్ కూడా ఇచ్చేశారు. మార్చి 17వ తేదీన క్రొత్త కంపెనీలో జాయిన్ కావాల్సి ఉంది. క్రొత్త కంపెనీలో చేరేముందు బాబాను దర్శించుకోవాలని మార్చి 15వ తేదీన మేము శిరిడీ వెళ్ళాము. కనులారా బాబాను దర్శించుకుని ఇంటికి తిరిగి వచ్చాక క్రొత్త కంపెనీలో జాయినింగ్ డేట్‌కి on-board అవుదామంటే, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ క్లియర్ అవలేదని చెప్పి మరో వారం రోజులు వెయిట్ చేయమన్నారు కంపెనీవాళ్ళు. ఈలోపు మార్చి 22వ తేదీన దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. ఆరోజు నుండి ఇప్పటివరకు క్రొత్త కంపెనీ మావారిని సంప్రదించలేదు. మాకు చిన్న బాబు కూడా ఉన్నాడు. దాదాపు ఒక సంవత్సరం నుండి మావారికి ఆదాయం లేదు. దాంతో, అప్పటివరకు ఎంతో ఆనందంగా సాగుతున్న మా జీవితాలు ఒక్కసారిగా ఎంతో సంఘర్షణకు లోనయ్యాయి. రెండు నెలల క్రితం నేను బాబాకు నమస్కరించుకుని, “మీ అనుగ్రహంతో మావారికి ఉద్యోగం వస్తే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో ఇటీవలే మావారికి ఎయిర్‌పోర్టులో ఉద్యోగం వచ్చింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా దయవలన మేమిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. బాబాకు మాట ఇచ్చినట్లు నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. పూర్వజన్మ కర్మల వలన మేము కొన్ని కష్టాలను అనుభవించాము. కేవలం బాబా దయవల్లనే మా కష్టాలు తీరాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.


కరోనా నుంచి రక్షించడమే కాదు, తమకు అంకిత భక్తునిగా మలుచుకున్న బాబా

యు.ఎస్.ఏ నుంచి పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను శిరిడీసాయి భక్తుడిని. నేనిప్పుడు పంచుకోబోయే అనుభవం 2020, జులై నెలలో జరిగింది. మా నాన్నగారు ఆఫీసర్ క్యాడర్లో ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ ఆఫీసులో చాలామంది వైరల్ ఫీవర్‌తో బాధపడ్డారు. మా నాన్నగారు కూడా వైరల్ ఫీవర్‌తో బాధపడ్డారు. మొదట్లో మేము అది మామూలు జ్వరం, జలుబు అనుకున్నాము. కానీ డాక్టర్ నాన్నగారిని ఆర్.సి-పి.టి.ఆర్ పరీక్ష చేయించుకోమన్నారు. రిపోర్టులో నాన్నకి స్వల్పంగా కరోనా ఎఫెక్ట్ అయిందని వచ్చింది. కానీ కేవలం ఆ టెస్ట్ మీద ఆధారపడలేమని, స్వాబ్ టెస్ట్ కూడా చేయాలని చెప్పారు. దాంతో యు.ఎస్.ఏ లో ఉంటున్న నేను ఆందోళనతో ఆ రాత్రంతా సచ్చరిత్ర చదువుతూ, “సానుకూల ఫలితాన్ని ఇవ్వమ”ని బాబాను ప్రార్థించాను. రెండురోజులు గడిచాయి. ఆ టెస్టు రిజల్ట్ ఖచ్చితంగా నెగిటివ్ వస్తుందని, అంటే నాన్నకి కరోనా లేదని వస్తుందని నేను ఆశించాను. కానీ బాబా నన్ను పరీక్షించదలచారు. రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. ఆ విషయం తెలిసి నేను నిర్ఘాంతపోయాను. బాబాను పూర్తిగా నమ్మినప్పటికీ ఎందుకిలా జరిగిందని నేను చాలా బాధపడ్డాను. అయితే, నాన్న కోలుకుంటారని, బాబా మా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని నాకు తెలుసు. అందువలన నేను ఆశ వదులుకోకుండా పారాయణ మొదలుపెట్టాను. అంతేగాక, ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకి బాబా ఆరతి వింటూ ఆయనను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాన్న షుగర్ పేషెంట్. షుగర్ వ్యాధిగ్రస్థులపై కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్న వార్త నన్ను మరింత ఆందోళనకు గురిచేసింది. సరిగ్గా అప్పుడే రాత్రంతా నిద్రపట్టక నాన్న చాలా ఇబ్బందిపడ్డారని మా చెల్లి ద్వారా తెలిసి నేను బాబా నుండి ఏదైనా భరోసా పొందాలనుకుని క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్లో నాన్న ఆరోగ్యం గురించి బాబాను అడిగాను. “నాలుగురోజుల్లో రోగి కోలుకోవడం ప్రారంభిస్తాడు” అని బాబా సమాధానం వచ్చింది. నాకు బాబాపై పూర్తి విశ్వాసముంది, కాబట్టి సహనంతో వేచి చూశాను. సరిగ్గా నాలుగవరోజు నాన్న ఆరోగ్యంలో మెరుగుదలను మేము గుర్తించాము. ఆయన కోలుకోవడం ప్రారంభించారు. అప్పుడు నేను యథాలాపంగా శిరిడీసాయి వెబ్‌సైట్  ఓపెన్ చేసి చూస్తే, “మూడు గురువారాలు పొగాకు మరియు నూనె దానం చేయమ”ని వచ్చింది. నేను మొదటి గురువారం సిగరెట్, నూనె బాబాకు సమర్పించి పూజ పూర్తిచేశాను. మరుక్షణం నా ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, చిలిం నోటిలో పెట్టుకుని ఉన్న బాబా ఫోటో చూసి ఆశ్చర్యపోయాను. బాబా అనుగ్రహంతో కేవలం పది రోజుల్లో నాన్న పూర్తిగా కోలుకున్నారు. నా ఆనందానికి అవధులు లేవు. నాన్న పూర్తిగా కోలుకున్న తరువాత నేను బాబాని, “నాన్నని మీ భక్తునిగా చేసుకుని సంరక్షించండి” అని ప్రార్థించాను. నేను ఆశ్చర్యపోయేలా బాబా నాన్నకి తన ఆఫీసు గోడమీద శివుడితోపాటు దర్శనమిచ్చారు. ఇక అప్పటినుంచి మా అమ్మానాన్నలు రోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి శిరిడీ ప్రత్యక్షప్రసారంలో కాకడ ఆరతి చూస్తున్నారు. అంతలా వాళ్ళు బాబాకు అంకిత భక్తులయ్యారు. నేను ప్రతి ఒక్కరికీ చెప్పాలనుకునేది ఒక్కటే, ‘బాబాను నమ్మండి, మన ప్రార్థనకు సమాధానం వచ్చేవరకు సహనంతో వేచి ఉండండి’. “థాంక్యూ, థాంక్యూ సో మచ్ బాబా!”

ఓం సాయిరాం!



సాయిభక్తుల అనుభవమాలిక 697వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నేను ఎప్పుడూ నీ వెంటే ఉన్నాను
  2. బాబా ఊదీతో తెల్లవారేసరికి 80% తగ్గిన చేతినొప్పి


నేను ఎప్పుడూ నీ వెంటే ఉన్నాను

సాయిభక్తురాలు శ్రీమతి అంజలి తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:

బాబా భక్తకోటి అందరికీ నా నమస్కారం. నా పేరు అంజలి. ఇటీవల నాకు జరిగిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను విద్యుత్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రతినెలా మొదటివారంలో నేను నా ల్యాప్‌టాప్‌లో మా కార్యాలయానికి సంబంధించిన రీడింగులు తీయాలి. ఆ పనిమీద నేను ఇంతకుముందు పనిచేసిన సబ్‌స్టేషన్‌కి వెళ్ళాను. అక్కడ కొన్ని మీటర్ల రీడింగ్ రాలేదు. నేను సహాయం కోసం బాబాను తలచుకుంటే, 'అవి వస్తాయ'ని చెబుతున్నట్లు నా మనసుకి అనిపించింది. కానీ ఎంత ప్రయత్నించినా రాలేదు. ఇంక నేను తిరిగి వెళ్ళిపోయాను. తరువాత గురువారంనాడు నేను బాబా వ్రతం చేసుకొని ఆఫీసుకి వెళ్ళాను. రీడింగులు తీయడానికి వేరే వాళ్ళ ల్యాప్‌టాప్‌ తెప్పించారు. కానీ ఆ ల్యాప్‌టాప్‌లో కూడా చాలాసేపు రీడింగులు రాలేదు. ఇంక ల్యాప్‌టాప్‌ క్లోజ్ చేద్దామనుకునే సమయంలో వేరే మేడం ఫోన్ చేసి, "వేరే పద్ధతిలో ఒకసారి ప్రయత్నించి చూడండి" అని చెప్పారు. బాబానే ఆమెతో చెప్పించారేమో! ఆ పద్ధతిలో ప్రయత్నిస్తే వెంటనే రీడింగులు వచ్చాయి. సరేనని నా వద్దనున్న ల్యాప్‌టాప్‌లో కూడా ప్రయత్నిస్తే, అందులో కూడా వచ్చాయి. బాబా మాట అబద్ధమెలా అవుతుంది? కొంచెం ఆలస్యమైంది అంతే!


మరో అనుభవం:


గత నెలలో (2021, జనవరి) మావారి వస్తువు ఒకటి కనపడకుండా పోయింది. అది మా అమ్మావాళ్ళింట్లో ఎక్కడో మిస్ అయ్యింది. దానికోసం చాలా వెతికాం కానీ, కనపడలేదు. దాంతో నేను బాబానే శరణువేడి, "ఎలాగైనా ఆ వస్తువు దొరికేలా చేయి తండ్రీ" అని ప్రార్థించాను. తరువాత మా అమ్మ ఇల్లంతా వెతికింది, అయినా కనపడలేదు. అది జరిగి చాలారోజులు గడిచాక ఫిబ్రవరి 4, గురువారంనాడు మా అమ్మ ఫోన్ చేసి, "వస్తువు దొరికింద"ని చెప్పింది. అమ్మ మాట విని చాలా సంతోషించాను. ఎందుకంటే, బాబాను వేడుకున్నా వస్తువు దొరక్కపోయేసరికి నేను, 'ఏంటి, బాబా నన్ను సరిగా పట్టించుకోవటంలేదా?' అని కొంచెం బాధపడ్డాను. కానీ, 'నేను ఎప్పుడూ నీ వెంటే వున్నాను' అని నిరూపించారు నా సాయితండ్రి. "థాంక్యూ సో మచ్ బాబా". మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.


సబ్ కా మాలిక్ ఏక్ హై!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా ఊదీతో తెల్లవారేసరికి 80% తగ్గిన చేతినొప్పి

 

అమెరికా నుండి సాయిభక్తురాలు శ్రీమతి సౌజన్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు సౌజన్య. మేము అమెరికాలో నివసిస్తున్నాము. నా చిన్నతనంనుండి నాకు బాబా అంటే చాలా ఇష్టం. నా సాయితండ్రి నన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నారు. ఇప్పటివరకు బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలో కొన్నిటిని ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటాను. 


చాలారోజుల తర్వాత ఈమధ్య మావారు క్రికెట్ ఆడటానికి వెళ్ళారు. అక్కడ అనుకోకుండా తన చేతికి గాయం అయింది. రాత్రయ్యేసరికి ఆ గాయం మరింత ఎక్కువై విపరీతమైన నొప్పితో బాధపడ్డారు. కనీసం ఆ చేతిని పైకి లేపలేకపోయారు. ఆ రాత్రికి హాస్పిటల్‌కి వెళ్ళలేక, మరుసటి ఉదయం అర్జెంట్ కేర్‌కి వెళ్తానన్నారు. (అమెరికాలో అనుకున్నంత త్వరగా హాస్పిటల్‌కి వెళ్ళలేము.) పైగా నాకు కారు డ్రైవింగ్ రాదు. మావారిని నేను కనీసం హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్ళలేను. కరోనా సమయం కాబట్టి ఎవరినీ సహాయం అడగలేము. అందువలన నేను బాబాకు నమస్కరించి, మావారు పడుతున్న బాధను వివరించి, “ప్లీజ్ బాబా! మావారి నొప్పిని తగ్గించండి. తెల్లవారేసరికి తన నొప్పి తగ్గితే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. తరువాత కొద్దిగా బాబా ఊదీని నీళ్ళలో కలిపి మావారికి ఇచ్చి, కొంచెం ఊదీని ఆ గాయం పైన రాశాను. నా సాయితండ్రి నా బాధను అర్థం చేసుకున్నారు. తెల్లవారేసరికి మావారి చేతినొప్పి 80% తగ్గింది. అది కేవలం నా బాబా అనుగ్రహమే. ఏమని చెప్పను నా సంతోషాన్ని? నా బాబాపై ఇష్టం, ప్రేమ ఇంకా బలపడ్డాయి. ”లవ్ యు బాబా! థాంక్యూ సో మచ్ బాబా. నీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే”. 




సాయిభక్తుల అనుభవమాలిక 696వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబాకి చెప్పుకుంటే అన్నీ నెరవేరుతాయి
  2. బాబా ఊదీతో బుగ్గ మీద మచ్చ మాయం

బాబాకి చెప్పుకుంటే అన్నీ నెరవేరుతాయి


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


సాయిభక్తులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. ప్రతిరోజూ సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను.


ఒకసారి మేము ఇల్లు మారేటప్పుడు సామాన్లు సర్దడంలో నేను చేస్తున్న బిజినెస్‌కు సంబంధించిన కొన్ని పత్రాలను ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఒకరోజు కస్టమర్ కాల్ చేసి బిల్స్ అడిగినప్పుడు అవి ఎక్కడ పెట్టానో నాకు గుర్తురాలేదు. వాటికోసం ఇల్లంతా వెతికినా అవి కనపడలేదు. తరువాత నేను బాబాను తలుచుకొని, “బాబా! నాకు కావలసిన పత్రాలు కనపడితే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని మాట ఇచ్చాను. కాసేపటి తర్వాత బాబా దయవల్ల ఆ పత్రాలను ఎక్కడ పెట్టానో గుర్తుకు వచ్చి ఆ చోట వెతికితే ఆ బిల్స్ అన్నీ కనిపించాయి. “చాలా చాలా ధన్యవాదములు బాబా!”


మరొకసారి మా బాబు తన ప్యాంటు జేబులో డబ్బులు ఉన్నాయన్న విషయం మర్చిపోయి తన బట్టలను ఉతకడానికి వేశాడు. తర్వాత మాటల సందర్భంలో ఆ విషయం నాకు చెప్పాడు. నేను వెళ్ళి అక్కడున్న బట్టలన్నీ వెతికి చూశాను, డబ్బులు కనిపించలేదు. మా పనిమనిషిని కూడా అడిగాను, తనేమైనా చూసిందేమోనని. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! పనిమనిషే గనక ఆ డబ్బులు తీసివుంటే తనే మాకు ఆ డబ్బులు ఇచ్చేలా చేయండి. మీ అనుగ్రహంతో మా డబ్బులు మాకు వస్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబాకు చెప్పుకున్న వెంటనే మా పనిమనిషి తన ఇంటికి వెళ్లి ఆ డబ్బు తీసుకొచ్చి మాకు ఇచ్చేసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తన సంకల్పంతో ఆమె మనసు మార్చి మా డబ్బులు మాకు ఇచ్చేలా చేసిన సాయి లీలకు మేము ఎంతో ఆనందించాము. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా!”


ఇంకొకసారి మా అమ్మ తన చెవికమ్మలు ఎక్కడో పెట్టి మర్చిపోయింది. వాటికోసం ఇల్లంతా వెతికింది, కానీ అవి ఎక్కడా కనబడలేదు. చెవికమ్మలు కనిపించనందుకు అమ్మ దిగులుపడుతుంటే చూసి నేను బాబాను స్మరించుకుని, “బాబా! మా అమ్మ చెవికమ్మలు కనబడితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. మరుసటిరోజు సాయంత్రం మా అమ్మ మళ్లీ వెతుకుతున్నప్పుడు ఆ చెవికమ్మలు కనిపించాయి. అమ్మ చాలా చాలా సంతోషపడింది. “థాంక్యూ బాబా!”


“నా అనుభవాలను కాస్త ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించు బాబా! ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడు తండ్రీ!”


బాబా ఊదీతో బుగ్గ మీద మచ్చ మాయం


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిరాం! సాయిభక్తులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా వందనం. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచీ మేము సాయిబాబాను నమ్ముకొనివున్నాము. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకటిన్నర సంవత్సరాల వయసున్న మా బాబుకి ఇటీవల బుగ్గ మీద నల్లని మచ్చలాగా వచ్చింది. అది గమనించిన నేను దానివల్ల బాబుకేమైనా అవుతుందేమోనని భయపడి, బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీ అనుగ్రహంతో బాబు బుగ్గ మీద ఉన్న నల్లమచ్చ తగ్గిపోతే నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. బాబాను ప్రార్థించిన తరువాత బాబు బుగ్గమీద ఉదయం, సాయంత్రం బాబా ఊదీని రాశాను. బాబా అనుగ్రహంతో రెండు రోజుల్లో ఆ నల్లమచ్చ తగ్గిపోయింది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”




కృష్ణాబాయి ప్రభాకర్



శ్రీమతి కృష్ణాబాయి ప్రభాకర్ అనే భక్తురాలు మొదటిసారి బాబాను దర్శించుకున్నప్పుడు, బాబా ఆమెకు ఒక నాలుగణాల నాణేన్ని ప్రసాదించారు. బాబా అమృతహస్తాల ద్వారా లభించిన ఆ నాణేన్ని ఆమె ఎంతో విలువైనదిగా భావించి, జాగ్రత్తగా భద్రపరుచుకొని ప్రతిరోజూ పూజిస్తుండేది. ఒకరోజు తన ఇంటి వద్దకు కొబ్బరికాయలు అమ్మే ఒక మహిళ వచ్చింది. ఆమె వద్ద కొబ్బరికాయ తీసుకున్న కృష్ణాబాయి ఇతర నాణేలతోపాటు పొరపాటున బాబా ఇచ్చిన నాలుగణాల నాణేన్ని కూడా ఆమెకు ఇచ్చేసింది. తరువాత కృష్ణాబాయి తన రోజువారీ ఇంటిపనులు పూర్తి చేసుకున్న తరువాత జరిగిన పొరపాటును గుర్తించి తన మూర్ఖత్వానికి ఎంతగానో బాధపడింది. ఆరోజు సాయంత్రం ఎవరో ఆమె ఇంటి తలుపు తట్టారు. కృష్ణాబాయి గుండెల నిండా బాధతో వెళ్లి తలుపు తీసి ఎదురుగా ఉన్న కొబ్బరికాయలు అమ్మే మహిళను చూసి ఆశ్చర్యపోయింది. ఎందుచేతనో తెలియదుగానీ ఆ మహిళ ఉదయం కృష్ణాబాయి ఇచ్చిన నాలుగణాల నాణేన్ని తిరిగిచ్చి, అందుకు బదులుగా వేరే నాణేన్ని అడిగి తీసుకొని వెళ్ళిపోయింది. జరిగిన సంఘటనతో కృష్ణాబాయి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తనపై చూపిన కరుణకు బాబాకు మనసారా కృతజ్ఞతలు అర్పించుకుంది.

సోర్సు: అంబ్రోసియా ఇన్ శిరిడీ బై విన్ని చిట్లూరి.

సాయిభక్తుల అనుభవమాలిక 695వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. చక్కని స్నేహితులను ఇచ్చిన బాబా
  2. మన మేలుకోసమే ఏదైనా చేస్తారు బాబా

చక్కని స్నేహితులను ఇచ్చిన బాబా


బెంగళూరు నుండి ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ నేను ఎంతో ఋణపడివున్నాను. మీకు చాలా ధన్యవాదాలు. మేము ఒక సంవత్సరం క్రితం మా అబ్బాయి స్కూలుకి దగ్గరగా ఉండేలా ఇల్లు చూసుకుని అక్కడికి మారాము. బాబా దయవల్ల అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ మా అబ్బాయికి పరిచయమైన కొత్త స్నేహితులు మా అబ్బాయిని ఊరికే ఏడిపించేవారు. వాడికి స్నేహితులతో ఆడుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. ప్రతిరోజూ ఆడుకోవడానికి వెళ్ళి కాసేపట్లోనే ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేవాడు. “ఈ విషయం అంతగా పట్టించుకోకు, వదిలెయ్యి, నువ్వు ఏడవకు” అని వాడికి ఎంత నచ్చజెప్పినప్పటికీ, 8 సంవత్సరాల అబ్బాయి కదా, అంతగా అర్థమయ్యేది కాదు. పాపం, ఊరికే ఏడ్చేసేవాడు. ఒకసారి మా అబ్బాయిని రోజూ ఏడిపించే అబ్బాయి 15 రోజులు ఊరికి వెళ్ళాడు. ఆ సమయంలో మా అబ్బాయి చాలా సంతోషంగా ఆడుకుని ఇంటకి వచ్చేవాడు. వాడి ముఖంలో సంతోషాన్ని చూసిన నేను, “సాయీ! మా అబ్బాయి ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఆడుకునేలా అనుగ్రహించు” అని బాబాను వేడుకున్నాను. ఆ తరువాత ఊరికి వెళ్ళిన ఆ అబ్బాయి తిరిగి వచ్చాడు. ఆశ్చర్యం! బాబాను వేడుకున్న తరువాత ఆ అబ్బాయి ఇంక మావాడిని ఏడిపించలేదు. బాబానే ఆ అబ్బాయి మనసు మార్చారని ఎంతో ఆనందంగా అనిపించింది. ఇది చిన్న విషయమే కావచ్చు. కానీ, పిల్లలు బాధపడితే తల్లి కూడా ఎంత బాధపడుతుందో బాబాకు తెలుసు. బాబా నా ప్రార్థన విని అందరూ ఆనందంగా ఉండేలా చేశారు. “మీకు చాలా చాలా థాంక్స్ సాయీ! మీరు ఎల్లప్పుడూ అందరికీ కష్టాసుఖాలలో తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను సాయీ! ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించు సాయీ!”


మన మేలుకోసమే ఏదైనా చేస్తారు బాబా

యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు శ్రీలక్ష్మి తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను బాబా భక్తురాలిని. మన జీవితంలోని ప్రతి మలుపు బాబా ఆధీనంలో ఉంటుంది. మన మేలుకోసమే వాటిని బాబా సంభవింపజేస్తారు. నేను 2015, జనవరి నుండి యు.ఎస్.ఏ లో నివాసముంటున్నాను. అంతకుముందు మేము బెంగళూరులో నివాసం ఉండేవాళ్ళం. నా భర్తకు చాలాసార్లు యు.ఎస్.ఏ వెళ్లే అవకాశం వచ్చినప్పటికీ మేమెప్పుడూ ఇండియా విడిచి వెళ్లాలని అనుకోలేదు. అయితే 2013లో కుటుంబ సమస్యల కారణంగా నా భర్త యు.ఎస్.ఏ వెళ్లే అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. తరువాత 2015, జనవరిలో నేను, నా పిల్లలు కూడా యు.ఎస్.ఏ వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన ఒక సంవత్సరం తర్వాత మా అమ్మాయికి 'గూని' సమస్య మొదలైంది. దాంతో తను చాలా బాధపడుతుండేది. వైద్యులను సంప్రదిస్తే, ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పి, అప్పటినుండి తనకు చికిత్స కొనసాగిస్తున్నారు. అదీకాక, చికిత్స కారణంగా సైడ్ ఎఫెక్ట్స్, ఇంకా వీసా, ఉద్యోగం మొదలైన సమస్యలు ప్రారబ్ధకర్మానుసారం ఉన్నప్పటికీ వాటిని అధిగమించడంలో బాబా మాకు సహాయం చేశారు.

100% శస్త్రచికిత్స అవసరమన్న పరిస్థితిని కూడా బాబా మార్చారు. 2020, నవంబరు రెండో వారంలో మేము మా అమ్మాయికి చికిత్స చేస్తున్న గూని సంబంధిత స్పెషలిస్ట్ డాక్టరుని సంప్రదించాము. అప్పుడు ఆ డాక్టరు, "అమ్మాయికి బాగానే ఉంది. గూని పెరుగుదల లేదు. శస్త్రచికిత్స అవసరం చాలావరకు తగ్గింది. రానున్న 8 నెలల్లో శస్త్రచికిత్స అవసరమైతే తెలియజేస్తాన"ని చెప్పారు. తరువాత నవంబరు 19న బాబా దయవలన నా భర్తకి ఫుల్ టైం జాబ్ వచ్చిందని తెలిసి మేము చాలా సంతోషించాము. ఇక మేము యు.ఎస్.ఏ లో మా అమ్మాయి చికిత్స విషయంగా భయపడాల్సిన పనిలేదు. ఇదంతా బాబా లీలని నాకిప్పుడు అర్థమైంది. మా అమ్మాయికి రానున్న గూని సమస్య గురించి బాబాకు ముందుగా తెలుసు గనుక ఇండియా విడిచిపెట్టడానికి ఏ మాత్రమూ ఇష్టంలేని మమ్మల్ని యు.ఎస్.ఏ కి తీసుకుని వచ్చారు. ఎందుకంటే, యు.ఎస్.ఏ లో తప్ప ఇంకెక్కడా ఈ గూని సమస్యకి మెరుగైన చికిత్స లేదు.

మా అబ్బాయి విషయంలో కూడా బాబా అనుగ్రహాన్ని కురిపించారు. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఒక సంవత్సరం వృధా కాకుండా మా అబ్బాయికి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు. బాబా ఎల్లప్పుడూ నాకు, నా కుటుంబానికి రక్షణగా ఉన్నారు. మాకు ఎదురయ్యే ప్రతి కష్టంలో మాకు సహాయం చేస్తున్నారు. "బాబా! థాంక్యూ సో మచ్. నా జీవితం మీ పాదాల చెంత ఉంది. సదా మీ అనుగ్రహాన్ని కురిపించండి".



సాయిభక్తుల అనుభవమాలిక 694వ భాగం....




ఈ భాగంలో అనుభవాలు:

  1. మనస్ఫూర్తిగా నమ్మితే, మన నమ్మకాన్ని బాబా నిలబెడతారు
  2. బాబా దయ ఉంటే చాలు

మనస్ఫూర్తిగా నమ్మితే, మన నమ్మకాన్ని బాబా నిలబెడతారు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సమస్త సాయిబంధువులకు మరియు ఈ బ్లాగుని నిర్వహిస్తున్న సాయికి నా వందనాలు. మేము కెనడాలో నివసిస్తున్నాము. నేను ‘సాయిశ్రీ’ అనే పేరుతో నా అనుభవాలను మీ అందరితో పంచుకోబోతున్నాను. 2018 నుండి సాయి అనుభవాల ఇంగ్లీష్ బ్లాగుని చదవడం నా అలవాటుగా మారింది. అలా ఎప్పుడైనా మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు ఆ బ్లాగ్ ఓపెన్ చేసి చదవడం, బాబా ఏదోరకంగా నా సమస్యకు సమాధానం ఇవ్వడం జరిగేవి. 2 నెలల క్రితం ఒకరోజు అలాగే ఆ బ్లాగ్ చదువుతున్నప్పుడు నాకు ఈ తెలుగు బ్లాగ్ గురించి తెలిసింది. వెంటనే మెయిల్ సబ్‌స్క్రిప్షన్ పెట్టుకున్నాను. ఆ తరువాత నుండి ప్రతిరోజూ సాయిభక్తుల అనుభవాలను చదవడం నా జీవితంలో ఒక భాగం అయిపోయింది.


నా జీవితంలో, 2000వ సంవత్సరంలో నాకు బాబా గురించి తెలిసింది. ఆ తరువాత 2006వ సంవత్సరంలో నేను బాబా గురించి తెలుసుకోవడం, ఆయనను నమ్మడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు బాబా నా జీవితంలో ఎన్నో అద్భుతమైన లీలలను ప్రసాదించారు. బాబా లేకపోతే ఈ జీవితం ఏమైపోయేదో! “బాబా! ఇలాగే మా జీవితం చివరి క్షణం వరకు నీ అనుగ్రహం మామీద ఉండేలా దీవించు తండ్రీ!”


బాబా నాకు ప్రసాదించిన అనుగ్రహాన్ని సాటి సాయిభక్తులతో పంచుకోవడం నాకు ఇదే మొదటిసారి. ఏమైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి. ఇప్పటినుండి నా ప్రతి అనుభవాన్ని ఒక్కొక్కటిగా మీ అందరితో పంచుకునే అవకాశాన్ని బాబా నాకు అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాను. మాకున్న అతి పెద్ద సమస్య పరిష్కారమైతే ఆ అనుభవాన్నే మొదటి అనుభవంగా మీ అందరితో పంచుకోవాలని సెప్టెంబరు, 2020 నుండి ఎదురుచూస్తున్నాను. కానీ, ఎందుకనో బాబా దానిని అనుగ్రహించలేదు. బాబా ఆదేశం మరోలా ఉంది. బాబా నా మనస్సు మార్చి మీతో ముందుగా ఇప్పుడు చెప్పబోయే అనుభవాన్ని పంచుకునేలా చేశారు. ఆ చిత్రం ఏమిటో చూడండి.


2021, ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి పడుకునే సమయానికి ఉన్నట్టుండి ఒక పనికోసం మావారు ల్యాప్‌టాప్ ఆన్ చేశారు. ఆన్ చేయడంతోనే ఒక్కసారిగా స్క్రీన్ అంతా ఒకరకంగా బ్లాంక్‌గా అయిపోయింది. ఇక ఎంతకీ ఆన్ అవలేదు. దాంతో అసలేమైందో చూద్దామని ల్యాప్‌టాప్‌ని టేబుల్ మీదనుండి తీయగానే దానిక్రింద నీళ్లు నిలిచివుండటం గమనించాము. నీళ్లు అక్కడికి ఎలా వచ్చాయో అర్థం కాలేదు. మాకు 5 సంవత్సరాల బాబు ఉన్నాడు. బాబుని అడిగితే, “ఆడుకుంటున్నప్పుడు ఎప్పుడో నీళ్ళు పడిపోయాయి, టేబుల్ మీద ఉండే టిష్యూతో క్లీన్ చేశాన”ని చెప్పాడు. చిన్నబాబు అవడం వల్ల ల్యాప్‌టాప్ క్రిందికి నీళ్ళు వెళతాయని ఆలోచించలేకపోయాడు. అంతకుముందు రెండు రోజుల నుండి నేను కూడా ల్యాప్‌టాప్ ఆన్ చేయలేదు. అందుకని ఆ నీళ్ళు ఎప్పటినుండి అక్కడ ఉన్నాయో తెలియదు. ల్యాప్‌టాప్‌ ఓపెన్ చేసి చూస్తే నీళ్ళు లోపలకు వెళ్ళిపోయి ఉన్నాయి. చాలావరకు లోపల పార్టులలో నీళ్ళు ఉన్నాయి. మాకు గుండె ఆగినంత పనైంది. మాకు సంబంధించిన ప్రతీ ఒక్క ముఖ్యమైన డేటా, ఇంకా మా పెళ్ళయినప్పటినుండి మా జ్ఞాపకాలన్నీ అందులోనే ఉన్నాయి. హార్డ్‌డిస్క్‌లోకి కూడా నీళ్ళు వెళ్ళినట్లయితే ఆ డేటా, ఆ జ్ఞాపకాలు అన్నీ పోతాయేమోనని చాలా భయపడిపోయాము. నేను వెంటనే బాబా దగ్గరకెళ్ళి, “బాబా! ఎలాగైనా నీ దయతో ల్యాప్‌టాప్‌ ఆన్ అయ్యేలా చూడు తండ్రీ! మీ దయవల్ల ల్యాప్‌టాప్‌ ఆన్ అయితే, నా మనసు మార్చుకుని, నేను పట్టుబట్టి ఏ అనుభవమైతే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో మొదటగా పంచుకోవాలని అనుకుంటున్నానో దానికంటే ముందే ఈ అనుభవాన్ని పంచుకుంటాను” అని మనస్ఫూర్తిగా బాబాను వేడుకున్నాను. అద్భుతం! 5 నిమిషాల్లో మావారు ల్యాప్‌టాప్‌ పార్టులు తీసి తుడవడం, వాటిని డ్రయ్యర్‌తో డ్రై చేయటం, ల్యాప్‌టాప్‌ ఆన్ చేయడం, చిత్రంగా ల్యాప్‌టాప్‌ ఆన్ అవడం జరిగాయి. 10 రోజుల క్రితం మావారు ల్యాప్‌టాప్‌లో క్రొత్త 8 GB RAM వేశారు. అది మాత్రం నీళ్ళలో పూర్తిగా తడవడం వల్ల పాడయిపోయింది. ఇక పాత RAM తో ఎప్పటిలా ల్యాప్‌టాప్‌ రన్ అయింది. పెద్దమొత్తంలో నష్టం జరగకుండా, డేటా ఏమీ నష్టపోకుండా, ల్యాప్‌టాప్‌ పాడవకుండా, మా జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా బాబా అనుగ్రహించారు. “నీకు శతకోటి వందనాలు తండ్రీ!”


రెండవ అనుభవం:


పై అనుభవం జరిగాక ఇంకో చిన్న అద్భుతం జరిగింది. నిజంగా మనం మనస్ఫూర్తిగా బాబా మీద భారం వేసి, ‘అన్నీ ఆయనే చూసుకుంటారు’ అని నమ్మితే మన నమ్మకాన్ని బాబా ఎలా నిలబెడతారో చూడండి. పైన జరిగినదంతా గమనిస్తున్న మా బాబు, “ల్యాప్‌టాప్‌ ఎలా ఆన్ అయింది?” అని నన్నడిగాడు. “ఇదంతా బాబానే చేశారు” అని చెప్పాను. అది విన్న మా బాబు పరిగెత్తుకుంటూ తన బొమ్మల కప్‌బోర్డ్ దగ్గరకెళ్ళి, అందులోనుండి దాదాపు రెండు నెలలుగా పనిచేయని తనకు ఇష్టమైన ‘వాయిస్ కమాండింగ్ కారు’ని బాబా వద్దకు తీసుకుని వెళ్ళి, “నా కారు కూడా రిపేర్ చేయి బాబా” అని చెప్పి ఆ కారుని బాబా దగ్గర పెట్టి వచ్చి పడుకున్నాడు. ఇదంతా చూస్తున్న మేము వాడు చేసిన పనికి నవ్వుకుని వాడిని ఏమీ అనలేక ఊరుకున్నాము. 


ఆ మరుసటిరోజు మా బాబు లేచి కారుని ఆన్ చేశాడు. అయితే ఎప్పటిలాగానే అది ఆన్ అవలేదు. అయితే మా బాబు, “బాబా దీనిని రిపేర్ చేయలేదు. బాబా దగ్గర దీనిని రిపేర్ చేయడానికి టూల్‌కిట్ లేదు కదా, నేను బాబాకి టూల్‌కిట్ ఇస్తాను” అని చెప్పి తన టూల్‌కిట్ తీసుకొచ్చి కారు దగ్గర పెట్టి, “ఇప్పుడు రిపేర్ చేయి బాబా” అని చెప్పి ఆ రోజంతా అలాగే వదిలేశాడు. మేము పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఈ విషయం తనే మర్చిపోతాడులే అనుకున్నాము. కానీ, మరుసటిరోజు లేవగానే మా బాబు తన కారును బాబా దగ్గర నుండి తెచ్చుకుని ఆన్ చేయగానే, ఆశ్చర్యకరంగా ఈ రెండు నెలలలో ఎప్పుడూ ఆన్ కాని కారు, దాని రిమోట్ ఎప్పటిలా లైట్లు వచ్చి ఆన్ అయ్యాయి. దాని వాయిస్ కంట్రోల్ కూడా చక్కగా పనిచేసి బాబు చెప్పినట్లు కారుని డ్రైవ్ చేసింది. దాంతో బాబు సంతోషంతో గెంతులేశాడు. బాబా చేసిన అద్భుతాన్ని చూసి మేము కూడా ఎంతో ఆశ్చర్యపోయాము. ఇంతటి ఆనందాన్ని ప్రసాదించిన బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము.


బాబా దయ ఉంటే చాలు


సాయి భక్తురాలు ప్రసన్నలక్ష్మి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


నా పేరు ప్రసన్నలక్ష్మి. నేను మన ప్రియమైన సాయికి భక్తురాలిని. నాకు బాబాపై పూర్తి నమ్మకం మరియు విశ్వాసం. ఎల్లప్పుడూ నేను బాబా ధ్యాసలో ఉంటాను. నాకు ఇటీవల సి-సెక్షన్ (సిజేరియన్) జరిగింది. బాబా అనుగ్రహంతో నాకు పాప పుట్టింది. నాకు గర్భసంచీలో రెండు కణుతులు (ఫైబ్రాయిడ్స్) ఉన్నాయని డాక్టర్ చెప్పారు. అంతేకాదు, ఆపరేషన్ సమయంలో బ్లీడింగ్ బాగా అవుతుందనీ, కాబట్టి బ్లడ్ కావాల్సి వస్తుందనీ అన్నారు. దాంతో మేము చాలా ఆందోళనచెందాము. కానీ బాబా దయవల్ల ఆపరేషన్ సమయంలో నాకు బ్లడ్ అవసరం లేకుండా పోయింది. బ్లడ్ అవసరం లేకుండా నన్ను కాపాడిన సాయిబాబాకి నా శతకోటి ధన్యవాదాలు. “ఇంత అద్భుతమైన లీలను నాకు ప్రసాదించినందుకు, నా అనుభవాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ బాబా!”



సాయిభక్తుల అనుభవమాలిక 693వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా ఉంటే ఏదీ కష్టం కాదు
  2. నాస్తికుడైన నా భర్తకు బాబా ఇచ్చిన దర్శనం

బాబా ఉంటే ఏదీ కష్టం కాదు

బాబా భక్తురాలు ప్రేరణాసింగ్ తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

భక్తులందరికీ సాయిరామ్! నా పేరు ప్రేరణ. మన ప్రియమైన సాయిబాబాకు నేను సాధారణ భక్తురాలిని. నేను ఎప్పుడు, ఎలా బాబా పాదాల వద్దకు చేరానో తెలియదుగానీ, ఆ క్షణం నుంచి నేను ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాబా ఎల్లప్పుడూ నాతో, నా కుటుంబంతో ఉన్నారు. నేను ఒక చిన్న పట్టణంలో నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. పైచదువుల కోసం మెట్రో సిటీలోని గవర్నమెంట్ కాలేజీకి వెళ్తానని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ, బాబా అనుగ్రహం వలన నాకొక మంచి గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్ దొరికింది. అయితే అంతకుముందు నాకెటువంటి పని(ఉద్యోగం) చేసిన అనుభవంలేని కారణంగా నా కోర్సుకు సంబంధించి ఇంటర్న్‌షిప్ పొందడం చాలా కష్టం అయింది. అప్పుడు కూడా బాబా నాకొక పెద్ద కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పించారు. బాబా అనుగ్రహం వల్ల నేను అక్కడ చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు బాబా చేసిన పెద్ద మిరాకిల్ గురించి చెప్తాను.

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. దాదాపు అన్ని సంస్థలూ ఉద్యోగ నియామకాలను ఆపేశాయి. నేను ఎక్కడైతే ఇంటర్న్‌షిప్ చేశానో ఆ కంపెనీ కూడా ఉద్యోగ నియామకాలను ఆపేసింది. నేను చాలా కంపెనీల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాను. కానీ ప్రయోజనం కనిపించలేదు. దాంతో నేను చాలా నిరాశకు లోనయ్యాను. ఎందుకంటే, నేను గనక ఉద్యోగం సంపాదించుకోలేకపోతే నా తల్లిదండ్రులు నా పెళ్ళి చేయాలని అనుకుంటారు. ఆ భయం నన్ను ఎక్కువగా వెంటాడింది. 'ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కలిగివుండాల'ని సచ్చరిత్రలో బాబా చెప్పినట్లు నాకు గుర్తు. అందుచేత నేను, "బాబా! మీరు చెప్తారు కదా, మా కాళ్ళమీద మేము నిలబడాలని. అందుకే నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. నాకు ముందు ఉద్యోగం కావాలి. సరైన సమయం వచ్చినప్పుడు మీరు మాత్రం ఆ ఉద్యోగాన్ని నాకు ప్రసాదించాలి" అని బాబాతో చెప్పుకున్నాను. ఆరోజు 2020, జూలై 16, గురువారం, నేను పూజకు కూర్చున్నప్పుడు యాదృచ్ఛికంగా సచ్చరిత్రలో ఒక పేజీ తీశాను. అక్కడ బాబా ఒక భక్తునితో, "తొందరలోనే నువ్వు కోరుకునే మంచి ఉద్యోగం నీకు వస్తుంది" అని చెప్తున్నారు. అది చదివి బాబా నాతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపించి నేను ఆశ్చర్యపోయాను. అయితే రోజులు గడుస్తున్నాయి, నాకు ఉద్యోగం మాత్రం దొరకలేదు. అంతలో ఒక ఇంటర్న్‌షిప్ వచ్చింది. నిజానికది నాకు ఇష్టం లేకపోయినప్పటికీ బాబా మీద భారంవేసి దాన్ని స్వీకరించాను. నా మనసులో మాత్రం, 'బాబా నాకు మంచి ఉద్యోగం వస్తుందని సచ్చరిత్ర ద్వారా చెప్పారు. కానీ, ఇది ఇంటర్న్‌షిప్ కదా' అని అనిపిస్తుండేది. కానీ, దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా అంతా బాబాకే వదిలేశాను. అయితే నా ఆరోగ్యం సరిగా లేనందున రెండురోజులకే నేను ఆ ఇంటర్న్‌షిప్ వదిలేశాను.

అనారోగ్యంతో ఉన్న సమయంలో నేను బాబాను ధ్యానించడం మొదలుపెట్టాను. ఆ మరుసటిరోజు నేను ధ్యానంలో ఉన్నప్పుడు మా కాలేజీనుంచి నాకొక లెటర్ వచ్చింది. అంతకుముందు నేనొక ప్రఖ్యాత కంపెనీకి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు తమ కంపెనీలో ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తూ పంపిన లెటర్ అది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా కాలేజీ నుండి కేవలం నా రెజ్యూమ్ మాత్రమే ఇంటర్వ్యూ కోసం ఎంపికైంది. ఆ ఇంటర్వ్యూ ప్రక్రియలో నాలుగు రౌండ్లు ఉంటాయని తెలిసి నా ఆత్మవిశ్వాసం కొంచెం సన్నగిల్లింది. ఇంటర్వ్యూ జరిగే సమయంలో సాయి నవగురువారవ్రతం పుస్తకాన్ని నా వద్ద ఉంచుకున్నాను. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలన్నీ నాకేదో ముందే తెలిసినట్లు నేను నాలుగు రౌండ్లు చాలా తేలికగా పూర్తిచేశాను. ఇదంతా నా సామర్థ్యం కాదు, కేవలం బాబా కృపవల్లనే నేను అన్ని రౌండ్లు పూర్తి చేయగలిగాను. ఇదే నా మొదటి ఇంటర్వ్యూ. అది కూడా ఈ కరోనా సమయంలో. బాబా మొదటి ప్రయత్నంలోనే నన్ను గెలిపించారు. నన్ను నేనే నమ్మలేకపోయాను. కానీ బాబా తోడుంటే అన్నీ సాధ్యమే. నాకు ఉద్యోగం వస్తుందని జూలై 16న బాబా సందేశమిచ్చారు. సెప్టెంబరు 11న ఆఫర్ లెటర్ నా చేతికొచ్చింది. కేవలం రెండు నెలల్లో నాకు ఉద్యోగం వచ్చింది. ఈ కరోనా కష్ట సమయంలో ఒక ఫ్రెషర్‌కి ఉద్యోగం దొరకడం ఎంతో కష్టం. కానీ బాబా ఉంటే ఏదీ కష్టం కాదు.

బాబాను పూర్తిగా నమ్మండి. ఆయన మనల్ని అమితంగా ప్రేమిస్తారు. ఆయన తమ అద్భుత శక్తితో మన జీవితంలో అన్నీ సరిచేస్తారు. విశ్వాసంతో బాబాకు శరణాగతి చెంది  మన భయాలను, బలహీనతలను వారికి అర్పిస్తే, వారు మనకు బలాన్ని, ఆనందాన్ని ఇస్తారు. కేవలం ఆయనను విశ్వసించండి. వారిని ఏమీ అడగకండి. మనకేది మంచిదో ఆయననే నిర్ణయించనివ్వండి. ఏ సమస్యలు ఉన్నా ఒక్కటి గుర్తుంచుకోండి, బాబాకంటే అవేమీ గొప్పవి కావు. అతిగా వాటి గురించి ఆలోచించక బాబాకు వదిలేయండి. ఆయనకు సంపూర్ణ శరణాగతులమైతే, ఆయన ఎంత ఉత్తమమైనది మనకు అనుగ్రహిస్తారో చూడండి. అందుకు శ్రద్ధ, సబూరీ అనే మూల్యం చెల్లించాలి. బాబా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనం కూడా అంతులేని శ్రద్ధ, సబూరీలతో మన ప్రేమను వ్యక్తపరచాలి. చివరిగా నేను నా తప్పులన్నిటికీ బాబాను క్షమాపణలు వేడుకుంటున్నాను. "బాబా! దయచేసి నన్ను క్షమించండి". నా అనుభవం మీ అందరి విశ్వాసాన్ని బలపరుస్తుందని ఆశిస్తున్నాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, "ప్రతిదీ బాబా చేతికి అప్పగిస్తే, అన్నింటా బాబా చర్యను చూస్తారు".


నాస్తికుడైన నా భర్తకు బాబా ఇచ్చిన దర్శనం

యు.కె నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను యు.కె. లో నివాసముంటున్న చిన్న సాయిబాబా భక్తురాలిని. నేను సాయిబాబాని నా తల్లిగా భావిస్తాను. ఒకసారి బాబా కలలో నాకు 'ఏదో చదవాల'ని చెప్పారు. అదేమిటో సరిగా అర్థంకాక నేను చాలా గందరగోళానికి గురయ్యాను. దానిగురించి తెలుసుకునేందుకు గూగుల్ లో శోధించి గ్లోబల్ మహాపారాయణ గురించి తెలుసుకున్నాను. దాంతో ఇటీవలే నేను యు.కె. మహాపారాయణ గ్రూపులో (గ్రీన్ టీమ్, రూల్ నెంబర్: 26) చేరాను.

ఇటీవల బాబా ఇచ్చిన మరో అనుభవాన్ని కూడా పంచుకుంటాను. నా భర్త నాస్తికుడైనందున తనకి "తమ ఉనికిని తెలియజేయమ"ని నేను బాబాను ప్రార్థించాను. తరువాత 2020, ఏప్రిల్ 22, బ్రాహ్మి ముహూర్త సమయంలో అంటే ఉదయం 3. 45 గంటలకి నా భర్తకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా ఒక వృద్దుని రూపంలో దర్శనమిచ్చారు. ఆయన తెల్లటి కఫనీ ధరించి అప్పటి ద్వారకామాయి మెట్లపై నిలబడి ఉన్నారు. ఆయన చుట్టూ చాలామంది భక్తులు ఉన్నారు. నా భర్త బాబాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. బాబా మౌనంగా అతన్ని చూస్తున్నారు. అంతటితో ఆ కల ముగిసింది. ఉదయాన ఈ విషయాన్ని నా భర్త నాతో చెప్పినప్పుడు నేను షాకయ్యాను. కానీ బాబా అనుగ్రహానికి మేమంతా చాలా సంతోషించాము.



సాయిభక్తుల అనుభవమాలిక 692వ భాగం.....




ఈ భాగంలో అనుభవం:
  • తల్లిలా, తండ్రిలా పనులన్నీ పూర్తైయ్యేలా అనుగ్రహించిన బాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


సాయిబంధువులందరికీ నమస్కారం. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇంతకుముందే ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇటీవల జరిగిన మరో అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.

 

నేను బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవల ఈ కరోనా కారణంగా మాకు జీతాలు చాలా తక్కువగా ఇస్తున్నారు. కానీ మమ్మల్ని స్కూలుకి వచ్చి ఖచ్చితంగా రిపోర్టు చెయ్యాలని ప్రిన్సిపాల్ చెప్పారు. ఒకవైపు చూస్తే తక్కువ జీతం, ఇంకోవైపు చూస్తే ఇంట్లోవాళ్ళు ఈ కరోనా కారణంగా నన్ను బయటకు పంపడానికి కూడా సిద్ధంగా లేరు. దాంతో నేను చాలా సందిగ్ధంలో పడ్డాను. ఏం చేయాలో అర్థంకాక చివరికి బాబా సమాధానం తెలుసుకోవడానికి ‘స్కూలుకి వెళ్లనా, వద్దా’ అని బాబా ముందర చీటీలు వేశాను. బాబా ‘వెళ్లవద్దు’ అన్నారు. దాంతో నేను బాబా మాటకు కట్టుబడి స్కూలుకి వెళ్ళకుండా ఇంటినుంచే పనిచేయడం ప్రారంభించాను. దాంతో మా ప్రిన్సిపాల్ మీటింగ్ పెట్టి, నో వర్క్-నో పే ఆప్షన్ పెట్టి లెటర్ ఇచ్చేయండి అని చాలా కఠినంగా చెప్పింది. నాకు చాలా బాధకలిగి, ఏం చేయమంటారో చెప్పమని చీటీల ద్వారా బాబాను అడిగాను. ప్రిన్సిపాల్ అడిగినట్లే లెటర్ ఇవ్వమని బాబా నుండి సమాధానం వచ్చింది. దాంతో ఇక వేరే ఆలోచన లేకుండా లెటర్ రాసి ప్రిన్సిపాల్‌కి ఇచ్చేశాను. దాంతో ఆమె నన్ను స్కూలుకి రమ్మని బలవంతపెట్టడం మానేసింది. దీని కారణంగా నాకు ఇంటినుంచే వర్క్ చేసే అవకాశం దొరికింది

     

ఇలా ఉండగా నేను తిరుపతిలోని యూనివర్శిటీకి వెళ్లి కొన్ని సర్టిఫికెట్స్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మా తమ్ముడికి ఐ-సెట్ కౌన్సెలింగ్ కూడా అదే యూనివర్సిటీలో వచ్చింది. నేను యూనివర్సిటీలో సర్టిఫికెట్స్ తెచ్చుకోవటం కోసం ‘తిరుపతి వెళ్లనా, వద్దా’ అని అడుగుతూ బాబా ముందర చీటీలు వేశాను. బాబా నన్ను వెళ్లమన్నారు. “అలాగైతే తిరుమల కూడా వెళ్లనా బాబా?” అని అడిగాను. బాబా అక్కడికి కూడా వెళ్లమన్నారు. దాంతో నేను ఇంట్లోవాళ్లతో “నా సర్టిఫికెట్స్ కోసం, తమ్ముడి కౌన్సిలింగ్ కోసం ఇద్దరం కలిసి తిరుపతి వెళ్తున్నాము” అని చెప్పాను. కానీ మా తాతయ్య, “తిరుమల వెళ్లకండి. కేవలం మీ పని చూసుకొని తిరిగి వచ్చేయండి. అయినా తెలియని ప్రదేశం కదా, ఇద్దరే ఎలా వెళ్తారు?” అంటూ, తిరుపతిలో తనకు పరిచయమున్న వాళ్లింట్లోనే ఉండమని చెప్పారు. తాతయ్య మాటలకు అంగీకరించి నేను, మా తమ్ముడు కలిసి తిరుపతికి బయలుదేరాము. మేము అనుకున్న సమయనికంటే ముందుగానే తిరుపతికి చేరుకున్నాం. తాతయ్య చెప్పిన వాళ్లింటికి ముందే వెళ్లి వాళ్లని ఇబ్బందిపెట్టడం ఎందుకని భావించి, ఈలోపు బాబా దర్శనం చేసుకుందామనుకుని, తిరుపతిలో బాబా గుడి ఎక్కడుందా అని గూగుల్‌లో వెతికాను. మేమున్న చోటికి దగ్గరలోనే బాబా గుడి ఉన్నట్టు గూగుల్లో కనిపించింది. దాంతో మేమిద్దరం బాబా గుడికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని సాయంత్రం ఆరతికి హాజరయ్యాము. నా తండ్రి ఇక్కడ కూడా నాకు తోడుగా ఉండడానికి వచ్చేశారని అనిపించి నాకు పట్టరాని సంతోషం వేసింది. ఆరతి అయిన తరువాత మా తాతయ్యకు తెలిసినవాళ్ళింటికి వెళ్ళాము. వాళ్ళింట్లో అడుగుపెట్టిన వెంటనే బాబా నాకు ఫొటో రూపంలో దర్శనమిచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ కుటుంబంలోని వారంతా సాయిబాబా భక్తులే. దాంతో బాబా నన్ను క్షేమంగా చూసుకుంటున్నారని నాకు చాలా సంతోషం వేసింది. వాళ్లు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. 


ముందుగా మా తమ్ముడి కౌన్సెలింగ్ కోసం యూనివర్శిటీకి వెళ్లాం. అయితే అప్పటికి తన డిగ్రీ మార్క్స్ కార్డ్ రాలేదు. డిగ్రీలో ఒక సబ్జెక్ట్ రిజల్ట్ రాలేదు, మరో సబ్జెక్టు ప్రాక్టికల్‌లో తనకు ఆబ్సెంట్ వేసి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తనకు కౌన్సెలింగ్ జరగడం అసాధ్యం అని ఇంట్లో కూడా అందరూ అన్నారు. కౌన్సెలింగ్ మాత్రం ఉదయం తొమ్మిది గంటలకు మొదలై మధ్యాహ్నం 12 గంటలకు అయిపోతుంది. నేను, మా తమ్ముడు కలిసి తన మార్క్స్ కార్డ్ కోసం యూనివర్శిటీలో చాలా తిరిగి చాలామందిని సహాయం చేయమని అడిగాము. కానీ వాళ్లు మమ్మల్ని గంటలు గంటలు వెయిట్ చేయిస్తూ, “ఇప్పుడు వస్తే మీకు మేము మార్క్స్ కార్డ్ ఎలా ఇస్తాం? మీరు ఇంతకుముందే రావాల్సింది. కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో మార్క్స్ కార్డ్ కోసం వచ్చారా? ఇప్పుడు ఇవ్వడం కుదరదు” అని కఠినంగా సమాధానాలు ఇచ్చారు. సమయం చూస్తే పన్నెండు అవుతోంది. కానీ కనీసం మా తమ్ముడు ఆ రెండు సబ్జెక్టులలో పాసయ్యాడా లేదా అన్న విషయం కూడా తేలలేదు. దాంతో మా తమ్ముడు, “ఇక ఈ విషయం వదిలెయ్యి, నాకు కౌన్సెలింగ్ జరగదు. టైమ్ కూడా దాటిపోయింది. కనీసం మార్క్స్ కార్డ్ అయినా తీసుకెళ్దాం” అన్నాడు. ఆ మాట విని నాకు చాలా కోపం వచ్చింది. “ఎప్పుడూ ఇలా నెగిటివ్‌గానే మాట్లాడతావెందుకు? కాస్త వెయిట్ చేయి” అని చెప్పి నేను మళ్ళీ మార్క్స్ కార్డ్ కోసమని యూనివర్సిటీలోని అధికారుల వద్దకు వెళ్ళాను. వాళ్ళు రికార్డులు చెక్ చేసి, మా తమ్ముడు ఆ రెండు సబ్జెక్టుల్లోనూ పాసయ్యాడని చెప్పారు. కానీ మార్క్స్ కార్డ్ ఇవ్వాలంటే కాలేజీకి వెళ్లి లెటర్ తీసుకుని రావాలని చెప్పారు. కానీ ఇప్పటికిప్పుడు అలా చెయ్యడానికి కుదరదు, ఎందుకంటే మా ఊరు తిరుపతికి చాలా దూరంలో ఉంటుంది. అందుచేత మేము మార్క్స్ కార్డ్ ఇప్పించమని వాళ్లను ఎంతో బ్రతిమిలాడాము. కానీ వాళ్లు చాలా మొండిగా కుదరదంటే కుదరదని చెప్పారు. తరువాత నేను బాబాతో, “ఏంటి బాబా ఇది? దయచేసి మాకు సహాయం చెయ్యండి” అని వేడుకున్నాను. తరువాత ఏదో రెకమెండేషన్ చెయ్యడం వల్ల వెంటనే మార్క్స్ కార్డ్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. కానీ మార్క్స్ కార్డ్ మాత్రం సాయంత్రం 3.30కి ఇస్తామని చెప్పారు. చేసేదిలేక మేమందుకు అంగీకరించాము. కానీ తనకు కౌన్సిలింగ్ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మా తమ్ముడికి వచ్చిన ర్యాంకుకి 12 గంటలకే కౌన్సెలింగ్ అయిపోతుంది కాబట్టి. 


ఇకపోతే నా సర్టిఫికెట్ కోసమని ఉదయం 11 గంటల నుంచి యూనివర్సిటీవారిని సంప్రదించడం ప్రారంభించాను. వాళ్లు “పోస్టు ద్వారా మీ సర్టిఫికెట్స్ మీకు పంపిస్తాము, ఇక్కడ ఇవ్వడానికి కుదరదు” అని చెప్పారు. “ఇక్కడ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది కదా, ఇక్కడే ఇవ్వండి” అని ఎంతో బ్రతిమిలాడాను. కానీ వాళ్లు, “కుదరదు, మీరు చలానా కట్టి వెళ్లండి” అని అన్నారు. బయటికి వచ్చిన తరువాత చలానా ఎక్కడ కట్టాలో, ఏమి చేయాలో తెలియక నేను వాళ్లకు ఫోన్ చేసి అడుగుతుంటే వాళ్ళు విసుక్కుని, “మీరు చలానా ఏమీ కట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడికే రండి” అని చెప్పారు. అక్కడికి వెళ్లిన వెంటనే నా దగ్గరున్న సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని, “ఇక వెళ్ళండి, సాయంత్రం 4.30కి రండి” అని చెప్పారు. వాళ్ళు అలా అనడంతో నాకేమీ దిక్కుతోచలేదు. నా మార్క్స్ కార్డ్ రాలేదు, కనీసం మా తమ్ముడి కౌన్సెలింగ్ కూడా అవలేదు. దాంతో చాలా బాధగా అనిపించి, "బాబా! మీ అనుమతితోనే కదా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పరిస్థితులన్నీ ఇప్పుడు నువ్వే కదా చూసుకోవాలి? చూడు, అన్నీ మాకు ఎలా వ్యతిరేకంగా ఉన్నాయో" అని బాబాతో చెప్పుకుని బాధపడ్డాను. ఆ తరువాత కనీసం మా తమ్ముడి కౌన్సిలింగ్ సంగతైనా కనుక్కుందామనుకొని మా తమ్ముడితో, “నీ కౌన్సిలింగ్ గురించి మరోసారి వాళ్లను రిక్వెస్ట్ చేద్దాం పద” అని చెప్పి అక్కడికి వెళ్లాము. ఆశ్చర్యంగా వాళ్ళు, “సాయంత్రం వరకు కౌన్సెలింగ్ జరుగుతుంద”ని చెప్పారు. దాంతో నాకు సంతోషమేసింది. యూనివర్సిటీవాళ్లు సాయంత్రం 4.30కి మా తమ్ముడి మార్క్స్ కార్డ్ ఇచ్చారు. అది తీసుకుని తను కౌన్సెలింగ్‌కి వెళ్ళాడు. తన కౌన్సిలింగ్ పూర్తయింది. కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ లేదని చెప్పి మళ్లీ పెండింగ్ పెట్టారు. బాబా దయతో క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఒకే రోజులో అప్లై చేసుకున్న వెంటనే వచ్చేసింది. దాంతో తన కౌన్సెలింగ్ పూర్తయి తనకు ఒక మంచి కాలేజీలో సీటు వచ్చింది.


ఇక నా సర్టిఫికెట్స్ విషయానికి వస్తే, వాళ్లు నన్ను ఆరోజు సాయంత్రం 5 గంటల వరకు ఎదురుచూసేలా చేశారు. తర్వాత నన్ను పిలిచి, “మీ సర్టిఫికెట్స్ ఇక్కడే ఇచ్చేస్తున్నాం, తీసుకోండి” అంటూ నా సర్టిఫికెట్స్ నాకు ఇచ్చేశారు. నాకు చాలా సంతోషమేసింది. బాబా నన్ను చివరి నిమిషం వరకు పరీక్షించారు, కానీ చివరికి నా సర్టిఫికెట్స్ నాకు వచ్చేలా చేశారు. మా తమ్ముడి కౌన్సెలింగ్ కూడా పూర్తయ్యింది. నిజం చెప్పాలంటే మా తమ్ముడికి ఐ-సెట్‌లో ర్యాంక్ రావడం కాదుకదా, కనీసం పాసవడం కూడా కష్టమే. ఎందుకంటే తను శ్రద్ధగా చదవలేదు. నిజానికి తనకు చదువు మీద అంత శ్రద్ధ లేదు కూడా. కనీసం డిగ్రీ మార్క్స్ కార్డ్ రావడం కూడా కష్టమే. కానీ బాబా ఎంతో దయతో మా తమ్ముడిని కూడా తన దగ్గరకు చేర్చుకుని తనకు మంచి కాలేజీలో సీటు వచ్చేలా చేశారు. మా తాతయ్య అంటూ ఉంటారు, “నీ తమ్ముడికి కౌన్సెలింగ్ జరగడానికి కారణం ఖచ్చితంగా నీ బాబానే! లేకపోతే తనకు కౌన్సెలింగ్ జరగడం అనేది అసాధ్యం” అని.


ఇక తిరుమల దర్శనానికి వస్తే.. ఇంట్లోవాళ్లు వద్దన్నప్పటికీ బాబా అనుమతించారు కనుక నేను ఖచ్చితంగా శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దాంతో నేను, మా తమ్ముడు కలిసి తిరుమల వెళ్లి ఎంతో ఆనందంగా శ్రీవారి దర్శనం చేసుకున్నాము. అది తెలిశాక ఇంట్లోవాళ్లు కూడా మమ్మల్ని ఏమీ అనలేదు. తిరుపతిలో మేమున్న ఇంట్లోవాళ్లతో కలిసి రెండుసార్లు బాబా గుడికి వెళ్లి ఆరతికి హాజరయ్యాను. బాబా నన్ను తిరుపతికి పంపించడమే కాకుండా అక్కడ నేను ఉండడానికి చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి తల్లిలా, తండ్రిలా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ముఖ్యంగా అక్కడ ఒక మంచి సాయికుటుంబాన్ని నాకు పరిచయం చేశారు. నిజం చెప్పాలంటే, నేను స్కూల్లో లెటర్ ఇవ్వకుండా ఉంటే ఇంత ధైర్యం చేసి తిరుపతికి వచ్చి అంత సమయం వెచ్చించడానికి  కుదిరేది కాదు. బాబా అనుమతితో స్కూల్లో లెటర్ ఇవ్వడం కారణంగానే తిరుపతిలో అన్నిరోజులు గడపగలిగాను. “బాబా! మీ మార్గం కనుక్కోవడం చాలా కష్టం తండ్రీ. మీ ప్రేమను మాటలలో వర్ణించలేము”. తిరుపతి వెళ్లి సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని తిరుమల శ్రీవారి దర్శనం లభిస్తే ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు మాటిచ్చాను. “బాబా! మీకు మాట ఇచ్చిన ప్రకారం నా అనుభవాన్ని పంచుకున్నాను! థాంక్యూ బాబా, లవ్ యు సో మచ్!”


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 691వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా తోడు
  2. బాబా కృపతో చెల్లెలి వివాహం

బాబా తోడు


సాయిభక్తురాలు లక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకి నా నమస్కారం. నా పేరు లక్ష్మి. మొదటిసారిగా నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. సాయిభక్తుల అనుభవాలను మాతృభాషలో చదవడం వల్ల మనస్సుకి చక్కగా హత్తుకుంటున్నాయి. నేనిప్పుడు చెప్పబోయే అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు మాట ఇవ్వకపోయినప్పటికీ ఈ చిన్ని అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనిపించింది. 


ఇటీవల మా తాతయ్యకి కంటి ఆపరేషన్ చేయించాలనుకున్నాము. వయసులో పెద్దవారవటం వల్ల మరియు ఆయనకి నెమ్ము ఉండటం వల్ల డాక్టర్ ఆపరేషన్ చేస్తారో లేదో అని కంగారుపడ్డాను. మా తాతయ్యను చెకప్‌కి తీసుకెళ్లినప్పుడు ఆయనను పరీక్షించిన డాక్టర్ తాతయ్యకు ఆపరేషన్ చేస్తామని చెప్పి కొన్ని పరీక్షలు చేయించమన్నారు. అక్కడ నేను వెంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి, వినాయకస్వామి మొదలైన ఆరుగురు దేవుళ్ళ పెద్ద పెద్ద ఫోటోలు ఉండటం చూశాను. బాబా ఫోటో మాత్రం ఎక్కడా కనిపించలేదు. నేను మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “ఆపరేషన్ రోజున ఎవరో ఒక పేషెంట్ చేతికో లేదా కవర్ మీద అయినా కనపడు బాబా” అని ప్రార్థించాను. ఆపరేషన్ రోజున బిల్లు కట్టేటప్పుడు ఇంతకుముందు ఎక్కడైతే వేరే దేవుళ్ల ఫోటోలు చూశానో అదే రూములో పెద్ద బాబా ఫోటో చూశాను. బాబాను చూస్తూనే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. బాబా అనుగ్రహంతో ఆపరేషన్ విజయవంతమైంది. ఆ తరువాత తాతయ్యకు చెకప్ కూడా చేసి అంతా బాగుందని చెప్పారు. కాకుంటే ఇప్పుడు మా తాతయ్యకి బాగా దగ్గు వస్తోంది. “ప్లీజ్ బాబా! మా తాతయ్య దగ్గు త్వరగా తగ్గేలా అనుగ్రహించు. అమ్మమ్మ, తాతయ్యల ఆరోగ్యాన్ని కాపాడు. వాళ్ళకు నా పెళ్లి చూడాలని కోరిక. వాళ్ళకి నేను ఒక్కగానొక్క మనవరాలిని కదా సాయీ! నీవు ద్వాపరయుగంలో కృష్ణునిగా అవతరించినప్పుడు యశోదమ్మ నీ వివాహాన్ని కనులారా చూడాలని కోరుకుంటే, మరుసటి యుగంలో వేంకటేశ్వరస్వామిగా అవతరించి, వకుళాదేవిగా జన్మించిన యశోదమ్మ సమక్షంలో పద్మావితీదేవిని వివాహమాడి ఆమె కోరికను తీర్చావుగా సాయీ! అలాగే, మానవమాత్రులైన మా అమ్మమ్మ, తాతయ్యల ఆశ కూడా నెరవేర్చు సాయీ. ఇంకో ఐదు నెలల్లో నాకు ముప్ఫై సంవత్సరాలు నిండుతాయి. ఈ సంవత్సరమైనా నా వివాహం జరిపించు సాయీ! చాలా రోజుల నుంచి ఉన్న నా కోరిక తీర్చు సాయీ! ఏమైనా మర్చిపోయినా, ఏదైనా తప్పు చేసినా నన్ను మన్నించు సాయీ!” 


సాయి రక్షక శరణం.

ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః.


బాబా కృపతో చెల్లెలి వివాహం


ఆదోని నుండి సాయిభక్తుడు రామ్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులందరికీ సాయిరామ్! ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారం. నా పేరు రామ్. మేము ఆదోనిలో నివసిస్తున్నాము. నేను ప్రతి పనిలోనూ బాబాపైనే భారం వేస్తాను. బాబా నాకు ఎంతో అండగా ఉంటూ ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలోనుండి ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. నా కోరిక నెరివేరిన వెంటనే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చి కూడా ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు సాయిబాబాను క్షమాపణ కోరుతున్నాను. “నన్ను క్షమించండి బాబా!”


మన సద్గురువు, సకలదేవతా స్వరూపమైన సాయిబాబాతో నాకు గత 13 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. నాకు ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. గత ఏడు సంవత్సరాలుగా (2013 నుండి) చెల్లెలికి వివాహం చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ తనకు ఏ సంబంధమూ కుదరలేదు. నేను తరచుగా బాబా దర్శనానికి వెళ్ళి మా చెల్లెలి వివాహం జరిపించమని వేడుకునేవాడిని. ఇలా ఏడు సంవత్సరాలు గడిచాయి. శ్రద్ధ, సబూరి కలిగివుండాలని బాబా అంటారు కదా! నా విషయంలో అదే జరిగింది. నేను తరచూ ఈ బ్లాగులో ప్రచురిస్తున్న సాయిభక్తుల అనుభావాలను చదువుతుంటాను. ఒకరోజు నేను బాబాకు నమస్కరించుకుని, మా చెల్లెలి వివాహం త్వరగా జరిగేలా అనుగ్రహించమనీ, మా చెల్లెలి వివాహం జరిగితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాననీ చెప్పుకున్నాను. ఆ తరువాత మొదటిసారిగా మా చెల్లెలు బాబాపై నమ్మకంతో తొమ్మిది గురువారాల సాయి వ్రతాన్ని 2020, జూన్ నెలలో ప్రారంభించింది. బాబా అనుగ్రహంతో చివరి గురువారంలోపు (2020, జులై నెలలో) మంచి వరుడితో తన వివాహం జరిగింది. “బాబా! మీ కరుణ, కృపాకటాక్షాలు ఎల్లవేళలా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను”.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 690వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో నాన్నకి ఆరోగ్యం
  2. మూడేళ్ళ బాధనుండి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా

బాబా అనుగ్రహంతో నాన్నకి ఆరోగ్యం


హైదరాబాదు నుండి సాయిభక్తురాలు ఉష తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి కుటుంబసభ్యులకు నా నమస్కారాలు. నాపై సాయి చూపిన దయను ఇంతకుముందు మీ అందరితో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు మరోసారి సాయి దయను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.


2021, జనవరి నెలలో భోగి పండుగనాడు నేను మా అమ్మానాన్నలతో ఫోన్లో మాట్లాడి వారికి పండుగ శుభాకాంక్షలు అందజేశాను. మాటల్లో మా తమ్ముడి కుటుంబసభ్యులంతా పండక్కి ఊరికి వచ్చి అమ్మానాన్నలతో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాను. సంక్రాంతి పండుగ మధ్యాహ్నం వరకూ బాగానే వున్న నాన్నకు ఉన్నట్టుండి ఆరోగ్యం దెబ్బతిని, ఆరోజు రాత్రికల్లా ఆందోళనకరంగా మారింది. దాంతో అప్పటికప్పుడు నాన్నను మా ఊరికి దగ్గరలోని తిరుపతికి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు నాన్నను ICU లో ఉంచి, సమస్య ఏమిటో తెలుసుకోవడానికి అన్ని టెస్టులూ చేస్తున్నారు. కానీ సమస్య ఇదీ అని చెప్పలేక గందరగోళం సృష్టిస్తున్నారు. నాలుగైదు రోజులైనా నాన్నకు బి.పి కంట్రోల్ కావటం లేదు. దాంతోపాటు నాన్నకు యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. అదీ కూడా కంట్రోల్ అవటం లేదు.


6వ రోజుకి కూడా నాన్నకున్న సమస్యలు ఏమాత్రం తగ్గకపోవటంతో, తాము ఏమీ చేయలేమనీ, అపోలో వంటి పెద్ద హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళమన్నారు డాక్టర్లు. ఆ సంగతి తెలిసి ఆరోజే నేను, మావారు హైదరాబాదు నుండి తిరుపతికి వెళ్లి 7వ రోజున చెన్నైలోని అపోలో హాస్పిటల్లో నాన్నను చేర్చడానికి అంబులెన్స్ సిద్ధం చేసి, నాన్నకు తోడుగా తమ్ముడిని రమ్మని చెప్పి, మేము మా అమ్మను తీసుకొని చెన్నై వెళ్ళాము. ముందుగానే మావారు చెన్నై అపోలో హాస్పిటల్లోని ఇన్‌ఛార్జ్ డాక్టరుతో మాట్లాడటం వల్ల నేరుగా నాన్నను ఎమర్జన్సీ వార్డులో చేర్చుకొని కొన్ని టెస్టులు చేసి, ఒక రాత్రంతా ICU లో ఉంచారు. మరుసటిరోజుకి రూముకి షిఫ్ట్ చేసి అన్ని సమస్యలనూ కంట్రోల్లోకి తీసుకొని వచ్చారు. ఆ తరువాత మా నాన్న ఆరోగ్యం కాస్త మెరుగయ్యాక తనను డిశ్చార్జ్ చేశారు. మూడు రోజుల తర్వాత మరలా రీ-చెకప్‌కి వెళ్లినప్పుడు నాన్నను పరీక్షించిన డాక్టర్లు, “అంతా బాగుంది, మీరింక ధైర్యంగా ఉండవచ్చు” అని చెప్పగానే మేమంతా ఎంతో సంతోషించాము. మా నాన్నను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళినప్పటినుండి, “బాబా! మా నాన్న ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తే నా ఈ సంతోషాన్ని సాయి కుటుంబసభ్యుల బ్లాగులో పంచుకుంటాను” అని రోజూ బాబాను తలుచుకుంటూ గడిపాను. బాబా అనుగ్రహంతో నాన్న ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ బ్లాగును నిర్వహిస్తూ, అందరి సంతోషాలను మనకు అందజేస్తున్న సాయికి మనసారా శతకోటి నమస్కారాలను తెలియచేస్తున్నాను.


ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః


మూడేళ్ళ బాధనుండి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా


గుర్గాఁవ్‌ నుండి సాయిభక్తురాలు శ్రీమతి రమణి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులందరికీ సాయిరాం! నా పేరు రమణి. నేను సాయిభక్తురాలిని. మేము గుర్గాఁవ్‌లో నివాసం ఉంటున్నాము. నా వయసు 63 సంవత్సరాలు. నా కష్టసమయాలలో బాబా ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నారు. “బాబా! ఇలాగే ఎప్పుడూ నా చేయి వదలకుండా నాకు తోడునీడగా ఉండు తండ్రీ!” ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఆయనకిచ్చిన మాట ప్రకారం మీతో పంచుకుంటున్నాను.


నేను గత మూడేళ్ళుగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాను. నా సమస్యను పరిష్కరించడానికి డాక్టర్లు ఎన్నో రకాల చికిత్సలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. డాక్టర్లు సూచించిన మందుల వలన నా శరీరంలో నీరు నిల్వ ఉండిపోయి మూత్రపిండాలలో వాపు వచ్చేసేది. అది ఎక్కువైతే నా గుండెకి కూడా ప్రమాదం. ఈ సమస్య వలన ఆయాసంతో నేను చాలా ఇబ్బందిపడుతూ నరకయాతన అనుభవించేదాన్ని. వెంటనే నన్ను హాస్పిటల్లో చేర్చేవారు. వైద్యంతో తాత్కాలికంగా ఉపశమనం లభించినా మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ సమస్యతో నేను ఎంతో బాధపడుతుండేదాన్ని. ఆ కష్టంతో విసిగిపోయిన నేను ప్రతిరోజూ బాబా ముందు నిల్చుని బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీరే నాకు సమస్తం. మీ ఈ బిడ్డకి ఏది మంచో, ఏది చెడో మీకు తెలుసు. దయచేసి నా అనారోగ్య సమస్యను పరిష్కరించండి” అని బాబాను వేడుకుని, బాబా ఊదీని పెట్టుకునేదాన్ని. నా ఈ సమస్య తీరితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. ఆ తరువాత బాబా ప్రేరణగా నేను వేరే డాక్టర్ని సంప్రదించాను. ఆ డాక్టర్ నాకు మెరుగైన చికిత్సను అందించారు. బాబా అనుగ్రహంతో నా ఆరోగ్యం ఇప్పుడు చాలావరకు మెరుగైంది. ఇంకా సమస్య ఉన్నా మునుపటి అంత కష్టం లేదు .“థాంక్యూ సో మచ్ బాబా! సరైన సమయంలో మీరు నాకు డాక్టర్ రూపంలో దర్శనమిచ్చి నన్ను కాపాడారు. మిమ్మల్ని నమ్ముకున్నవారెవరూ నిరాశచెందరు. మీ అభయహస్తం వారికి ఎప్పుడూ ఉంటుంది సాయీ!”



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo